సృష్టి కథనము
ఇట్లు ప్రజాపతి ప్రజలను సృజించి అయోనిజయైన శతరూపను బత్నిగ బడసెమ. ద్యులోకము నావరించి యుండెడి ఆపవునియొక్క మహిమచే ధర్మముచే శతరూప జనించినది, ఆమె పదివేలేండ్లు దుశ్చరతపమ్ముజేసి తపోదీప్తుని స్వాయంభువమనువును భర్తనుగా బొందెను. డెబ్బదియొక్క మహాయుగములా మనువుయొక్క ఆయుర్దాయము. అదే మన్వంతర మనబడును.
ఆ పైరాజుని వలన శతరూప వీరుడను కుమారునిగనెను. ప్రియవ్రత-ఉత్తానపాదులను గూడగనెను వీరునికి కామ్య జనించెను. కామ్యయొక్క కుమారులు నల్వురు సమ్రాట్టు కుక్షి విరాట్టు ప్రభువు అనువారు, ఉత్తాసపాదుని వలన సూసృత నల్వురు కొడుకులంగాంచెను. ఆమె ధర్ముని కూతురు. సూనృత (సునీత) అశ్వమేధము చేయుటచే జనించినది. ఆమె ధృవుని తల్లి. ఉత్తానపాదునికి ధ్రువుడు కీర్తిమంతుడు ఆయుష్మంతుడు వసువు అను నల్వురు కుమారులు సూనృతయందు గల్గిరి. ధృవుడు గొప్పకీర్తి కావలెననికోరి మూడువేల దివ్య సంవత్సరములు తప మాచరించెను.
ఆతనికబ్జయోని ప్రీతుcడై తన స్థానమునకు సమానమైన స్థానము నిచ్చెను. అది సప్తర్షుల పురోభాగమందు అచలమయి (ధ్రువమయి) వెలుగుచున్నది. ఆతని అభిమానము సమృద్ధిని మహిమను గని దేవాసుర గురుండు శుక్రుడీ క్రింది శ్లోకమును జెప్పెను. ”ఆహా ఈ ధ్రువునితపస్సు-వీర్యము-శ్రుతము (పాండిత్యము) అద్భుతము. ఈతని ముందిడుకొని సప్తర్షులు విలసించుచున్నారు. అని. ధ్రువుని వలన శంభువను నామె శ్లిష్టి భవ్యుడు నను కుమారుల గనెను. శ్లిష్టి వలన సుచ్ఛాయ యను నామె రిపువు-రిపుంజయుడు-వీరుడు-వృకలుడు-వృకతేజనుడు నను నైదుగురు తనయులం గాంచెను. రిపువువలన బృహతి యను నంగన సర్వ తేజశ్శాలియైన చక్షుస్సును గనెను. అతడు వీరణుడును ప్రజాపతి యొక్క కూతురగు పైరణి యందు చాక్షుషమునువుం గాంచెను.
అతనికి నడ్వలయను నామెయందు పదిమంది పుట్టిరి. నడ్వల పైరాజప్రజాపతి కుమార్తె ఆపదిమంది కుత్సుడు-పురుషుడు శతద్యుమ్నుడు-తపస్వి-సత్యవాక్కు-కవి-అగ్నిష్టుత్తు-అతిరాత్రుడు-అభిమన్యుడు సనువారు, పురుని వలన ఆగ్నేయియనునామె అంగుడు-సుమనసుడు-ఖ్యాతి-క్రతువు-అంగిరసుడు-గయుడునను నాఱ్వురు కుమారులం గనెను. అంగునివలన సునీథుని కుమారి వేనుడను కొడుకుం గాంచెను. వాడు చేసిన యపచారముచే ఋషులు కోపోద్రిక్తులైరి. వానిసంతాసముసకై వాని కుడి హస్తమును మథించిరి. అపుడు ఒక మహానుభావుడుదయించెను. మునులాతనిం గని యితడు ప్రజారంజకుడు అనిరి. ఆ బాలుడు ధనువూని కవచము తొడిగికొని జ్వలించు నగ్నివోలె నుదయించెను. అతడెపృథువు. ఈనేల నేలినవాడు. (అతని పేర ఇల పృథివి అనబడెను.)
ఆ వసుధాధీశుడు రాజసూయయాగాభిషేకము నందిన రాజులకెల్ల మొట్టమొదటివాడు. అతనికి నిపుణులయిన సూతమాగధులిర్వురు జనించిరి. అతనే భూమిని గోవు నొనరించి సస్యరూపమయిన క్షీరమును బిదికిన మహానుభావుడు. అట్లు పిదుకబడిన గోవు (భూమి) ప్రజా జీవనమునకు పాలు చేపినది. దేవతలు ఋషులు పితృదేవతలు దానవులు అప్సరసలు నాగులు (సర్పములు) పుణ్యజనులు (రాక్షసులు) వీరుధులు పర్వతులు తమతమ కాయాపాత్రములందు పిదుకబడిన క్షీరమును ద్రావి ప్రాణధారణ మొనరించుకొనిరి. వసుంధర వారివారికి పాలిచ్చెను. వృథుని కుమారులు ధర్మజ్ఞులు అంతర్థి పాతి యనువారు గల్గిరి. అంతర్థానుని వలన శిఖండిని యను నామె హవిర్ధానుడను కొడుకుం గాంచె. హవిర్ధానుని వలన ఆగ్నేయి యార్వురు కుమారులం గాంచెను. వారు ప్రాచీన బర్హి-శుక్రుడు-గయుడు-కృష్ణుడు-వ్రజుడు-అజినుడు ననువారు. ప్రాచీనబర్హి భగవానుడు మహానుభావుడు ప్రజాపతి యయ్యెను. హవిర్ధానుని కుమారుడు ప్రాచీనబర్హి యేలు నేలలో నీటిలో దర్భలు ప్రాచీనాగ్రములుగానే మొలచెనట. (అందుచే నాతడు ప్రాచీన బర్హియయ్యె.). ఆప్రభువు సముద్రుని కూతురు సవర్ణయను నామెను బరిణయమాడెను. తీవ్రతపస్సుచేసిన మీదటనే అతడు పెండ్లిచేసికొని సవర్ణ యందు పదిమంది కుమారులను ధనుర్వేదపారగులను గాంచెను. ప్రాచేతసులగు వారందరు నొక్కటియై తపమాచరించిరి. ఏక రీతిగా ధర్మము నిర్వహించిరి. పదివేలేండ్లు సముద్రజలములందుండి తీవ్రతపము సేసిన మహానుభావులు వారు. వారు తపము సేయు తఱి-రక్షణలేనితన మహావృక్షములు (అంగుళమెడములేకుండ) మొలచి యీ పృథివిని కప్పివేసినవి. అందువలన ప్రజాక్షయ మేర్పడెను. వాయువు వీచరాదయ్యె. వాయుపధము చెట్లచే నిండి నిబిడీకృతమయ్యె. పదివేలేండ్లు ప్రజలు కదలను మెదలను వశముగాదయ్యె. అది విని తపస్సులు ప్రాచేతనులు కోపించి మొగములనుండి వాయువును అగ్నిని జనింపజేసిరి. వాయువు తరువులనెల్ల మొదలిటికి బెల్లగించి బడద్రోసి తడియార్చివైచెను. వాని నగ్ని దహించెను. ఇట్లు సర్వద్రుమ నాశనమయ్యెను. కొలదిగా మిగిలిన తరువులంగని సోముడేతెంచి వారింగని యిట్లనియె. రాజులారా ! కోపము నాపుడు. పృథివియెల్ల వృక్షశూన్యయయ్యె. అనలానిలములను శమింపజేయుడు. ఈ వృక్షములు గన్న కన్యారత్నమిదిగో పరమసుందరి-భవిష్యవృత్తాంత మెరిగి నేనీమెను గడుపులో దాచితిని. ఇది మారిషయను పేరుగలది. ఈమె మీకు భార్య యగుగాక ! సోమవంశవర్ధని ఈమె. మీ తేజస్సులు సగము నా తేజస్సులో సగము వహించి యీమె యందు దక్షుడను ప్రజాపతి ఉదయింపగలడు. మీ తేజముచే దగ్ధమయిన యీ పృథివిని అగ్నికల్పుడగు నాతడు చల్లార్చి ప్రజలను వృద్ధినందింపగలడు. ప్రచేతసులా సోముని పలుకులాచరించి కోపము ఉపసంహరించి వృక్షముల నుండి మారిషయను ఆ కన్యం గైకొనిరి. ఆ ప్రచేతసులు పదిమందివలన మారిషయందు సోమాంశమున మహాతేజస్వి దక్షుడుదయించెను.
అతడు చరాచరభూతములను ద్విపాచ్చతుష్పాదపశువులను మననుచేతనే సృజించి యామీదట స్త్రీసంతానమును గనెను. అందు ధర్మునికి పదిమందిని, కశ్యపునకు ఐదుమువ్వురనిచ్చి తక్కినవారిని నక్షత్రనామధారిణుల నిర్వదియేడ్గురను సోముని కొసంగెను. వారియందు దేవతలు-పక్షులు-గోవులు-నాగులు-దైత్యులు. గంధర్వులు-అప్సరసలు మఱి పెక్కుజాతులు జనించెను. అది మొదలు మైథునసంభవులయిన ప్రజలు పుట్టనారంభించిరి. పూర్వము సంకల్పమాత్రమున-దర్శనమాత్రము-స్పర్శమాత్రమున సృష్టి యయ్యెడజరుగుచుండెను.
మునులిట్లనిరి.
సూత! శుభవ్రతియైన దక్షుడు బ్రహ్మయొక్క అంగుష్ఠమునుండి కదా జనించెనని వినబడును. ఆయన బొటనవ్రేలినుండి కదా యీయన భార్య జనించెను. అట్టితఱి దక్షుడు ప్రాచేతసులకు జనించెనంటిరే! ఇది సంశయము వివరింప నీవ యర్హుడవు. సోముని కూతురుబిడ్డ వీరి మామ యెట్లయ్యె అని అడిగెను
లోమహర్షణు డిట్లనియె
విప్రులారా ! భూతములందు జరుగు పుట్టువు నిరోధమును గురించి తెలియక మునులే తికమకపడుచుందురు. విద్యావంతులకే ఇది దురవగాహము. ఈ దక్షాదులు రాజులు యుగయుగమందు తిరిగి పొడముచుందురు. తిరిగి చాటగుచుందురు. విద్వాంసుడేని అక్కడ పొరబడును. వీరిలో జ్యేష్ఠ కనిష్ఠ భావములు మున్ను లేకుండెను. తపస్సు-ప్రభావమును బట్టియే చిన్న పెద్ద పరిగణనము. దక్షుని యీ విసృష్టి నెఱింగిన యాతడు సంతానవతుడయి, పూర్ణాయువై స్వర్గమందు వసించును. (47-58)
ఇది శ్రీ బ్రహ్మమహాపురాణమునందు సృష్టికథనమను ద్వితీయాధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹