Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై రెండవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర నాల్గవ భాగము

“ఎలాగైనా సరే , నువ్వు జయించి తీరాలి ! ఆ రాక్షస గురువు , గురు రాక్షసుడూ అయిన శుక్రుడి తపస్సు భగ్నం కావాలి !” ఇంద్రుని మాటలు జయంతి చెవుల్లో గింగిరుమన్నాయి.

ఎదురుగా , దూరంగా ఎండలో తపస్సమాధిలో కూర్చున్న శుక్రుడి మీద ఆమె చూపులు తాపడం అయిపోయి ఉన్నాయి.

“గురు రాక్షసుడు…” తండ్రి మాట ఆమెకు మళ్ళీ గుర్తొచ్చింది. జయంతి పెదవులు చిరునవ్వుతో కదిలాయి. తన తండ్రి శుక్రుడిని చూసినట్టు లేదు. చూసి ఉంటే – అంత అందగాణ్ణి ”గురురాక్షసుడు” అంటాడా !

అద్భుతమైన ముఖ వర్చస్సు ! మెరిసిపోతున్న దేహ కాంతి ! గుండ్రటి భుజాలు ! వెడల్పాటి వక్షపీఠం ! పొడుగాటి చేతులు ! ముఖ్యంగా దృష్టిని లాగుతున్న మూసిన రెప్పల కింద దాగిన పెద్ద పెద్ద కళ్ళు ! బోర్లించిన అరచేతుల్లాంటి రెప్పల పైన వంకీలు తిరిగిన కనుబొమలు ! స్వర్గంలో కూడా తనకు ఇంత వరకూ కనిపించని పురుష సౌందర్యం… “గుర్తుంచుకో తల్లీ ! ఆ దుర్మార్గుడు ‘మృతసంజీవని’ని సాధిస్తే మనకు అత్యంత ప్రమాదం ! నీ అందచందాలు ఉపయోగించు ! శుక్రుడికి దీక్షాభంగం జరిగేలా చూడు ! అతన్ని వివాహం చేసుకో !…”

“నీకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తున్నాను ! ఆ శుక్రుణ్ణి పతితుణ్ణి చేస్తావో , పతిగా చేసుకుంటావో నీ ఇష్టం ! నీ లక్ష్యం ఒక్కటే. శుక్రుడికి మృతసంజీవని దక్కకూడదు”

తండ్రి తనను ఉద్బోధిస్తూ ఆవేశంగా పలికిన పలుకులు జయంతి అంతరంగంలో ప్రతిధ్వనించాయి.

“పతితుణ్ణి చేస్తావో , పతిగా చేసుకుంటావో నీ ఇష్టం !”

“శుక్రుడికి మృతసంజీవని…”

జయంతి అసహనంగా తల విదిల్చింది. తండ్రి మాటల ప్రతిధ్వనిని దూరంగా తరిమి వేస్తూ.

ఆమె పాదాలు మెల్లగా ముందుకు కదిలి , ఆమెను శుక్రుడికి మరికొంచెం దగ్గరగా తీసుకెళ్ళాయి. ఆమె చూపులు తమ అదృశ్య హస్తాలతో శుక్రుడి శరీరాన్ని స్పృశిస్తున్నాయి. ఆయన శరీరంలోంచి యౌవన తేజం పొంగిపొర్లుతోంది. తపస్సమాధి ఆయన పట్టుదలను సూచిస్తోంది. శరీరమంతా స్వేదబిందవులు అలంకరించిన పూలలా ఉన్నాయి.

జయంతి నిట్టూర్చింది. శుక్రుడి వర్చస్సు , తేజస్సు తనను సమ్మోహన పరుస్తున్నాయి. తండ్రి తనకు స్వాతంత్య్రం ఇచ్చాడు సంపూర్ణంగా ! తాను ఆయనను పతితుణ్ణి చేయదు. పతిగా స్వీకరిస్తుంది. తాను ఆయన తపస్సును పాడు చేయదు. ఫలవంతం కావడానికి సహకరిస్తుంది. మృతసంజీవని ! తన భర్త చేతిలో మృతసంజీవనీ విద్య ఉంటే ఏం ? ఉండాలి !

నిర్ణయం ఆమెకు కొండంత బలం ఇచ్చింది. తండ్రినీ , ఆయన ఆజ్ఞనూ మరిచిపోతూ , జయంతి శుక్రుడి సమీపానికి చేరింది. చెమటతో తడుస్తున్న ఆయన శరీరాన్ని చూస్తూ పైట చెరగును వీవనంగా రెండు చేతుల్తో పట్టుకొని విసరబోతూ ఆగింది.

కొంగు గాలి శృంగార సంకేతం ! శుక్రుడికి ప్రస్తుతావసరం శృంగార సంకేతం కాదు. శుశ్రూష ! జయంతి ఆత్రుతగా చుట్టూ పరికిస్తూ చూసింది. పొడుగాటి ఆకులున్న అరటి చెట్టు ఆమెను ఆహ్వానిస్తోంది , గాలికి స్పందిస్తూ.

జయంతి వెళ్ళి జాగ్రత్తగా అరటి ఆకులు కోసి తెచ్చింది. ఒక కదళీ పత్రాన్ని శుక్రుని మీద ఎండ పడకుండా నీడలా పట్టుకుంది. రెండవ దానితో అతనికి విసరడం ప్రారంభించింది. కదళీపత్రవీవన !

శుక్రుని తపస్సు సాగుతూనే ఉంది.

జయంతి శుక్రుడు కూర్చున్న స్థలం చుట్టూ , సెలయేటి నీటితో అలుకుతోంది. ప్రతి ఉదయమూ పూల లోంచి సేకరించిన పుప్పొడులతో ముగ్గులు పెడుతోంది.

తామరాకు దొన్నెలో సెలయేటి స్వచ్ఛ జలం తెచ్చి , తన చేలాంచలాన్ని తడిపి , శుక్రుడి శరీరాన్ని సున్నితంగా తుడుస్తోంది. ఎండ ఉన్నంత సేపూ అరటి ఆకును సూర్యుడికి అడ్డంగా పట్టుకుంటోంది , విసుగూ , విశ్రాంతి లేకుండా ప్రతి ఉదయమూ కందమూలాలూ పళ్ళూ సేకరించి , ఆయన తాత్కాలికంగా తపస్సు విరమించి , ఆహారం స్వీకరిస్తాడేమో అన్న ఆశతో వేచి చూస్తోంది.

రాత్రి వేళల్లో ఆయనకు కొద్ది దూరంలో చేతినే తలగడగా చేసుకుని , నేల మీద శయనిస్తోంది.

కాలం పరుగెడుతోంది. శుక్రుడి తపస్సు ఏకదీక్షతో సాగుతోంది. జయంతి శుశ్రూష కూడా ఏకదీక్షగా సాగుతోంది. శుక్రుడి లోకం తపస్సు. జయంతి లోకం ఆయన సేవ.

“నాథా ! జయంతి వెళ్ళి ఎంత కాలమైందో గుర్తుందా ?” శచీదేవి ఇంద్రుణ్ణి అడిగింది.

“ఎంతకాలమైందో , రోజులలో , ఘడియలలో , విఘడియాలలో కూడా చెప్పగలను దేవీ !” ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు.

“నాకెందుకో ఆందోళనగా ఉంది. జయంతి…” శచీదేవి ఏదో చెప్పబోయింది.

“జయంతి తిరిగి వస్తుంది ! ఆలస్యం నాకు కూడా ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఆచార్యులను రమ్మన్నాను…” ఇంద్రుడు సముదాయింపుగా అన్నాడు.

“మహేంద్రా !” మందిర ద్వారం దాటుతూ , పలకరించాడు బృహస్పతి.

“దయచేయండి, గురుదేవా !” ఇంద్రుడు సగౌరవంగా బృహస్పతిని ఆహ్వానించాడు.

“కాలం గడిచిపోతుంది. జయంతి తిరిగి రాలేదు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిందో , లేక ఏదైనా అపాయానికి గురి అయ్యిందోనని శచి ఆందోళన చెందుతోంది…” ఇంద్రుడు బృహస్పతితో అన్నాడు.

బృహస్పతి కూర్చుంటూ, చిరునవ్వు నవ్వాడు. “ఆ ప్రయత్నంలో జయంతికి విజయమో , పరాజయమో ఎదురవుతుంది తప్ప , అపాయం సంభవించదు ! శుక్రుడు సామాన్య తాపసి కాదు కదా ! సాక్షాత్తుగా శివుడి జఠరం ప్రవేశించి , సజీవంగా బైటపడిన మహా శక్తిశాలి ! అలాంటి మహా యోగులను లొంగదీయడం అనేది అంత త్వరితంగా అయ్యేది కాదు !”

“ఏమో గురుదేవా… చిన్నదాని క్షేమం గురించి నాకు భయంగా ఉంది !” శచీదేవి అంది.

“ఆందోళన అవసరం లేదు , ఇంద్రాణీ ! నిశ్చింతగా ఉండండి !” అంటూ బృహస్పతి ఇంద్రుడి వైపు తిరిగాడు.

“మహేంద్రా ! జయంతీ శుక్రుల ఉదంతాన్ని అటుంచి , అసురుల గురించి ఆలోచించాలన్న తలంపు కలిగింది ! శుక్రుడు అందుబాటులో లేడు. వాళ్ళకి మంత్రాలోచన చెప్పే వారు లేరు ! రాక్షసుల మీద దండయాత్ర చేయడానికి ఇది అనువైన సమయం !”

ఇంద్రుడు తల పంకిస్తూ చూశాడు.

“అసుర సైన్యం ప్రస్తుతం బలహీనంగా ఉంది. యుద్ధానికి ముహూర్తం నిర్ణయిస్తాను !” బృహస్పతి అన్నాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment