Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఎనబయ్యవ అధ్యాయం

బుధగ్రహ చరిత్ర ఏడవ భాగము

బుధుడి వెంట వచ్చిన ఇలకు ఆశ్రమంలోని లేళ్ళు , కుందేళ్ళు తమ విధానంలో స్వాగతం చెప్పాయి. బుధుడు సాత్వికాహారంతో ఇలా కన్యకకు ఆతిథ్యం ఇచ్చాడు.

ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడటానికి , సరోవరం తెరుస్తున్న అందమైన కళ్ళలాగా తామరలు విచ్చుకుంటున్నాయి. కొలనులో బుధుడు స్నానం చేస్తున్నాడు. అతను ఆశ్రమం నుంచి రాకముందే జలక్రీడ ముగించిన ఇల కొలనుగట్టు మీద కూర్చుని , గురువిందపూల మాల గుచ్చుతోంది. రూపం మారిన వెంటనే , ఆ రూపానికి తగిన విద్యలన్నీ తమంత తామే తనను ఆశ్రయించినట్టున్నాయి.

సరస్సులోంచి గట్టు మీదికి వచ్చిన బుధుడు ఇల దగ్గరగా కూర్చున్నాడు. కోసి తెచ్చిన కెందామరను ఆమెకు అందించాడు. ఏదో చెప్పదలచుకున్నట్టు ఇల ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.

ఇల అతని కళ్ళల్లోకి చూసింది. “మీ కళ్ళు ఏదో చెప్తున్నట్టున్నాయి” అంది. నవ్వుతూ.

“అలాగా ! కళ్ళు – అంతే ! అవి మనసు తొంగిచూసే గవాక్షాలు ! కళ్ళే కాదు… ఇలా… నా పెదవులు కూడా నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి.” బుధుడు ఆమెనే చూస్తూ అన్నాడు.

“చెప్పమనండి , మీ పెదవుల్ని ,” ఇల నవ్వింది.

“ఒంటరిగా , స్వతంత్రంగా జీవిస్తూ సాధన చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఆశ్రమంలో విడిది చేశాను. ఎప్పుడూ లేని ఏదో వెలితి నాలో కాపురం ప్రారంభించింది. దేనికోసమో ఎదురు చూస్తున్న వెలితి ! ఎవరి కోసమో ఎదురు చూస్తున్న వెలితి ! ఆ వెలితి నన్ను అసంతృప్తిలో పడవేసింది. అర్ధం లేని , అర్థం కాని అసంతృప్తి అది !”

“అలాగా…” ఇల కనుబొమలు కదిలాయి.

“ఆ వెలితి ఇప్పుడు లేదు. ఆ అసంతృప్తి విచిత్రంగా అంతర్థానమైపోయింది !” బుధుడు చిరునవ్వు నవ్వాడు.

“అలాగా !”

“ఆ వెలితి , అసంతృప్తి ఎప్పుడు మాయమయ్యాయో తెలుసా ?” బుధుడు భావావేశంతో అన్నాడు. *“నువ్వు నాకు కనిపించిన ఆ మధుర క్షణం నుంచీ !”

ఇల రెప్పలు కిందికి వాలాయి.

“నిన్ను చూసిన క్షణంలోనే , అసంతృప్తి స్థానంలో ఏదో అలజడి ప్రారంభమైంది. ఇంత వరకూ ఏ స్త్రీ కూడా నాలో , నా సర్వస్వంలో ఇలాంటి అలజడిని పుట్టించలేదు !”

ఇల రెప్పలెత్తి అతన్ని చూసింది. “నిజంగా ! నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది ! నా జీవితంలో మీరు కనిపించేదాకా ఏ పురుషుణ్ణి నేను… అలా… చూడలేదు. మీలాగా ఏ పురుషుడూ నన్ను ఆకర్షించుకోలేదు !”

“నిజమా ?” బుధుడు ఉత్సాహంగా అడిగాడు.

“మీరిచ్చిన ఈ పద్మం మీద ఒట్టు” ఇల నవ్వుతూ అంది.

“స్వయం పోషణలో , స్వయం సాధనలో , స్వేచ్ఛగా , స్వతంత్రంగా జీవించమంటూ పెద్దలు నన్ను దీవించి పంపించారు. ఒకరికి రక్షణ ఇచ్చే వయసు వచ్చిందన్నారు నా పితామహులు. ఆయన మాటను నిజం చేయాలనిపిస్తోంది ?” బుధుడు ఆగి , ఆమె కళ్ళల్లోకి చూశాడు.

“ఏ విధంగా ?” ఇల ప్రశ్నించింది.

“నీకు… నీకు… రక్షణ కల్పించడం ద్వారా. ”

“ఏ విధంగా ?” ఇల చిరునవ్వు నవ్వింది.

“నీ నుండి నేను రక్షణ పొందడం ద్వారా.”

“ఏ విధంగా ?” ఇల మళ్ళీ నవ్వింది.

“నిన్ను… భార్యగా స్వీకరించడం ద్వారా.”

“ఏ విధంగా ?”

బుధుడు మౌనంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ , చిరునవ్వు నవ్వాడు. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. ఆమె పెదవులు నవ్వుతున్నాయి. బుధుడు లోపల్లోపలే ఇల ప్రశ్నకు సమాధానం వెతకసాగాడు.

“ఈ విధంగా !” అంటూ ఆమె మెడ చుట్టూ తన చేతుల్ని దండలా అల్లి , ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. దగ్గరవుతున్న బుధుడి అందమైన ముఖాన్ని చూస్తూ ఇల పారవశ్యంతో , సిగ్గుతో కళ్ళు మూసుకుంది.

కొలనులో తామరలన్నీ వాళ్ళ ఐక్యతను ఆమోదిస్తూ మెచ్చుకుంటున్నట్టు పుష్ప శిరస్సులను ఊపుతున్నాయి.

“ఇలా… మనం బార్యాభర్తలుగా ఆశ్రమంలో జీవించుదాం. ” ఆ రోజు సాయంత్రం ఆశ్రమ ప్రాంగణంలో ఆశ్రమ ప్రాణుల మధ్య తిరుగాడుతూ , అన్నాడు బుధుడు. ఇలా ఆగి , అతని ముఖంలోకి కాసేపు తదేకంగా చూసింది. తటాలున పక్కకు తిరిగి , ఆశ్రమం వైపు పరుగెట్టింది. ఆమె ప్రవర్తన బుధుణ్ణి తత్తరపాటుకు గురి చేసింది. ఆశ్చర్యంతో నోరు తెరిచి , ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు.

ఇలా ఎందుకలా ప్రవర్తించింది ? భయపడిందా ? తనతో వివాహం ఇష్టం లేదా ? ఆలోచనలు బుధుడి అంతరంగంలో సలుపు పుట్టిస్తూ సాగుతున్నాయి. తాను ఆవేశంతో తొందరపడలేదు కద ! అప్రయత్నంగా ఆశ్రమం వైపు రెండడుగులు వేసిన బుధుడు తటాలున ఆగాడు. ఇల ఆశ్రమంలోంచి తన వైపు వస్తోంది. ఆమె ముఖం మీద చిరునవ్వు. నడకలో వేగం బుధుడి ఆందోళనను తగ్గుముఖం పట్టిస్తున్నాయి.

ఇల అతని ఎదురుగా నిలుచుంది. పైట కొంగు చాటున దాగి ఉన్న ఆమె కుడి చెయ్యి ఇవతలకి వచ్చింది. ఆ చేతిలో ఆమె అల్లిన మాల ఉంది. ఇల ఆ మాలను రెండు చేతుల్తో పట్టుకుంది. తల కొద్దిగా ఎత్తి భావావేశంతో బుధుడి కళ్ళల్లోకి చూసింది. ఆమె చేతులు మెల్లిగా పైకి లేచాయి. మాల బుధుడి కంఠసీమను అలంకరించింది.

“ఇలా…” రెండోసారి ఆశ్చర్యం నుంచి కోలుకున్న బుధుడు ఉద్వేగంతో అన్నాడు. కొద్దిగా వణుకుతున్న చేతులతో తన మెడలోని దండను తీసి , ఇల కంఠంలో వేశాడు. ఇల కళ్ళు చెమ్మగిల్లాయి. ఉద్వేగంతో నిట్టూర్పు విడిచింది. ఆమె లోంచి పొంగుతున్న భావావేశాన్ని కళ్ళకు కట్టుతున్నట్టు మాల స్పందిస్తోంది అందంగా.

ఇల చూపులు మెల్లిగా బుధుడి రిక్త కంఠం మీద వాలాయి. తన కంఠం మీద నుంచి కిందకి వేళ్ళాడుతున్న మాల చివరి భాగాన్ని రెండు చేతులతో పట్టుకొని , పైకెత్తి సున్నితంగా బుధుడి మెడలో సర్దింది. అనురాగ శృంఖలలాగా ఇద్దరి కంఠాల్నీ కలుపుతూ , బంధించిన మాలికను బుధుడు ఆనంద పారవశ్యంతో చూశాడు. మెల్లిగా అతని చూపులు ఇల చూపులను ఎదుర్కొన్నాయి.

ఆత్మపరంగా సతీపతులుగా రూపొందిన ఇలా బుధులు ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా తీసుకున్నారు. ప్రథమ పరిష్వంగంలో మైమరచిన వధూవరుల చుట్టూ ఆశ్రమ జంతువులు ఉల్లాసంగా గంతులు వేయడం ప్రారంభించాయి. రకరకాల పక్షులు మంగళ వాద్యాలలాగా బృందగానం ప్రారంభించాయి. వాన కారు కాకపోయినా , కారుమేఘాలు లేకపోయినా , ఉరుముల మృదంగ నాదం వినిపించకపోయినా , నెమళ్ళు పురులు విప్పి దంపతుల చుట్టూ కల్యాణ నాట్యం చేయసాగాయి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment