Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఎనిమిదవ అధ్యాయం

పురాణ ప్రారంభం

“దితి”కి హిరణ్యాక్షుడు , హిరణ్య కశ్యపుడు , వజ్రకుడు అనే పుత్రులు కలిగారు. తామసికమైన రాక్షస లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు వాళ్ళవి. ”దితి” పుత్రులైన కారణంగా వాళ్ళు ”దైత్యులు”గా వ్యవహరించబడ్డారు.

”దను”అనే కశ్యప పత్నికి మయుడు , విప్రచిత్తి , శంబరుడు , నముచి , పులోముడు , అసిలోముడు , విరూపాక్షుడు మొదలైన రాక్షసులు కలిగారు. దను పుత్రులైనందువల్ల వీళ్ళు ”దానవులు”అనబడ్డారు.

”అనాయువు” అనే పత్నికి విక్షరుడు , బలుడు , వీరుడు , వృత్రాసురుడు అనే రాక్షసులు జన్మించారు. ”కాల”కు వినాశకుడు , క్రోధుడు అనే రాక్షసులు , కాలకేయులు పుట్టారు.

”ముని” అనే కశ్యప పత్నికి భీమసేనుడు , ఉగ్రసేనుడు మొదలైన గాంధర్వ పుత్రులు కలిగారు. వీళ్ళంతా దేవగంధర్వులు.

“ప్రాధ” అనే పత్నికి కూడా దేవ గంధర్వ సంతతి కలిగింది. ”క్రోధ”కు క్రోధవశులు , ”క్రూర”కు సుచంద్రుడు , హంతుడు , చంద్రుడు కలిగారు. ఇతర పత్నులకు పక్షులు , జంతువులు కశ్యప సంతతిగా జన్మించాయి.

దేవ లక్షణాలు కలిగిన అదితి పుత్రులకూ , రాక్షస లక్షణాలున్న దితి , దను , అనాయు పుత్రులకూ , రాక్షస లక్షణాలతో జన్మించిన ఇతర కశ్యప పత్నుల పుత్రులకూ ద్వేషమూ , అసూయా , వైరమూ జన్మ సిద్ధంగానే వచ్చాయి. బాల్యంలోనే అదితి పుత్రులు ఒక బృందంగా , ఇతర పత్నుల పుత్రులంతా ఒక బృందంగా విడిపోయారు. దేవబృందానికి ఇంద్రుడు నాయకుడయ్యాడు. రాక్షసులకు వృత్రాసురుడు , హిరణ్యకశపుడు నాయకులయ్యారు.

తన సంతతి అయిన దేవ , రాక్షస పుత్రుల మధ్య అసూయా ద్వేషాలు తొలగించడానికీ , సౌభ్రాతృత్వం పెంపొందింపజేయడానికి కశ్యపుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యుక్త వయస్కులు కాగానే రాక్షస పుత్రులు అరణ్యాలలో నివాసాలు ఏర్పర్చుకొని , స్వేచ్ఛగా జీవిస్తూ , రాక్షస సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకునే నిర్ణయంతో తల్లులనూ , తండ్రినీ వదిలి వెళ్ళిపోయారు. తమ దాయాదులలాగా స్వతంత్రంగా జీవిస్తూ , దేవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆశతో అదితి పుత్రులైన ఇంద్రాదులూ వెళ్ళిపోయారు. అదితి , కశ్యపులు విచారంలో మునిగిపోయారు.

ఆశ్రమం వదిలి అరణ్యం చేరిన రాక్షస కుమారులకు నివాస మందిరాల ఆవశ్యకత తెలిసి వచ్చింది. హిరణ్య కశ్యపుడూ , వృత్రాసురుడూ తమ సోదరుడైన మయుణ్ణి – తమ కోసం అద్భుతమైన భవనాలు నిర్మించమని అడిగారు.

భవన నిర్మాణ కౌశలం కోసం మయుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ మయుడి ముందు సాక్షాత్కరించాడు. మయుడు ఆయనకు సాగిలపడ్డాడు.

“పితామహా ! మందిర నిర్మాణ కౌశలాన్ని ప్రసాదించు ! భవన నిర్మాణ కళలో నా పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా అనుగ్రహించు.”

“మయా ! ఆ నైపుణ్యం ఎందుకు ?” బ్రహ్మ ప్రశ్నించాడు. “దైత్య దానవ కాలకేయ సోదరులు రాక్షస సామ్రాజ్యాలు స్థాపించబోతున్నారు. వారి కోసం చక్కని భవనాలు నిర్మించాలి !” అన్నాడు మయుడు

“ఇంద్రాది అదితేయులు కూడా నీకు సోదరులే కదా ! ఇంద్రాబులు దేవ సామ్రాజ్య స్థాపన చేయబోతున్నారు. వాళ్ళకు అవసరమైన మందిరాలను కూడా నువ్వు నిర్మించాలి. పక్షపాత రహితంగా ఆ కార్యం నెరవేర్చే నిబంధనతో నీకు కోరిన వరం ప్రసాదిస్తాను. సరేనా ?” అన్నాడు బ్రహ్మ.

మయుడు అంగీకరించాడు. బ్రహ్మ వరం అనుగ్రహించాడు.

మయుడు రాక్షస సోదరుల కోసం నగరాలనూ , నగరులనూ నిర్మించాడు. బ్రహ్మ ఆదేశించిన విధంగా ఇంద్రాది దేవ సోదరులకూ అద్భుతమైన మందిరాలు నిర్మించాడు. దేవ రాక్షస సామ్రాజ్యాలు వర్ధిల్లసాగాయి.

దితి జ్యేష్ఠ పుత్రుడైన హిరణ్యాక్షుడు భయంకరమైన గదను చేతబట్టి , దేవ , గంధర్వ , కిన్నర , కింపురుషులతో తలపడుతూ ఊర్ధ్వ లోకాలలో కలకలం సృష్టించ సాగాడు. భుజబలంతో విర్రవీగుతున్న అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది. విజయ గర్వంతో వీర విహారం సాగిస్తూ సంచరిస్తున్న హిరణ్యాక్షుడు సముద్రాలను కూడా అల్లకల్లోలం చేయాలనుకున్నాడు. సముద్రంలో దూరి , గదతో నీటిని మోదుతూ పెనుకల్లోలాన్ని కలిగిస్తూ ఉండిపోయాడు.

సతీసమేతంగా తపస్సు సాగిస్తున్న బ్రహ్మ మానస పుత్రుడైన స్వాయంభువ మనువు కర్తవ్య నిర్వహణ కోసం శ్రీకారం చుట్టాల్సిన సమయం వచ్చిందని గ్రహించాడు. తన మూలంగా భూలోకంలో మానవ సృష్టి జరగాలి. అయితే , ఆయన కంటికి భూమి కనిపించలేదు. భూలోకం ఎక్కడుందో తెలుసుకునే ఆశయంతో బ్రహ్మదేవుని సన్నిధి చేరుకున్నాడు.

“జనకా ! మీ ఆదేశానుసారం సాధన సాగించాను. నా కర్తవ్యమూ , దాని నిర్వహణా విధానమూ నాకు ధ్యాన గోచరమైనాయి. అయితే నరజాతిని ఉత్పత్తి చేసి , నిలపడానికి భూమి కనిపించడం లేదు” అన్నాడు మనువు.

“మానవ జీవుల నివాసార్ధం భూగోళాన్ని నేను ఏనాడో సృష్టించాను. కానీ అది సముద్రంలో మునిగిపోయింది. దానిని ఉద్ధరించడం నా శక్తికి మించిన కార్యం. శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాను. దితీకశ్యపుల పుత్రుడు హిరణ్యాక్ష రాక్షసుడు జలాదివాసాలను జయించే దుర్బుద్ధితో సాగరంలో దూరి, అక్కడున్న భూమిని తొక్కి పట్టుకున్నాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించగలిగిన శక్తిమంతుడు శ్రీహరి ఒక్కడే !” బ్రహ్మ వివరించి , కళ్ళుమూసి , శ్రీహరిని ధ్యానించాడు.

శ్రీమహావిష్ణువు బ్రహ్మ కుడి నాసికారంధ్రం నుండి సూక్ష్మ వరాహరూపంలో వెలికి వచ్చాడు. క్షణాలలో పర్వత పరిమాణమైన శ్వేత వరాహుడుగా పెరిగి , సముద్రంలోకి లంఘించాడు. హిరణ్యాక్షుడిని సంహరించి వసుధను కోరల మీద ధరించి పైకి తీసుకొచ్చాడు. భూమండలం విశ్వాంతరాళంలో తన స్థానంలో స్థిరపడింది. శ్వేతవరాహకల్పం మొదలైంది.

స్వాయంభువ మనువు పత్ని శతరూపాదేవితో కలిసి , భూలోకం చేరాడు. మను దంపతుల సంతతిగా మానవసృష్టి ప్రారంభమైంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment