ఆదిత్య మహాత్మ్యము
సూర్య భగవానుని మహిమ నీవు చెప్పగా విన్నాము. ఇంకను విన కుతూహలమగుచున్నది. బ్రహ్మచర్యాశ్రమస్థులు ముక్తినందుటకు ఏ దేవతను ఉపాసింపవలయును. స్వర్గమునుండి దిగజారకుండుటకు ఏమిచేయవలయును? దేవతలకు పితృదేవతలకు పరమ దేవత ఎవరు? ఈ సృష్టి ఎవనివలన నగును? ఎవ్వనియందు లీన మగును. తెలుప వలయును.
ఓ ద్విజోత్తములారా ! ఈ ఆదిత్యుడు ఉదయించుచునే తన కరంబులచే చీకటిని హరింపజేయును. ఇంత కంటే మరిదైవమెవ్వరు? ఈ పురుషుడు మొదలు తుదలేనివాడు శాశ్వతుడు. అవ్యయుడు. ముల్లోకముల తన కిరణముల వెలిగించుచుండును. సర్వ దేవమయుడు సర్వజగన్నాధుడు సర్వసాక్షి జగత్పతి సర్వభూతముల సృజించును. పెంచును. సంక్షేపించును. ఈయనయే వేడిమినిచ్చును. వర్షించును. ధాత. విధాత. భూతాది. భూతభావనుడు ఈయనకు క్షయములేదు. అన్ని వేళల నక్షయమండలుడు పితరులకు పిత. దేవతలకు దేవత. ఈయనది ధ్రువస్థానము. ఇందుండి మరలడు. ఆదిత్యుని నుండి జగత్తు పుట్టును. అందు లయించును. యోగులు కళేబరము వీడి వాయురూపమంది తేజోరాశియైన దివాకరుని యందు ప్రవేశింతురు. ఈయనవేలకొలది కిరణముల నాశ్రయించి పక్షలుతరుశాఖల నాశ్రయించి యున్నట్లు- సిద్ధులు, దేవతలు ఈయనయందు వసింతురు. యోగులు గృహస్థులైన జనకాది రాజర్షులు వాలఖిల్యాదులు, బ్రహ్మవాదులైన మహర్షులు వ్యాసాదులు వానప్రస్థులు భిక్షువులు యోగముంబూని సూర్యమండలమున ప్రవేశింతురు. వ్యాసకుమారుడు శ్రీ శుకుడు యోగధర్మమూ ఆదిత్య కిరణముల జొచ్చి పునరావృత్తి లేని వదమందియున్నాడు.
బ్రహ్మ విష్ణు శివాది దేవతలు శబ్ద మాత్ర శ్రుతి గమ్యులు. ఈయన యే ప్రత్యక్ష పరదేవత. తమోహరుడు. విష్ణుముఖ దేవతావర్గము కంటికి గానరారు. ఈయన ప్రతక్ష నారాయణుడు. ఈయనయే తల్లి తండ్రి గురువు అనాది రశ్మిమాలి జగత్పతి మిత్రుడు నిత్యుడు ఆక్షయుడు ఈయన సాగరద్వీపములను పదునాల్గు భువనములను సృజించి చంద్రనదీ తీరమున నున్నాడు. సహస్రాంశువై అవ్వక్తుడై ద్వాదశమూర్తులచే వ్యక్తుడేప్రత్యక్షనారాయణుడై ఆదిత్య స్థానమున వెలుంగుచున్నాడు.
ఇంద్రుడు. ధాత, పర్లన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, ఆంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. అను నీ పండ్రెండు మూర్తులచే ఈ పరమాత్మ సర్వజగమ్ములు వ్యాపించియున్నాడు. దేవశత్రునాశినియైన మూర్తి ఇంద్రరూపమున దేవ రాజ్యనుందున్నది మొదటిది, రెండవది ప్రజాపతి రూపమున సృష్టి గావించునది. మూడవది మేఘములందు వర్షించునది. నాల్గవది వనస్పతులందు ఓషథులందున్నది. ఐదవమూర్తి పూష అన్నగతమై ప్రజల పోషించును. అఱవమూర్తి ఆర్యమా రూపమై దేవతలందున్నది. సప్తమమూర్తి భగనామమున దేహుల దేహములందు, సంపదలందు నున్నది. ఎనిమిదవది వివస్వాన్ అగ్నిగా నుండి జీవుల ఆహారమను పచనము చేయుచున్నది. తొమ్మిదదది ”విష్ణువు” అను మూర్తి. దేవశత్రు సంహారమునకు ప్రపర్తించును. పదవమూర్తి వాయువునందుండి జీవులకు సుఖ స్పర్శనొసంగి ఆనందపెట్టును. పదునొకండవ మూర్తి వరుణనామకము, జలములందుండి ప్రజాపుష్టి కూర్చును. పదిరెండవమూర్తి మిత్ర సంజ్ఞకము. లోకహితమునకై చంద్ర నదీ తీరమందున్నది. ప్రభాకరుడీమూర్తితోవాయుభక్షణ సేయుచు మైత్రీవ్రయుక్తమైన చూపుతో వరములిచ్చి భక్తానుగ్రహముచేయుచు చంద్ర నదీతటమందు తపము చేయుచుండును. కావున అతడు మిత్రుడను బిరుదు నామమందెనని స్మృతులు తెలపుచున్నవి. ఇట్లు ద్వాదశ మూర్తియగు పరమాత్మ స్థావర జంగమములకెల్ల ఆత్మరూపుడైన సూర్యభగవానుడై ధ్యానమునకు లక్ష్యమై నమస్యుడు. ఈ ద్వాదశాదిత్యులను గూర్చి నిత్యము నమస్కరించుచు పఠించుచు వినువారు సూర్యలోకముందు వెలుగొందుదురు.
మునులిట్లు పలికిరి
సూర్యుడు సనాతనుడగు ఆదిదేవుడైనచో ప్రాకృత జనునివలె వరములగోలి తపమెందులకు చేసెను
బ్రహ్మయిట్లనియె. ఇది మిక్కిలి రహస్యవిషయము. నారదుడు సూర్యనడగిన విషయము. ఇంతకు మున్ను సూర్యభగవానునుని పండ్రెండు మూర్తుల గురించి చెప్పితిని. అందు మిత్రుడు. వరుణుడు అనువారు తపస్సునందుండిరి. అందు జలాహారియై వరుణడు పశ్చిమ సముద్రమునందును మిత్రుడు వాయుభక్షకుడై ఈ వనమందు ఉన్నారు. ఈ మిత్రుడు మేరుశిఖరము నుండి గంధ మాదనమునుండి జారెను. మహాయోగియైన నారదుడు మిత్రుని దగ్గరకు వచ్చెను. తపస్సు చేయుచున్న ఆయనను జూచి చాల వేడుక వడెను. ఆవ్యయము వ్యక్తావ్యక్తము త్రిలోకధారకము సర్వదేవతా పరాయణము సర్వజనకమునైన మిత్రమూర్తి మఱి యే దేవతలను పితృదేవతలనుద్దేశించి మనస్సుచేత ధ్యానించుచు యజించుచున్నాడు.” అని ఆలోచించి ఆయనతో నిట్లనియె.
సాంగోపాంగములైన వేదములందు నీవు గానము సేయబడుదువు. భూతభవద్భవ్యమయిన యీ దృశ్యమెల్ల కేవల ద్రష్టమైన నీయందు నిలుపునందును. గృహస్థాద్యాశ్రమస్థులు నల్గురు నిన్నే పూజింతురు. నీవు సర్వజగజ్జనకుడవు జననివియున, దైవమును, నీవు నీకు పితయైన మఱియే దేవతను యజింతువో మేమెఱుంగము.
మిత్రుడిట్లనియే:- నీ వడిగిన ప్రశ్న పరమగుహ్యము. తెలుపరానిది. నీవు భక్తుడవని తెలుపుచున్నాను. సూక్ష్మము అవ్యక్తము అచలము ధ్రువము అనబడు నది వస్తువేదిగలదో అది భూతేంద్రీయ వివర్జితము. సర్వభూతాంతరాత్మ క్షేత్రజ్ఞుడనంబడును. త్రిగుణాతీతము. పురుష శబ్ద వాచ్యము. హిరణ్యగర్భ నామకమదియే బుద్ధిఅని చెప్పబడును. మహత్తు ప్రధానమనియు యోగ సాంఖ్యములందు పెక్కుపేరుల పిలువబడును. ఆ వస్తువు త్రిరూపము. ఈశ్వరుడనియు, అక్షరమనియు పేర్కొనబడినది. అది ఏక రూపమై యీ త్రిలోకముధరించును. శరీరులందు అశరీరుడై ఉండును. కర్మలేప మతనికి లేదు, అంతరాత్మ యన నదియ. సర్వసాక్షి. ఈ తత్త్వము సగుణము. నిర్గుణము. విశ్వరూపము. జ్ఞానగమ్యము. సర్వతః పాణిపాదము. సర్వతోక్షిశిరోముఖము. సర్వత శ్రుతిమంతము. సర్వమావరించి యున్నది. విశ్వమూర్ధము విశ్వభుజము విశ్వపాదాక్షినాసికము. క్షేత్రమందు (దేవామందు) స్వేచ్ఛాసంచారియై యొక్కడుగా నుండును, తానున్న ఉపాధుల నెఱుంగువాడు గావున క్షేత్రజ్ఞుడనంబడును. అవ్యక్తమయిన పురమందు శయించును. కావున పురుషడనంబడును. విశ్వము బహువిధము. అది ఆయనయే, కావున విశ్వరూపుడన నగును. ఆయన యొక్కనికే మహత్మ్య ముండుటచే మహాపురుష వాచ్యుడతడు. ఆకాశమునుండి వడిన నీరు భూమియొక్క రుచిని బట్టి రుచి భేధముందినట్లు గుణభేదమును బట్టి యతడు పలు విధ రూపములం గానవచ్చును. ఒక్కటే వాయువు దేహమందయిదు తీరులుగ నున్నట్లాయన యొక్కడే నానారూపుడగును. అగ్ని స్థానభేధముంబట్టి పలురీతులం గనవచ్చి పలునామము లందినట్లు ఆయనయు ఉపాధి నిమిత్తముగా నానాత్వ మందును. ఒక్క దీపమునుండి పలు దీపములు ముట్టింపబడి వెల్లినట్లొక్కడయ్యు ఆతడనేక రూపములం గన్పించి వెలుగును. తన్ను తానెరిగిన తరినతడు కేవలుండగును. ఏకత్వ ప్రళయమునందు బహుత్వము నొందును. నిత్యుడతడొక్కడే. అతని వలన త్రిగుణ రూప మవ్యక్తము పొడమినది. వ్యక్తావ్యక్త భావస్థయగు దానినే ప్రకృతి యందురు. అది బ్రహ్మకు కారణము. బ్రహ్మ సదసదాత్మకుడు. దేవపితృ కర్మములందు అతడే పూజింప బడువాడు. అతడు, తండ్రి, దేవుడు, ఆత్మచే తెలియ దగినవాడు. అతనినే నేను పూజించుచున్నాను. నానా రూపముల నానాదేవతల అర్చించునందరి పూజలు నాతనొక్కనే చెందును. అయన సర్వగతి. ఆయనయే సూర్యుడును. కావున దివాకరుని నామరూపమునే నేనారాధింతును. ఏకత్వవిశ్వాసము గలవారు ఏకైకమైన ఆ పరతత్వమునే యందుదురు. ఇది గుహ్యాతి గుహ్యమైన అంశము.
ఇట్లు మున్ను నారదునికి సూర్యుడు తెలిపెను. మీకిది తేట తెల్లంబొనరించితి. ఆదిత్య భక్తిలేని వానికిది తెలుపరాదు. ఇదిచదివిన నరులు సహస్రకిరణుడు సాలోక్యమందెందరు, సర్వదుఃఖ హరమిది.అభీష్ట సిధ్ధిదము. సూర్యభగవానుని మీరెల్లప్పుడు స్మరింపుడు. ఆయనయే ధాత విధాత సర్వజగత్ప్రభువు.
ఇది బ్రహ్మపురాణము నందు ఆదిత్య మాహాత్మ్యము అను ముప్పదియవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹