పార్వతి తపోవర్ణనము
బ్రహ్మ యిట్లనెను : – అఖిల దేవతా మండలి ఆ జగజ్జనని కడకేగి, ఓదేవీ ! తపము వలదు. శీఘ్రకాలములో నా నీలకంఠుడు ఏతెంచి నీకు భర్త కాగలడు. అని నచ్చజెప్పి ప్రదక్షిణముచేసి వెళ్ళిపోయిరి. ఆమె తపస్సు విరమించెను. తన పర్ణశాల గుమ్మమున నున్న యశోకము క్రింద నామె వసించెను. అంతట ఇందుతిలకుడు సురార్తిహరుడునగు హరుడు వికృతరూపియై పొట్టిచేతులు సొట్టముక్కు రాగిజడలు వికృతముఖము మఱిగుజ్జునైవచ్చి దేవి ! నిన్ను నేనువరింతుననియె. ఉమయు యోగసిద్ధిచే అతనిని శంకరునిగా గ్రహించి విశుద్ధాంతరంగయై ఆర్ఘ్యపాద్యాదులు మధుపర్కములు నొసంగి బ్రాహ్మణాకారముననున్న స్వామిని బ్రాహ్మణప్రియ కావున యధావిధి నర్చించి యిట్లనియె.
పార్వతి పలికెను :- ”స్వామీ!నేను అస్వతంత్రను. మాతండ్రి శైలాధిపతి యింట నున్నారు. ఆయన కన్యాదానము చేయ సమర్థుడు. అతనిని అర్థింపుము. ఆయన నన్ను నీకిచ్చునేని అది నాకు ఉచితము”. అంత నా విప్రుడు గిరిరాజు కడకేగి ”తనకు కన్యాదానము చేయుమని” యర్థించెను. ఆతడీ వికృతరూపుని శివునిగా గ్రహించి శాపభీతిచే నిట్లనియె.
శైలరాజిట్లనియె :- భూదేవులగు విప్రుల నవమానింపబోను, నా అభిప్రాయము మనవి చేసెద. మా అమ్మాయి స్వయంవరముననెవ్వని వరించునో యతడామెకు భర్తయగును.” అన వృషభధ్వజుడు తిరిగి వచ్చి ”దేవీ! మీ తండ్రి స్వయంవరమున నీవెవ్వని వరింతువు వానికిచ్చునని వినికిడి. నీవు నీకు ఈడగు రూపవంతుని విడచి తగని వాని నేల వరింతువు.” కాన నాకందవు. నీతో జెప్పి వెళ్లుచున్నాననెను.
బ్రహ్మయిట్లనియె :- అంత నా ఉమాదేవి ఆ మాటను భావన చేసి తనపై ఆతడిడిన భారమును గ్రహించి దానితో బాటు చూపిన మనఃప్రసన్నతను నాలక్షించి ”దేవేశ! నీకు నుఱొక తలంపు వలదు. నేను నిన్ను వరించెద. ఆశ్చర్యమక్కరలేదు. సందేహమున్నదా? ఇదిగో ఇక్కడే నాకోరిక విభుడవగు నిన్ను నేను వరించుచున్నాను. అని పుష్పగుచ్ఛమొక్కటి రెండుచేతలం గొని శంభుని మూపున నుంచి యాదేవి దేవదేవుంగని యిప్పుడ వరింప బడితివనియె. అంతనా శివుడామె కూర్చుండిన అశోకముంగని దానికి మాటచేప్రాణము పోయుచున్నాడా అన్నట్లిట్లనియె.
శివుడు పలికెను :- ”ఓ అశోకమా! నీ పూలగుత్తిచే నేను వరింపబడినాడ గావున నీకు ముదిమి ఉండదు. అమరమయ్యెదవు గాక! నీవు సర్వాభరణకుసుమఫలభరితమై కామరూపివై సర్వకామప్రదమై, కామపుష్పమువై సర్వాన్న భక్షకమై అమృతాస్వాదివై సర్వ పరిమళపూర్ణమై దేవతల కత్యంతప్రియము కాగలవు. నీ కెందును భయముగల్గదు. నీవు సంపూర్ణ తృప్తుడవయ్యెదపు. ఈ అశోకాశ్రమము చిత్రకూటమను ఖ్యాతినందగలదు. ఇటకుయాత్ర చేసినవాడు అశ్వమేధయాగ ఫలమందును. ఇచట ప్రాణోత్ర్కమణ మందినయతడు దేవియొక్కతపస్సుతోగూడి మహా గణపతి యగును.
బ్రహ్మ యిట్లనియె:- పై ప్రకారము అశోకమునకు వరమిచ్చి శివుడు గిరికన్యతో వెళ్ళివత్తునని చెప్పి యంతర్ధాన మందెను. ఆయన వంకనే మోమునిలిపి ఆ దేవి యచట నొక శిలయందు చంద్రుడు లేని రాత్రి యట్లు విరహ వ్యధాకుల మనస్కయయి యుండెను. అంతలో శైలకన్య ఆశ్రమ సమీపమున ఉదక పూర్ణమైన సరస్సు నందు ఆర్తుడైన యొక్క బాలుని మాట వినెను. శివుడు బాలరూపము దాల్చి ఆ సరోవరమందు క్రీడించుచు మొసలి పట్టుకొన్నట్లు సృష్టిహేతువైన యోగమాయం బూని నటించి యిట్లనియె.
ఎవడేని నన్ను మొసలిబారినుండి రక్షించుగాక! అయ్యో! మొసలినోట బడినాడను. నాకై నాదేహమునకై నే నేడ్వను. కాని నాకై యింటనెదురు చూచు నాతల్లిదండ్రుల గూర్చి చింతించుచున్నాను. వారికి నేనొక్కడనే తనయుడను. నాయందెంతేని ప్రేమ, మక్కువ గొన్నవారు. గావున యీవిషయము విని ప్రాణములం బాసెదరు. ఎంత కష్టము వచ్చినది. బాలుడను. అకృతాశ్రముడను. (ఉపనయన మేని కానివాడను) ఈ మొసలివాతబడి మృత్యువాత కెఱయయ్యెదను గదా! అని దుఃఖించెను.
బ్రహ్మ యనియె: – బాలకుని మాటలు విని ఆ కల్యాణి అయ్యిందువదన బయలుదేరి సుందరుడగు నా బాలకుని మొసలి నోటబడి కొట్టుకొనుచున్నట్లు చూచెను. ఆ మొసలియును దేవిని చూచి ఆ బాలుని నోటగఱుచుకొని సరస్సులోనికిం బాఱను. బాలకు డాక్రందించుచుండెను. అది చూచి పార్వతి మొసలితో నిట్లనియె.
ఓ గ్రాహరాజ!మహాపరాక్రమా! ఈ బాలకుని త్వరగ విడిచిపెట్టుము. ఈతడు తల్లిదండ్రులకు నేకైక పుత్రుడు అన మొసలి.
దేవి! ఆఱవరోజున ముందుగా నీ సరస్సు నకేతెంచు నతడు నీకాహారమగునని నాకు బ్రహ్మ యేర్పాటుచేసెను. నేడీతడు లభించెను. బ్రహ్మప్రేరణమిది. వీనినేమైన వదలననియె. అంత వారికిరువురకు నిట్లు సంవాదమయ్యెను.
ఓ మకర రాజమా! హిమగిరి శిఖర మందు నేను జేసిన ఉత్తమతపస్సు ఫలము నీవు తీసికొని ప్రతిఫలముగ నీ బాలుని విడిచి పెట్టుము. నీకు నమస్కారము.
ఓ దేవీ! తపము వ్యయ పరచకుము. నే చెప్పినట్లు చేయుము. అట్లైన నితడు ముక్తుడగును.
హే గ్రాహాధిప! సత్పురుషులు నిందింపని యేపనియైన చెప్పుము. తప్పక చేసెదను. సందేహము లేదు. బ్రాహ్మణులు నాకు మిక్కిలియిష్టులు.
ఓ దేవి! నీవు చేసిన తపము స్వల్పమైనను నుత్తమమైనది. ఆ తపము సర్వమును నాకిమ్ము. అట్లైన నీబాలుడు ముక్తుడగును.
ఓ మహాగ్రాహమా! మంచిది. ఆజన్మము నేచేసిన పుణ్యమేది గలదో యది సర్వము నీ కొసగు చున్నాను. బాలుని విడువుము.
బ్రహ్మయనియె. ఇట్లన్యోన్య భాషణములు జరిపిన వెంటనే మొసలి యాదేవి తపస్సు సర్వము స్వీకరించి మధ్యందినభానునివలె వెలుగొందెను. మరియు లోకోద్ధారిణియగు దేవిం గని సంతుష్టాంతరంగుడయి యిట్లుపల్కెను.
దేవీ! తపస్సు సంపాదించుట కష్టము దానిని త్యజించుట ప్రశస్తము గాదు. కావున తపస్సును, నీబాలుని కూడా నీవే స్వీకరింపుము. నీబ్రాహ్మణ భక్తికి మెచ్చితినని మకరము పలుక మహావ్రతధారిణియగు నామె యిట్లనియె.
దేహముతోనైనను విప్రుడు నాకు రక్షణీయుడు. తపస్సు మరల సాధించగలను గాని బ్రాహ్మణుడు సాధ్యుడు కాడు గదా!
అనవిని ఆ మకరము దేవికి నమస్కరించి ఆదిత్యుడట్లు వెలుంగుచు నచ్చటనే అంతర్ధానమయ్యెను. ఆ బాలుడును సరస్తీరమున మొసలిచే విడువబడి కలలోగన్న వస్తువువలె నచ్చటనే అంతర్ధానమయ్యెను. దేవియు తన తపఃఫలము బాలుని నిమిత్తముగా వ్యయమగుట గని మరల తపస్సు నాచరింప బూనెను. శంకరుడది యెరిగి నీ వింక తపస్సు చేయవలదు. నీ చేసినదంతయు నా కర్పించితివి. అది నీ కక్షయము కాగలదనెను. అట్లు వరమును బొంది యా దేవి స్వయంవరముకొఱకు నిరీక్షించుచుండెను. పరమేశ్వరుని యీశిశులీలను జదివిన వాడు దేహపాతా నంతరము పవిత్రుడై కుమార తుల్యుడై గణాధీశుడగును.
ఇది పార్వత్యుపాఖ్యానము అను ముప్పదియైదవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹