మార్తండ మాహాత్మ్యము
మునులనిరి : – పితామహ ! సూర్యకథ నెంతవిన్నను తృప్తిలేదు. అగ్నిరాశివలె వెలుంగు నీ మూర్తికి ప్రభావమెందుండి యయ్యెనో తెలియనెంతుము. ఇంకను నా శుభచరిత్ర మాకానతిమ్ము.
బ్రహ్మయిట్లనియె :- లోకములు తమఃప్రాయములు కాగా చరాచరసృష్టి నష్టప్రాయము కాగా ప్రకృతియొక్క గుణవికారమునకు కారణమై బుద్ధి జనించెను. అందుండి అహంకారము, దాన మహాభూతములు నవ్వల నొక అండము జనించెను. ఈ లోకములెల్ల దానియందున్నవి. అందు నేను, విష్ణువు, శివుడునుండి తామస వృత్తులమై ఈశ్వరుని ధ్యానించితిమి అపుడు విజ్ఞాన స్వరూపుడు ధ్యానయోగమందు మాకు సూర్యరూపుడై గోచరించెను. విశ్వరూపునిగ మేము ఆయనను స్తుతించితిమి.
”ఆదిదేవోసిదేవానాం”
నీవుదేవతలకెల్ల మొదటి దేవతవు” ఇత్యాదిగా మూలశ్లోకములు పారాయణార్హములు వీని భావము సుగమము.
దేవతలు పలికిరి : –
జగత్ప్రభూ ! నీ తేజోరూపము ఎవ్వడును సహింపనేరడు. కావున లోకహితము కొఱకది ప్రశాంతమగుగాక! అనినంతట సూర్యభగవానుడు ఘర్మమును వర్షమును జలువను గూడ నీయగలవాడు కావున జగత్కార్య సిద్ధి కట్లేయగుగాక యనెను. సాంఖ్యులు, యోగులు ముముక్షువులు భాస్కరుని హృదయమందు చైతన్య రూపముననున్నవాని గని ధ్యానింతురు. బహుదక్షిణములైన క్రతువులు వానికినాధారమైన వేదములు సూర్యనమస్కారము యొక్క కలామాత్రమునకేని (లేనమాత్రమునకేని) సరిగావు, అది తీర్థములకెల్ల తీర్థము. మంగళములకెల్ల మంగళము. పవిత్రములకెల్ల పవిత్రమునైన దివాకరమూర్తి నందరు శరణందుదురు. సూర్యనమస్కారము సర్వ పాపహరము.
”ప్రజాపతీ ! చాలా కాలమునుండి మాకు సూర్యుని అష్టోత్తర శత నామములను వినవలెనని కోరిక యున్నది. కాన దయచేసి తెలుపుమని” మునులడిగిరి.
బ్రాహ్మణులారా ! మిక్కిలి రహస్యమును స్వర్గమోక్షముల నిచ్చునదియు నగు సూర్యుని అష్టోత్తరశతనామములను చెప్పుచున్నాను. వినుడు
గొప్ప తేజశ్శాలి అగు శ్రీ సూర్యుని అష్టోత్తర శతనామములు చెప్పబడెను. సురాసురసిద్ధపితృ యక్షగణ సేవితుడును, సువర్ణము అగ్నియొక్క కాంతివంటి కాంతిగలవాడును నగు భాస్కరుని నా శ్రేయస్సుకొరకు నమస్కరింతును. సూర్యోదయకాలమున ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును సావధాన చిత్తుడై చదివినవాడు యోగ్యమైన భార్యను పుత్రులను ధనరత్నసముదాయమును, పూర్వజన్మస్మృతిని, జ్ఞాపకశక్తిని, గొప్ప ధారణాశక్తిని పొందగలడు. సంసార దావాగ్ని సాగరమునుండి విముక్తి నందును. మనోరథముల నెల్ల పొందును.
ఇది బ్రహ్మపురాణమునందు సూర్యాష్టోత్తర శతనామస్తోత్రమను ముప్పది మూడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹