Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై ఐదవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర ఏడవ భాగము

“ఈ సంధి కాలంలో రాక్షసులకు సరికొత్త విద్యాబోధన చేయాలి ! దేవతలు గొప్పవారు , దేవతలు మంచివారు దేవతలకు రాక్షసులు సేవలు చేయాలి. రాక్షసులు దేవతలను గౌరవించి , ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా దేవతల పట్ల అవిధేయత చూపరాదు. దేవతలతో యుద్ధానికి దిగరాదు. ఇలాంటి దేవహితం పొంగిపొర్లే విద్యను వాళ్ళకు బోధించాలి. వాళ్ళను మన విధేయులుగా , శాశ్వత విధేయులుగా – సేవకులుగా మార్చివేయాలి !” బృహస్పతి వివరించాడు.

“మీ ఆలోచన అద్భుతం ! అయితే మనం బోధిస్తే వాళ్ళ చెవులకు ఎక్కదుగా గురుదేవా ?” ఇంద్రుడు అన్నాడు..

“చెప్పాల్సింది , ప్రబోధించాల్సింది నువ్వూ , నేనూ కాదు , మహేంద్రా ! శుక్రుడు !” బృహస్పతి నవ్వుతూ అన్నాడు.

“శుక్రుడా ?!”

“శుక్రుడు ! మాయా శుక్రుడు !” బృహస్పతి ఇంద్రుణ్ణి తీక్షణంగా చూస్తూ అన్నాడు. “శాంబరీ విద్య ఇంద్రా!”

“మాయా శుక్రుడా ?” ఇంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు. “ఇదిగో ! చూడు !” అన్నాడు నవ్వుతూ బృహస్పతి. క్షణంలో ఆయన అంతర్ధాన మైపోయి , ఆ స్థానంలో శుక్రుడు ప్రత్యక్షమయ్యాడు.

ఇంద్రుడు నిర్ఘాంతపోతూ లేచి నిలుచున్నాడు.

“ఇదీ నా పథకం , మహేంద్రా ! మాయా శుక్రుడి అవతారంలో వృషపర్వుడి ఆస్థానంలో ప్రవేశిస్తాను. శుక్రుడు జయంతితో అజ్ఞాత దాంపత్యం నెరపే పదేళ్ళ సంధి కాలంలో అసురులందర్నీ సురసేవకులుగా మార్చివేస్తాను !” శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి కంఠం సగర్వంగా పలికింది.

“మీ ఆలోచన పరమాద్భుతం ! అయితే మృతసంజీవని లభించింది కాబట్టి , దేవతలను ఢీ కొందామని రాక్షసరాజు తొందరపడితే…” ఇంద్రుడు సందేహాన్ని వ్యక్తం చేశాడు.

శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి నవ్వాడు. “మంత్రోపదేశం పొందాను. మంత్ర సిద్ధి జరగాలి కద ! సమయస్ఫూర్తితో సాధించుకుంటానులే , మహేంద్రా !”

“మీరు సాధించగలరు !” ఇంద్రుడు మెచ్చుకున్నాడు. “కానీ , మీ కంఠస్వరం ?”

“ముందుగా ఆశ్రమానికి వెళ్ళి మా జననీజనకులను దర్శించుకుని , మృతసంజీవని గురించి చెప్పి , వాళ్ళ ఆశీస్సులు తీసుకొని , వృషపర్వుడి ఆస్థానం చేరుకుంటాను !”

శుక్రుడి వేషంలో ఉన్న బృహస్పతి శుక్రుడి కంఠస్వరాన్ని అవలీలగా అనుకరిస్తూ అన్నాడు.

ఇంద్రుడు గొల్లున నవ్వాడు.

వృషపర్వుడి ఆధ్వర్యంలో రాక్షస వీరులందరూ , పూర్ణకుంభాలతో మాయా శుక్రుడికి స్వాగతం పలికారు.

శుక్రుడి పేర వాళ్ళు చేస్తున్న జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. కొలువు కూటంలో అగ్రాసనం మీద కూర్చోబెట్టి , శుక్రుడికి పాద పూజ చేశాడు. వృషపర్వుడు. గురుపాద తీర్థాన్ని అందరూ శిరస్సుల మీద చల్లుకున్నారు.

“గురుదేవా ! దిగ్విజయంగా తిరిగి వచ్చారు ! మా అదృష్టం ! ఇంక అసుర వీరుల ఆయుర్దాయానికి అంతం లేదు !” వృషపర్వుడు ఆనందోత్సాహాలతో అన్నాడు.

సభలో అందరూ హర్షధ్వానాలు చేశారు. మాయాశుక్రుడు లేచి నిలబడి సభను కలియజూశాడు.

“పరమశివుడు మీ గురువును కరుణించాడు ! మృతసంజీవనీ మంత్రం ఉపదేశించాడు !”

హర్షధ్వానాలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి.

“మంత్రోపదేశం జరిగింది , మంత్రసిద్ధి జరగాలి ! పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆ మంత్రరాజాన్ని జపించాలని ముక్కంటి ఆనతిచ్చాడు ! అప్పుడు మంత్ర శుద్ధి ! మంత్ర సిద్ధి !”

“గురుదేవా ! అయితే… అప్పటిదాకా మనం దేవతలను ఢీ కొనలేమన్నమాట !” వృషపర్వుడు కొంచెం నిస్పృహతో అన్నాడు.

“నిరాశ వద్దు వృషపర్వా ! మరణించే మన వీరులకు మరలా ప్రాణం పోయగలిగిన నాడే దేవతలను ఎదుర్కొందాం అది తిరుగులేని విజయం కదా !” కపట శుక్రుడు. నవ్వుతూ అన్నాడు.

“పదేళ్ళు ! గురుదేవా , పదేళ్ళు మనం ఓపిక పట్టాలి !”

“పదేళ్ళు ఎంత ? చిటికెలో గడిచిపోతాయిలే , వృషపర్వా ! అప్పటి దాకా మన పరివారానికి విశేషవిద్య బోధిస్తాను !” కపట శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు.

కపట శుక్రుడు అన్నట్టు పది సంవత్సరాలు చిటికెలో గడిచిపోయాయి జయంతి సాహచర్యంలో శుక్రుడికి ! పదేళ్ళ అజ్ఞాత దాంపత్యం ఆనంద యాత్రగా సాగింది. విడిచి వెళ్ళలేక కన్నీళ్ళు పెట్టుకున్న జయంతికి ధైర్యం చెప్పి , ఓదార్చి , శుక్రుడు వృషపర్వుడి నగరానికి , జయంతి తల్లిదండ్రుల వద్దకు ప్రయాణమయ్యారు.

వృషపర్వుడి సభ నిండుగా ఉంది. కపట శుక్రుడు తన ఆసనం మీద ఆసీనుడై ఉన్నాడు.

“గురుదేవా ! మీరన్నట్టు , పది సంవత్సరాలు పది రోజుల్లా గడిచిపోయాయి ! మనకు మృతసంజీవని సిద్ధించినట్టే కదా !” వృషపర్వుడు ప్రశ్నించాడు.

కపట శుక్రుడు సమాధానం ఇచ్చేంతలో సభలో కలకలం బయలుదేరింది. అందరి తలలు మహాద్వారం వైపు తిరిగి ఉన్నాయి. శుక్రుడు దండకమండలాలు ధరించి , వస్తున్నాడు. సభలోని రాక్షసులంతా మాటలు మరచిపోయిన వాళ్ళలా , మూగవాళ్ళలా ఉండిపోయారు. ఎవ్వరూ పైకి లేవలేదు.

శుక్రుడు వృషపర్వుడి ముందు ఆగాడు. ఆయన చూపులు కపట శుక్రుడి మీద వాలాయి. వృషపర్వుడు తన సమీపంలో కూర్చున్న కపట శుక్రుడి వైపు తిరిగాడు.

“గురుదేవా ! ఎవరితను ?”

“వృషపర్వా !” శుక్రుడు గద్దించాడు. “మీ గురు దేవుణ్ణి నన్నే గుర్తు పట్టలేవా ?””వీడెవడో మాయావిలా ఉన్నాడు , రాక్షసరాజా !” కపట శుక్రుడు శాంతంగా అన్నాడు.

“ఎవరు మాయావి ? నేను లేని సమయంలో , నా వేషంలో , నా స్థానంలో తిష్ఠ వేసిన నువ్వు మాయావి !” శుక్రుడు గద్దించాడు..

“నోర్ముయ్ ! పరమశివుణ్ణి మెప్పించి , మృతసంజీవని సాధించి తెచ్చిన మా గురుదేవులను మాయావి అంటావా ? నీ వేషాలు కట్టిపెట్టు ! నీ మాయ ఇక్కడ పనిచేయదు !”

“వీడు… ఈ కపట నటుడు , మృతసంజీవని సాధించాడా ? నా మాట విశ్వసించు వృషపర్వా ! వీడెవడో నా వేషంతో మీ అసురకులాన్ని మోసగిస్తున్నాడు. నేను శుక్రుణ్ణి. నేను పులోమా భృగు మహర్షి దంపతుల పుత్రుణ్ణి. నన్ను నమ్ము !”

“పరిజనులారా ! ఈ మాయావిని మందిరం నుంచి , నగరం నుండి , మన రాజ్యం నుండే వెళ్ళగొట్టండి. మన గురుదేవుల రూపంలో ఉన్నందువల్ల ఆ రూపాన్ని గౌరవించి ప్రాణాలతో వదలండి !” వృషపర్వుడు ఆజ్ఞాపించాడు. కపట శుక్రుడు మెప్పుగా తలపంకించాడు.

నలుగురు రాక్షస వీరులు శుక్రుడిని సమీపించారు , బెదిరింపుగా చూస్తూ.

“ఆగండి !” శుక్రుడు హుంకరించాడు. “మీకు విద్యాబుద్ధులు చెప్పి , మీ కోసం కఠోర తపస్సుతో మృతసంజీవని విద్యను సాధించిన నన్నే అనుమానించి , అవమానిస్తారా ? అందుకు శిక్షగా నిరంతర అపజయాలతో అఘోరించండి !”

శుక్రుడి కంఠస్వరం సభలో మారుమ్రోగింది. ఆయన ఆవేశంగా అడుగులు వేసుకుంటూ సభలోంచి వెళ్ళిపోయాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment