సోమోత్పత్తి వర్ణనం
సూతుడిట్లనియె : – పితృకన్యయగు విరజయందు మహాతపస్వియగు సహుషుని. ఇంద్రతల్యులైన ఆర్వురు కుమారులుదయించిరి. వారు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, యాతి, నుమాతి అనువారు. అందు యయాతి రాజయ్యెను. అప్పరమ ధార్మికుడు కకుత్ద్స కన్యను గోవు యను నామెను వివాహమాడెను. యతి మునియై మోక్షమార్గమందుండి బ్రహ్మీభావమందెను.
యయాతిసోదరులు ఐదుగురు రాజ్యముం గెల్చుకొని ఉశనసుని (శుక్రుని) తనయను దేవయానిని భార్యగ గైకొనెను. మఱియు వృషపర్వుడను నసురుని కుమార్తె శర్మిష్ఠంగూడ పత్నిగ గైకొనెను. దేవయాని యదువును తుర్వసుని గనెను. శర్మిష్ఠ ద్రుహ్యుని అనువును-పురవును గాంచెను. దేవేంద్రు డాతనికి (యయాతికి) ప్రీతుడై, దివ్యమైన, భుజకీర్తిని దివ్యములు మనోజవము లైన తెల్లని యశ్వముల బూన్చిన స్వర్ణమయమైన రథమునొసంగెను.
ఆ రథముతో విజయయాత్ర చేసి యుద్ధమునందు అజేయుడై యయాతి ఆరుదినములలో మహీమండలమెల్ల జయించెను దేవదానవుల నిగ్రహించెను. సంవర్తవసు నామకమైన అరథము కౌరవులదాయెను. కురువంశీయుడును. కురువంశీయుడును పరీక్షుతుని కుమారుడునునగు జనమేజయునినుండి గర్గశాపమున నారథమంతరించెను.
బాలుడైన గర్గుని కుమారుని జనమేజయుడు కాలవశమున చంపి బ్రహ్మహత్యా పాపము నందెను. దానిచే లోహగంధియై (ఇనుప వాసన గొట్టు మేనుగలవాడై) యారాజర్షి యిందందు వెఱ్ఱిఫరుగులు పెట్టుచు పౌర జానపద పరిత్యక్తుడై దుఃఖ సంతప్తుడై శాంతినెచటను పొందడాయెను. ద్విజశ్రేష్ఠుడగు శౌనకుని శరణమందెను. జ్ఞానియైన శౌనకుడు పవిత్రతకై అతనిచే అశ్వమేధము జేయించెను. అవబృధస్నానము కాగానే యతని దుర్వాసన పోయెను. యయాతి దివ్యరథము చేదిరాజునకు జిక్కగ నింద్రుడు తుష్టుడై దానిని కొనివచ్చి బృహద్రధున కిచ్చెను. బృహద్రధనుండి యదియాతని కొడుకునకు జరాసంధునికి దక్కెను. భీముడు వానిని చంపి ఆ రధమును వాసుదేవున కర్పించెను.
సహుషి నూనుడగు యయాతి సాగరము సప్తద్వీపము నగు వసుంధరనెల్ల గెలిచి యైదుభాగములసేసి పుత్రుల కొసంగెను తూర్పుదిశను జ్యేష్టుడగు యదువును, నడుమ పూరుని నభిషేకించెను. అగ్నేయమున తుర్వసు నుంచెను. వారిచే నీవిశ్వంభర నేటికిని ధర్మముతో పరిపాలింపబడుచున్నది. బ్రాహ్మణులారా ! అ దేశముల గూర్చి ముందుచెప్పగలను.
యయాతి తన ఐదుగురు కుమారులు దురంధరులు రాజ్యభారము వహించగా వార్ధకదశలో ధనుర్భాణసన్యాసము జేసి భూమియందు సంచరించుచు సంప్రీత మనస్కు డయ్యెను. ఇట్లు భూ విభాగము చేసి యాతడు తన కుమారుని యదుపుం జూచి నా ముసలితన మీవు గ్రహించి నీ యవ్వనము నాకిమ్ము నాముసలితనమును నీయందుంచి నీరూపములో యువకుడనై కార్యాంతరము వలన నీభూమిపై నంచరింతును. యయాతితో యదువిట్లు బదులు పలికును.
యదువిట్లనియె : – ఒక బ్రాహ్మణునికై నేనిత్తునని ప్రతిజ్ఞజేసిన భిక్ష నింతదాక యీయలేదు. అది చెల్లింపక నీజరాభార-మెట్లు స్వీకరింపగలను? అదిగాక ముదిమియందన్నపాన నిమిత్తమయిన దోషములనేకములు గలవు. కావున నీ ముసలితనమ మేను గ్రహింప నుత్సహింపను. రాజా! నాకంటెను ప్రియతములైన పుత్రులు నీకనేకులు గలరు. ధర్మజ్ఞా! నీ జరాభారము గ్రహింప మరొక్కని కోరుకొమ్ము. అనవిని వక్తలలో శ్రేష్ఠుండగు యయాతి కోపవశుడై తనయుని గర్హించుచు నిట్లనియె.
దుర్బుద్ధీ! నన్ను నిరాకరించిన, నీకు మరి యాశ్రమమేమి యున్నది? ధర్మమేమి యున్నదిరా! నేను నీకు దేశికుడను గద! నీనంతతికి రాజ్యముండదు సందేహము లేదని శపించెను. అట్లే కొడుకులందరినడిగెను. వారు నల్వురు కాదనినం త నిట్లేశపించెను ఇదప వానిం పూరుని గూర్చి యదేమాట చెప్పెను.
ఆ పూరుడు తండ్రి ముదిమిని స్వీకరించి తండ్రికి దన యవ్వన మొసంగెను. దాన యయాతి భూమియందు తిరుగుచు, కామముల యంతయును వెనకుచు విశ్వాచితో గూడి చైత్రరధోద్యానమందు స్వేచ్చావిహారము లొనరించుచు పెక్కు కాలము క్రీడించెను. తృప్తుడైన తరువాత వచ్చి పూరునకాతని యవ్వన మిచ్చివేసి తనముదిమిం దాను గ్రహించెను.
మునిశ్రేష్టులారా ! ఆ సమయమున యయాతిచే గానము చేయబడిన గాధ (అనుభవము)ల విన్నవాడు, తాబేలు తన అవయవములను లోపలికి ముడుచుకొనిన విధముగ తనకు కలిగిన కామము (కోరిక) లను సంకోచింపచేసి కొనును. ఒకప్పుడును కోరికల యనుభవముచే కామముతీరదు. పైగా హవిస్సుచే అగ్ని పెంపొందినట్లు పెంపొందును. భూమియందు గల ధాన్యసంపద , బంగారము, పశువులు, స్త్రీలు ఇవన్నియు నొక్కనికి గూడ తృప్తి నీయ జాలవని తెలిసినవాడు మోహపడడు. ఎపుడు సర్వభూతములపై త్రికరణము (మనస్సు, వాక్కు, శరీరము) లచే పాపాలోచన చేయడో; అపుడా జీవుడు బ్రహ్మయే యగును. ఎప్పుడెవ్వడెవ్వరివల్లగాని జడియడో, తనవలన నెవ్వరు గాని జడియకుందురో, ఎప్పుడెవవ్వడేదియు కావలయునని గాని యక్కర లేదనిగాని యనడొ యపుడాతడు బ్రహ్మ భావమందును, దుర్మతులకేది వదిలించుకొనరానిదో, యేది నరునికి ముదిమి కదిపిన కొలది తాను ముదిమిcగొనదో, ఏది ప్రాణాంతక మయిన రోగమో ఆ తృష్ణ (ఆశ) అనుదానిని వదిలించుకొన్న వానికే సుఖము. జరితుడైన కొలది కేశములు జర్జిరితములగును. జుట్టు నెఱియును దంతములు జరితములగును కాని ధనాశ, జీవితాశ మాత్రము జరితములు గావు. లోకమున కామసుఖముగాని దివ్యమయినది అనగా స్వర్గాది తేజోమయ లోకములలోగల్గు సుఖముగాని తృష్ణాక్షయము వలన గలుగు సుఖముయొక్క పదునారవకళకేని సరికాదు.
అనిచెప్పి రాజర్షియైన యయాతి భార్యతో అడవి బ్రవేశించెను. (వానప్రస్థాశ్రమము స్వీకరించెను.) చాలాకాలము విపుల తపమానరించి అంతమందు భృగుతుంగ (పర్వతశిఖర) మందుండి నిరాహారియై మేను విడచి పత్నితో స్వర్గమునకేగెను. సూర్యుడు కిరణములచే నావరించినట్లాతని వంశీయులు రాజర్షులయిదుగు రభిలభూమండలమావరించిరి. పృష్టికులవర్ధనుడై నారాయణుడు శ్రీకృష్ణుడుగ నవతరించిన, రాజన్యులచే పొగడ్తగాంచిన యదు వంశమున కీర్తించెదను. వినుడు! బ్రాహ్మణోత్తములారా! ఈ యయాతి చరితము నిత్యము వినునతడు స్వస్థుడు, సంతానవంతుడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు కాగలడు.
శ్రీ బ్రహ్మ మహాపురాణమందు సోమవంశమున యయాతి చరిత నిరూపణమను పండ్రెండవ యధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹