Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై నాల్గవ భాగము

వ్యాసముని సంవాదే మహాప్రళయ వర్ణనము

ఓ వ్యాసా ! ఎఱుగ శక్యము కాని విష్ణుమాయా తత్త్వము నీవలన వింటిమి. కల్పాంతమున జరుగు మహాప్రళయమున సృష్ట్యువ సంహారమును వినగోరుచున్నాము. అని మునులు వ్యాసునడిగిరి.

ప్రాకృత ప్రళయమున సృష్ట్యుప సంహారము జరుగు విధము వినుడు. మానవుల మాసము పితరులకునను నంవత్సరము దేవతలకును ఒక ఆహోరాత్రముగును. కృతము, త్రేతా,ద్వాపరము,కలి అను చతుర్యుగము బ్రహ్మకు ఒక పగలు. ఇది దేవతల పండ్రెండువేల సంవత్సరములకు సమానము, కల్పాదియందలి కృతయుగమున సృష్టియు కల్పాంతము నందలి కలియుగమున ఉపసంహారము-ప్రళయమును జరగును.

ధర్మము నాలుగు పాదములతో నడువక వైకల్యము నొందు కలియుగ స్వరూపము వినగోరెదమని మునులనిరి.

కలియుగమున నరులు ఋగ్యజుః సామవేదములు ప్రమాణముగా వర్ణాశ్రమాచార ధర్మముల యందు ప్రవర్తించరు. వివాహములు ధర్మములు ఉండవు. శిష్యులు గురువుల నాదరించరు. పుత్రులు తమ ధర్మమును పాటించరు. అగ్నిహోత్రాది క్రియలు ఉండవు. ఏకులమున పుట్టినవాడైనను బలమున్నచో సర్వేశ్వరుడై పాలకుడగును. అన్ని వర్ణములందును జనులు తమ కుమార్తెల మూలమున ధనమార్జింతురు. విప్రులు తమకుతోచిన ఏదోయొక విధానమున యాగదీక్షను వహింతురు. తమకుతోచిన విధానమున ప్రాయశ్చిత్తములు చేయుదురు. ఎవరు ఏది చెప్పిన అదే శాస్త్రము. అందరును అందరకును దేవతలే. అందరకును అన్నియు బ్రహ్మచర్యాది ఆశ్రమములే. తమకు ఏది ఇష్టమై అనుష్ఠించినచో వారికి అదియే ఉపవాసము. అదేతపస్సు అదేదానము. కొంచెము ధనమన్నను మదము హెచ్చును. బంగారం,మణులు,రత్నములు అన్నియు నశించగా స్త్రీలకు కేశములే అలంకారమునకు సౌందర్యమునకు కారణమైయుండును. స్త్రీలు ధనవంతునే భర్తగా గ్రహింతురు. ధనహీనుడగు భర్తను వదలుదురు. సేవకులు తమకు ఎక్కువ ధనము ఇచ్చిన వానినే యజమానునిగా గ్రహింతురు. ధనమునకు గృహములే ప్రధానోపయోగము – తెలివియున్నందులకు ధనమూర్జించుటయే ప్రధానోపయోగము – అస్తియున్నందులకు సుఖములే ప్రధానోపయోగము. అని కలియుగ జనులు భావింతురు.

కలియుగమున స్త్రీలు స్వేచ్ఛాప్రవృత్తి-విలాసములయందు వాంఛ కలిగియుందురు. అన్యాయముగా ధనమార్జించిన పురుషులను వాంఛింతురు. మిత్రులుకూడ ఎంత వేడినను మానవులు అల్పముగాకూడ తమ ధనమును వదలుటకు ఇష్టపడరు. మనస్సు ఎప్పుడును లౌకికమైన పురుషార్ఠములను సాధించుటయందేయుండును. పాలెక్కువగా ఇచ్చుటను బట్టియే గోవులపై గౌరవము. జనులు తరచుగా అనావృష్టికి గుఱియై ఆకలిచే బాధనొందురు ఆకాశమువైపు వానకై చూచు చుందురు. వేళ్ళు పండ్లు ఆకులు తినుచు తమ్ముతాము చంపుకొనుచుందురు. కరువులతో పడరాని బాధలు పడుచు తట్టుకొనలేక సుఖములు లేక ఉందురు. స్నానము చేయకయే ఆహారము తిందురు. అగ్నిని దేవతలను అంధులను పూజింతురు. పిండోదకాది పితృక్రియలు చేయరు. స్త్రీలు వివాహ సుఖవాంఛ చిన్నదేహము అధికాహారము తినుట ఎక్కువసంతానము తక్కువ భాగ్యము కలవారగుదురు. వారు రెండుచేతులతో తలగోకికొందురు. దేహమును నిండుగా కప్పుకొనకయుందురు. పెద్దలయొక్క భర్తయొక్క అజ్ఞమీరుదురు. తమపొట్ట నింపుకొనుచు కోపసలై దేహసంస్కారము లేక అసత్యములు పరుషములు మాటాడుచుందురు. దుఃశీలము కలిగి దుఃశీలురగు పురుషులయందు ఆసక్తి దుష్ర్పవర్తనము కలిగియుందురు.

బ్రాహ్మణులు ఉపవనయనము లేకయే వేదాధ్యయనము చేయుదురు. గృహస్థులు హోమములు తగినట్లు దానములు చేయరు. యతులు అడవులలో నివసించుచు మొరటైన ఆహారము తినుచు పుత్రాది స్వజనముపై ప్రీతి కలిగియుందురు. ప్రభువులు ప్రజలను కాపాడకపోగా పన్నులను పేరుతో ప్రజల ధనమును హరించుచుందురు. అశ్వరథ గజములు ఉన్న వాడేరాజు; బలహీనుడే సేవకుడు. వైశ్యులుకృషి వాణిజ్యమువంటి తమ వృత్తులు విడిచి వడ్రంగము మొదలగు పనులతో శూద్రవృత్తితో జీవింతురు. శూద్రులు అధములై సన్యాసి వేషముతోనుండి ధర్మములు సంస్కారములు లేక భిక్షావృత్తితో యతివలె జీవింతురు. జనులు కరువు వలన పన్నులవలన బాధలు పడలేక గోధుమలు యవలు ఆహారముగా తిను దేశములకు పారి పోదురు. లోకమున వేదమార్గము నశించి అవైదికప్రవర్తన పెరిగి అధర్మమెక్కువైనందున జనులు అల్పాయువులగుదురు. శాస్త్ర విహితములుకాని ఘోరతపస్సులచేయు జనులను రాజు దండించకపోవుటచే రాజదోషమువలన పసివారు మరణింతురు. ఎనిమిది తొమ్మిది పది ఏండ్ల మగవారివలన ఐదారేండ్ల స్త్రీలకు కాన్పులు అగును. పండ్రెండేండ్లకంటె పైబడి చాల తక్కువమంది జీవింతురు. తక్కువ తెలివి వ్యర్థముగా వేషముధరించుట దుష్టమగు అంతః కరణము కలిగి జనులు అల్పవయస్సుననే మరణింతురు.

వైదిక మార్గము ననుసరించి వారికి హాని కలిగినప్పడెల్ల అధర్మము పెరుగునని ఎఱుగవలెను. అప్పుడే కలి విజృంభించును. ధర్మము నాచరించువారి ప్రయత్నములు నెఱవేరకుండును. వేద వాదములందు ఆసక్తి తగ్గును. నరులు ఆవైదికుల ప్రభావమునకు లోబడుటచే సర్వస్రష్ట – సర్వేశ్వరుడగు విష్ణుని అర్చింపకుందురు. వేదములతోను బ్రాహ్మణులతోను దేవతలతోను నీటితో పవిత్రత సంపాదించుటతోను పనియేమి? అని పలుకుచుందురు. వానలు ఎక్కువగా కురియవు. పంటలు ఎక్కువగా పండవు. పండ్లలో సారమెక్కువగా ఉండదు. అణుప్రాయమగు ధాన్యము. మేకపాలకు ప్రాముఖ్యము. వట్టివేళ్ళ గంధము పూసికొనుట అధికమగును. నరులకు అత్తమామలే గురువులుగా మిత్రులే ముని శ్రేష్ఠులుగా అగుదురు. నరులు మామగారలు చెప్పినది వినుచు మానవుడు తనపని తాను చేసికొనునపుడు ఎవరికి ఎవరు తండ్రి? ఎవరు తల్లి? ఎవరు కుమారుడు? అందురు. అల్పప్రజ్ఞ కలవారై వాజ్మనఃకాయిక దోషములకు వశులై అనుదినమును పాపముల చేయుచుందురు. సత్యము శౌచము సిగ్గు వీనిని విడిచినవారికి కలుగవలసిన దుఃఖములన్నియు కలిగి జనులు బాధలు పడుదురు. స్వాధ్యాయము స్వధా స్వాహ వషట్కారములు లోపించును. సరియగు బ్రాహ్మణులు అరుదుగా నుందురు. కృతయుగమున దీర్ఘకాలము తపస్సుచేసి సాధించిన పుణ్యస్కంధమును కలియుగములో అల్పకాలములోనే సాధించికొందురు.

ఏ కాలములో అల్ప ధర్మము నాచరించినను అధిక పుణ్యఫలము కలుగునో తెలుపుమని వ్యాసుని మునులండిగిరి.

ఓ విప్రులారా! ధన్యమగు అల్ప క్లేశముతో తపస్సు చేసినను మహాఫలము లభించును. ఈ విషయములో స్త్రీలును శూద్రులును మఱియు ధన్యులు. కృతయుగమున పండ్రెండేండ్లు తపస్సు చేయుటచే కలుగు ఫలితము త్రేతాయుగమున ఒక సంవత్సరము ద్వాపరమున ఒక మాసము కలిలొ ఒక అహోరాత్రముతోనే కలుగును. తపస్సు బ్రహ్మచర్యము జపము మొదలగువాని ఫలము కలియుగములో ఇట్లు నరుడు అల్పశ్రమముతేనే పొందగలడు. అంతేకాక కృతయుగమున ధ్యానముచేత త్రేతలో యజ్ఞములచేత ద్వాపరములో అర్చనముచేత కలుగు ఫలము కలియుగమున కేశవ సంకీర్తనముతోనే కలుగును. బ్రాహ్మణులు కలియుగమున ఉపనయనము చేసికొని వేదవ్రతములనుష్ఠించుచు వేదాధ్యయనము చేయవలెను. తరువాత ధర్మానుసారముగ సంపాదించిన ధనముతో విధానము ననుసరించి యజ్ఞములు చేయవలెను. వ్యర్థముగా భాషించుట – భుజించుట – ధనమార్జించుట బ్రాహ్మణులు పతితులు అగుటకు హేతువగును. కనుక విప్రులు ఆయా విషయములలో నిగ్రహముకలిగి ఉండవలెను. వారు ఏ విషయముల నైనను సరిగా చేయకపోవుట దోషకరము. భోజ్యములను తినుట పానీయములను త్రావుటవలన ద్విజులకు కోరికలు నెరవేరవు. జనులును అట్టి బ్రాహ్మణులకు అధీనులై అన్ని కార్యములయందును ప్రవర్తించినచో వారు ఎంతో శ్రమకు ఓర్చి వినయవంతులై జనులచే ఆయా యజ్ఞాదులను చేయింతురు. శూద్రుడు బ్రాహ్మణులను సేవించుచున్నచో పాకయజ్ఞమునకు అధికరాము కలిగి తాను సాధింపదగిన ఉత్తమలోకములన సాధించుకొనును. త్రికరణములతో పతిసేవ చేయుటవలన స్త్రీలు తన భర్తతోపాటు అతడు పుణ్యములు చేసి సాధించిన లోకములకేగి సుఖింతురు.

ఓ బ్రామ్మణులారా ! మీరు ఏ విషయము తెలియగోరి ఇక్కడకు వచ్చితిరో అది తెలిపితిని. ఇంకను ఏమి కావలయునో అడుగుడు.

ఇది శ్రీ మహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమున భవిష్యకథనము అను నూట ఇరవై నాల్గవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment