భవిష్య కథనము
ఓ వ్యాసమహామునీ! ప్రళయకాలము దగ్గరలో నున్నదో దూరములోనున్నదో మాకు తెలియదు. కనుక ఎప్పుడు ద్వాపరయుగము అంతమై కలియుగము ఆరంభమగునో ప్రళయము ఎప్పుడు వచ్చునో గుర్తించు విధము తెలిసికొన గోరి ఇటకు వచ్చితిమి. అల్పమగు ధర్మానుష్ఠానముతోనే అధికమగు ధర్మఫలము లభించు విధమును ధర్మము నాశము నొందుటచే మహాభయంకరమగు ప్రళయసమయమును గుర్తించు విధమును ఓ మునీ! మాకు తెలుపుము.
యుగాంతకాలమున రాజులు ప్రజలను రక్షింపకయే పన్నులు గ్రహించుచు తమ్ముతాము రక్షించుకొనుట యందాసక్తి కలిగియుందురు. క్షత్రియులు కానివారు రాజులగుదురు. బ్రాహ్మణులు శూద్రుల సేవించి జీవింతురు. శూద్రులు బ్రాహ్మణుల ఆచారములను పాటింతురు. వేదపండితులు కాండపృష్ఠులు- వేదములను నిరర్థకముగా మోయువారు – అగుదురు. కర్మానుష్ఠానము సరిగా చేయకయే హవిస్సును అగ్నిలో వేల్చెదరు. అన్నికులములవారును ఒకే పంక్తితో భుజింతురు. జనులు శిష్టాచారములులేక ధనము ముఖ్యమని భావించుచు మద్యమాంసములయందు ప్రీతికల వారగుదురు. నరాధములై మిత్రుల భార్యలననుభవింతురు. దొంగలురాజులవెను రాజులుదొంగలవలెను ప్రవర్తింతురు. భృత్యులు తమకు అర్హము కాని దానిని అనుభవింతురు. ధనములకు గౌరవముకలుగును. సత్ర్పవర్తనకు ఆదరము కలుగదు. భ్రష్టుడైనవానిని ఎవరును నిందింపక మెచ్చుకొందురు. పురుషులు వివేకహీనులు జుట్టు ముడివేసికొనక విడిచినవారు విరూపులు అగుదురు. పదానారేండ్లలోపు స్త్రీలకే కాన్పుఅగును. జనపదములలో అన్నము అమ్మబడును. నడి వీథులలో వేదము విక్రయించబడును. స్త్రీలును మానమును అమ్ముకొందురు. బ్రాహ్మణులు అంత్యజులగు వారితో కలిసివసించుచు శూద్రులవలె మాటలాడుచుందురు. శూద్రులు తెల్లనిదంతములు కలవారు – ఇంద్రియముల జయించినవారునై తలలు బోడిగా చేసికొని కాషాయవస్త్రములు ధరించి కపటధూర్తబుద్ధితో జీవించుచు ధర్మము ప్రవచింతురు. కుక్కలు ఎక్కువగును. గోవులుతగ్గును. సాధువులును తగ్గిపోవుదురు. గ్రామాంతరములయందు నివసింపవలసిన వారు గ్రామమధ్యమునను. గ్రామమధ్యమున మధ్యనుండవలసినవారు గ్రామాంతమున నివసింతురు. జనులు అందరు సిగ్గులేని వారయి తత్ఫలముగా నశింతురు. బ్రాహ్మణులు తపోయజ్ఞఫలమ్ముకొందురు. ఋతుధర్మములు తారుమారగును. రెండేండ్ల గిత్తలచే నాగళ్ళులాగింతురు. వానలు క్రమము ననుసరించి కురియకుండును.
దొంగలవంశములలో పుట్టినవారందరును ప్రభువులగుదురు. దానికి తగినవారుగానే ప్రజలునుందురు. తండ్రులకు ఈయదగినవి అన్నియు ఇతరులకు ఈయబడును. కుమారులు గాని ఇతర మానవులుగాని తాముతాము ఆచరించవలసిన ధర్మములను ఆచరింపరు. భూమి ఎక్కువ చవిటినేలయగును. త్రోవలు అన్నియు దొంగలతో నిండిపోవును. తండ్రినుండి దాయభాగముగా వచ్చిన ఆస్తిని కుమారులు పంచుకొనుటలో లోభముతో నిండినవారై పరస్పరము కలహించుకొనుచు తామే ఎక్కువ హరించుకొనవలెనను ప్రయత్నముతో కూడినవారై యుందురు. స్త్రీలు తమ సౌకుమార్యము రూపము నశించిపోగా కేశములతో మాత్రమే అలంకారము చేసికొందురు. పురుషుడు నిర్వీర్యుడై యుండియు అట్టి భార్యలతో సుఖింతురు. భార్యతో సుఖించుటయే పరమసుఖముగా భావింతురు. జనులు చాలభాగము దుఃశీలము కలవారు అనార్యులు ఐయుందురు. నిరుపయోగముగా రూపసౌందర్యముల పోషించుకొందురు. పురుషులు తగ్గిపోవుదురు. స్త్రీలసంఖ్య అధికమగును. పైరులలో పంటతక్కువగును. యాచకు లెక్కువగుదురు. ఒకరికొకరు ఇచ్చుకొనుట ఉండదు. రాజదండనము చోరపీడలవలన బాధనొంది జనులు నశింతురు. యువకులుకూడ వృద్ధులవలె అలవాటులు కలవారుగా నుందురు. శీలములేనివారు సుఖింతురు. వర్షాకాలమందును పరుషమైన గాలులు ఇసుకను వర్షించు చుండును. పరలోకము లేదా ఉన్నదా అని సందేహింతురు. క్షత్త్రియులును వైశ్యులవలె ధనధాన్యములపై అధారపడి జీవింతురు. బంధుప్రీతి తగ్గిపోవును. ఒడంబడికలు శపథములు పనిచేయక నశించును. ఋణము తీర్చు విషయములో సద్వ్యవహారముండదు. సంతోషము నిష్ఫలమై క్రోధము సఫలమగును. అనగా కోపముచేసిన వారికి మనుష్యుల భయపడుదురే కాని నిదానముగా చెప్పినమాట వినరు. పాడికే మేకలను గొర్రెలను కట్టివేసికొందురు. యజ్ఞములు శాస్త్రవిధానము ననుసరింపక యే జరుగుచుండును. నరులు ఎవరికివారు తామే పండితులమనుకొనుచు శాస్త్రప్రమాణములతో పనిలేక అయా కార్యములాచరింతురు. శాస్త్రవిషయములను ప్రవచించువారుండరు. పెద్దలను సేవించి విషయములను తెలిసికొనకయే తనకు విషయము తెలిసెననును. ప్రతివాడునుకవియే. నక్షత్రములు సరియైనయోగములతో నుండవు. బ్రాహ్మణులు తమ ధర్మకర్మములను సరిగా ఆచరింపరు. రాజులు దొంగలవంటి వారగుదురు. బ్రాహ్మణులు మోసగాండ్రు కల్లు త్రాగువారునగుదురు. అశ్వమేధయాగము చేయుదురు. యాగముచేయింపతగనివారిచే యజ్ఞములచేయింతురు. తినరానిదానిని తిందురు. ధనాశాపరులగుదురు. అందరును ”భోః” అను శబ్దమును ఉచ్చరింతురేకాని ఒక్కడును అధ్యయనము చేయడు. స్త్రీలు గడ్డితో తలలుకప్పికొందురు. నక్షత్రములు కాంతి తగ్గును. దిక్కులు తారుమారగును. సాయంసంధ్యాకాలపు ఎఱుపు దిక్కులుమండుచున్నట్లు కనబడును. కుమారులు తండ్రులకును కోడళ్ళు అత్తలకును పనులు ఆజ్ఞాపింతురు. బ్రాహ్మణులు హోమములుచేయరు. ఏమియు ఇతరులకు మిగుల్చక అంతయు తామేతిందురు. నిద్రించుచున్న భర్తలను మోసగించి స్త్రీలు మఱియొకచోటికి పోవుదురు. స్త్రీలు రోగులుగాను రూపహీనులుగాను ప్రయత్న పరులుగాను తన తప్పులు గుర్తించు వారుగాను నుండు భర్తలనుపొందరు. ఉపకారికి ఎవరును ప్రత్యుపకారముకూడ చేయరు.
ఇట్లు యుగాంతమున ధర్మములోపింపగా మనుష్యులు కష్టములుపొందుచు ఏ ఆహారవిహారములు కలిగి ఏ కర్మలాచరించుచు ఏ కోరికలుకోరుచు ఎంత ప్రమాణము (ఎత్తు కొలతలు) ఎంత ఆయువు కలవారై కాలము గడుపుచు మరల కృతయుగమును అందుకొందురు ? అని మునులు వ్యాసునడిగిరి.
అటు మీదట క్రమముగా ధర్మము భ్రష్టమైపోగా ప్రజలు సద్గుణహీనులగుదురు. శీలము నశించును. ఆయువు క్షీణమగును. బలముతగ్గును. దానిచే దేహము వన్నె తఱుగును. దానిచే వ్యాధులబాధ కలుగును. దానిచే వైరాగ్యము కలుగును. దానిచే ఆత్మజ్ఞానసిద్ధికై ప్రయత్నించి దానిని పొంది మఱల జనుల ధర్మశీలురగుదురు. ఇట్లు మరల ఉన్నత స్థితికిపోయి పోయి కృతయుగ మును అందుకొనెదరు. అంతకులోగా మాత్రము కొందఱు నామమాత్రమునకు ధర్మ శీలముకలవారు – కొందఱు ధర్మము తెలిసియు పట్టించుకొనని తటస్థులు – కొందఱు అల్పముగా ధర్మశీలము కలవారు – కొందఱు వేడుకకు మాత్రము ధర్మమును అనుష్ఠించువారు – అగుదురు. ప్రత్యక్షముగా ఇంద్రియములకు గోచరించునదే ప్రమాణమని కొందఱు-అనుమానము-హేతువుచే నిర్ణయించినది-కూడ ప్రమాణమేయని మఱికొందరు ఏ ప్రమాణముతోను పనిలేదు మఱికొందరు వాదింతురు. నాస్తికత్వమును పూనువారు ధర్మమును లోపింపజేయువారు అగుదురు. బ్రాహ్మణులను తామే పండితులమను అహంకారముతో నుందురు. అప్పటికి పని జరుగు విషయములమీద మాత్రము శ్రద్ధకలవారై శాస్త్రజ్ఞానము లేక దాంభికులై పరమార్థత త్త్వజ్ఞానము లేకుందురు. ఇట్లు ధర్మము నశించగా జనులు మరల శ్రేష్ఠులగు పెద్దలను ముందుపెట్టుకొని దానగుణము సుశీలము కలవారై శుభము కలిగించు కర్మలను ఆచరింతురు. జనులు సిగ్గులేక సర్వము భక్షింతురు. తమకై అన్నియు దాచుకొందురు. నిర్దయులగుదురు. జ్ఞానము సాధించుటయందు నిష్ఠ ఉండదు. అట్టి స్థితిలో జ్ఞాననిష్ఠకలవారు మాత్రము అల్పకాల తపముతోనే సిద్ది పొందుదురు. యుగాంతమున తక్కువ కులములవారు బ్రాహ్మణుల ప్రవర్తనమును వహింతురు. మహాయుద్ధములు మహావర్షములు-పెనుగాలులు-తీవ్రమగు ఎండలు సంభవించును. రాజులు కర్మవాదులు అయి భూమిని రాజ్యమును అనుభవింతురు. రాక్షసులు బ్రాహ్మణులై జన్మింతురు. వారు స్వాధ్యాయము పషట్కారములు మొదలగు యజ్ఞవాక్కులు లేక జనులను చెడుమార్గములలో నడపుచు దురభిమానులై సర్వము భక్షించునుచు వ్యర్థముగా కపటమునకు మాత్రము కర్మానుష్ఠానము చేయుదురు. వారు మూర్ఖులు ధనప్రధానులు లోభులు క్షుద్రులు క్షుద్రులను పరివారజనముగా పెట్టుకొనినవారు శాశ్వతమగు ధర్మమును వదలి లోకవ్యవహారమునకై పాటుపడువారు అగుదురు. పరధనముల హరింతురు. పరదారలను ఆశింతురు. కామముతో దురాత్ములై కపటులై సాహసము మీద ఇష్టము కలవారై ఉందురు. బ్రాహ్మణులు ఇట్లు కాగా మునులు అనేక లక్షణములతో ఉందురు. జనులలో జరుగరాని చెడుగులు జరుగును. ప్రధాన పురుషులుగా ఏర్పడిన వ్యక్తులను గూర్చిన కథలకు ప్రాముఖ్యమిచ్చి అట్టివారిని పూజించుచుందురు. జనులు పంటలు – పైరులు – వస్త్రములు భక్ష్యభోజ్యములు – వస్తువులు దాచుకొను డబ్బీలు దొంగిలిచువారగుదురు. దొంగల ధనము హరించు దొంగలు వధించువారిని కూడ వధించు క్రూరులు అగుదురు. ఇట్లు దొంగలు- ప్రాణివధ చేయువారు నశించిపోగా ప్రజలకు క్షేమము కలుగును. ఇట్లు లోకము నిస్సారమై క్షోభము చెందగా ఏమియు చేయలేక పన్నులబరువు మోయలేక జనులు అడవులకు పారిపోవుదురు. యజ్ఞకర్మలు లోపించుటచే జనులకు రాక్షసుల-క్రూరమృగముల – కీటమూషిక సర్పముల వలన భయమెక్కువగును. ప్రజలలో క్షేమము సుభిక్షము ఆరోగ్యము బంధుసమృద్ధి ఉండవలెనను ఉద్దేశము కలవారెవరైన నున్నచో అట్టివారు నరశ్రేష్ఠులని భావించవలసిన కాలము వచ్చును. ఇట్టి స్థితిలో జనులు నిస్సారులై తమవారితో కూడ స్వదేశములు విడిచిపోవుదురు.
జనులంతట కుమారులను వెంట తీసికొని భయముతో పారిపోవుచు కౌశికీనదిని (హిమాలయ సమీపమున) దాటి ఆకలితో బాధపడుచు అంగవంగ కశింగ కాశ్మీర కోసల దేశములను కొండలోయలను హిమవత్పర్వత ప్రాంతమును సముద్రతీరమునంతటిని ఆశ్రయించి నివసించుచు తమకు తామే శ్రమించి సంపాదించుకొనిన ఎండుటాకులు తినుచు చర్మములు చెట్ల నారలు ధరించుచు జీవింతురు. భూమి శూన్యమునుకాక అడవియును కాక యుండును. ప్రభువులు ప్రజల రక్షంపని వారగుదురు. మానవులు మృగములను చేపలను పక్షులను క్రూరమృగములను పాములను పురుగులను తేనెను ఆకుకూరలను పండ్లను దుంపలను వేళ్ళను ఎండుటాకులను తిని జీవింతురు. తమవంశమువారిపై కూడ స్నేహభావము లేక కర్రలతో చేసిన శంకువులతో కొట్లాడుకొనుచు మేకలను గొర్రెలను గాడిదలను ఒంటెలను పశువులుగా పోషించుకొనుచుందురు. నదీతీరములను ఆశ్రయించి నివసించుచు నీటికై నదీజల ప్రవాహములను అడ్డుకట్టలతో అడ్డగింతురు. జుట్టు మొలచినది మొలిచినట్లు లోపల మురికితో నిండి పెరుగుచుండ అట్లే వదలుదురు. కొందఱికి సంతానము అధికము. కొందఱికి సంతానమే కలుగదు. కుల శీలములుండవు. వండిన ఆహారపదార్థములు అమ్ముచు కొనుచు వానితో వ్యాపారము చేయుదురు. ప్రజలు హీనులై హీనధర్మమును అనుసరింతురు. విషయసుఖములకు పాల్పడి దుర్బలులు రోగులునై ఇంద్రియములు క్షీణములై జరాశోకములచే బాధ నొందుదురు. ఆయువు తగ్గునని భయము కలుగగా చివరకు ఇంద్రియ సుఖములనుండి వెనుకకు మరలుదురు. లోక వ్యవహారము చేతకాకపోవుటచే వైరాగ్యము కలిగి సత్పురుషుల దర్శించి సేవించవలెనను కోరిక కలుగును. సత్యముపై శ్రద్ధ కలుగును. పెద్దల ఆజ్ఞను పాటించి సద్గుణముల వైపునకు మరలుటచేత ధర్మమే మంచిదని తోచి దానిననుష్ఠింతురు. కోరికలు తీరుటకు అవకాశము లేకపోవుటచే ధర్మశీలులుగుదురు సుఖక్షయముచే బాధనొంది చిత్తసంస్కారము సంపాదింతురు. ప్రాణులపై దయ కలుగును. ఇట్లు పాదపాదక్రమమున మరల ధర్మము వృద్ధియగుట కారంభమగును. ఇట్లు మరల జనులు కృత కృతయుగములోనిక వత్తురు. కాలము ఎప్పుడును ఒక్కటియే. కలియుగమున ధర్మక్షయము-కృతయుగమున ధర్మవృద్ధి-ఇదే భేదము. చంద్రుడొక్కడే రాహువు కప్పినచో మలినుడై-విడిచినపుడు ప్రకాశించునుకదా! కలియుగమున పరబ్రహ్మతత్త్వము అర్థవాదముగా పొగుడుటకు చెప్పిన గోప్పమాటగా – భావింతురు. కృతయుగములో ఆ పరబ్రహ్మమును వేదముచే తెలియదగిన వస్తువునుగా గ్రహింతురు. ఆ తత్త్వము కలిలో తెలియరానిదై వివేచింత రానిదై శత్రుభావముతో చూడబడును. కలిలో తపస్సు అనునది ఇష్ఠముతో వేడుకకు చేయుపనిగా ఉండును. కృతయుగములో అదే తపస్సు గౌరవించబడును. ఇదే రెంటికి భేదము. సద్గుణములున్నచో కర్మలనుష్ఠించగలరు. కర్మలు అనుష్ఠించినచో గుణములు సంస్కారమునొంది శుద్ధములగును. ఆయా యుగములందలి పురుషుని యోగ్యతను బట్టి దేశ కాలానుసారముగా వారివారి కోరికలును ఆచరణములు నుండునని ఋషులు చెప్పిరి. యుగయుగమునను పురుషుని యోగ్యతానుసారమే ధర్మార్ధ కామ మోక్షసాధనకై కర్మానుష్ఠానము దేవతల అనుగ్రహము శుభములు పుణ్యములు నగు కోరికలు జనులకు కలుగును. ఇట్లు యుగముల పరివర్తనములు విధి చేసిన సృష్టి స్వభావము ననుసరించి అనాదినుండియు ప్రవర్తిల్లుచున్నవి. ముందును ఇట్లే ప్రవర్తిల్లుచుండును.
ఈ జీవలోకము కూడ యుగ స్వభావము ననుసరించి క్షయమును వృద్ధిని పొందుచు మార్పుల నొందుచుండునే కాని ఒక్కక్షణము కూడ మార్పులేక నిలుకడగా నుండదు.
ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసృషి సంవాదమున భవిష్యకథనము అను నూట ఇరవై ఐదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹