Skip to content Skip to footer

శ్రీ అగ్ని మహాపురాణం🌹🌹🌹 – పన్నెండవ అధ్యాయము

శ్రీ హరివంశ వర్ణనం

అగ్ని ఉవాచ

హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, అతనికి యయాతి పుట్టిరి, అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషవర్వుని కుమారైయైన శర్మిష్ఠ ద్రుహ్యు-అను పూరులు అనెడు కుమారులను కనిరి. యదువు కులముందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.

భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశివుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు ప్రేరిత యైన యోగమాయ- ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవకి సప్తమ గర్భముగా అయెను. అతడు రోహిణి యందు సంక్రమింపజేయబడి సంకర్షణుడాయెను . పిమ్మట చతుర్భుజుడైన హరి శ్రావణ కృష్ణపక్ష్య అష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.

రెండు భాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్భుజుని దేవకీ వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద పక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో పరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.

దేవకి వారించినను “నీ అష్టమగర్భము నాకు మృత్యుహేతువు” అని పలుకుచు అట్లుచేసెను. ఆకాశవాణిని విని అతడు దేవకి వివాహసమయమున చెప్పిన ప్రకారము తన కిచ్చిన శిశువులనందరిని పూర్వము చంపివేసెను. క్రిందికి విసరి వేయబడిన ఆ బాలిక అకాశముపైకి ఎగిరి కంసునితో ఇట్లు పలికెను.

బాలిక పలికెను. కంసా; నన్ను విసిరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు సర్వస్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.

ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే “ఆర్యా! దుర్గా. వేదగర్భా, అంబికా, భద్రకాళీ, భద్రా, క్షేమ్యాక్షేమకరీ, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమస్కరించుచున్నాను.” అని స్తుతింపబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమన్తకామములను పొందును.

ఆ బాలుని చంపుటకై, కంసుడు, పూతన మొదలగు వారిని పంపెను. కంసునినుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదాపతియైన నందునికి రక్షణార్థమై ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకులతోడనుకలిసి సంచరించిరి. జగత్తునకు పాలకులైనా వారు గోపాలులైరి.

విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జునవృక్షములు మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.

బృందావనమందున్న శ్రీకృష్ణుడు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివెసెను. కాళీయుని జయించి అతనిని యమునాహ్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. బలముచే స్తుతింపబడిన అతడు గార్దభ రూపమున నున్న ధేనుకాసురుని చంపి తాలవనమును క్షేమకరమైన దానినిగా చేసెను.

వృషభ రూపముననున్న అరిష్టాసురుని చంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శక్రోత్సవమును మాన్పి పర్వతపూజ చేయించెను.

పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపించిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి గోవింద నామము సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.

కంసుడు పంపిన ఆక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్లెను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు అతనితో క్రీడించిన, అనురక్తలైన గోపికలు అతనిని చూచుచు నిలబడిపోయిరి. వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. అంగరాగమునిచ్చిన కుబ్జకు గూని పోవునట్లు చేసెను. రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, అసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరముల్లునితో మల్లయుద్ధము చేసెను. బలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.

శ్రీకృష్ణుడు మథురాపతి యైన కంసుని చంపి అతని తండ్రిని రాజుగా చేసెను. కంసుని భార్యలైన ఆస్తి-ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధుడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్దము చేసిరి.

రామకృష్ణులు మథరను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్ధమున జరాసంధని జయించి, పౌండ్రక వాసుదేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.

జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహామాడెను. ఈ విధముగ అతడు పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.

నరకాసురసంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూడుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణిశైలమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని సత్యభామా గృహమున ఉంచెను.

సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన అతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను. పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందునిచే పూజింపబడెను. దేవకీవసుదేవులను భక్తులను, విప్రులను పూజించెను.

బలభద్రునకు రేవతియందు నిశఠుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి, కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. అరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరంచి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను. (మ్రింగెను) ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. శంబరుడు మాయావతి కిచ్చెము. మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి అదరముతో పెంచెను అతనితో ఇట్లనెను. ” నేను నీ రతిని. నీవు నాపతివైన మన్మథుడవు. శివుడు నీకు శరీరము లేకుండునట్లు చేసెను. నన్ను శంబరుడు హరించెను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.

ఆ మాట విని ప్రద్యుమ్నుడు శంబరుని చంపి భార్యయైన మాయావతితో కూడ కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణి కృష్ణులు సంతసించిరి.

ప్రద్యుమ్నునకు ఉషాపతియు, ఉదారబుద్ధియు అగు అనిరుద్ధుడు పుట్టెను. బలిపుత్రుడైన బాణుడుండెను. అతని కుమార్తె ఉష. అతని నగరము శోణితపురము. అతడు తపస్సుచే శివునికి పుత్రుడు వంటివాడయెను. ”ఓ బాణా! నీ మయూరధ్వజము ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీవు యుద్ధము పొందగలవు” అని సంతసించిన శివుడు పలికెను.

గౌరి శివునితో క్రీడించుచుండగా చూచి ఉష భర్తను గూర్చి అభిలాష కలదాయెను. గౌరి ఆమెతో ఇట్లనెను. వైశాఖమాన ద్వాదశీ దివసమున నీకు స్వప్నమునందు కనబడు పురుషుడు నీకు భర్తకాగలడు గౌరి మాటలు విని సంతసించిన ఉష గృహమునందు నిద్రించి ఆతనిని చూచెను. అతడు తనతో సంగము చేసినట్లు తెలిసికొని, చిత్రపటముపై అతని మూర్తిని చిత్రించి దాని సహాయముతో సఖియైన చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడైన ఆనిరుద్ధుని ద్వారకనుండి తెప్పించికొనెను. ఆ చిత్రలేఖ బాణాసురుని మంత్రియైన కుంభాడుని పుత్రిక. అనిరుద్దుడు ఉషతో కూడ రమించెను.

కృష్ణుడు నారదునినుండి ఈ విషయము తెలియగా, గరుడారూఢుడై, ప్రద్యుమ్న బలరామసమేతడై వచ్చి శత్రువులను, మహేశ్వరజ్రమును కూడ జయించెను.

పిమ్మట కృష్ణుడు శంకరుల మధ్య బాణములతో యుద్దము జరిగెను. తార్యుడు మొదలగు వారు నంది – వినాయక- స్కందాదులను జయించిరి.

కృష్ణుడు ప్రయోగించిన జృంభణాస్త్రముచే శంకరుడు ఆవులించుచు నిద్రపోయెను. అపుడు బాణుని బాహస్రము భేదింపబడెను. రుద్రుడు బాణునకభయ మిమ్మని కృష్ణుని కోరెను.

కృష్ణుడు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి శివునితో ఇట్లనెను. ” నీవు ఈ బాణునకు ఆభయమిచ్చినావు గాన నేనును ఇచ్చుచున్నాను. మన ఇరువురికిని భేదము లేదు. భేదమును చూచువాడు నరకమున పడును.”

కృష్ణుడు శివాదులచే పూజడింపబడి, ఉషా అనిరుద్ధాదులతో కూడి ద్వారకకు వెళ్లి ఉగ్రసేనాదియాదవులతో కలిసి సుఖముగా ఉండెను.

అగ్ని మహా పురాణము నందు హరివంశ వర్జనం నామ ద్వాదశోధ్యాయః

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment