Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – డెబ్భై ఒకటవ అధ్యాయం

కుజగ్రహ చరిత్ర మొదటి భాగము

“అమ్మా….నన్ను ”కుజుడు” అంటారు కదా ? ఆ మాటకు అర్థమేమిటమ్మా ?” కుజుడు ఒకసారి ఉన్నట్టుండి భూమాతను అడిగాడు.

భూదేవి యుక్తవయస్కుడైన కుజుడిని చిరునవ్వుతో చూసింది. కుజుడు అందంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు ! మొక్కగా ఉన్నప్పట్నుంచీ , పాదు చేసి , నీళ్ళు పోసి , జాగ్రత్తగా పెంచిన వృక్షాన్ని చూస్తున్నట్టు తృప్తిగా చూసింది భూదేవి కుజుణ్ణి. కుజుడు సాధారణ వృక్షం కాదు. చేవ కలిగిన శైవ వృక్షం !

“ఏమిటమ్మా , అర్ధం చెప్పకుండా అలా చూస్తున్నావు ?” కుజుడు నవ్వుతూ అడిగాడు. భూదేవి చిరునవ్వు నవ్వింది. “నిన్ను చూస్తూ ఉంటే – ఇంకా , ఇంకా చూడాలనిపిస్తుంది. మంగళా !”

“అదిగో – మరొక పేరు !” కుజుడు నవ్వుతూ అన్నాడు. “మంగళుడు – ఈ ద్వితీయ నామధేయానికి నువ్వు అర్ధం చెప్పాలి !!

“అలాగే , అంగారకా !” భూదేవి పకపక నవ్వింది. “ఈ మూడో పేరుకు కూడా ముద్దైన అర్ధం ఉంది ! అది కూడా చెప్తాను !”

కుజుడు భూదేవి దగ్గరగా కూర్చుని , తలను ఆమె వొడిలో పెట్టుకుని , విశ్రాంతిగా పడుకున్నాడు. చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూశాడు. “ఎందుకో… ఎప్పుడూ నీ వొడిలో విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తూ ఉంటుందమ్మా !”

భూదేవి కుజుడి తల నిమురుతూ , చిరునవ్వు నవ్వింది. “అది నా అదృష్టం. నాయనా ! అలసిపోయే కోట్లాది ప్రాణులు ఎప్పుడూ , నా ఒడిలో ఆదమరిచి పడుకుంటాయి ! తల్లిలాగా అందర్నీ , అన్నింటినీ వొడిలోకి చేరదీసి , విశ్రాంతి ఇచ్చే ఆనందం నాది !”

“మొదటి పేరు: కుజుడు !” కుజుడు చిరునవ్వు నవ్వుతూ గుర్తుచేశాడు.

“సరే… విను ! భూమి , అచల , అనంత , విశ్వంభర , స్థిర , ధర , ధరణి , ధరిత్రి , ధాత్రి , క్షోణి , క్షితి , వసుమతి , వసుంధర , వసుధ , ఉర్వి , విపుల , పృధ్వి , క్ష్మా , అవని , మహి , మేదిని , ఇల , జగతి , రత్నగర్భ , సర్వంసహ – ఇవన్నీ నా నామధేయాలు. వీటితో బాటు ‘కు’ అనే ఏకాక్షర నామధేయం కూడా వుంది. “కు” నుండి జన్మించినందుకు – నిన్ను పరమేశ్వరుడు “కు – జుడు” అన్నారు !

“ఓహో…’ కుజుడు’ అంటే ‘భూమిజుడు’ అనీ , భూపుత్రుడు అనీ అర్థమన్నమాట ! అయితే అమ్మా , నీకు ఎన్ని పేర్లున్నాయో అన్ని పేర్లూ నేను కూడా పెట్టుకోవచ్చు కుజుడు నవ్వుతూ అన్నాడు. *”ఇప్పుడు రెండో పేరు… మంగళుడు…” కదూ !”

“నువ్వు మంగళవారం నాడు జన్మించావు. ఆ కారణంతో అందరూ ”మంగళుడు” అన్నారు !! భూదేవి చిరునవ్వుతో అంది. “నీ మూడవ పేరు ”అంగారకుడు… ఆ పేరు రావడానికి కారణం నీ శరీర వర్ణం ! ”అంగారకం” అంటే నిప్పు ! అగ్ని వర్ణంలో ఉన్నావు. కాబట్టి నిన్ను ”అంగారకుడు” అన్నాం !”

“ఓహో ! అర్థంలేని నామధేయాలు నీ కుమారుడికి లేవన్న మాట !” కుజుడు నవ్వాడు.

భూదేవి కుజుడి తలను ప్రేమగా నిమిరింది. ఆమె విశాల విలోచనాలు వొడిలో ఉన్న కుజుడి ముఖం మీద ప్రేమామృతాన్ని కురిపిస్తున్నాయి. “అవును… నీవి అన్నీ సార్ధక నామధేయాలే ! ఒక ప్రశ్న అడుగుతాను , నిజం చెప్పు ! నీ పేర్లకున్న అర్థాలు నిజంగా నీకు తెలియవా ?”

కుజుడు ఆమె కళ్ళలోకి నిదానించి చూసి , పక్కున నవ్వాడు. “ఎందుకు తెలీదమ్మా ! తెలుసు…”.

“అయితే ఎందుకడిగావు ?” భూదేవి ప్రశ్నించింది.

“ఎందుకంటే… నువ్వు వివరిస్తూ ఉంటే… నేను వింటూ ఉంటే… హాయిగా , ఆనందంగా ఉంటుంది ! అమ్మ మాట… అతి మధురం ! తెలుసా ?” కుజుడు నవ్వాడు. భూదేవి శృతి కలిపింది.

“అమ్మ మాట అతి మధురం…” కుజుడన్న మాట ఆమెలో ఆలోచనలు రేపుతోంది. “కుజా ! నీకో విషయం చెప్పాలి…”.

“ఓ ! చెప్పమ్మా ! చెప్పానుగా ! కన్నతల్లి మాట కర్ణామృతమే !” కుజుడు భూదేవి కంఠం చుట్టూ చేతుల్ని వేస్తూ అన్నాడు.

“నేను… నీ కన్నతల్లిని కాను , నాయనా ! ”చేకొన్న” తల్లిని !” భూదేవి కుజుడి కనుబొమల్ని సున్నితంగా వేళ్ళతో సవరిస్తూ అంది.

“అమ్మా…” అంటూ కుజుడు ఆమె ఒడిలోంచి లేవబోయాడు.

భూదేవి అతన్ని అదిమి , ఒడిలోనే పడుకోబెట్టింది.

“నువ్వు పరమశివుడి నుదుటి మీద నుంచి జారి పడిన స్వేదబిందువు నుండి ఆవిర్భవించావు ! ఆయన తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మహత్తర సమయంలో ఆ సంఘటన జరిగింది. స్వేదబిందువు నాలో ఉన్న ఆకర్షణ శక్తి వల్ల సహజంగా – ఇదిగో , ఇప్పుడు నువ్వు నా ఒడిలో పడుకున్నావు చూడూ – అలా నా వొడిలో పడింది. తక్షణం ఆ స్వేద కణం అంతర్థానమై , ఆ స్థానంలో అగ్నివర్ణంలో అందమైన శిశువుగా నువ్వు ఆవిర్భవించావు. ”అమ్మా ! అవనీ , నీ వొడిలో పడిన బాలుడు , నీ బాలుడే ! నువ్వే పెంచి , పెద్దవాణ్ణి చేయి !” అన్నాడు పరమేశ్వరుడు. “

“పరమేశ్వరుడు అలా ఎందుకన్నారమ్మా ?” కుజుడు ప్రశ్నించాడు.

“ఆ సందర్భంలో ఆయనది భార్యలేని , భారమైన ఏకాంత జీవితం ! ఆయన సతి , సతీదేవి దక్షయజ్ఞంలో దగ్ధమైపోయింది. బిడ్డలు తల్లి పెంపకంలోనే లక్షణంగా , సవ్యంగా ఎదగగలరని శివుడికి తెలుసు…” భూదేవి వివరించింది. “నీకు మరొక విషయం తెలుసా ? నేను విష్ణుపత్నిని. పరమశివుడు నాకు సోదరుడు. సోదరుడి సంతానానికి తల్లి లేనప్పుడు – సోదరి పాలిచ్చిపెంచడం అపరాధం కాదు , నిషిద్ధం కాదు. నీకు నా చనుబాలు త్రాగిస్తూ , నేను ఎంత పులకించిపోయేదాన్నో !” భూదేవి కనుగొనల నుండి ఆనందబాష్పాలు కుజుడి ముఖం మీద పడ్డాయి.

“అమ్మా !” కుజుడి కంఠంలో మమకారం బరువుగా పలికింది. “పరమశివుడితో నీ సంబంధ బాంధవ్యం ఏదైనా సరే , నీతో నా బాంధవ్యం ఏదైనా సరే – నేను నిన్ను ఎన్నటికీ ”అమ్మా” అనే పిలుస్తాను !”

‘అందుకు అభ్యంతరం ఏముంది నాయనా !” భూదేవి ఆనందంగా అంది. “నువ్వెప్పుడూ నా బిడ్డడివే ! నువ్వు ఇష్టపడే వ్యక్తులకు మాత్రమే ఈ భూదేవి ఆస్తిగా దక్కుతుంది ! అది అలా ఉంచితే – నీకు యధార్ధ మాత ఉంది. ఆమె… నీ పితృదేవులైన పరమేశ్వరుల పత్ని. సతి , పార్వతిగా అవతరించి , ఆయన పత్ని అయ్యింది. ఆమెకు ”దుర్గ” అనీ , ”చండిక” అని నామధేయాలున్నాయి. ఇంకా చాలానే ఉన్నాయి. నువ్వు ఇప్పటి దాకా నీ ”తల్లి”ని చూడలేదు…”

“అమ్మా… ఆ తల్లి… నా జనకుల పత్ని… నీలాగా అందంగా ఉంటుందా ?” కుజుడు అమాయకంగా అడిగాడు.

“ఆమె సౌందర్యఖని ! సౌందర్యలహరి ! త్రిలోక సుందరి ! ఆ శివాని త్రిజగన్మోహిని ! నువ్వు ఆ జనయిత్రిని దర్శించాలి ! ప్రార్థించాలి ! కీర్తించాలి ! ఆశీస్సులు అందుకోవాలి ! వరాలు మూట కట్టుకోవాలి…” భూదేవి చెప్పుకు పోతోంది.

“అమ్మా….నువ్వుంటే అన్నీ ఉన్నట్టే…”

“అలా అనకు తండ్రీ ! నీకు శివపత్ని అయిన ఆ ఆదిపరాశక్తి కరుణ అవశ్యం. త్రిజగన్మాత అయిన ఆమె నీకు మాత కావడం నీ అదృష్టం. నీ విద్యాభ్యాసం పూర్తయింది. యువకుడివయ్యావు ! నువ్వు వివాహం చేసుకోవాలి. ఆ శుభకార్యానికి శుభసూచకంగా అద్రిసుతను ఆరాధించి , అనుగ్రహం సంపాదించు !” భూదేవి ప్రోత్సహిస్తూ అంది.

“సరే ! అయితే , రేపే కైలాసానికి వెళ్తాను !” కుజుడు లేచి , కూర్చుంటూ అన్నాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment