భారతాఖ్యానం
అగ్ని ఉవాచ
కృష్ణుని మహాత్మ్యమునకు లక్షణమైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగా చేసికొని భూభారమును తగ్గించెను.
విష్ణువు నాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, అతనికి బుధుడు, అతనికి ఐలుడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, ఆతనికి. యయాతి, ఆతనికి పూరువు, పుట్టెను. అతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టెను. అతని వంశమునందు శంతనుడు జన్మించెను. అతనికి గంగాపుత్రుడైన భీష్ముడు జనించెను. శంతనునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద- విచిత్రవీర్యుడు పుట్టిరి.
శంతనుడు స్వర్గస్థుడైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరుల రాజ్యము పాలించెను. చిన్నవాడైన చిత్రాంగుదుని, చిత్రాంగదుడనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశీరాజు కుమార్తెలైన అంబికా అంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యునికి భార్యలుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మచే స్వర్గస్థుడయ్యెను.
సత్యవతి అనుమతిచే వ్యాసునివలన అంబికయందు రాజైన ధృతరాష్ట్రుడును అంబాలికయందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రుని వలన గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్యయైన కుంతియందు యమధర్మ రాజువలన యుధిష్ఠిరుడును. వాయుదేవునివలన భీముడును. దేవేంద్రునివలన అర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకులసహదేవులు పుట్టిరి. శతశృంగాశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాద్రీసంగము చేయుటవలన మరణించెను. మాద్రి అతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.
దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్ధియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి.
పిమ్మట ఆ పాండవులు ఏకచక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకాసురుడు అను రాక్షసుని చంపిరి
వారు ద్రౌపదీ స్వయంవరము నిమిత్తమై పాంచాలదేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషితయైన ద్రౌపదిని పాండవులైదుగురును భార్యగా పొందిరి.
దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్దరాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్ని దేవుని నుండి గాండీవమను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, అక్షయ్యమైన బాణములు గల అమ్ములపొదలను పొందెను. ద్రోణునివలన బ్రహ్మద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరరును శస్త్రాస్త్రములందు సమర్థులైరి.
పాండుకుమారుడైన అర్జునుడు తన శరవర్షముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహాయముతో, ఖాండవవనమునందు అగ్నిని సంతృప్తిని చేసెను.
పాండవులు నలుదిక్కులను జయించిరి. యధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీనినంతను సహింపలేకపోయెను.
సోదరుడైన దుశ్శాసనుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతమునకై ఆహ్వానించి, ఆ ద్యూతశాలలో యుధిష్ఠిరుని మోసము చేసి నవ్వుచు, అతని రాజ్యమును హరించెను.
ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసమునందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు. బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లుతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవులని గుర్తించిరి.
కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునునివలన అభిమన్యుడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తర నిచ్చెను.
ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును సన్నద్దము చేసికొనెను. కృష్ణుడు అమర్షపూర్ణుడును, పదకొండు అక్షోహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి – “యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయము” అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.
సుయోధను డిట్లనెను : – ”సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను.” అని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, “ఆ సుయోధననితో యుద్ధము చేయుము” అని చెప్పెను.
అగ్ని మహాపురాణములో భారతాఖ్యానమను పదమూడవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹