Skip to content Skip to footer

🌹🌹🌹 బ్రహ్మ పురాణము 🌹🌹🌹 – పడకుండవ భాగము

సోమ వంశ వర్ణనమ్‌ రెండవ భాగము

లోమహర్షణు డిట్లనియె : –

ఆయుఫుపుత్రులు మహరధులయిదుగురు స్వర్భానుని (రాహువు) కుముర్తె ప్రభయనునామెయందు జన్మించిరి. వారు సహుషుడు – వృద్ధశర్మ-రంభుడు – రజి – అనేనుడు, అనువారు త్రిలోకప్రసిద్దులు. రజి యైదువందలమంది కుమారులంగనెను. ఈ క్షత్రకుటుంబము రాజేయమని ప్రసిద్దికెక్కినది. ఇంద్రునికి గూడ ఇది భయంకరమయ్యెను. దేవాసురయుద్దమైన తఱి నయ్యుభయులును మా యిర్వురకును జరుగు యుద్దమందెవ్వరు జయింతురో వినవలతుము నిజమేఱిగింపుమని బ్రహ్మనడిగిరి.

బ్రహ్మ యిట్లనియె : – రజియనుప్రభు వాయుధమెత్తి యెవ్వరివంక పోరాడునో వారు ముల్లోకములం గెలువగలరు.

రజి యెటుండునో యటనే ధైర్యము ఉండును. ధృతి యెటుండనో యట లక్ష్మి యుండును . థృతియు శ్రీయు నెందుండునో నక్కడ ధర్మము జయమును గల్గును.

దేవ దానవులది విని ప్రీతులై రజిని దమవంక రమ్మని వరించిరి. స్వర్బానుని దౌహిత్రుడు (రాహువుయొక్క కూతురు కొడుకు) ప్రభయందు పుట్టినవాడు, పరమతేజస్వి, సోమవంశవర్ధనుడు నగు రజింగని వారు మాకు జయము కల్గుట కీవు విల్లుగైకొను మని వేడికొనిరి. అతడు విని అర్ధజ్ఞుడుగావున స్వార్ధమెంచి తన కిర్తిం బ్రకాశింపజేయుచు నిట్లనియె.

దైత్వగుణముల నెల్ల గెలిచి ధర్మమున సేవింద్రుడనగుదునేని యప్పుడు యుద్ధమున బోరెదను. అని రజియనగా వేల్పులు మొదట సంతోషపడిరి. అట్లే నీ కోరిక సఫలము నేసికొమ్మనిరి. అవ్వల నసురముఖ్యుల జూచి దేవతలనడిగినట్లడిగెను. దానవులు దర్పసంపూర్ణులు గావున స్వార్ధముసే చూచికొని సాభిమానముగ నతని కిట్లు బదులుపలికిరి.

రాక్షసులిట్లు పలికిరి : – మా కింద్రుడు ప్రహ్లాదుడు. ఆయనకొరకే మేము గెలుపు పడయనెంతుము. రాజా! నీవీ సమరమున నిలువుమనిరి.

అతడట్లేయని దేవతలచేత గూడ వీనిని (ప్రహ్లాదుని) గెలిచి యింద్రుడవైతీరెదవని ప్రేరేపింపబడి దానవులందఱ సంహరించెను. వజ్రపాణికిగూడ వధింపవలవిగానివారింగూడ తుదముట్టించి పరమ శ్రీమంతుడైన రజి మున్ను నష్టమైపోయిన వేల్పుల ఐశ్వర్యమును పునఃప్రతిష్ఠ చేసెను. అప్పుడింద్రు డమరులతో గూడి మహాధీరుడయిన రజిం జూచి నిక్కముగ నీవు దేవేంద్రుడవ నావనులచే నేను నీకు పుత్రుడనను ప్రఖ్యాతిగాంచెద ననెను. రజి యునట్లు మాయచే శత్రువుచే మోసగింపబడి యట్లే యగుగాక యని సంప్రీతినెంచెను. అట్లా నృపతి దేవసముడై దివమ్మునకరుగ, నాతని పుత్రులైదువందలమంది యాతని ఆస్తిని (పిత్రార్జితమును ఇంద్రునుండి గైకొనిరి, అట్లు స్వర్గమాక్రమించి వారు రాగమత్తులై మూఢులై ధర్మదూరులై బ్రహ్మద్వేషులై వీర విక్రమముల గోల్పోయిరి. అందుపై కామక్రోథవశులైన వారింజంపి ఇంద్రు డెప్పటియట్ల స్వస్థానమును బొంది స్వస్థుడయ్యెను ఈ శతముఖుని స్థానభ్రంశమును పునఃప్రతిష్ఠానమును విన్నవాడును ధారణ జేసినయతడును దుర్గతిపాలుగాడు.

సూతుడిట్లనియె : – రంభునకు సంతానములేదు. ఇక యనేనసుని వంశము వర్ణించెద. అనేననుని కుమారుడు యశస్వియైన ప్రతిక్షత్రుడు అనురాజు. వాని తనయుడు సంజయుడు. వాని బిడ్డడు జయుడు. వానివాడు విజయుడు. వాని తనయుడు కృతి. వాని సుతుడు హర్యత్వతుడు. వాని యాత్మజుడు సహదేవుడు. మంచి ప్రతాపశాలి. వానికొడుకు ధర్మశీలియగు నదీనుడు. జయత్సేనుడు వానికుమారుడు. వాని రసుడు సంకృతి. వానిబిడ్డడు ధర్మపరుడైన క్షత్రవృద్ధుడు కీర్తిశాలి. అనేననులు చెప్పబడిరి. క్షత్రవృద్ధుని వంశము చెప్పెదను. క్షత్రవృద్ధుని తనయుడు సునహోత్రుడు. యశస్వి వాని సంతానము, పరమధార్మికులు కాశుడు, శలుడు గృత్సమదుడు ననువారు. గృత్సమదుని కుమారుడు శునకుడు. వానికొడుకు కొడుకు శౌనకుడు వానివలన బ్రహ్మణ క్షత్రియులు, వైశ్య శూద్రులు కలిగిరి. అర్షిసేనుడు శలుని కుమారుడు. వానితనయుడు కాశుడు. కాశునికొడుకులు కాశిపుడు దీర్ఘతవుడు. ధనవు దీర్ఘతవుని కుమారుడు.

విద్వాంసుడు. వానితయుడు ధన్వంతరి. ఆయన మహత్తర తప మ్మొనరించి వృద్ధుడయినదశలో ధనువునకు గల్గినాడు. దేవతాంశమున మున్నుదయించిన ధన్వంతరియే యిపుడు మానవాంశమున జన్మించెను. కాశీమహారాజై భరద్వాజుని వలన నాయుర్వేదమును జదివి వైద్యము సేసి సర్వరోగహరుడై యాశాస్త్రము నెనిమిదిభాగములుగావించి, (అష్టాంగమొనరించి) శిష్యుల కుపదేశించెను.

ఆ ధన్వంతరి తనయుడు కేతుమంతుడు. భీమరధుడాతని తనయుడు. దివోదాసు డతని తనయుడు. అతడు ధార్మికుడు. కాశినగరము నేలినవాడు. ఈతని కాలముననే క్షేమకుడను రాక్షసుడు వారణాసిని శూన్యముం గావించెను. మహాత్ముడైన నికుంభుని శాపముచే వేయేండ్లు కాశీక్షేత్రమట్లుగావలసి వచ్చెను. అట్లు శాపనష్టమైన రమ్యమైన నగరమున దివోదాసుడు గోమతీ తీరమందు పునర్నిర్మించెను. ఇంతకుముందు వారణాసి భద్రశ్రేణ్యుని పాలనయందుండెను. దివోదాసుడు వాని కుమారులను నూర్వురను మేటి విలుకాండ్రను జంపి భద్రశ్రేణ్యుని రాజ్యము గెలిచి నూతన నగర నిర్మాణముసేసెను.

భద్రశ్రేణ్యుని తనముయుడు దుర్దముడు దివోదాసునిచే బాలుడని కరుణచే విడుపబడినవాడై హైహయుని దాయాద్యమును (పరంపరా గతమైన రాజ్యసంపదను) హరించెను. బలాత్కరించి హరించిన సామ్రాజ్యమును మహానుభావుడగు దుర్దముడు లాగికొనెను తన ప్రతాపముచే వైరమును అంతముచేసెను. దివోదాసునికి దృషద్వతియందు వీరుడగు ప్రతర్ధను డుదయించెను, బాలుడయ్యునాతడు పరబలమును హరించెను. వాని తనయులు వత్సుడు, భర్గుడు ననువారు మిక్కిలి కీర్తిశాలురు. వత్సుని కుమారు డలర్కుడు. అలర్కుడు బ్రహ్మజ్ఞాని. సత్యప్రతిజ్ఞుడు. వానికొడుకు సంనతి. రాజర్షియగు అలర్కుని గూర్చి ప్రాచీనుల శ్లోకమొకటి గలదు. అతడు యరువదియారు వేలేండ్లు కులోద్ధారకుడై లోపాముద్రానుగ్రహ పాత్రుడయ్యెను.

రూపవనసంపన్నుడైన అతనికి సువిశాలమైన సామ్రజ్యముండెను. శాపాంతమున క్షేమకుడను రాక్షసుని జంపి వారణసీ నగరమును రమ్యముగ పునర్మిర్మాణము గావించెను.

సంనతి కొడుకు సునీధుడు. వానినుండి క్షేముడు, వానికి కేతుమంతుడు. వానికి సుకేతువు, వానికి ధర్మకేతువు వానికి మహారధుడగు సత్యకేవువు, వానికి విభువు. వానికి అనర్తుడు, వానికి సుకుమారుడు, వానికి ధృష్టకేతువు, వానికి వేణుహోత్రుడు, వానికిభార్గుడు ననుపుత్ర పరంపరయేర్పడెను. వత్సునికి వత్సభూమి, యనువాడు భార్గునకు భార్గభూమి యనువారు పుత్రులు. నీరందరును అంగిరసుని పుత్రులు భార్గవ వంశమువారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వేలకొలది జన్మించిరి. ఇది కాశ్యపవంశము ఇక సహూషుని పరంపర వినుండు.

శ్రీ బ్రహ్మమహాపురాణమునందు సోమవంశమున వృద్ధక్షత్ర ప్రసూతి నిరూపణమను పదునొకండవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment