వరాహావతార వర్ణనము
ఓ మునీంద్ర ! కృష్ణుని మహిమ అద్భుతము. బలరాముని యొక్కయు ప్రభావమట్టిదే. నీ వలన నెంత విన్నను దృప్తి కలుగుటలేదు. పురాణములందు విష్ణువు వరాహావతారమెత్తినట్లు విన్నాము. అది సవిస్తరముగా ఆనతిమ్ము. వరాహమన స్వరూపమేమి? దేవత యెవరు? ఏవిధమైన ఆచారము ప్రభావము కృత్యము జరిపెనో తెలుపుము. యజ్ఞకర్తలకు పరలోకమేగు వారికి బ్రాహ్మణులకు ఈ చరిత్ర పుణ్యలోకప్రదము. ఆయన కోర తుదతో భూమినైత్తినకథ వినగోరెదము. అదిగాక పరమాత్మయొక్క అవతార విశేషంబులుగూడ దెల్పుమన వ్యాసుండిట్లనియె.
ఇది గొప్ప ప్రశ్నభారము. యథాశక్తిగ దెల్పెదను. ఆ విష్ణు యశస్సు శ్రవణము చేయవలెనన్న తలపు మీకు కల్గుట యదృష్టము. అందువలన విష్ణుయశ సంకీర్తనము విష్ణులీలలను వినుడు.
యజ్ఞ వరాహ స్తుతి
విష్ణువు సహస్రశీర్షుడు. నహస్రాక్షుడు. సహస్రముఖుడు సహస్రకరుడు సహస్రజిహ్వుడు. సహస్ర కిరీటుడు. సహస్రభుజుడని ఆ యజ్ఞపురుషుని విష్ణుని పురుషనూక్త విధానమున బ్రహ్మజ్ఞులు స్తుతింతురు. హవనము హోమము సవనము (ప్రాతర్మధ్యాహ్న సాయంసవనములు మూడు) హోత హవ్యము (హోమద్రవ్యము) పాత్రలు పవిత్రములు వేది దీక్ష సమిధ స్రువము స్రుక్కు సోమము సూర్యుడు ముసలము ప్రోక్షణి దక్షిణాయనము అధ్వర్యుడు సామగుడు (ఉద్గాత) సదస్యుడు సదనము (యజ్ఞశాల) సదస్సు యూపము చక్రము ధ్రువ దర్వి చరువు ఉలూఖలము ప్రాగ్వంశము త్రేతాగ్నులుండుశాల (ఉపసదేష్టులు ప్రవర్గ్యమిందే జరుగును) హ్రస్వములు అణువులు స్థావరములు జంగమములు ప్రాయశ్చిత్తములు అర్ఘ్యము స్థండిలములు (అగ్ని ప్రతిష్ఠ చేయుటకు కల్పింపబడిన ప్రదేశ విశేషములు) కుశలు మంత్రములు యజ్ఞముల వహించు వహ్ని హవిర్భాగము భాగవహము (హవిర్భాగములను) వహించు పాత్ర విశేషము) అగ్రాసి సోమభుజుడు హోమము చేయబడిన శ్రుత్యుక్త ఆయుధములను ధరించిన అగ్నిగ వేదవేత్తలు పిలుతురో అట్టి శాశ్వతుని యజ్ఞేశ్వరుని శ్రీవత్సాంకితవక్షుడగు విష్ణువు యొక్క అవతార సహస్రములెన్నో జరిగినవి. జరుగనున్నవి. చతుర్ముఖబ్రహ్మ యిట్లు చెప్పెను. విష్ణువు యొక్క అవతారమునకు సంబంధించిన కథలను శ్రద్ధతో వినుడు. ఈ వాసుదేవమాహాత్మ్యము చరిత్ర దేవమర్త్యలోకములకు హితకరము. శుభప్రదము.
సర్వ భూతాంతరాత్మ అవతారములు పెక్కు గలవు. వేయి దివ్యయుగములు నిదురించి ఒకానొక పనికై మరల మేల్కొనును. బ్రహ్మ కపిలుడు. త్ర్యంబకుడు దేవతలు సప్తర్షులు నారదుడు అప్సరసలు సనత్కుమారుడు మనువు మొదలగువారిని ఆయన ఆవిర్భవింపజేసెను. అతడు అగ్నివంటి తేజస్వి.
సముద్ర మధ్యమందా సనాతన మూర్తి యుండగా ప్రళయమైన తఱి మధుకైటభు లిద్దరు భగవంతునిచేత వరములంది యుద్ధము సేయబూనిరి. కమలనాభుడు నిదురించిన తఱి పుష్కరమునుండి దేవతలు ఋషులు పుట్టిరి. ఆ ప్రాదుర్భావమే పౌష్కరమను పేర పురాణమునందు శ్రుతిసమ్మతమై వర్ణింపబడినది.
హరి వరాహరూపమున నెత్తిన యవతారము శ్రుతిముఖము. అనగా వేదములే ఆ మూర్తియొక్క ముఖాద్యవయవ స్వరూపములందెనన్నమాట.
యజ్ఞవరాహమూర్తి స్వరూపవర్ణనము
అ యజ్ఞ వరాహమూర్తి పాదములు నాల్గువేదములు. ఆయన కోర యూపస్తంభము. క్రతువు చేతులు. అశ్వినులు ముఖము. అగ్ని జిహ్వ. దర్భలు రోమములు. బ్రహ్మ శిరస్సు. అహోరాత్రములు కన్నలు. వేదాంగములు కర్ణభూషణములు. ఆజ్యము నాసిక. స్రువము ముట్టి సామధ్వనిఘర్ఘరస్వరము. సత్యధర్మములాశ్రీమంతుని స్వరూపము. ప్రాయశ్చిత్తమాయన ఘోరమైనముఖము. పశువు మోకాళ్ళు ఉద్గాతి ఆయనపేగు మంత్రముమూపువేదిక హవిస్సు వాసన (హవ్యకవ్యములు) ప్రాగ్వంశము నానాదక్షతలతో కూడినది శరీరము. ఆసనము శరీరకాంతి పత్నిమణిమయమైన శృంగమువలె లేచి దక్షిణ హృదయము అనేక సత్రమయము యోగ వరహమూర్తి యొక్క స్వరూపము. ఉపాకర్మాష్టకము దంతములు ప్రవర్గలా శరీరమందలి సుడులు. ఛందస్సులన్నియు నాయన నడచుదారులు. గాహ్యోపనిషత్తు సశైలవనము సాగరపర్యంతము ఏకార్ణవమందు మునిగిన భూమిని తన కొమ్ముచివర లోకహితము కొరకు పెల్లగించి ధరించెను. ఈవిధముగ యజ్ఞవరాహమూర్తిచేత వసుంధరాదేవి భూతహితార్ధ ముద్ధరింపబడినది.
నరసింహమూర్తివర్ణనము
నరసింహరూప మెత్తిహరి హిరణ్యకశిపుని సంహరించిన కథ వినుండు. కృతయుగమందు దైత్యులకు మొదటి పురుషుడు. హిరణ్యకశిపుడు పదివేల పదిహేనువందలసంవత్సరములు ఉపవాసము సేసి మౌనము బూని తీవ్రతపస్సు చేసెను. వాని శమదమములకు బ్రహ్మచర్యమునకు తపో నియమములకు బ్రీతినొంది భగవంతుడు స్వయంభువు స్వయముగా హంసలను బూన్చిన సూర్యప్రభమైన విమానమున ఆదిత్యులు వసువులు మరుత్తులు దేవతలు రుద్రులు వెన్నంటిరాగా యక్షరాక్షసులు కిన్నరులు దిక్కులు విదిక్కులు నదులు సముద్రములు నక్షత్రములు ముహూర్తములు మహాగ్రహములు తపోవృద్ధులైన సిద్ధులు విద్వాంసులు పుణ్యఋషులు మొదలగు పరివారముతో వచ్చి నీ తపస్సునకు సంతసించితిని. నీకు భద్రమగుగాక. ఇష్టమైన వరము కొరుము సిద్ధినందుమనెను.
హిరణ్యకశిపు డిట్లనెను. పితామహ! దేవాసుర గంధర్వాదులెవ్వరును కోపించి నన్ను శపింపరాదు. ఇదియే వరము. శస్త్రాస్త్రములచే చెట్లచే గిరులచే నెండిన తడసిన దేనిచేగాని క్రిందగాని పైనగాని కాకుండ ఒక్క చేతితో మాత్రమే సైన్య సపరివారముగ నన్ను చంపగల వాడే నాకు మృత్యువు గావలెను. నేనే సూర్యచంద్రులు వాయువు అగ్ని నీరు అంతరిక్షము ఆకాశమునై యుండవలెను. కామక్రోధములు నేనే. ఇంద్ర యమ వరుణ కుబేరులు నంతయు నేనే కావలెనన బ్రహ్మ యివిగో దివ్యబాణములు నీకిచ్చుచున్నాను. ఇవి అద్భుతములు. నీవు కోరిన కోరికలు వానిచే బొందెదవు. సందియము లేదు. అని వైరాజమనిశ్రుతి పిలిచెడి బ్రహ్మ సదనమునకు బ్రహర్షిగణ సేవితుడై వేంచేసెను.
అటుపై దేవనాగ, గంధర్వ, మునులు బ్రహ్మవలన జరిగిన ఈవరప్రదాన విషయమువిని బ్రహ్మకిట్లనిరి. స్వామి! ఈ నీవిచ్చిన వరమువలన నా అసురుడు మమ్ము బాదింపగలడు. దయcజేసి వాని వధ విషయమాలోచింపుము. నీవు ఆదికర్తవు హవ్యకవ్యములను సృష్టించినవాడవే నీవు. అన బ్రహ్మ త్రిదశులార! చేసిన తపస్సు యొక్క ఫలమవశ్యమనుభవింప వలసినదే. తపస్సునకు చివర విష్ణుభగవానుడు వానిని వధించును. అన విని దేవతలు సంతసించి స్వస్థానముల కేగిరి.
వాడు వరము లభించిన క్షణములో పొగరెక్కి మున్యాశ్రమములందు వ్రతనిష్టులై సత్మధర్మరతులైన దాంతులను శాంతులను హడలగొట్టెను. అట్లే స్వర్గమున కేగి దేవతల నోడించెను. ముర్లోకముల వశము జేసుకొని స్వేచ్ఛాసంచారియై దైత్యులను యజ్ఞీయులను (యజ్ఞ భాగార్హులను) దేవతలను ఆయజ్ఞీయులను గావించెను. ఆదిత్యులు మొదలుగా దేవవర్గము విష్టుని శరణొందిరి. దేవేశ్వరా! రక్షింపుము. హిరణ్యకశిపుని వలన మాకిప్పుడు భయము వచ్చిపడినది. నీవుగదా మాకు పరమదైవము. పరమ గురుడవు. పరమధాతవు. కమలలోచన! అదితి వంశజయమునకు శరణమగుమనిరి.
వాసుదేవుడు పలికెను.
జడియకుడు. అభయమిచ్చుచున్నాను. మనువటివలె స్వర్గము త్వరలో పొందగలరు. ఇపుడే నేను వరదాన దర్పితుడైన వానిని సపరివారముగ సంహరించుచున్నాను. అని యిట్లు పలికి దేవతలను బంపి భగవంతుడు హిరణ్యకశివుని తావునకు వచ్చెను. సగము నరశరీరము సగము సింహశరీరము సేసి చేతితో చేయిని తాకుచు దట్టపు మేఘమువంటి శరీరము మేఘగర్జనము వంటి గర్జనము గొని మెరయుచు మేఘమంతవేగముగ వచ్చి యాకలికొనిన పెద్దపులి వలె నున్న యా రక్కసుని పొగరెక్కియున్న రక్కసులచే రక్షణ యివ్వబడుచున్నవారిని సంహరించెను. నృసింహుని గూర్చి జెప్పితిని .
వామనావతార వర్ణనము
ఇక వామనుని గూర్చి వినుండు. బలి యజ్ఞమందు బలశాలియైన విష్ణువుచే మూడడుగులచే మహాసురులు సంక్షోభింపజేయబడిరి. విప్రచిత్తి బృహత్కీర్తి మొదలు శంబరుడుదాక గల రాక్షసులు శతఘ్ని చక్ర ముసలములూని అశ్వయంత్రములుబూని బిందిపాల శూల ఉలూఖలములు జేబూని పరశ్వధములూని పాశముద్గర పరిఘాయుధములు గొని పెద్దబండలు గొని యుద్ధమునకు నడిచిరి. వారి ముఖములు తాబేలువలె కోడివలె గుడ్లగూబలవలె నుండెను. కొందరు గాడిదలు ఒంటెలు పందులు పిల్లులు నెమళ్ళ వంటి ముఖములు గలవారు. మొసళ్ళు మేకలు ఎడ్లు గొర్రెలు గేదెలు దున్నపోతుల అట్టి మొగములతో నుండిరి. ఉడుముముఖము కొందరిది. చుంచులు కప్పలం తోడేళ్ళంబోలినవారు కొందను. అశ్వముఖులు క్రౌంచముఖులు (బెగ్గురు పక్షులు) మయూరముఖులు కొందరు. కొందరు గజచర్మము కృష్ణాజినము ధరించిరి. నల్లని బట్టలు కట్టుకొనిరి. కొందరు తలపాగలు కొందరు కిరీటములు ధరించిరి. కొందరికి కుండలములున్నవి. జుట్టు విరబోసికొనిరి కొందరు. శంఖమువంటి మెడలుగల్గి నానామాల్యాములు గంధములు పూసికొని నానావేషధారులై అందరు తమ ఆయుధములం పచారు సేయుచున్న హరిని సమీపించిరి.
విష్ణువు పాదములతో కరతలముతో రక్కసులంగొట్టి భూమినిలాగుకొనెను. అతడడుగడుగున నాక్రమించి చంద్రసూర్యులు రొమ్ముదానందాకబెరిగి నాభిదాక నంతైయింతంతగుచు సర్వమాక్రమించి సర్వంసహ నింద్రున కొసంగెను. ఈ త్రివిక్రమావతార వైభవమును వేదవిదులు వర్ణింతురు. ఇది విష్ణుయశస్సంకీర్తనము.
దత్తాత్రేయావతారము
భూతాత్మయగు విష్ణువుయొక్క కేవలక్షమాలక్షణమైన యవతారము దత్తాత్రేయుడను పేరవచ్చిప్రఖ్యాతిజెందినది. వేదములు నశింప ప్రక్రియ యజ్ఞలునశింప చాతుర్వర్ణ్యముసంకరమై ధర్మముశిథిలమై అధర్మము బెరుగ సత్యముచెడి అసత్యము పెరుగ ధర్మమువ్యాకులముగాగ యజ్ఞముతో క్రియలతో నతడు వేదములను పునరుద్ధరించెను. చాతర్వర్ణవ్యవస్థ నామహాత్ముడు కాపాడెను. మరియు హైహయరాజ వంశమువాడైన బుద్ధిమంతుడగు కార్తవీర్యునకాయన వరమిచ్చెను. ఈ నీ బాహువులు రెండును నానిమిత్తముగ వేయి బాహువులగును. సర్వవసుధను పాలింతువు. యుద్ధమునందు శత్రువులకు జూడనశక్యుడవగుదువు. ఈ నీ యవతారము విష్ణువుయొక్క యవతారము.
పరశురామావతారము
ఇటుపై మహానుభావుడగు పరశురాముని యవతారమయ్యెను. అందు వేయి బాహువులచేత దుర్జయుడైన కార్తవీర్యార్జునుని యాయన సంహరించును. రథమునందున్న కార్తవీర్యుని పరుశురాముడు పుడమిపై పడగొట్టి యప్పటికిని మేఘమువలె గర్జించుచున్న వానిని హడలగొట్టి వేయిబాహువులను గొడ్డలిచే నఱికెను. వాని జ్ఞాతులను గూడగొట్టెను. కోట్లకొలదిక్షత్రియులతో నిండిమేరుమంథరపర్వత భూషణమైన పృథివి ఇరువది యొక్కమార్లు దండెత్తి నిక్షత్రియమొనర్చెను. ఈ పాపము పోవుటకాయన అశ్వమేధముగూడ సేసెను. మహాదాన పవిత్రమైన నయ్యజ్ఞమందాతుడు మరీచి వంశము వాడైన కశ్యపునకు తాను గెల్చిన వసుమతిని దక్షిణగానిచ్చెను. మరియు ఆ అశ్వమేధమున గుఱ్ఱములను రథములను ఏనుగులను అక్షయమైన బంగారమును గోవులను దానముసేసెను. ఇప్పుడును భృగునందనుడగు (భార్గవుడు) పరశురాముడు లోకహితముకొరకు మహాతపస్సు సేయుచు శ్రీమంతుడై దేవునివలెనున్నాడు. ఇది, దేవపతి యవ్యయుడు శాశ్వతుడునైన విష్ణువుయొక్క పరశురాముడను పేర యవతారము.
దశరథ రామావతారము
ఇరువది నాల్గవ త్రేతాయుగమందు విశ్వామిత్రుని పురస్కరించుకొని దశరథునకు కమలాక్షుడవతరించెను. ఆయన తనను నాల్గువిధములుగ నొనరించుకొని సాక్షాత్ సూర్యునివలె వెలుంగుచు రాముడను ప్రసిద్ధినొందెను. లోకానుగ్రహమునకు రాక్షస నిగ్రహమునకు ధర్మసమగ్ర వృద్ధికొరకు మహాకీర్తిశాలి దయచేసినారు. సర్వభూతహితుడు నరేంద్రుడని యాయననందురు. సర్వధర్మజ్ఞుడాతడు. లక్ష్మణుడనుసరింప పదునాల్గేండ్లు అరణ్యమునవసింసి. తపస్సుచేసెను. ఆయన గృహిణి సీత. జగత్ర్పసిద్ధురాలు మున్నేను చెప్పిన మహాలక్ష్మియే సీతగా భర్తననుగమించినది. జనస్థానమున వసించుచునాయన వేల్పుల కార్యమును జక్కపెట్టినాడు. ఆయనకపకారియైన పరమక్రూరుని రావణుని సీతజాడ నెరిగిబోయి సంహరించినాడు. ఆ రావణుడు దేవాసుర యక్షరాక్షస నాగాదిగణములకవధ్యుడు. కారుమేఘమట్లున్న వానినిరాక్షసకోట్లువెంబడించినవి. ముల్లోకములు నారావమెత్తజేసినందున (ఏడ్పించినందున) రావణుడను పేరుగన్న ఆ రాక్షసరాజును దుర్జయుని,దుర్మదుని,దృక్తుని, శార్దూల విక్రముని,దుర్నిరీక్ష్యుని, వరదానగర్వితుని,మంత్రులతో సేనలతోఁగూడ సమూలముగ రామచంద్రప్రభువు సంహరించెను. ఆ చేసిన రావణ సంహారము సర్వ జగత్సంహారము చేసిన భూతపతి (శివునియొక్క) చేతవలెదీపించెను. సుగ్రీవుని కొరకు మహాబలుడైన వానరేంద్రుడు వాలి నిహతుడయ్యెను. సుగ్రీవుడభిషి క్తుడయ్యెను.
మధువను రాక్షసుని కుమారుడు లవణుడు. వాడు మధువనమందు సంహరింపబడెను. మునుల యజ్ఞములను జెరచిన మారీచసుబాహులు శ్రీరామునిచే నిహతులైరి. మరియెందరో రాక్షసులు సంహరింపబడిరి. శాపవశులైన గంధ్వరులు విరాధ కంబధులాయనచేగూలిరి. ఆయన బాణములగ్ని రవితేజస్స్వరూపములు. బంగారపు విచిత్రమైన పుంఖములు కలవి. ఆ మహానుభావునకు విశ్వామిత్రుడు అమోఘములైన శస్త్రాస్త్రములు నొసంగెను.
మహానుభావుడైన జనక చక్రవర్తియొక్క యజ్ఞమందు రాముడు శివచాపమును విలాసముగనెత్తి విరచెను. ఈ పనులు సేసి ధర్మమూర్తి రామమూర్తి అవిఘ్నముగ పది అశ్వమేధ యాగములుసేసెను.
రాముడు రాజ్యము ప్రశాసించుచుండ దొంగతనములులేవు. వైధవ్య దుఃఖములేదు. సర్వము శుభమయ్యెను. వాయు జల అగ్న్యాది భూత ప్రకోపమువలన భయములేదు. పెద్దవాండ్రు బాలురకు ప్రేతకార్యములు చేయుటలేదు. క్షత్రియ జాతి బ్రహ్మచర్య పరమైయుండెను. అనగా బ్రాహ్మణుల కధీనులై ప్రవర్తించిరి. వైశ్యులు క్షత్రపరులైరి. శూద్రులు మూడువర్ణములవారు చెప్పినట్లువినిరి. అహంభావము లేనివారైరి. స్త్రీలు భర్తలను భర్త భార్యను అతిక్రమించి నడువలేదు. సర్వజగత్తు ప్రశాంతమయ్యెను. భూమి చోరరహితమయ్యెను. రాముడొక్కడే భరించువాడు(భర్త) రాముడొక్కడే పాలించువాడు. పుత్రసహస్రములతో అనేక వర్ష సహస్రములు ప్రజలు జీవించిరి. దేవతలకు ఋషులకు మనుష్యులకు అన్యోన్య సామరస్యము పృథివియందు నెలకొల్పెను. ఇచ్చట పురాణజ్ఞులు రామునియెడల చంచలమైన తత్వజ్ఞానము గలవారు. ఆ బుద్ధిమంతుని మాహాత్మ్యమును గురించి ఈ కింద్రి విధమైన గాథను గానముసేయుదురు.
రాముడు చామనచాయ మేనివాడు. రక్తాంతలోచనుడు. కళకళలాడు నెమ్మోమువాడు. అజానుబాహువు. ప్రసన్న ముఖుడు. సింహము నూపురమువంటి నూపురము గలవాడు. మహావీరుడు. ఆ రాముడు పదివేలేండ్లు రాజ్యముసేసెను. ఆయన రాష్ట్రమున ఋగ్యుస్సామ వేదములయొక్క ఘోషము జ్యాఘోషము(ధనుష్టంకారము) యెడతెరగకుండెను, ఇవ్వండి తినండి అన్నధ్వని నిర్విరామముగ వినిపించెను. సత్వసంపన్నుడు గుణసంపన్నుడైన రాముడు కేవలము తన తేజస్సుచే దేదీప్యమానుడయ్యెను. రామచంద్రుడు చంద్రుని సూర్యులను మించి తేజరిల్లెను. పవిత్ర క్రతు శతము సంపూర్ణ శ్రేష్ఠి దక్షిణమైన దానినతడు యజించెను. అయోధ్యను విడచి మహాబలుడు రాఘవుడు దివమ్మునకేగెను. ఇక్ష్వాకుకులనందనుడైన దశరథనందనుడు సగణముగ రావణునిజంపి స్వర్గమాక్రమించెను.
మహాత్ముడైన విష్ణువుయొక్క మరొక అవతారవర్ణనము ఈ తరువాతి యవతారము. ఇది సర్వలోకహితమునకై మాధురకల్పమునందు వచ్చినట్లు విఖ్యాతిగన్నది. ఇందు సాల్వచైద్యకంస ద్వివిద వృషభ కేశిపూతనా రిష్టాదులను కువలయాపీడ చాణూర ముష్టికాదులను మానుషాకారముతో వచ్చిసంహరించెను. ఇందే బాణునివేయి బాహువులు తెగినవి. నరకుడుకూలెను. కాలయవనుడు గడతేరెను. అనేకమంది రాజులయొక్క సర్వరత్నములు (సర్వ ద్రవ్యములందు సర్వశ్రేష్ఠ వస్తువులు) ద్వారకకుంగొని రాబడినవి. ధుర్ధర్షులైన రాజులు భూతలమునకొరిగిరి. ఇదిలోకహితమునకు వచ్చిన పరమాత్మయొక్క యవతారము.
కల్కి అవతారము
కల్కిమూర్తి శంభల గ్రామమున విష్ణుయశస్సను పేరున సర్వలోకహితమునకు అవతరించును. ఇవేగాక దితితో దేవగణములతో వచ్చిన అవతారములను బ్రహ్మవాదులు పురాణములందు గీర్తించియున్నారు. ఈ అవతార కీర్తన మందుదేవతలు గూడ తబ్బిబ్బువడుదురు. వేదధ్వనితో బాటు పురాణకీర్తన ప్రవచనము జరుగవలెనను ఉద్దేశ్యముతో ఆ అవతార చరిత్ర వర్ణింపబడినది. కీర్తనీయుడైన సర్వ జగద్గురులైన విష్ణువుయొక్క ఈ చరిత్ర కీర్తించుట వలన పితృదేవతలు సంప్రీతులగుదురు. మరియు విష్ణువుయొక్క ఈ కథ కృతాంజలియై విన్నవాడు యోగీశ్వరేశ్వరుడైన ఆ స్వామియొక్క యోగమాయ విలాసములను విన్ననరుడు సర్వపాసములనుండి విమోచననుండి సమృద్ధియైన బుద్ధిని (జ్ఞానమును) విస్తారములైన భోగములను భగవత్ప్రహదమువలన శీఘ్రముగబొందును. మునీంద్రులార ఇట్లునాచే నమితితేజస్వియైన విష్ణువుయొక్క పుణ్యావతారములు సర్వపాపహరములు. సమగ్రముగా కీర్తింపబడినవి.
ఇది శ్రీ బ్రహ్మపురాణమున విష్ణ్వవతార సంకీర్తమను నూట ఏడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹