శుక్రగ్రహా చరిత్ర రెండవ భాగము
ఆ రాత్రికే కుబేరుడి మీద ఉశనుడు ప్రయోగించిన యోగ ప్రభావం నశించింది. అతీంద్రియ శక్తితో తనను ఉశనుడు మోసం చేసి , నిలువు దోపిడీ చేశాడని కుబేరుడు తెలుసుకున్నాడు. విశ్వ సంపన్నుడైన తను రాక్షస గురువు కుతంత్రంతో నిరుపేదగా మారిపోయాడు. కోశాగారాలన్నీ బోసి పోయి ఉన్నాయి. అపారమైన ఆ సంపదను మాయం చేసిన ఉశనుడి యోగ బలం కుబేరుణ్ణి ఆశ్చర్యంలో ముంచి వేసింది.
“నాథా ! తక్షణం ఉశనుడి మీదా , అతని శిష్యుడు వృషపర్వుడి మీదా దండయాత్ర చేయండి !” కుబేరుడి ధర్మపత్ని ‘భద్ర’ ఆవేశంతో అంది.
“ఉశనుడు మోసగాడు ! అతగాడికి మీరు తగు విధంగా బుద్ధి చెప్పాలి. ఆ మోసగాడు దోచుకున్న సంపదను వెంటనే మన కోశాగారాలలో భద్రంగా దాచుకోవాలి !”
“దేవీ ! అది జరగని పని ! యోగబలంతో ఆ మాయావి దోచుకువెళ్ళిన దాన్ని బుద్ధి బలంతో గానీ , భుజబలంతో గానీ తిరిగి పొందలేం ! ఆ ఉశనుడి యోగశక్తిని మహా యోగశక్తితో జయించాలి…” కుబేరుడు సాలోచనగా అన్నాడు.
“అంత మహాయోగ బలం మీకు ఉంటే – ఉశనుడి యోగబలం మీ మీద పనిచేసేది. కాదుగా , నాథా.” భద్ర అనుమానంగా ప్రశ్నించింది.
“మహాయోగశక్తిని మించిన మహత్తరమైన , మహనీయమైన శక్తి ఈ కుబేరుడి హృదయంలో ఉంది !” కుబేరుడు ఉద్రేకంతో పైకి లేస్తూ అన్నాడు. “ఆ కైలాస వాసుని స్నేహమే నాకు ఉన్న మహత్తర , మహనీయ శక్తి ! ఇప్పుడే పరమశివుణ్ణి ఆశ్రయిస్తాను ! ఉశనుడి దుర్మార్గానికి తగిన శిక్ష ఆయనే విధిస్తాడు !”.
కుబేరుడి అపార సంపదను హరించి , తన యోగ శక్తితో భద్రపరిచి వచ్చిన గురువు ఉశనుడిని వృషపర్వుడు విజయోత్సాహంతో తన సభలో సన్మానిస్తున్నాడు.
రాక్షస ప్రముఖులూ , రాక్షస యువకులూ ఉశనుడి మీద పుష్ప వర్షం కురిపిస్తున్నారు.
“గురుదేవా ! ఈ క్షణం నుంచి మన ధనాగారాలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి. మా కోశాధికారి మీరే ! ఐశ్వర్య ప్రదాత అయిన మీరే మాకు ప్రత్యక్షదైవం.” వృషపర్వుడు ఉత్సాహంతో అన్నాడు.
“నీ రాక్షస కులాన్ని దేవతల తలదన్నే శక్తిగా రూపొందించడమే నా ధ్యేయం , వృషపర్వా ! నా మాతృమూర్తి ఆ లక్ష్యంతోనే నన్ను కన్నది !” ఉశనుడు విజయగర్వంతో అన్నాడు. “ఇప్పుడు నీ సంపదలో నీ స్థాయి ఇంద్రుడి స్థాయిని అధిగమించింది ! నా యుద్ధ తంత్రాలతో శక్తిలో కూడా మన అసురులు ఆ సురలను మించి ప్రకాశిస్తారు !”
తన ప్రియమిత్రుడైన కుబేరుడు చెప్తున్నది వింటున్న కొద్దీ పరమశివుడిలో ఆగ్రహజ్వాల రగుల్కొంటోంది. ఆయన దవడలు అదురుతున్నాయి. ఫాలనేత్రంలో కోపాగ్ని రాజుకుంటోంది. ఆవేశంతో ఆయన విశాల విలోచనాలు నుదుర్ని పైకి తోస్తూ విచ్చుకుంటున్నాయి. ఆపుకోలేని ఆగ్రహంతో ఒక్కసారి తల విదిల్చాడు పరమశివుడు. తామ్రవర్ణ జటాజూటం నీలలోహిత తరంగంలాగా ఊగింది.
“కుబేరా! ” మహారుద్రుడి గంభీర కంఠం కైలాసగిరి సానువులలో ప్రతిధ్వనించింది , భీకరంగా. “ఆ ఉశనుడు చేసింది మహా నేరం ! యోగవిద్యా దురుపయోగం ! ఆ మాయావికి తగిన శిక్ష విధిస్తాను !”
క్షణంలో త్రిశూలం ఆయన దక్షిణ హస్తంలో ప్రత్యక్షమైంది. ఆయన హుంకారం కైలాసమంతటా వ్యాపించింది. “ఎక్కడ ? ఉశనుడెక్కడ ?” ఆగ్రహావేశాలతో గర్జిస్తున్న శివుణ్ణి కుబేరుడు భయ భక్తులతో చూశాడు.
వృషపర్వుడి సభలో రాక్షసులు ఉశనుడిని కీర్తిస్తూ జయజయ ధ్వానాలు చేస్తున్నారు. ఆనందోత్సాహాలతో అందరూ సురాపానం చేయడంలో నిమగ్నమై పోయారు. వృషపర్వుడు స్వయంగా అందిస్తున్న పానపాత్రను అందుకోబోతూ ఉశనుడు ఆగాడు.
చెయ్యెత్తి అసురులను వారించాడు. గురువాజ్ఞతో అసురులందరూ మౌనాన్ని ఆశ్రయించారు. కళ్ళు చిట్లించి , ఏకాగ్రతతో వింటున్నాడు ఉశనుడు. ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి. ఆశ్చర్యం , ఆందోళన , భయం ఒకదాన్నొకటి తరుముతూ ఆయన ముఖం మీద ప్రత్యక్షమవుతున్నాయి.
“ఎక్కడ ? ఉశనుడెక్కడ ?” పరమశివుని కంఠధ్వని ఆయనకు స్పష్టంగా అంతరంగంలో వినిపిస్తోంది , ధమరుక ధ్వనిలా. ఉశనుడు వృషపర్వుడి వైపు ఆందోళనగా చూశాడు.
“వృషపర్వా ! పరమశివుడు ఉగ్రుడై పోయాడు. నా కోసం యుద్ధనాదం చేస్తున్నాడు !”
“గురుదేవా !”వృషపర్వుడు నోరు వెళ్ళబెట్టాడు.
“ఆ కుబేరుడు శివుణ్ణి శరణుజొచ్చినట్టున్నాడు. పరమశివుడు అతగాడికి పరమ మిత్రుడు…” ఉశనుడు ఆలోచిస్తూ అన్నాడు.
“రుద్రుడు ఉగ్రుడైతే ప్రమాదమే !” వృషపర్వుడు భయంగా ఉన్నాడు. “ఇప్పుడు కర్తవ్యం , గురుదేవా?”
ఉశనుడు కూర్చున్న చోటు నుండి లేచాడు. “కర్తవ్యం శూలపాణి సన్నిధికి వెళ్ళడమే !”
“గురుదేవా !”
“ఆయన ఆగ్రహాన్ని నియంత్రించడానికి అదొక్కటే మార్గం !” అంటూ ఉశనుడు నిష్క్రమిస్తూ అంతర్థానమైపోయాడు.
వృషపర్వుడూ , రాక్షసప్రముఖులూ ముఖాలు చూసుకొన్నారు.
శూలాన్ని ఎత్తి పట్టుకొని , ఆగ్రహ తాండవం చేస్తున్నట్టు “ఎక్కడ ? ఉశనుడెక్కడ ?” అంటూ కేకలు వేస్తున్న పరమశివుడికి కొంచెం దూరంలో , తన యోగశక్తితో సాక్షాత్కరించిన ఉశనుడు , మహారుద్రుడి మహారౌద్రాన్ని ప్రత్యక్షంగా చూసి , వణికిపోయాడు. భయంతో పక్కనే ఉన్న పొదలో నక్కిదాక్కున్నాడు. అయితే , ఆ ముక్కంటి నుండి తప్పించుకోవడం అసాధ్యమన్న జ్ఞానం ఆ వెంటనే కలిగింది ఉశనుడికి. వెంటనే పొదలోంచి ఇవతలకి వచ్చి , గుండె దిటవు చేసుకుని , పరమేశ్వరుని సమీపానికి వెళ్ళిపోయాడు. తన చేతికి దగ్గరగా అందుబాటులో ఉన్న ఉశనుడిని పట్టుకుని , పరమశివుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో , నోటిలో వేసుకుని , గుటుక్కున మ్రింగివేశాడు.
మహేశ్వరుడి మహాశరీరంలో ఉశనుడు సుళ్ళు తిరుగుతూ ఉండిపోయాడు. అక్కడ పొంగుతున్న ఉధృతమైన వేడిమిని భరించలేక తల్లడిల్లిపోయాడు. పరమేశ్వరుడు ఉశనుడు వెలికి రావడానికి అవకాశం లేకుండా నవరంధ్రాలను బంధించి వేశాడు !
మహారుద్రుడి జఠరకుహరంలో ఉక్కిరిబిక్కిరయిపోతున్న ఉశనుడు – మార్గాంతరం లేక – ఆయననే శరణుజొచ్చి , కీర్తిస్తూ – తనను రక్షించమని ప్రార్థించాడు. పరమశివుడు కనికరించాడు. తన జననాంగ ద్వారాన్ని తెరచి , ఆ రంధ్రం గుండా వెలికి రమ్మని ఉశనుణ్ణి ఆజ్ఞాపించాడు.
ఉశనుడు వెంటనే పరమేశ్వరుని జననాంగ మార్గం గుండా వెలికి వచ్చాడు. శివుడు అతడి వైపు నిప్పులు కక్కుతూ చూశాడు. అప్పుడు పార్వతీదేవి ఆయన ఆగ్రహాన్ని గుర్తించింది.
“స్వామీ… శాంతించండి ! ఉశనుడు మీ శుక్రమార్గం ద్వారా బయల్పడ్డాడు. ఆ కారణంతో అతడు నాకు పుత్రుడైనాడు. నాకు పుత్రుడైనవాడు , మీకూ పుత్రుడే ! మన్నించి , ఉశనుడికి మనుగడ ప్రసాదించండి !” అంది పార్వతి నాథుణ్ణి శాంతింపజేస్తూ.
పరమశివుడు చిరునవ్వు నవ్వాడు. “నీ కోరిక తీరుస్తాను ! నీ కుమారుడన్నావు , కాబట్టి ఉశనుడిని తేజోవంతుడిగా చేస్తున్నాను. నా శుక్రద్వార నిర్గతుడైన కారణంగా నేటి నుండి ఈ ఉశనుడు ”శుక్రుడు” అని పిలువబడతాడు.”
పార్వతి తృప్తిగా నవ్వింది. ఉశనుడు శివుడి పాదాలకు ప్రణమిల్లాడు , ”ధన్యోస్మి అంటూ. “శుక్రా ! ధనకాంక్షతో నువ్వు కాని పని చేశావు ! కుబేరుడు ధనాధిపతిగా ఉండటానికి జన్మించాడు ! విశ్వధన నిర్వాహకుడినే కొల్లగొట్టడం ధర్మం కాదు. కుబేరుడి నుండి నువ్వు సంగ్రహించి దాచుకున్న సంపద తిరిగి అతనికే చేరుతుంది ! కుబేరుడిని నువ్వు నీ కోసం దోచుకోలేదు గనుక , నీ నిస్వార్థతకు బహుమతి ప్రసాదిస్తున్నాను ! భవిష్యత్తులో నువ్వు ఐశ్వర్యకారకుడవవుతావు. అందుకు కావలసిన ఐశ్వర్యం నీకు అందుతూనే ఉంటుంది !” పరమశివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు.
“పరమేశ్వరా ! మీ ఆగ్రహం అనుగ్రహంతో పదునెక్కి ఉంటుంది ! అందుకే , ”ఉశనుడు ఎక్కడ” అని మీరు హుంకరించగానే , స్వయంగా వచ్చి , చరణాల ముందు వాలిపోయాను !” శుక్రుడు వినయంగా అన్నాడు.
శివుడు చిరునవ్వుతో శిరస్సు పంకించాడు.
శుక్రుడు పార్వతికి చేతులు జోడించాడు. “జగన్మాతను మాతృదేవతగా పొంది , తరించాను !”
“దీర్ఘాయుష్మాన్ భవ !” పార్వతి నవ్వుతూ దీవించింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹