కుజగ్రహ చరిత్ర మూడవ భాగము
“అమ్మా ! నేను మంగళవారం జన్మించాను ! నాకు నువ్వు నేడు – అంటే మంగళవారమే దర్శనం అనుగ్రహించావు. నా పేరు మంగళుడు ! ఈ ”మంగళ” శబ్దం మనిద్దరినీ కలిపి ఉంచాలి. నా నామధేయం నీ నామధేయంతో కలిసి పరమపావనం కావాలి ! అనుగ్రహించు !”
“తథాస్తు ! నీ ఆలోచనా సరళి నన్ను అలరిస్తోంది.” పార్వతి చిరునవ్వులు చిందిస్తూ అంది. “నువ్వు ఆవిర్భవించింది మంగళవారం ! నేను నీ ముందు అవతరించింది మంగళవారం ! నీ పేరు మంగళ… నా పేరు కూడా మంగళను స్వీకరిస్తుంది. ”చండిక” అయిన నేను ఈనాటి నుండి ”మంగళ చండిక”గా వ్యవహరింపబడతాను !”
“ధన్యోస్మి మాతా, మంగళ చండికా !”
“ఇంకా ఏం కావాలో కోరుకో కుమారా !”
“అమ్మా ! నీకు ఇష్టమైన వరం ప్రసాదించు !” కుజుడు వినయంగా అన్నాడు.
“నీ వినయం , నీ ఆప్యాయతా నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పరమేశ్వరుల స్వేదపుత్రుడుగా జన్మించావు , నా నామధేయాన్ని నీ నామధేయంతో పొదుగుకున్నావు. పేరును అంటిపెట్టుకుని నీ పేరు ఉన్నట్టే – నా సమీపాన నువ్వు ఎప్పుడూ ఉండేలా వరమిస్తున్నాను…”
“అమ్మా !”
“ఔను ! ఈ మంగళచండిక గ్రామ దేవతగా ఎక్కడెక్కడ నెలకొని ఉంటుందో , అక్కడ నువ్వు నెలకొని ఉంటావు ! నాతో బాటుగా పూజలు అందుకుంటావు !”
“ధన్యోస్మి మాతా !” కుజుడు చేతులు జోడించాడు.
“మంగళా ! నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను. నిన్ను ఆరాధించే వాళ్ళకు నా అనుగ్రహం లభిస్తుంది !” మంగళచండిక చెయ్యెత్తి దీవిస్తూ అంది.
కుజుడు భక్తి పారవశ్యంతో చండిక చరణాల ముందు సాగిలపడి , సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇందాక ఆ ప్రాంతాన్ని ఆవరించిన మనోహర సుగంధం దూరంగా వెళ్తున్నట్టు అనిపించింది కుజుడికి. మెల్లగా పైకి లేచాడు.
అంబ అప్పటికే అంతర్థానమైంది.
“చాలా సంతోషం నాయనా ! ఊహకు అందని దివ్యమైన వరం కోరావు !” భూదేవి మెచ్చుకుంటూ అంది. “నీ మాతృభక్తి నీకు తెలియకుండానే , చిగురు తొడిగింది. నీ జనకులు పరమేశ్వరులు నీ జనన సమయంలో ప్రసాదించిన పేరులో ఈ అమ్మ భూదేవి మిళితమై ఉంది. ఆ తండ్రికి ఇల్లాలైన ఆ చండిక కూడా నీ పేరులో మిళితమైంది. ఇందులోని అద్భుతమైన విశేషమేమిటో నీకు తెలుసా , కుజా ?”
కుజుడు మంత్రముగ్ధుడిలా తల అడ్డంగా ఊపి , తనకు తెలియదని తెలియజేశాడు.
భూదేవి చిరునవ్వు నవ్వింది. “నీ నామధేయంతో తమ నామధేయాలను కలిపి అల్లుకున్న తల్లులిద్దరిలో ఎవ్వరూ నిన్ను కన్నతల్లి కాదు. అంటే ఈ భూమాత నిన్ను కనలేదు. ఆ చండికామాతా నిన్ను కనలేదు ! అంటే , గర్భవాసక్లేశం అనేది లేకుండా… జన్మించిన మహా అదృష్టం నీది ! నీ జననంలోని విశేషం ఇదే ! అలాగే గర్భభార క్లేశమూ , ప్రసవ వేదన , ప్రసవమూ అనేవి లేకుండా నీకు తల్లులైన అదృష్టం ఆ దేవిదీ , నాదీ !”
“అమ్మా , నీ మాటలు వింటూంటే నేను మహాభాగ్యశాలిననిపిస్తోంది !” కుజుడు ఆనందంగా అన్నాడు.
“అందుకు సందేహం లేదు నాయనా ! నిన్ను సేవించే వాళ్ళకూ ఆ మహద్భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు నీకు సేవలు చేయడానికి పత్ని కావాలి. తగిన వధువును అన్వేషించు ! పార్వతీపరమేశ్వరుల ఆశీస్సులతో వివాహం జరిపిస్తా !” అంది భూదేవి.
“అలాగే , అమ్మా ! వధూన్వేషణ ప్రారంభిస్తాను. ఆశీర్వదించు !” కుజుడు. నమస్కరించాడు.
“విజయోస్తు ! కళ్యాణమస్తు !” భూదేవి ద్విముఖంగా ఆశ్వీరదించింది.
భూమాత దీవించినట్లే కుజుడు – వధువు కోసం సాగించిన అన్వేషణలో విజయం సిద్ధించింది. ”శక్తి” అనే సౌందర్యవతి లభించింది. ఆమెతో కుజుడి కళ్యాణం వైభవంగా జరిగింది. పార్వతీపరమేశ్వరులూ , లక్ష్మీ విష్ణువులూ , సరస్వతీ బ్రహ్మలూ నూతన దంపతులను దీవించారు.
“నాయనా , త్రిమూర్తుల ఆదేశం ప్రకారం విశ్వకర్మ నీకు మందిరం నిర్మించాడు. సతీసమేతంగా నీ మందిరంలో నివాసం ప్రారంభించు !” భూదేవి కుజుడితో అంది. కుజుడు విచారంగా ఆమె వైపు చూశాడు. “నిన్ను వదిలి వెళ్ళను !” అన్నాడు నిష్కర్షగా.
భూదేవి చిరునవ్వు నవ్వింది. “తప్పదు నాయనా ! నువ్వు కారణజన్ముడివి. నీ ఆవిర్భావానికి ఒక ఉద్దేశం , ఒక మహాలక్ష్యం ఉన్నాయి. ఆ లక్ష్యం నెరవేరాలంటే నువ్వు నీ స్థానంలో ఉండి తీరాలి. నువ్వు నన్ను వదిలి ఎక్కడికీ పోలేవు. ఎక్కడ ఉన్నా నన్ను దర్శించకుండా ఉండలేవు. నేను విపులను ! విపులమైన విస్తారమైన పృథ్విని కదా నేను !”
కుజుడి ముఖం మీద చిరునవ్వు పరుచుకుంది. “ఎక్కడ ఉన్నా నీ దగ్గరే ఉన్నప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం అక్కడికే వెళ్తాను !” అంటూ కుజుడు భూమాతను కౌగిలించుకున్నాడు. శక్తి కళ్ళల్లో ఆనందబాష్పాలు నిండుతున్నాయి.
“గురువుగారూ , నవగ్రహాల చరిత్రలు విన సొంపుగా ఉన్నాయి ! ప్రతీ చరిత్రలోనూ ఒక పరమార్థం ఉంది !” చిదానందుడు ఉత్సాహంగా అన్నాడు. కుజుని చరిత్ర ముగించిన నిర్వికల్పానందతో.
“అవును ! ఇప్పుడు మీరు ఆలకించబోయే బుధుడి చరిత్ర ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. అది అద్భుతాలకు ఆటపట్టు !” నిర్వికల్పానంద అన్నాడు.
“పితామహులైన అత్రి మహర్షి వద్ద విద్యాభ్యాసం చేస్తూ బుధుడు పెరుగుతున్నాడని విన్నాం !” సదానందుడు గుర్తు చేసుకున్నాడు..
“అత్రీ అనసూయల పెంపకంలో బుధుడు యువకుడయ్యాడు. అతడు స్వయం సాధనలో , స్వయం పోషణలో జీవించాల్సిన సమయం వచ్చినట్టు గుర్తించాడు అత్రి మహర్షి. ఆ విషయాన్ని సతీమణి అనసూయతో చర్చించాడు…” నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు…
రేపటి నుండి బుధగ్రహ చరిత్ర ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹