శ్యమంతకోపాఖ్యానము
సూతుడిట్లనియె
శ్రీ కృష్ణుడు సత్రాజిత్తునకు మణిరత్నము నొసంగగా, దానిని బభ్రువు, (అక్రూరుడు) భోజవంశీయుడగు శతధన్వునిచే హారింపజేసెను. అక్రూరుడవకాశము కనిపెట్టి శ్యమంతకమడుగున దాగి యుండెను. శతధన్వుడు సత్రాజిత్తును సంహరించి రాత్రివేళ మణింగొనివచ్చి అక్రూరునకొసంగెను. అక్రూరడదిగొని ఈ విషయమెవ్వరికి ఎన్నడును దెలుపనని వానిచే ప్రమాణము చేయించెను.
తండ్రి హతుడగుటకు తపించి సత్యభామ రథమెక్కి వారణావతమునకేగెను. అక్కడ భోజవంశీయుడగు శతధన్వుని ఈ వృత్తాంతమును భర్తకుందెలిపి కంటనీరు గ్రుక్కుకొనెను, లక్కయింట దగ్ధులైన పాండవుల ఉదకక్రియసేసి కృష్ణుడు సాత్యకిని వారియొక్క ఉత్తరక్రియయందు నియోగించి వెంటనే ద్వారకకేతెంచి బలరామునితో నిట్లనెను.
శ్రీ కృష్ణుడిట్లనియె
సింహము ప్రసేనుని జంపినది, శతధ్వనుడు సత్రాజిత్తును జంపెను. శ్యమంతకము నాకు జెందవలసియున్నది. కావున త్వరగా రథమెక్కుము. అ భోజుంగూల్చి ఆ మ్మణిం తెత్తుము, ఆ శ్యమంతకము మనది కాగలదనియె.
సూతుడిట్లనియె
శతధ్వనుడు కృష్ణునితో బోరుచు అక్రూరుడెక్కడున్నాడని చూచుచుండెను. అక్రూరుడు శక్తుడయ్యు శాపభీతిచే యుద్ధమున తోడ్పడడయ్యెను, అప్పుడు భోజుడు భయార్తుడై వెనుదిరుగ నిశ్చయించెను. ”హృదయ” ఆను వాని గుఱ్ఱము నూరు యోజనములు మించి దూకగలదు. భోజుని స్వాధీనముననున్నది. దానితోనే కృష్ణునితో దలపడెను. నూరుయోజనములు మేర అరిగి వేగముడుగుటయు, తన రథవేగ మెచ్చుటయు జూచి కృష్ణుడు శతధన్వుని నొప్పించెను. అ గుఱ్ఱము డిల్లవడి తుదకు ప్రాణములు గోల్పోవుట చూచి కృష్ణుడు బలరామునితో నిట్లనియొ.
శ్రీకృష్ణుడిట్లనియె
ఓ శూరాగ్రేసర ! నీవిక్కడేయుండుము. గుఱ్ఱము నష్టమైనది. పాదచారినై వెళ్లి మణిరత్నమైన శ్యమంతకము హరించగలను అని,అటు పిమ్మట హరి పాదచారియై వెళ్ళి శతధన్వుని పైకేగి మిధిలా ప్రాంతమున వానిని సంహరించెను. కాని వాని దగ్గర శ్యమంతకముకానరాదయ్యె. మరలివచ్చిన కృష్ణునింగని హలాయుడుడగు బలరాముడు మణినిమ్మని యడిగెను. కృష్ణుడు లేదని బదులు చెప్పెను. అంతట బలరాముడు రోషముగొని ఛీఛీ యనికేకలు వేసి కృష్ణునితో నిట్లుపలికెను.
తమ్ముడవని సైరించితిని. నీకు స్వస్తి యగుగాక. నాకు ద్వారకతో గాని, నీతోగాని, వృష్ణులతోగాని పనిలేదు, నేను వెళ్ళు చున్నాను,అని బలరాముడు మిథిలం బ్రవేశించెను. మిథిలాధిపతి సత్కారమంది. ఇష్టోపభోగియై యక్కడనే యుండెను.
ఈ సమయములోనే బుద్ధిశాలియగు బభ్రువు (అక్రూరుడు) పెక్కువిధములగు క్రతువుల నాచరించెను. గాధీపుత్రుడగు నా అక్రూరుడు దీక్షామయమైన రక్షాకవచమ్ముదొడిగికొని శ్యమంతకము కొఱకు యజ్ఞము చేసెను. అరువదేండ్లు వివిధరత్న ధనరాసుల నధ్వరములందు వినియోగించెను. ” అక్రూరయజ్ఞము”లను పేర నవి ప్రఖ్యాతి వవసినవి. అవి విపులాన్న దానదక్షిణులు సర్వకామప్రదములునై విలసిల్లెను. అంతట దుర్యోధనుడు మిథిలకేగి బలరామునికడ గదాయుధ్ధ శిక్షణమును వడసెను.
మహారథులగు వృష్ణ్వంధకులతో పోయి కృష్ణుడు బలరాముని ద్వారకకు మరలదెచ్చెను. బంధువులతో గూడ నిద్రలోవున్న సత్రాజిత్తును జంపిన అక్రూరుడంధకులతో బాటు మరల ద్వారకకు వచ్చెను. అప్పుడు కృష్ణడు జ్ఞాతులతో బెడియునను భయమువలన వాని నుపేక్షించెను. అప్పుడక్రూరుడు మిథిలకుపోగా నింద్రుడు వర్షించడయ్యె. అనావృష్ఠితో రాజ్యమనేక విధముల క్షిణించిపోయెను. అందువలన కుకురాంధకులు అక్రూరునిం బ్రసన్నుం జేసికొని మరల ద్వారకకుం గొనివచ్చిరి. అంత దానవతి యగునతడు ద్వారకకు రాగానే జలనిధి తీరమున వాసవుడు బాగుగా వర్షించెను. అక్రూరుడు శీలవతియగు తన చెల్లెలిని వాసుదేవునకు ప్రీతికలుగ నిచ్చెను. అంతట కృష్ణుడు యోగశక్తిచే శ్యమంతకమణి అక్రూరుని దగ్గర నున్నదని గమనించి సభామధ్యమున అక్రూరుని గూర్చి యిట్లు పలికెను.
శ్రీకృష్ణు డిట్లనియె !
నీ చేజిక్కిన మణిని నాకిమ్ము. నా మర్యాద గాపాడుము. అఱువదియేండ్లు నాకీమణి నిమిత్తముగ రోషము గల్గినది, కాలమెంతో గడిచిపోయినది.
అంతట అక్రూరుడు కృష్ణుని పలుకులను బట్టి సర్వ యాదవ సమాజము నందు మణిని గొనివచ్చి మనస్సునొచ్చకుండ బుద్దిమంతుడు కావున దానిని హరికిచ్చెను. అరిభీకరుడైన కృష్ణుడు బభ్రు హస్తమునుండి సూటిగ లభించిన ఆ మణిని చేకొని హర్షముగొని తిరిగి దానిని అక్రూరునకే యిచ్చెను. గాదినీ పుత్రడగు అక్రూరుడు క్భష్ణుని హస్తము నుండి లభించిన యా శ్యమంతక మణిరత్నమును దాల్చి సూర్యునివలె దేజరిల్లెను.
ఇది బ్రహ్మపురాణమునందు శ్యమంతకమణి సమానయనమును పదునేడవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹