అరణ్య కాండ వర్ణనము
శ్రీ రాముడు వసిష్ఠునికి , తల్లులకు నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటము నుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రి మహామునిని, ఆతని భార్యయైన అనసూయను, శరభంగుని, సుతీక్ష్ణుని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. ఆగస్త్యునిఅనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమునుపొంది, దండకారణ్యము చేరెను.
జన స్థానమునందు గోదావరీ తీరమున, పంచవటిలో నివసించెను.భయంకరురాలైన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రామునిచూచి ఆమె కామ మోహితురాలై ఇట్లు పలికెను.
“నీవు ఎవరవు? ఎక్కడ నుండి వచ్చినావు? నేను కోరుచున్నాను. నాకు భర్తవగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను.ఇట్లు పలికి ఆమె సీతా లక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేసెను.
రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెనను. “ఖరుడా! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.
అట్లేచేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ, త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధము నందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలి బంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరస్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.
శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపై బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. “నీవు రాజువుకావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామ లక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. అట్లు కానిచో జీవింపను.
ఆ మాటలనువిని రావణుడు “అటులనే చేసెదను” అని పలికి మారీచునితో ఇట్లు పలికెను. బంగారుచిత్ర వర్ణమైన మృగ రూపము ధరించి, రామలక్ష్మణులను దూరముగా తీసికొనుబోవు వాడవై సీత ఎదుటకు వెళ్ళుము. నేనామెనుహరించెదను. ఇట్లు చేయకున్నచో నీకు మరణమే.”
మారీచుడు రావణునితో ఇట్లు పలికెను (అనుకొనెను). ధనుర్దారియైన రాముడు సాక్షాత్తు మృత్యు దేవతయే. రావణుని చేతిలోనైనను మరణింపవలసినదే, రాముని చేతిలో నైనను మరణించవలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు. ఈవిధముగ తలచి, మృగ రూపము ధరించి మాటి మాటికిని సీత ఎదుటసంచరించెను.
సీతచే ప్రేరితుడైన రాముడు (కొంత దూరము దానిని వెంబడించి) బాణము చేత దానిని చంపెను. మరణించుచు ఆ మృగము హా సీతా! హా లక్ష్మణా! అని అరచెను.
పిమ్మటసీత ప్రేరేపింపగా లక్ష్మణుడు, తనకిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను రావణుడు జటాయువును చంపి సీతను హరించెను.
జటాయువుచే చీల్చబడిన శరీరము గల ఆతడు జానకిని అంకముపై కూర్చుండ బెట్టుకొని తీసికొని పోయి లంకచేరి, ఆమెను అశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను.
“నీవు నాకు ప్రముఖురాలైన భార్యవగుము”. “ఓ రాక్షస స్త్రీలలారా! ఈమెను రక్షింపుడు.”
రాముడుమారీచుని చంపి, లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.”
“లక్ష్మణా! అది మాయా మృగము. నీవు కూడ వచ్చినావు. అందుచే సీతను తప్పక అపహరించి యుందురు.” పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడ లేదు.
రాముడుదుఃఖించుచు “నన్ను విడచి ఎక్కడికి పోతివి” అని పలుకుచు దుఃఖార్తుడై విలపించెను.లక్ష్మణునిచే ఊరడింప బడి జానకిని అన్వేషించెను.
జటాయువు రాముని చూచి “సీతను రావణుడు అపహరించెను” అని చెప్పి ప్రాణములు విడచెను. రాముడుఆతనికి అంత్య సంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహరించెను. ఆతడు శాప విముక్తుడై “సుగ్రీవుని వద్దకు వెళ్లుము” అని రామునితో పలికెను.
అగ్ని మహాపురాణములోని రామాయణ కథలో ఆరణ్యకాండ వర్ణన అనెడు ఏడవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹