కోణాదిత్యమాహాత్మ్యము
దక్షిణ సముద్ర తీరమందు ఓఢ్రదేశము గలదు. అది స్వర్గ మోక్షప్రదము. సముద్రమునకు ఉత్తరముగా విరజమండలము సరిహద్దుల దాక అది యున్నది. అచటి బ్రాహ్మణులు జితేంద్రియులు. తపస్స్వాధ్యాయనికతులు. వంద్యులు పూజ్యులును. యజ్ఞదాన వివాహాది శుభకర్మములందు శ్రాద్ధాదులయందు వీరు చాలా ప్రశస్తులు. షట్కర్మనిరతులు. ఇతిహాస పురాణార్థ విశారదులు. సర్వశాస్త్రార్థ సమర్థులు. మాత్సర్యహీనులు పుత్ర దారధనక్షేత్రసంపన్నులు. సత్యవచనులు. దాతలు. క్షత్రియాది వర్ణముల వారును స్వధర్మనిరతులు ధార్మికులు శాంతులు. ఆ దేశమందు కోణాదిత్యుడను పేర సూర్యభగవానుడు వెలసి యున్నాడు. తద్దర్శనము సర్వపాప నికృంతనము.
ఆ దేశమందు కోణాదిత్యుడను పేర సూర్యభగవానుడు వెలసియున్నాడు. లవణ సముద్రోత్తరతీరము వాలుకాకీర్ణము. మనోహరము సర్వపుష్ప ఫల భరిత తరు సుందరము రమారమి సార్థయోజనవిశాలముగా నచట సూర్యక్షేత్రము భక్తి ముక్తి ప్రదము. అది నానాతరులతా సుందరము.
మాఘమాస శుక్ల సప్తమినాడు వేకువనక్కడి సముద్రమున స్నానముచేసి దేవ ఋషి పితృ తర్పణము చేసి ధౌత వస్త్రములు దాల్చి యాచమించి యమ్మహోదధియం దుదయవేళ నాసీనుడై రక్తచందన జలముల సూర్యునకు ఎనిమిదిరేకులు గల కేసరావృతమైన వర్తులాకార పద్మమును (అష్టదళ పద్మమును) గర్ణికతో గూడ లిఖించి తిల తండుల తోయముల రక్తచందనముతో గూర్చి రక్తపుష్పములు దర్భలు రాగిపాత్ర యందుంచి ఆ దానిని మరొక పాత్రతో మూసి అంగన్యాస కరన్యాసములు చేసి తనను భాస్కరునిగా ధ్యానించి శ్రద్ధతో నడుమ అగ్నిదళమందు నైఋతి వాయవ్య ఈశాన్యస్థాన మధ్యయందు పూజచేయ వలెను. (కేసరము – కింజల్కము)
ఆ పద్మమును ఆరాధించి అందు గగనము నుండి భాస్కరుని ఆహ్వానించి తామర పువ్వు దుద్దు మీద ప్రతిష్టించి ముద్రా ప్రదర్శనము చేసి రెండు భుజములు తేనెరంగు కన్నులు గల వానినిగా అరుణపద్మారుణాంబరధారిగా సర్వాభరణ భూషితునిగా సర్వలక్షణ లక్షితునిగా శాంతమూర్తిగా వరదముద్రాధారిగా ప్రభామండల మండితునిగా సాంద్రసిందూర వర్ణునిగ ఉదయ భాస్కరుని ధ్యానించి మోకాళ్ళపై గూర్చుండి ఆ పాత్రను నెత్తి శిరంబున దాల్చి త్య్రక్షర మంత్రముతో సూర్యునకు అర్ఘ్యమీయవలెను. సూర్యమంత్ర దీక్షలేనివాడు. సూర్యనామముతోనే అర్ఘ్య మీయనగును. ఆగ్నేయ-నైఋతి, వాయు-ఈశ-మధ్య పూర్వాది దిశలందు-హృదయ-శిర శ్శిఖా-కవచ- నేత్ర అస్త్రముల పూజింపవలెను. ఆర్ఘ్యమర్పించి గంధ ధూప దీప నైవేద్యాదు లొసంగి జపము జేసి నమస్కరించి స్తుతించి ముద్రాబంధముతో విసర్జనము చెప్పవలెను. భక్తితో నిట్లర్కునకర్ఘ్యమిచ్చిన పుణ్యులు భుక్తిముక్తులను బడయుదురు. త్రైలోక్య దీపసుడైన భాస్కరదేవుని గగన సంచారి నెవ్వరాశ్రయింతు రాజనులు సుఖ భాజనులు. భాస్కరున కర్ఘ్య మీయకుండ విష్ణుశంకలసురేశ్వరుని అర్చింప గూడదు.
రోగవిముక్తి ధనసంపత్తి విద్యాసిద్ధి-పుత్ర పౌత్రాభివృద్ధి యన్నియు దీన గల్గును. చేతం పూవులు ధరించి సూర్యాలయమునకు ఏగవలయును. మూడుమార్లు ప్రదక్షిణము చేయవలెను. ఆ మీద నా దేవుని పూజింపవలెను. దాన దశాశ్వమేధ ఫలము కల్గును, తుదకు సూర్యుడట్లువెలుగు విమానము నెక్కి గంధర్వులచే ఉపగీయమానుడై సూర్యభక్తుడు సూర్యలోకమందును. తిరిగి వచ్చి యోగి కులమందుదయించి భానుయోగమునంది ముక్తినందును. చైత్రశుక్ల మందు మదనభంజికయను (కామదమనము) యాత్రనుజేసియు నీ ఫలమందును. శయనోత్థానైకాదశీతిధులందు భానుసంక్రమణమందు నీ యాత్ర చేసిన వారు విమాన యానులై భానులోకమరిగెదరు. ఆ సముద్ర తీరమున రామేశ్వరుడను పేర శివుడున్నాడు. అయన నర్చించినవారికి రాజ సూయ ఫల మొదవును. కామగమైన విమానమున నీమున్ను చెప్పిన ప్రభావముతో శివపురికేగును. ఈ రవి క్షేత్రమున మేను బాసిన జీవి సూర్యలోకమంది మానవ జన్మమెత్తి ధార్మిక ప్రభువై సూర్యసారూప్యమంది మోక్ష మందును. ఇది కోణార్కస్వామి మహిమ.
ఇది శ్రీ బ్రహ్మపురాణమందు కోణాదిత్యమాహాత్మ్య వర్ణనమను ఇరువది ఎనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹