Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పదిహేనవ భాగము

సదాచార వర్ణనము

వ్యాసుండిట్లనియె.

ఇట్లు గృహస్థు దేవతలను పితృదేవతలను హవ్యకవ్యములచేతను అతిథులను బంధువులను భూతములను నౌకరులను పశుపక్ష్యాదులను చీమలను బిచ్చగాండ్రను సన్యాసులను యాచకులను బాటసారులను సదాచారవంతులను అన్నాద్యాహారములచే పానీయములచే పూజించి నిత్యములయిన సంధ్యావందనాదులను నైమిత్తికములయిన ఆ యా పర్వాదులందు విహితములైన క్రియలను నిర్వర్తించి తీరవలెను. వీని నతిక్రమించినయెడల పాపమనుభవించును. అన మునులిట్లనిరి.

ఓ విప్రుడా! నీవలన నిత్యము నైమిత్తకము కామ్యము (ఏదేని కోరిక సఫలము కావలెనని చేయు కర్మ) అను త్రివిధమైన పురుష కర్తవ్యము (కర్మను) తెలిసికొన్నాము. ఇక సదాచారమనగా నేమో ఇహమందు పరమందు మానవుడాచరించి సుఖపడు దానిని గురించి వినగోరుచున్నామన మునులకు వ్యాసుండిట్లనియె.

గృహస్థు నిరంతరమును అచార రక్షణము చేసికొనవలెను. ఆచారహీనునికి ఇహపరములందు క్షేమము లేదు. సదాచారము నుల్లంఘించి వర్తించు వానికి యజ్ఞదాన తపస్సులు సుఖమీయవు. దురాచారుడు ఇక్కడ పూర్ణాయుర్దాయము పొందడు. సదాచార సంపన్నమైన ధర్మమును జేయవలెను. అట్టి ఆచారముయొక్క లక్షణము స్వరూపమును దెల్పెద వినుండు. తానేకాగ్రమనస్కుడై దానిని పరిపాలింపవలెను. (నిర్వహింపవలె నన్నమాట) గృహస్థు త్రివర్గమును (ధర్మ అర్ధ కామములను పురుషార్థములను) సాధించు ప్రయత్నము సేయవలెను. అది సిద్ధించిన యెడల ఇహవర సిద్ధియు గల్గును. ఈ త్రివర్గమందు నాల్గవభాగమేని జరిపిన పరలోకశ్రేయస్సు చేకూర్చును. సగము నిర్వర్తించినచోదన్నుదాను భరించుకొన గలవాడగును. నిత్యనైమిత్తికములజేయగల్గును. నాల్గవవంతుసదాచార సమాచరణమున ధర్మమూలమును వృద్ధిగావింపగలడు. ఈధర్మాచరణముచే అర్ధము సిద్ధించును. అట్లేపాపమును నిషేధించుటకు దెలిసినవాడు ధర్మమాచరింపనగును. పరమందర్ధము దానితరువాతిది కామముఫలప్రదములగుటకు వాని ఇహమందనుష్ఠింప వలయును. ప్రత్యవాయ భయముతో (పొరపాటుగ జేసిన పాపము వచ్చునను భయముతో) కామముగాని మఱి యే పురుషార్థమునకు విరుద్ధము గాకుండను (రెండు విధములుగాను) గావించిన కామపురుషార్థము గూడ త్రివర్గసాధనమందు విరోధకరముగాదు. ఈ పురుషార్థము నొకదానినొకటి అనుబంధింపబడునవిగా నున్నవా? విపరీతానుబంధములుగా నున్నవా? అను విషయము తెలిసికొనవలయును. ధర్మము ధర్మానుబంధియైన అర్ధమును బాధింపని ధర్మము అట్లే ధర్మార్దానుబంధియైన కామము ఆ రెండిటిని బాధింపని కామము దానిచే (కొమముచే) బాధింపబడని ధర్మార్థములును ఆత్మబాధకములు గావు. అనగాదనకు కృతార్ధతను గల్గించి తీరునన్నమాట. పురుషార్థములొకదానికొకటి యనుబంధపడి పరస్పర విరుద్ధములు గాకుండ జాగరూకుడై చేసినయెడల మానవుడు అన్నింటి ఫలమును పూర్తిగ పొందునని భావము.

బ్రాహ్మీ ముహూర్తమున (తెల్లవారుజాము) మేలుకొని తానానాడు చేయవలసిన ధర్మము అర్థము నను పురుషార్థసాధనను గురించి ఆలోచన చేయవలెను. అటుపై లేచి ఆచమము చేసి స్నానము చేసి నియమవంతుడై శుచియై సంధ్యావందనమును నక్షత్రములుండగా నొనరింపవలెను. సాయం సంధ్యను సూర్యుడుండగా గావింపవలెను. ఈ సంధ్యోపాసనను ఆపదయేమియు లేనప్పుడు తప్పక సేసితీరవలసినది. చెడ్డ ప్రేలాపనను అనృతమును పరుష భాషణమును వదలవలెను. అట్లే ఆసచ్ఛాస్త్రమును (నాస్తికాది మతములను) అసద్వాదమును (దుష్టనాదము) అసత్సెవను (అధర్మవరుల సేవించుటను) మానవలెను. నియమవంతుడై సాయం ప్రాతః కాలమందు హోమము సేయవలెను. సూర్యుని ఉదయాస్తమయములను జూడరాదు. తల దువ్వుకొనుట అద్దము చూచుట దంతధావనము కాటుక వెట్టుకొనుటయు పూర్వాహ్ణమందే చేయవలెను. దేవతర్పణము కూడ నప్పుడే కావింపనగును. గ్రామములు ఇండ్లు తీర్థములు క్షేత్రములు అనువానికేగు దారులందు దున్నిన పొలములో గోశాలలందు విణ్మూత్రములు సేయరాదు.

దిగంబరమైయున్న పరస్త్రీని తన పురీషమును జూడరాదు. బహిష్ఠమైన స్త్రీని చూచుట తాకుట పలకరించుట గూడదు! నీళ్ళలో మూత్రపురీషములు సేయుట మైధునము పనికిరాదు. మూత్ర పురీషముల వెంట్రుకలు బూడిద పొల్లు బొగ్గులు తెగిపోయిన త్రాళ్ళు గుడ్డపీలికలు దారిలో పడియున్న చింపిగుడ్డలు మొదలగువానిని ద్రొక్కరాదు.

పితృదేవ మనుష్యులను భూతములను అర్చించి అటుపై గృహయజమాని భోజనము చేయవలెను. తూర్పు ఉత్తరము దిశలవైపున కున్ముఖుడై ఆచమనముసేసిమౌనమూని శుచియై మనసుం దాను దిను ఆహారమువైపు నిలిపి మోకాళ్ళలోపల చేయి ఉంచి భోజనము సేయవలెను. తెలిసినవాడు చెడిన యన్నమొక్కటి తప్ప మఱి యే యన్న దోషములను తెలుపరాదు. కేవలం లవణము తినరాదు. ఉచ్ఛిష్టాన్నమును (ఎంగిలిని) విడిచిపెట్టవలెను. నడుచుచు లేక నిలువబడి మూత్రపురీషములు విడువరాదు. ఎంగిలినే కొంచము తినరాదు. ఎంగిలి నోటితో మాటలాడరాదు. వేదము చెప్పగూడదు. సూర్యచంద్ర నక్షత్రములను బుద్ధిపూర్వకముగా జూడరాదు. విరిగిన ఆసనము మంచము పగిలిన పాత్రమును వాడుకొనరాదు. పెద్దలు వచ్చినపుడు తాను లేచి నిలువబడుట ఎదురేగుట మొదలగు సత్కారములు చేసి ఆసనము(పీట కుర్చీ చాప మొదలయినవి) వేయవలెను. అనుకూలముగ సంభాషణము చేయవలెను. వారు వెడలి చనునపుడు కొంతదూరము వెంబడింపవలెను. ప్రతికూలముగ సంచరింపరాదు. ఒంటి గుడ్డతో భోజనము దేవతార్చనము బ్రాహ్మణాహ్వానము అగ్నియందు హోమము సేయరాదు. నగ్నుడై (దిశమొలతో దిగంబరియై) స్నానము చేయరాదు. పండుకొనరాదు. రెండుచేతులతోను నెత్తిని గోకుకొనరాదు. నిష్కారణముగ మాటిమాటికి తలమీద స్నానము సేయరాదు. శిరఃస్నానము చేసి తైలముతో అంగస్పర్శ చేయరాదు. అనధ్యయన దినములందన్నిట వేదాధ్యయనము మానవలెను. బ్రాహ్మణులను అగ్నిని గోవులను సూర్యుని ఎన్నడు అవమానింపరాదు.

పగలు ఉత్తరాభిముఖముగను రాత్రి దక్షిణాభిముఖముగను సంకట సమయములందు యదేష్టముగను మూత్రపురీషోత్సర్జన మొనరింప నగును. గురువు తప్పునుజెప్పరాదు. ఆయన కోపించిన యెడల బ్రతిమాలి క్షమాపణసెప్పి కొని ప్రసన్నునిం జేసికొనవలెను. ఇతరులు చేయు అపవాదమును వినరాదు. బ్రాహ్మణులకు రాజునకు దుఃఖాతురునికి విద్యాధికునికి గర్భిణికి రోగికి పూజ్యునకు మూగ గ్రుడ్డి చెవుటివాండ్రకు మత్తెక్కినవానికి ఉన్మత్తునికి దారియిచ్చి తొలగి నడువవలెను. దేవాలయమును చైత్యవృక్షమును (ఆలయాది పుణ్యస్థానములందు నాటించిన పుణ్యవృక్షము రావి మొదలయిన వానిని) నాల్గుదారులు గలిగిన కూడలిని ప్రదక్షిణముసేసి వెళ్లవలయును. అప్రదక్షిణముగా బోరాదన్న మాట. ఇంకొకడు వాడిన చెప్పులు బట్టలు పూలమాలలు మొదలయినవానిని తాను ధరింపరాదు. చతుర్దిశి అష్టమి పూర్ణిమ పర్వములునయిననాడు అభ్యంగము స్త్రీసంభోగము గూడదు. బాహువులు పిక్కలు పైకెత్తి నిలుచుండరాదు. పాదము లిట్టట్టు నాడింవరాదు. ఒకకాలితో నింకొకకాలు త్రొక్కరాదు. జారిణిని తప్పు జరిగిపోయిన తరువాత బాలుని జాతిభ్రష్టుని మర్మాఘాతముగ దిట్టుటను దెప్పి పోవుటను (సాధించుటను) మానవలెను. వివేకి డాంభికత్వము (డంబములు పలుకుట) నేనేఘనుడనను దురభిమానము తీక్షణత్వమును జూపరాదు. మూర్ఖులను పిచ్చివాండ్రను వ్యసనములలో నుండు వారిని (కష్టములలోనున్నవారిని) విరూపులను అంగవైకల్యముగలవారిని నిర్ధనులను పరిహసించి కించపఱుపరాదు శిష్యులను పుత్రులను శిక్షించుట కింకొకచేతికి దండమును (కఱ్ఱను)ఈయరాదు. కాలితో నాసనము దగ్గరగా నీడ్చికొని దానిపై కూర్చుండరాదు. తనకుదాను తినుటకు సంయావము గోధుమపిండితోచేయు కృశరము (పులగము) మాంసమును సేకరింపరాదు. సాయం ప్రాతఃకాలములందు అతిథులను పూజించి భుజింపవలెను. తూర్పు ఉత్తరము మొగమై మౌనియై పండ్లుతోముకొన వలెను. నిషిద్ధములయిన దంతకాష్ఠములను వాడరాదు. ఉత్తరదిశగా పడమరగా తలపెట్టి పండుకొనరాదు. తూర్పుదిశగా గానీ దక్షిణదిశగా తలపెట్టి పండుకొనవలెను. పరివళోదకములతో నిద్రపోరాదు. ఉషఃకాలమందు నిదురింపరాదు. గ్రహణమునందు విడుపుస్నానము రాత్రియే చేయవలెను. విడుపుకాగానే రాత్రియే చేయవలెనుగాని మరునాడు పగలుచేయరాదని అర్థము. ఉప్పును తినరాదు. నిలువయున్నది తడియారినది పాసినదియునగు అన్నము తినరాదు. పిండికూరలు చెఱకుపాలుఅను వానియొక్కయు మాంసముయొక్కయు వికారములు అనగా వాని వాని తో తయారైన పదార్థములను చిరకాలము నిలువయున్నవైనను తినవచ్చును. సూర్యోదయాస్తమయ కాలములందు పండుకొనరాదు. స్నానముచేయక కూర్చుండక మనస్సునిలుపక మంచముమీద వట్టినేలమీద కూర్చుండి చప్పుడు చేయుచు లేకమాట లాడుచు బోజనముసేయరాదు. సేవకులకు పెట్టకుండ తినరాదు. సాయం ప్రాతః కాలములందు స్నానముసేసి భోజనము సేయనగును. పరదారసంగము కూడదు. ఆదోషము ఇష్టాపూర్తముల వలనగల్గు ఫలమును ఆయుర్దాయమును నాశముసేయును. ఇష్టమనగా యజ్ఞము, వాపీకూప తటాకాది నిర్మాణము సత్రము పెట్టుట గోడకట్టించుట తోటలు వేయించుట మొదలయిన ధర్మకార్యములు పూర్తములు పరదార గమనమంత ఆయుర్దాయమును హరించుతప్పిదము మఱియొకటిలేదు.

ఆచమనముచేసియే దేవాగ్నిపితృకార్యములు గురువందనము భోజనమును జేయవలెను. ఆచనమునకుపయోగించు జలము నురుగు వాసనలేనివిగా ఉండవలెను. ఆచమానము చేయు నప్పుడు చప్పుడు కాగూడదు. తూర్పుగ ఉత్తరముగదిరిగి ఆచమనముసేయవలెను. నీళ్ళనుండి తీసినది ఇంటిపెరటిలోనున్నది పుట్టలోనిది ఎలుకకలుగులోని శౌచక్రియయందుపయోగింపగా మిగిలినదియునుగా నీయైదువిధములమన్ను శౌచవిధికుపయోగింపరాదు. కాలుసేతులు గడిగికొని వానిని ప్రోక్షణముసేసికొని స్థిరమనస్కుడై మూడుసార్లుగాని నాల్గుసార్గుగాని ఆచమనముసేసి రెండుసార్లు పెదవులను దుడిచికొని ఇంద్రియములను రెండుసార్లు స్పృశించి శుచియై సంధ్యావందనాది క్రియలను జేయవలెను. తుమ్మునందు నాకుటయందు అపానవాయువు నందు ఉమ్మివేయుట మొదలగు పనులందు ఆచమనము సేయవలెను. అంటరానివానిని అంటినపుడు సూర్యదర్శనము సేయవలెను. మఱియు కుడిచెవి స్పృశింపవలెను. ఈ చెవిని స్పృశించుట యింతకుమున్ను చెప్పిన ఆచమన సూర్యదర్శనముల కవకాశములేప్పుడే. మున్నుచెప్పినది ఉన్నప్పుడు తరువాతజెప్పిన పనులు సమ్మతములుగావు. పండ్లుకొఱుకరాదు. తనదేహమును గ్రుద్దుకొనరాదు. పండుకొన్నపుడు దారినడచునపుడు భుజించునపుడు స్వాధ్యాయము పనికిరాదు. సంధ్యలందు మైథునము ప్రయాణమును జేయగూడదు. అపరాహ్ణమున (కుతపకాలమందు) పగటికాలమును మూడుభాగములు సేయగా మూడవభాగమున పితృతర్పణము సేయవలెను. దేవపితృకార్యములముందు శిరఃస్నానముసేయనగును. తూర్పు ఉత్తర దిశమొగమై క్షురకర్మ చేయించుకొనవలెను. వికలాంగిని వివాహమాడరాదు. ఉత్తమకులమున బుట్టినది రోగములులేనిదియగు కన్యను బెండ్లాడవలెను. తండ్రివైపున ఏడవతరము దానిని తల్లివైపున ఐదవతరము దానిని మాత్రమే స్వీకరింపనగును. భార్యను సత్ప్రవృత్తివయందు బెట్టవచ్చును. శిక్షణయీయవచ్చును గాని ఈర్ష్య పనికిరాదు. పగటియందు నిద్రా మైథునములుగూడవు. ఇతరులకు తాపముగల్గించుపని జంతుపీడయు సేయరాదు.

ముట్టయిన స్త్రీని అన్ని వర్ణములవారు నాల్గురాత్రులు వెలుపల నుంచవలెను. అయిదవరోజు కూడ దూరముగ నుంచినచో నామెకు మఱి స్త్రీ జన్మము రాదు. ఆఱవరాత్రి ఆమెను బొందవచ్చును. మఱియు జ్యేష్ఠయుగ్మాసు అనగా ఋతు దినములయిన మొదటి పదియారు దినములలో సరిరాత్రులందు బొందనగును. సరిరాత్రులందు గూడిన పుత్రులు బేసిరాత్రులందు గూడిన ఆడుపిల్లలు గల్గుదురు. పర్వదినములందు బొందిన అధర్మపరులు సంధ్యాకాలమందు గూడిన నపుంసకులు పుట్టుదురు. రిక్తాతిథి క్షురకర్మ నిషిద్ధము. వినయము లేనివాండ్రేదేని చెప్పుచుండ నది వినరాదు. నీచునకున్నతస్థాన మీయరాదు. క్షురకర్మ సేసికొన్నపుడు స్త్రీ నంభోగానంతరము సంతకు వెళ్ళినపుడు సచేల స్నానము చేయవలెను. దేవతలను వేదములను ద్విజులను సాధువులు సత్యవంతులు మహాత్ములు నైనవారిని గురువును పతివ్రతలను బ్రహ్మయజ్ఞములు తపస్సు సేయువారిని దూషించుట (అప్రతిష్ఠపాలు చేయుట) పరిహసించటము కూడదు.

అచ్చపు తెలుపు వస్త్రములను దెల్లని పువ్వులను దాల్చి ఎపుడును మాంగల్యవేషియై శుభవేషము గొన్నవాడై యుండవలెను. అట్టివానికి అమంగళములు గల్గవు. తలబిరుసు గలవారితో ఉన్మత్తులతో మూఢులతో వినయహీనులతో నీచశీలురలో వయస్సుచే జాతిచే దూషితులైనవారితో డబ్బు దుబారా చేయువాండ్రతో శత్రువులతో కార్యదక్షులుగాని వారితో నింద్యులతో జారులతో జేరినవాండ్రతో నిరుపేదలతో వాదపరులతో మఱిపెక్కుతెఱగుల అధములతో చెలిమి చేయరాదు.

మిత్రుడు దీక్షితుడు (యజ్ఞము సేసినవాడు) భూపాలుడు స్నాతకుడు (గురుకులమందు విద్య పూర్తిసేసినవాడు) మామగారు అనువారితో గూడ తానును వేచి వారు వచ్చినపుడు ప్రత్యుత్దానము చేసి ఆసన పాద్యాదులీయవలెను. వీరు తన యింటికి వచ్చినపుడు తనకున్నంతలో (యథావిభవముగ) లోటుసేయకుండ పూజింపవలెను.

ప్రతి సంవత్సరోషితాన్‌ = సంవత్సరమున కొకసారి వచ్చియున్నవారిని అనగా ఆబ్దికమునందు యథాస్థానముగ అనగా వైశ్వేదేవస్థానము పితృస్థానము అనువానియం దర్చన సేయవలెను. అవ్వల అగ్నికి ప్రజాపతికి గృహదేవతలకు వరుసగా మూడాహుతులీయవలెను. మఱొకటి కశ్యపున కీయవలెను. అటుపైని అనుమతికొక యాహుతి నీయవలెను. పిమ్మట గృహబలి నీయవలెను. నిత్యకర్మ విధానమందు నేనింతమున్ను జెప్పిన వైశ్వదేవ క్రియను సేయవలెను. ఆ విధానము తెలుపుచున్నాను వినుడు.

పర్జన్యదేవతకు (వరుణునికి) అబ్దేవతకు భూదేవతకు మూడు స్థానములందు విడివిడిగా బలి వేయవలెను. ఆ వేయుట మణిక మందు. (మణికమనగా మట్టిపాత్ర) వాయువునకు అన్ని దిశలందు దిగ్ధేవతలకు వరుసగా తూర్పు నుండి బ్రహ్మ అంతిరిక్షము సూర్యుడు విశ్వేదేవులు విశ్వభూతములు ఉషస్సు భూతపతి అనువారికి ఉత్తరము వైపు బలివేయవలెను. ”స్వధాయైనమః|| అని పలుకుచు పితరులకు దక్షిణమునను ప్రాచీనావీతిగ వేయవలెను. యక్ష్మైతత్తే అను మంత్రము పఠించుచు వాయవ్యమూలలో అన్నావశేషలతో గూడిన యుదకము యథావిధిగ వదలవలెను. అటుపై దేవతలకు బ్రాహ్మణులకు నమస్కారము సేయవలెను. కుడిచేతి అంగుష్ఠమునకు (బొటనవ్రేలికి) కుత్తరమువైపుననున్న రేఖ బ్రాహ్మతీర్థమనబడును. అచమనము సేయవలసిన తీర్థమిది. తర్జనికి (చూపుడువేలు) అగుష్ఠమునకు నడిమిది పితృతీర్థము. నాందీముఖములోగాక మఱి యెల్లవిధులందును పితరులకు తర్పణాదులీతీర్థమున జేయవలెను. వేళ్ళఅగ్రము దైవతీర్థము. దేవతలనుద్దేశించి చేయు తర్పణాదివిధులు ఆ తీర్థమున జేయవలెను. చిటికెనవ్రేలి మొదలు ప్రజాపతితీర్థము. అక్కడ ప్రజాపతికి జేయవలయును. ప్రజాపతి కాండర్షిగావున ఋషితీర్థమున జేయవలె నన్నమాట. బ్రాహ్మ తీర్థమునం దాచమనము ప్రశస్తము. పితృక్రియ పితృతీర్థమున, దేవతలకు దేవతీర్థమున, ప్రజాపతికి నాందీముఖ దేవతలకు పిండతర్పణాదులు ప్రజాపతికివలె ప్రాజాపత్యతీర్థమున (చిటికెనవ్రెలి మొదట) చేయవలెను.

నీటిని అగ్నిని ఒక్కసారి కలిపి పట్టుకొనరాదు. గురువులు దేవతలు తల్లిదండ్రులు బ్రాహ్మణులవైపు పాదములు చాచరాదు. పాలు గుడుపుచున్న గోవును జూడరాదు. దోసిలితో నీరు త్రావరాదు. చిన్న పెద్ద శౌచకాలములందు విలంబము సేయరాదు. నవేగాన్‌ధార యేత్క్వచిత్‌ అని యిదే విషయము మఱియొకచో దెలుపబడినది. నోటితో నగ్ని నూదరాదు. ఈ క్రింది నాలుగును లేనియూరిలో వసింపరాదు. ఇదేమాట సుమతిశతకమం దిట్లున్నది.

అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్‌

జొప్పడిన యూర నుండుము

చొప్పడుకున్నట్టి యూరు సొరకుము సుమతీ!

భృత్యులను జయించినవాడు నౌకరులకు లొంగనివాడన్నమాట బలశాలి ధర్మతత్పరుడు నయిన రాజు గల దేశమందు ప్రాజ్ఞుడు పసింపవలెను. చెడ్డరాజు కలచోట సుఖమెక్కడిది? ఎక్కడ పౌరులు (ప్రజలు) కలిసిమెలిసి న్యాయవర్తనులై శాంతులు మాత్స్యర్యహీనులునై యుందురో అక్కడ నివాసము సుఖోదయము. ఎక్కడ వ్యవసాయదారులు (కృషికులు) దురభిమాన దురహంకారములు లేనివారో యెక్కడ ఓషధులు సర్వముగలవో యచట వివేకి వసింపవలె. జయింపవలెనను కోరిక కలవారు పూర్వవైరము కలవారు నిరంతరము వేడుకలకై వేడుకపడు జనము ఈ మూడులక్షణములు గలచోట వసింపరాదు. ఉత్తీమశీలురైనవారు సహచరులు శత్రువుల బెదిరింపులకు లొంగని రాజు సస్యసమృద్ధమైన భూమిగలచోటు నిత్యనివాసార్హము. ఇదంతయు మీ హితముకోరి తెల్పితిని. ఈమీద భక్ష్యాభక్ష్యవిధానము తెల్పెద వినుండు.

ఇది శ్రీ బ్రహ్మపురాణమునందలి సదాచార వర్ణనమును నూట పదిహేనవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment