Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – అరవై ఏడవ అధ్యాయం

చంద్రగ్రహ చరిత్ర ఐదవ భాగం

“రోహిణీ , నువ్వు వేశ్యలాగా ప్రవర్తిస్తున్నావు. చివరి సారిగా హెచ్చరిస్తున్నాను. పత్నులుగా మాకున్న అధికారాన్ని…”

“అపహరించానా ? అలాగే అనుకుని ఏడుస్తూ కూర్చోండి. వెళ్ళండి !” రోహిణి తలుపుల్ని దభాలున మూసివేసింది.

అశ్వినిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఆమె ముఖం ఎర్రబారింది. శరీరం వణుకుతోంది. మూసిన తలుపు వైపు ఆమె కదలబోయింది.

తలుపు తటాలున తెరుచుకుంది. ద్వారానికి అటు వైపున చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.

అతని కళ్ళు ఆగ్రహాన్ని చిమ్ముతున్నాయి. “యుద్ధానికి వచ్చారా ? విజయం దక్కదు మీకు. రోహిణి నా ఇష్ట సఖి. రోహిణి కోసమే మీ గుంపును అంగీకరించాను. రోహిణి వల్లే మీకు ఈ మందిరంలో ప్రవేశం లభించింది. మీ పాదపూజలూ , పుష్పార్చనలు నా మీద పనిచేయవు !” చంద్రుడు కోపంగా అని క్షణకాలం ఆగి అశ్విని ముఖంలోకి తీక్షణంగా చూశాడు. “నా రోహిణిని నువ్వు అన్న మాటలన్నీ విన్నాను. ఆమె నా పట్టపురాణి. ఈ మందిరంలో ఉండాలనుకుంటే అందరూ మీరందరూ పరిచారికలుగా ఉండండి. నాకు , రోహిణికి సేవ చేస్తూ పడి ఉండండి. వెళ్ళండి !”.

తన హెచ్చరిక ముగించి చంద్రుడు ఆవలికి జరిగాడు. అంతసేపూ చాటులో నిలుచున్న రోహిణి ముందుకు వచ్చి , తలుపుల్ని రెండుచేతుల్తో పట్టుకుంది. చంద్రుడు ఆమె వెనుకకు జరిగి ఆమె భుజాల మీద రెండు చేతుల్ని వేశాడు.

రోహిణి విశాల నేత్రాలు అహంకారానికి పట్టిన భూతద్దాల్లా , అక్కచెల్లెళ్ళ ముఖాలను కలయజూశాయి. వాళ్ళని పరిహసిస్తున్న చిరునవ్వు ఆమె పెదాల మీద నాట్యం చేస్తోంది. రోహిణి చేతులు కదిలాయి. తలుపులు మూసుకున్నాయి. శబ్దం చేస్తూ , అశ్విని మందిరంలోంచి బైటికి నడిచింది , చెల్లెళ్ళతో బాటు.

దక్షప్రజాపతి , ప్రసూతి నోట మాట లేకుండా , నిర్ఘాంతపోతూ విన్నారు. ఇరవై ఆరుగురు పుత్రికలూ గద్గదకంఠాలతో చెప్తున్న సంగతులు వాళ్ళ హృదయాలను కలిచి వేస్తున్నాయి. దక్షప్రజాపతి ముఖం జేవురించింది. దవడలు అదురుతున్నాయి.

“అల్లుడు సరే ! మీ అందరికీ కొత్త రోహిణి ఎందుకలా ప్రవర్తిస్తోంది ? చిన్ననాటి నుండి మీతో తనకు ఉన్న చెలిమిని ఏం చేసిందది ?” ప్రసూతి అంది.

“వాళ్ళిద్దరికీ సపర్యలు చేసే పరిచారికలుగా మీరు మమ్మల్ని అక్కడికి పంపలేదు. ఆ మందిరంలోంచి నిషేధించబడితే ఆ స్వార్ధ దంపతుల సేవ ఎందుకు ? తల్లిదండ్రులు పాదాలు సేవించుకుంటూ ఇక్కడే ఉంటాం !” అశ్విని అంది.

“స్వామీ…పరిష్కారం ఆలోచించండి !” ప్రసూతి దక్షప్రజాపతితో అంది.

“నా కన్నబిడ్డలకు జరిగిన అవమానం నన్ను దహించివేస్తోంది. కానీ ఆవేశం సమస్యను జటిలతరం చేస్తుంది. సంయమనంతో మన బిడ్డల కాపురాన్ని చక్కదిద్దాలి.” దక్షుడు ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ అన్నాడు. “పిల్లలు నిరాదరణతో , అవమానంతో అలసిపోయి ఉన్నారు. కొన్ని రోజులు ఇక్కడ విశ్రాంతిగా ఉంటారు. ఆ తరువాత స్వయంగా వెళ్ళి , రోహిణిని మందలించి , చంద్రుడికి హితవు చెప్పి వస్తాను.”

“నీ సోదరీమణులు ఏరి తల్లీ ?” చంద్ర మందిరంలోనికి వచ్చిన నారదుడు , నమస్కరించిన రోహిణిని ఆశీర్వదించి , ప్రశ్నించాడు.

రోహిణి కళ్ళల్లో దోబూచులాడి , క్షణంలో అంతర్థానమైన అనుమానం నారద మహర్షి దృష్టి నుండి తప్పించుకోలేకపోయింది.

“వాళ్ళు… మా పుట్టింటికి వెళ్ళారు.” రోహిణి మెల్లగా అంది. “నిన్ను ఒక్కదాన్నే వదిలిపెట్టి అందరూ వెళ్ళి పోయారా ?” నారదుడు అడిగాడు. “వాళ్ళు వెళ్ళిన కారణమేమిటమ్మా ? అలుకా ? ఆగ్రహమా ?”

అడగకూడని ప్రశ్నలు అడుగుతున్న నారదుడిని రోహిణీ ఇబ్బందిగా చూసింది. “నమస్కారాలు మహర్షీ !” అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రుడు అభివాదం చేస్తూ అన్నాడు. “అలకలూ , ఆగ్రహాలు అందగత్తెలు అన్ని వేళలా ధరించే అలంకారాలే కదా ! కానీ దక్షపుత్రికలు తమ తల్లిదండ్రులను దర్శించడానికి వెళ్ళారు.”

“గిలిగింతలు పెట్టే సమాధానం. ఇరవై ఏడుమంది అందగత్తెల అలుకలనూ , ఆగ్రహాలను అనుభవిస్తూ ఆనందం అనుభవించే అదృష్టం నీదే. వస్తాను – బృహస్పతి ఆశ్రమానికి వెళ్తూ దారిలోనే కదా అని నీ మందిరానికి వచ్చాను. నీ వివాహానికి సూత్రధారిని. మీ సుఖాలూ , సంతోషాలు చూడాల్సిన వాణ్ణి.” అంటూ నారదుడు ద్వారం వైపు వెళ్తున్నాడు. ఆయన మెడలోంచి వేళ్ళాడుతున్న ”మహతి”. ఆయన అంగుళీ స్పర్శతో ”నారాయణ ! నారాయణ” అంటోంది.

నారదుడి వీపునే చూస్తూ చంద్రుడూ , రోహిణి ఒకేసారి తేలికగా నిట్టూర్చారు.

ఇరవై ఆరుగురు పుత్రికలనూ వెంట బెట్టుకుని అకస్మాత్తుగా వచ్చిన దక్షప్రజాపతిని చూసి , చంద్రుడు కొద్దిగా కలవరపడ్డాడు. రోహిణి ఆందోళనలో మునిగిపోయింది. ఆసనం మీద ఠీవిగా కూర్చున్న దక్షప్రజాపతి వెనుక ఇరవై ఆరుగురు పుత్రికలు నిలుచున్నారు. రోహిణి చంద్రుడి సమీపాన నిలుచుంది.

చంద్రా ! నేను పది మంది పుత్రికలను ధర్ముడికి కన్యాదానం చేశాను. త్రయోదశ కన్యలను కశ్యపుడికి భార్యలుగా ఇచ్చాను. నీ వంశాన్ని గౌరవించి , నీ చక్కదనాన్ని అభిమానించి చక్కని చుక్కలైన ఇరవై ఏడుగురు పుత్రికలను పత్నులుగా బహూకరించాను. కానీ , నీవు ధర్మం తప్పి చరించావు. పరస్త్రీని దగ్గర చేర్చుకోవడం అపరాధం. అలాగే స్వపత్నిని దూరంగా ఉంచడం కూడా అపరాధమే !” చంద్రుడికి ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నట్టు ఆగాడు దక్షుడు.

తన పరదారా ప్రణయ ప్రసంగం వినగానే చంద్రుడు తలవాల్చుకున్నాడు. దక్షుడు ఇలా అన్నాడు.

“వివాహానికి ముందు గురుపత్ని తారతో నీవు పారడారికం నెరపావు. పాపం. చేశావు. నీ భార్యలుగా రూపొంది నీకే తమను అంకింతం చేసుకున్న అశ్వినినీ , ఆమె చెల్లెళ్ళను పరిచారికలుగా చూస్తూ చేరదీయకుండా దూరంగా ఉంచావు. మళ్ళీ పాపం చేస్తున్నావు. మామ అయిన నేను నీకు పితృసమానుడిని. నీ అపరాధాన్ని క్షమించి నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. దక్షపుత్రికలందరినీ సమదృష్టితో దక్షతతో ఏలుకో. నీ అనురాగాన్ని ఒక్క రోహిణికే కైంకర్యం చేయవద్దు. అందరికీ పంచు !” తన ప్రసంగం ముగించి దక్షుడు పైకి లేచాడు.

“అమ్మా అశ్వినీ , మీరందరూ మీ మీ ఉపగృహాలకు వెళ్ళండి. మీ భర్త మిమ్మల్ని ఆదరిస్తాడు !” దక్షుడు పుత్రికలతో అన్నాడు.

దక్షపుత్రికలు ఆనందబాష్పాలతో తమ తండ్రి వైపు చూసి , వెళ్ళారు. “ఆత్రేయా ! నీ సమాధానం కావాలి నాకు ,” అన్నాడు దక్షుడు , మౌనంగా ఉన్న చంద్రుడిని చూస్తూ.

చంద్రుడు రెప్పలెత్తి మామగారి ముఖంలోకి చూశాడు. దక్షుడు తీక్షణంగా చూశాడు.

“నీ అపరాధాన్ని క్షమిస్తున్నాను. పునరావృతం కాకుండా చూసుకో. మరొక్కసారి అపరాధం చేసిన అల్లుడికి ఈ దక్షుడు అరణంగా ఇచ్చేది దారుణ శాపమే. గ్రహించావు కదా ?”

గ్రహించినట్టుగా చంద్రుడు మౌనంగా తలపంకించాడు. దక్షుని చూపులు తలవాల్చుకుని నిలుచున్న రోహిణి మీద వాలాయి. “రోహిణీ ! ఒకసారి నీ మందిరానికి పదా!”

తండ్రి ఆజ్ఞ రోహిణిని నిలుచున్న చోటు నుండి కదిల్చింది. దక్షుడు ఆమె వెంట గంభీరంగా అడుగులు వేశాడు.

తలుపుల్ని మూసి , రోహిణీ తండ్రి వైపు తిరిగి మౌనంగా చూసింది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment