ద్వివిద వానరవధ వర్ణనము
వ్యాసుడిట్లనియె.
బలరాముని లీల మఱియొకటి వినుడు. నరకాసురునికి మిత్రుడు దేవవిరోధి ద్వివిదుడను వానరుడుండెను. వాడు శత్రువులతో విరోధము వెట్టుకుని నరకుని జంపిన కృష్ణుని నిమిత్తముగా దేవతలకు ప్రతిక్రియ సేయుదునని యజ్ఞ ధ్వంసము చేయుచు మర్త్యలోకమునకు హాని సేసెను. సాధువుల మర్యాదలను జెరచెను. జీవులం జంపెను. దేశమును పురములను గ్రామములను కాల్చెను. పర్వతము లెత్తిపడవేసి గ్రామములను గుండగొట్టెను. శైలముల లేపి నీళ్ళలో సముద్రములో పారవేసెను . సముద్రమున నిల్చి క్షోభింపజేసెను. దాన వార్ధి పొంగి చెలియలికట్టదాటి దారినున్న పురగ్రామముల ముంచెత్తెను. కోరిన రూపు దాల్చి దూకుచు గంతులిడుచు పంటల నెల్ల విథముల చూర్ణములు చేసెను. వానిచే నీ జగమెల్ల అపకరింపబడి నిస్స్వాధ్యాయ నషట్కారమై దుఃఖించెను.
ఒకతరి హలాయుధుడు రైవతోద్యానమున మద్యపానము సేయుచుండెను. ఆయన భార్య రైవతి మఱి కొందరు రమణులాతని ననుగమించిరి. వారు తన కీర్తిని గానముసేయ నడుమున నిల్చి కుబేరుడట్లు క్రీడించెను. అంతట ద్వివిద వానరుడు వచ్చి ఆతని రోకలిని నాగలిం గైకొని ఎదుటబడి వినోదమొనరించెను. ఆ తరుణుల యెదుట ఇకిలించెను. నిండు కల్లుకుండల గిరవాటు వెట్టెను. పగుల నడచెను. బలరాముడీసుగొని వానిని బెదరించెను. అయినను వాడతని అవమానించుచు కిలకిల ధ్వని సేసెను. అంతట లేచి హలి రోషముతో రోకలిం బట్టెను. వాడొక వెఱవు గొలుపు రాతిబండ నెత్తి విసరెను. హలి దానిని ఱొకట వేలతునకలు సేసి చిమ్మెను. ఆ కోతి దుమికి మీదబడ బలుడు రోసమున వాని వంచి ఱొమ్మునం గొట్టెను నడినెత్తిం గ్రుద్దెను. అంత ద్వివిదుడు రక్తము గ్రక్కికొని ప్రాణములు పోయి పడిపోయెను. పడుచున్నవాని యొడలున నా కొండశిఖర మో మునులార! వజ్రియొక్క వజ్రమున గొట్టబడినట్లు విరిగి పడెను. దేవతలంతట రామునిపై పూలవాన గురిపించిరి. వచ్చి బాగుబాగు గొప్పవని సేసినాడవని కొనియాడిరి. ఈ చెడ్దకోతి దైత్యులవైపు అపకారముచేయ లోకమును బాధించినాడు. భాగ్యవశమున వీడు నీచే గడతేర్పబడినాడనిరి. ఇట్లవంతమూర్తి విశ్వంభరధారి బలదేవుని లీలలు అనంతములు.
ఇది శ్రీ బ్రహ్మపురాణమున బలరామ లీలావర్ణనము ద్వివిధవానరవధయను నూట మూడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹