బాణయుద్ధవర్ణనము
వ్యాసుడిట్లనియె:-
బాణుడు త్రిలోచనునికి మ్రొక్కియిట్లనియె. వేయిబాహువులతో యుద్ధములేక నేను నిస్పృహుడనైతిని. ఈచేతులున్నందులకు ఇవి సాఫల్యము నందుటకేదేని రణము సంఘటింపవలదా? అదిలేనపుడీ చేతులు బరువు చేటుగదా. ఇవియెందులకు? అన శంకరుండు నీ నెమలి టెక్కెమెప్పుడు విఱుగునో అప్పుడు మాంసాశనులగు జనముల కానందమగు యుద్ధము నీకు సంఘటించుననియె.
అంతట సంతసించి శంభునికి మ్రొక్కి యింటికివచ్చి రాగానే ధ్వజభంగమగుట చూచి మిక్కిలి హర్షమొందెను. ఇదేసమయమున చిత్రలేఖ ఆ అనిరుద్థుని కన్యాంతఃపురమునకు యోగబలమున గొనివచ్చినిలుప ఉషాదేవితో క్రీడించుచున్న వానింజుచి కావలివాండ్రు దైత్యపతికెఱిగించిరి. బాణుని ఆనతిచే వచ్చి పైబడిన సేవక సైన్యము ఆ మాహాత్ముడు అనిరుద్ధుడు ఇనుప పరిఘంగొని చాపమోచెను.
వారట్లు హతులైనంత బాణుడు రథమెక్కివచ్చి పోరియవ్వీరుని వలన పరాజయమొందెను. అవ్వల బాణుడు మంత్రము జపించి మాయాయుద్ధము చేయనారంభించెను. సర్పాస్త్రముచే యదునందనుని బంధించెను. అనిరుద్ధుడెటువోయెనని ద్వారకలో అనుకొనుచున్న యాదవులకు నారదుడతని బాణునిచే బద్ధుడయినట్లు తెలియజేసెను. అవ్వల యాదవులా అనిరుద్ధ కుమారుని యోగవిద్యా విశారదయగు నొక అంగన శోణితపురమునకు కొనిపోయినట్లు విని శత్రువునందు విశ్వాసము నందిరి.
అంతట హరి తలచినంతనే వచ్చిన గరుడునెక్కి బలరామునితో ప్రద్యుమ్నునితో గూడి బాణపురమున కేగెను. పురప్రవేశమందే బలశాలురగు ప్రమథ గణముతో రణమయ్యెను. హరి వారిని క్షయమొందించి బాణపుర ప్రాంతములకు వెళ్లెను.
అవ్వల త్రిపాద ముత్రిశిరస్కమునైన మాహాజ్వరము బాణుని కాపుదలకై శారఙ్గధన్వునితో (హరితో)పోరజొచ్చెను. కృష్ణశరీరస్పర్శ వలన భస్మసర్శవలన జనించిన ఒకానొకతాపమును బలరాముడుకూడ పొంది కన్నులుమూసికొనెను. కృష్ణునితో బోరుచున్న మహేశ్వర జ్వరము వైష్ణవ జ్వరముచే కృష్ణదేహమునుండి త్రోసివేయబడెను. నారాయణుని భుజముల ఒత్తిడిచే పీడింపబడిన మహేశ్వర జ్వరమును చూచి బ్రహ్మ దీనిని క్షమింపుడని పలికెను. వానిబాహువనమట్లు తెగిపోవ మధువైరి త్రిపురవైరిచే తెలుపబడి చేతనున్న సుదర్శనమును వదలనెంచెను. అప్పుడు ఆ ఉమాపతి లేచి బాహువులతెగి రక్తధారలను వర్షించుచున్న బాణునింగని సామపూర్వకముగ గోవిందునితో నిట్లనియె.
నారాయణ భుజాఘాతముచే గల్గినబాధచే కన్నులు తీసివేసిన మాహేశ్వర జ్వరముంగని బ్రహ్మ వీనిని క్షమింపుమని హరింగోరె అటుమీద క్షమించితినని వైష్ణవ జ్వరమును దనయంద లయింప జేసికొనెను. నీతో నాకైన ఈ యుద్ధమును ఎవ్వరు స్మరింతురో వారు విజ్వరులు (జ్వరబాధలేనివారు) అయ్యెదరని హరి యేగెను. అవ్వల శత్రు ప్రయుక్తములగు పంచాగ్నులగెల్చి క్షీణింపజేసి దానవుల సేనలను విష్ణువు లీలగ పిండిసేసెను.
అవ్వల బాణుడు శంకరుడు కుమారస్వామియు సమస్తసైన్యముతో కృష్ణునెదిరించి యుద్ధముసేసిరి. హరిహరుల పోరాటము మిక్కిలి దారుణమయ్యెను. శస్త్రాస్త్రములచే లోకములు సంక్షోభించెను. ఇది సర్వజగత్ప్రళయము వచ్చినదని వేల్పులు తలచిరి. గోవిందుడు జృంభణాస్త్రముచే శంకరుని జృంభింప జేసెను. అంతట దైత్యులు ప్రమథులును నశించిరి. జృంభణమువలన నోటువడి హరుడు రథమధ్యమందొరగెను. కృష్ణునితో బోరలేడయ్యెను కుమారస్వామి గరుడునిచే బొడువబడిన బాహువులతో ప్రద్యుమ్నుని అస్త్రముల దెబ్బతిని కృష్ణుని హుంకారములచే శక్త్యాయుదము చెదర రణభూమి నుండి తొలగిపోయెను. హరిచే శంకరుడూదరగొన అసురసైన్యము నాశముగన గుహుడోటువడ ప్రమథసేన క్షయమొంద నందీశుడశ్వములం బూన్చిన రథమెక్కి బాణుడు కృష్ణునితో కృష్ణునితో బలముతో బోరవచ్చెను.
మహావీరుడు బలభద్రుడు బాణుని సైన్యము అనేకవిధముల చెండాడెను. ప్రద్యుమ్నుడు రణధర్మమును అనుసరించి పారిపోక (వెనుదివక) పోరెను. బలరాముడు నాగలికొనచే బట్టిలాగి రోకలిని చక్రి బాణములచే నుగ్గాసేయుటను బాణుడు నూచెను. అవ్వల కృష్ణుడును బాణుడును తలపడిరి. ఒండొరులు మెఱుగులుగ్రమ్ము కవచములను ఖండించుకొనిరి. ఒండొరుల బాణములను ఒండొరులను గొట్టుకొనిరి. తుదకుహరి బాణుని సంహరింపవలెనిన దృఢనిశ్చయము చేసికొనెను అంతట నూరుగురు సూర్యులట్లు వెలుగుచక్రమును సుదర్శనాఖ్యమును దైత్యచక్రవైరి హరిచేబట్టెను. మధువైరి ఈ సారిబాణుడు నశించితీరవలెనని చక్రాయుదమును వదలినంతట రాక్షసుల మాయామంత్రశక్తి కోటరియనునది దిగంబరి యయ్యెను. అనగా వెల్లడియయ్యెను.
ఆశక్తింగని కనులుమూసికొని బాణుని బాహువనమును ఖండించుటకు సుదర్శనమును విసరెను. ఆ చక్రాయుధము బాణుని బాహువనమును నరకెను. హరి ఆ మీద బాణునిగూడ సంహరింపనెంచినంతట త్రిపురవైరి (శివుడు) బాణుడు చేతులు తెగి రక్తము వర్షించుచుండ గని తటాలునవచ్చి హరితో సామపూర్వముగ నిట్లనియె.
కృష్ణా! కృష్ణా! జగన్నాథ! నీవు పురుషోత్తముడవు పరాత్పరుడవు ఆద్యంతములు లేని వాడవునని యెఱుంగుదును. దేవమనుష్య పశుపక్ష్యాదులందు శరీరమును గ్రహించుట దైత్యసంహారము చేయుటయను క్షణముగల ఈ చేష్ట నీలీల. కావున ప్రసన్నుడవగుము. ఈ బాణునకు నేనభయ మిచ్చియున్నాను. నాపల్కిన పలుకు నీవు అబద్ధము సేయదగడు. నా ఆశ్రయ మదముచే పెరిగినవాడు వీడు. నీయపరాధమిందులేదు. ఈదైత్యుని కేను వరములిచ్చితిని. కావున నిన్ను నేను సైరణ గొనుమని కోరుచున్నాను. అన గోవిందుడు శూలపాణింగూర్చి ప్రసన్నముఖుడై బాణునియెడ గసివిడచి యిట్లనియె.
శంకర! నీచే వరములీబడిన వాడు గావున నీ భాణుడు బ్రతుకుంగాక! నీమాటపైగల గౌరవముచేనిదిగో చక్రమును మఱలించితిని. నీవభయమిచ్ఛుట నేనిచ్చుటయే. నాకంటె నీవువేఱుగావని చూడదగను. నేనెవ్వడనో యతడునీవే. సదేవా సురమానుషమైన ఈ జగత్తు గూడ మనమే. అవిద్యామోహితులైనవారు భేదదృష్టినందుదురు. అని కృష్ణుడుపలుక ప్రద్యుమ్నుని చుట్టుకొని యున్న పాములు చచ్చువడిపోయినవి. అంతట పత్నితోగూడిన అనిరుద్దుని గరుడునిపై కెక్కించికొని బలరామకృష్ణ కృష్ణసంబంధిపరివారములు ద్వారకాపురికి వచ్చిరి.
ఇది బ్రహ్మపురాణమందు కృష్ణచరితమున బాణాసుర యుద్ధము అను నూరవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹