కృష్ణనిర్యాణము రెండవ భాగము
వ్యాసుడిట్లనియె.
కృష్ణునిచే నిట్లు తెలుపబడి దారుకుడు స్వామికి మఱిమఱి నమస్కరించి ప్రదక్షిణ మొనరించి ఆయన చెప్పినట్లేగెను. ఏగి ద్వారకకు అర్జునుని గొనివచ్చి వజ్రుని రాజును జేసెను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మకము అయిన తన అంశమును బ్రహ్మందారోపించి సర్వభూతములందు ధరించెను. సర్వాత్మభావమునందె నన్నమాట. మున్ను దుర్వాసుడు చెప్పినట్లు (అది ద్విజుడు బ్రాహ్మణుడు చెప్పినమాట యైనందున) దానిం గౌరవింని మోకాలిపై పాదముంచి యోగ సమాధిం గొని నిల్చెను. అంతట జరుడు అను వ్యాధుడు (బోయ) అచటికి వచ్చెను. వాడు మునుపటి రోకలి యందు మిగిలిన యినుపముక్కతో తయారైన బాణముంగొని యొక లేడి కాలియడుగు వలెనున్న హరిపాదముం జూచి బాణముతో గొట్టెను. కొట్టి ఆదరికి వెళ్ళి నాలుగు బాహువులతో నున్న ఒక నరమూర్తిం జూచెను. ఆయనకు ప్రణామము సేసి క్షమింపుమని మఱిమఱి వేడుకొనెను. తెలియక ఒక లేడీ అనుకొని కొట్టితిని. నా పాపకర్మము చేత తగలబడుచున్న నన్ను నీవు తగలబెట్టవలదు అనెను. వానింగని భగవంతుడు నీకణుమాత్రమేని భయము లేదు. నా ప్రసాదముచే దేవేంద్ర లోకమునకు ఏగుమని హరి పలికెను.
శ్రీహరి వాక్యానంతరము అప్పుడే విమాన మేతెంచెను. ఆ బోయ హరిప్రసాదమువలన అది యెక్కి స్వర్గమున కేగెను. అతడేగినంతట భగవంతుడు నారాయణుడు మనసునకందని అమేయము అమలము జన్మ జరామరణములు లేనిది సర్వాత్మకమునైన ఆత్మయందు (తనయందు) ఆత్మను (తనను) వాసుదేవ రూపమూర్తియందు సంయోజించి మానుష దేహమును బాసి త్రివిధమయిన గతిని బొందెను. సాలోక్య సారూప్య సాయుజ్య రూపమైన పరమముక్తిని బొందెను.
ఇది శ్రీబ్రహ్మపురాణమున శ్రీకృష్ణ చరితమున కృష్ణనిర్యాణ కథనమను నూట ఐదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹