శుక్రగ్రహ చరిత్ర ఐదవ భాగము
వృషపర్వుడు సభలో ఉన్న రాక్షస వీరులతో తమ గురువు శుక్రులవారు తపస్సు నుండి ఇంకా తిరిగి రాని విషయం చర్చిస్తున్నాడు. చారుడు వచ్చి నమస్కరించాడు.
“దేవతలు మన మీదికి యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. వాళ్ళ గురువు బృహస్పతి. ముహూర్తం నిర్ణయించే ఆలోచనలో ఉన్నాడు !” చారుడు వినయంగా అన్నాడు.
“ఎంత దుర్మార్గం ! గురుదేవులు లేని సమయం చూసుకుని ఆ ఇంద్రుడు రెచ్చిపోతున్నాడు !” ఒక రాక్షస వీరుడు హుంకరించాడు.
“గురుదేవులు మనలను యుద్ధానికి వెళ్ళ వద్దన్నారు కదా !” మరొక రాక్షస ప్రముఖుడు సందేహం వ్యక్తం చేశాడు.
“మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఏలికా ! ఆ దేవతలే మన మీదికి దూకుతారు !” దారుడు వృషపర్వుడిని హెచ్చరించాడు.
అందరూ వృషపర్వుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వృషపర్వుడు అందరినీ కలియజూసి ఇలా అన్నాడు. “మన గురుదేవులు మనలను దేవతల పైకి దండయాత్ర చేయవద్దన్నారు. దేవతలే ముట్టడిస్తే యుద్ధం చేయవద్దు అనలేదు ! దేవ సైన్యానికి గుణపాఠం నేర్పుదాం ! సిద్ధకండి !”.
తమ వైపు దూసుకు వస్తున్న దేవ సైన్యాన్ని రాక్షస సేన నిలువరించింది. యుద్ధం ప్రారంభమైంది. అచిరకాలంలోనే యుద్ధం భీకరంగా మారింది.
బృహస్పతి ఊహించినట్టుగానే , యుద్ధ తంత్రాన్ని బోధించే గురువు లేని కారణంగా రాక్షస వీరులు కుప్పలుతెప్పలుగా శవాలుగా మారుతున్నారు. యుద్ధం కొనసాగించినా రాక్షసకులానికి నష్టమే ! వెన్ను చూపినా నష్టమే ! దేవతలు వెంటాడకుండా వదులుతారన్న నమ్మకం లేదు. ఆ విషమ పరిస్థితిలో ఏం చేయాలో పాలు పోలేదు వృషపర్వుడికి , ముందు మృత్యువు , వెనక వినాశం !
వృషపర్వుడు దిక్కుతోచని పరిస్థితిలో – శుక్రుడి తల్లిదండ్రులను కలుసుకుని రాక్షసకులానికి దాపురించిన మహాకష్టం గురించి వివరించాడు. యుద్ధ రంగంలో దేవతల ధాటికి రాక్షసులు లెక్కకు మిక్కిలిగా చనిపోతున్నారనీ , ఏదో ఉపాయం ఆలోచించి రక్షించాలని వాళ్ళను ప్రార్ధించాడు.
పులోమ భర్త అనుమతి తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళింది. తన పాతివ్రత్య మహిమతో – దేవసైన్యం చలనంలేని స్థాణువుల్లా ఉండిపోయేలా చేసి వేసింది ! ఎక్కడ ఉన్న దేవతలు అక్కడే విగ్రహాల్లా ఉండిపోయేసరికి , రాక్షస సైన్యం విజృంభించి స్వైర విహారం చేయసాగారు.
శుక్రుడి తల్లి మూలంగా దేవతలకు ఎదురైన కష్టం ఇంద్రుడిని ఉక్కిరిబిక్కిరి. చేసింది. బృహస్పతి సూచనను అనుసరించి ఇంద్రుడు శ్రీమహావిష్ణువును శరణుకోరాడు. విష్ణువు హుటాహుటిన యుద్ధరంగం చేరుకున్నాడు.
భృగుపత్ని పులోమ సజీవంగా ఉన్నంతకాలం దేవతలు చలనరహితంగానే ఉండిపోతారని గ్రహించిన విష్ణువు , విధిలేని పరిస్థితిలో తన చక్రాయుధంతో పులోమ శిరస్సు ఖండించాడు. పులోమ మరణంతో దేవతలకు చలనం లభించింది. వృషపర్వుడు ఆక్రోశిస్తూ భృగుమహర్షి వద్దకు వెళ్ళి , పులోమ దుర్మరణం గురించి చెప్పాడు.
మహర్షి ఆగ్రహావేశాలతో ఊగిపోతూ యుద్ధ భూమి చేరుకున్నాడు. శరీరం నుండి వేరైపోయి దూరంగా పడి ఉన్న పులోమ శిరస్సును మొండేనికి అనుసంధానించాడు. అమోఘమైన తన తపశ్శక్తితో ఆమెను బ్రతికించాడు.
పులోమ భర్త పాదాలకు ప్రణామం చేసింది. తమ వైపు ఆశ్చర్యంతో చూస్తున్న విష్ణువును నిప్పులు కక్కుతూ చూశాడు భృగుమహర్షి
“స్త్రీ అని కూడా గౌరవించకుండా , నా భార్యను హతమార్చావు ! స్త్రీ హత్య మహాపాతకం ! అది నిన్ను వదిలిపెట్టదు. భవిష్యత్తులో మానవుడుగా జన్మిస్తూ , భూలోకంలో కష్టదుఃఖాలూ , వియోగాలూ అనుభవించు !” అంటూ శపించాడు.
ఆయన శాపంతో దేవతలు నిర్ఘాంతపోయారు. యుద్ధం ఇంక కార్యసాధకం కాదని గ్రహించి , వెనుతిరిగి వెళ్ళిపోయారు.
వృషపర్వుడు పులోమా భృగు దంపతులకు ధన్యవాదాలు తెలియజేశాడు.
“సమీప భవిష్యత్తులో ఇంద్రుడు మీ మీద యుద్ధానికి వచ్చే సాహసం చేయడు ! మా పుత్రుడు మృతసంజీవనితో తిరిగి వచ్చే దాకా , సైన్యాన్ని పటిష్టపరుచుకో !” అంది వృషపర్వుడితో పులోమ.
జయంతికి ఎవరో మేల్కొలిపినట్టు మెలకువ వచ్చింది. అలవాటు ప్రకారం శుక్రుడి వైపు చూసింది. ఆకలి దప్పులను పూర్తిగా విస్మరించిన శుక్రుడి కఠోర తపస్సు నిరాటంకంగా సాగుతూనే ఉంది. ఇంకా ఎంత కాలం సాగుతూ ఉండి పోతుందో తనకు తెలీదు. ఆయన తపస్సు సాగినంత కాలం తన సపర్య సాగుతూనే ఉంటుంది !
ఉషోదయం అవుతోంది. జయంతి లేచి నిలుచుంది. దివ్యమైన తపోదీక్షలో సూర్యుడిలా వెలిగిపోతున్న శుక్రుణ్ణి క్షణకాలం భక్తితో , అనురక్తితో చూసి సెలయేటి ” వైపు అడుగులు వేసింది.
ఆయన సన్నిధిలో చక్కగా అలకాలి. పుప్పొడులతో ముగ్గులు పెట్టాలి. అరటి ఆకులతో నీడ ఏర్పాటుచేసి , కదళీపత్ర వీవనతో విసరాలి. తన దినచర్యను తృప్తిగా గుర్తు చేసుకుంటోంది , నడుస్తూ జయంతి.
ఉన్నట్టుండి ఢమరుక నాదం మృదంగ ధ్వనిలా వినిపించసాగింది. ఢమరుక ధ్వనితో శుక్రుడి శరీరం సున్నితంగా చలిస్తోంది. ఇన్నాళ్ళూ నిశ్చలంగా ఉండిపోయిన ఆయన కనుబొమలు కొద్దిగా స్పందిస్తున్నాయి. ఢమరుక ధ్వని ఆగింది.
“శుక్రా !” మేఘ ధ్వనిలా గంభీరంగా విన వచ్చింది పిలుపు.
శుక్రుడి సర్వస్వమూ తదేక ధ్యానానికి స్వస్తి చెప్పింది. ఆయన కళ్ళు విచ్చుకున్నాయి.
“వత్సా , శుక్రా !” గంభీర కంఠంతో వాత్సల్యం ధ్వనించింది.
శుక్రుడి విశాల నేత్రాలు ఇంకా విచ్చు కున్నాయి. ఆయన కళ్ళెదుట పరమశివుడు.
చిరునవ్వు దివ్వెతో దీవిస్తూ తన ముందు సాక్షాత్కరించిన పరమేశ్వరుడి ముందు శుక్రుడు సాగిలపడిపోయాడు.
“శుక్రా ! నీ తపస్సు నన్ను ఇక్కడకు రప్పించింది ! ఏం కావాలో కోరుకో !”
శుక్రుడు పైకి లేచి , చేతులు జోడించాడు. ఆనంద భాష్పాలు నిండుతున్న కళ్ళతో ఇష్టదైవాన్ని చూశాడు. “పరమేశ్వరా ! మృతసంజీవనీ విద్య ప్రసాదించు !”.
“అలాగే ! దగ్గరగా రా ! మృతసంజీవనీ మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను !” శివుడు నవ్వుతూ అన్నాడు.
శుక్రుడు పరమశివుడిని సమీపించి , వినయంగా చెవి వొగ్గి , నిలుచున్నాడు. పరమేశ్వరుడు మంత్రోపదేశం చేస్తున్న అనుభూతి కలుగుతోంది శుక్రుడికి.
“వత్సా , మృతసంజీవని నీకు సిద్ధించింది ! వెళ్ళు ! శుభం భూయాత్ !” అన్నాడు. శివుడు, శుక్రుడు కళ్ళు తెరిచి చూశాడు. చెయ్యెత్తి దీవిస్తూ పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు.
అంతర్థానమైన శివుడికి తన అంతరంగంలో ధన్యవాదాలు అర్పించుకుంటూనే ఉన్నాడు శుక్రుడు.
తన పాదాల వద్ద నేల మీద కనిపిస్తున్న ముగ్గుల్నీ , ఆ ముగ్గుల మీద అలంకరించబడిన పువ్వుల్నీ ఆశ్చర్యంగా చూశాడు శుక్రుడు. ఆయన కనుబొమలు మధ్యలో కలుసుకున్నాయి. ఎవరు ? ఎవరు చేశారీ అలంకరణ. గట్టిపడిన నేలను చూస్తుంటే ముగ్గుల అలంకరణ చాలా రోజులుగా సాగుతున్నట్టు బోధపడుతోంది. తపస్సులో ఉన్న తనకు ఎవరో సేవలు చేశారా ? ఎవరు ? ఎందుకు ?
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹