Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – అరవై ఆరవ అధ్యాయం


చంద్రగ్రహ చరిత్ర నాల్గవ భాగము

అందరూ మౌనంగా ఆయననే చూస్తున్నారు. మళ్ళీ నారదుడే అన్నాడు.

“మీ తండ్రి దక్షప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుడు. నేను కూడా బ్రహ్మ మానస పుత్రుడినే ! మీకు పితృ సమానుడిని. మీరు నవ వధువుల్లా లేరు. కారణం చెప్పండి.”

అందరూ చెప్పమన్నట్టు అశ్విని వైపు చూశారు. ఆ చూపును అర్థం చేసుకున్న నారదుడు “అశ్వినీ , చెప్పు తల్లీ” అన్నాడు.

అశ్విని ప్రయత్నించి నోరు పెగుల్చుకుంది. భర్త మందిరంలో తమకు ఎదురైన అనుభూతినీ , రోహిణీ చంద్రుల మూలంగా తమకు జరుగుతున్న అన్యాయాన్నీ తడబడుతూ వివరించింది.

“అదన్నమాట , సంగతి !” అంతా విన్న నారదుడు అన్నాడు. “మీరందరూ అమాయక వధువులు. మీ భర్త దృష్టినీ , ప్రేమనూ ఆ రోహిణి లాగే ఆకర్షించే ప్రయత్నం చేయాలి.”

“ఆ ఉపాయమేదో మీరే చెప్పండి.” భరణి ధైర్యంగా అడిగింది.

“మీరు చాలా సాత్వికంగా ఉన్నారు. భర్తను వశ పరుచుకోడానికి రాజసగుణ స్పర్శ అవసరం. భర్త ఆదరించలేదన్న నిరాశతో ఇలా దీనంగా , నీరసంగా నిరలంకారంగా ఉండకూడదు. ఆ రోహిణిని మించి అలంకరించుకోండి. గలగలా నవ్వండి. ఉల్లాసంగా సల్లాపాలాడుతూ చంద్రుణ్ణి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేయండి” నారదుడు నవ్వుతూ అన్నాడు.

దక్షపుత్రికలు ముఖాలు చూసుకున్నారు.

“భర్త అనురాగం కోసం చేసే ప్రయత్నంలో భక్తి , భయం ఉండకూడదమ్మా , రక్తీ , రసికతా ఉండాలి. అర్థమైంది కదా” నారదుడు చిరునవ్వుతో అడిగాడు.

అశ్విని తల ఊపింది. అందరూ చిరునవ్వులు నవ్వారు.

“నారాయణ !” నారదుడు పైకి లేస్తూ అన్నాడు. “మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను.. మీ ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తూ కనిపించాలి నాకు.”

ఒంటరిగా రాబోయే చంద్రుడి కోసం అశ్వినీ , ఆమె చెల్లెళ్ళు ఇరవై ఐదుగురు వేచి చూస్తున్నారు. అందరూ చక్కగా అలంకరించుకున్నారు. అందరికీ మళ్ళీ నూతన వధువులు కళ వచ్చేసింది. పూలమాలలతో , విడి పూలతో , పతిదేవుడి పాదాలు కడగటానికి. బంగారు పళ్ళెంతో , బంగారు గిండితో సిద్ధంగా ఉన్నారు.

చంద్రుడు వచ్చాడు. ద్వారాన్ని దాటిన అతని పాదాల ముందు బంగారు పళ్ళెం పెట్టబడింది. ముందుగా పథకం వేసినట్టు ఇద్దరు దక్షపుత్రికలు ఆశ్లేష , మఖ చెరొక చెయ్యి పట్టుకొని పళ్ళెంలో నిలచేలా చేశారు.

భరణి నీళ్ళు పోస్తుంటే అశ్విని చంద్రుడి పాదాలు కడిగింది. పళ్ళెంలోని నీళ్ళను తన తల మీద చల్లుకుని , సోదరీమణుల తలల మీద ప్రోక్షించింది.

అశ్విని భర్త మెడలో పూలదండ వేసింది. చంద్రుడు అర్ధం కానట్టు చూస్తున్నాడు. ఎడమచేతితో అశ్విని వేసిన మాలను తీసి వేశాడు. వెంటనే భరణి చేతుల్లోని దండ అతని మెడలో వాలింది. చంద్రుడు నడుస్తున్నాడు. దక్షపుత్రికల చేతుల్లోంచి పువ్వులు వర్షిస్తున్నాయి.

చంద్రుడి కళ్ళు ఆత్రుతగా చుట్టూ అన్వేషించాయి. “రోహిణి ఏది ?” అన్నాడు దగ్గరగా ఉన్న అశ్వినితో.

అశ్విని సమాధానం చెప్పేలోగా , తలుపును భళ్ళున తెరిచి , రోహిణి ఎదురుగా నిలబడింది. చంద్రుడి ముఖం మీద మెరుపులా చిరునవ్వు మెరిసింది. అతను రోహిణిని ఎగాదిగా చూశాడు. అప్పుడే మంచం దిగిన రోహిణి పువ్వులు లేకుండా , తగ్గిన ఆకర్షణతో కనిపిస్తోంది.

చంద్రుడు ఆక్షేపణగా అశ్వినినీ , ఆమె చెల్లెళ్ళనీ కొరకొర చూశాడు. “మీరు స్త్రీలేనా ? రోహిణికి ఇవ్వకుండా అన్ని పువ్వులూ మీరే అలంకరించుకున్నారా ? ఛీఛీ !”

అశ్వినీ , ఆమె చెల్లెళ్ళు నిర్ఘాంతపోయారు. వాళ్ళు తేరుకునేలోగా చంద్రుడు తన కంఠంలోని హారం తీసి ప్రేమగా రోహిణి మెడలో వేశాడు. భుజాల చుట్టూ చేతిని వేసి ఆమెను శయనాగారంలోకి నడిపించుకెళ్ళి విసురుగా తలుపు మూసి బంధించాడు.

నిన్నటి దాకా నీరు కార్చిన అశ్విని కళ్ళు ఇప్పుడు నిప్పులు కక్కుతున్నాయి. మూర్తీభవించిన ఆగ్రహంలా ఉన్న అశ్వినిని చెల్లెళ్ళు ఆందోళనగా చూశారు. ఉలుకూ , పలుకు లేకుండా ఉగ్రరూపంలో ఉన్న అశ్వినిని సోదరీ బృందం పలకరించింది. అశ్విని పెదవులు అదిరాయి కానీ , మాట వెలువడలేదు.

క్రితం రాత్రి జరిగిన ఘోరమైన అవమానం ఆమె హృదయాన్ని కాల్చివేస్తోంది. చంద్రుడి మీద కోపం రోహిణి మీద ఆగ్రహం.

“అక్కా…” విగ్రహంలా చలనం లేకుండా కూర్చున్న అశ్విని చేతిని తాకుతూ పిలిచింది కృత్తిక.

“ఈ అన్యాయాన్ని ఇక క్షమించను , సహించను !” అశ్విని తటాలున పైకి లేచి అంది.

ఆవేశంగా అడుగులు వేస్తూ చంద్రుడి శయనాగారం వైపు వెళ్ళింది. చెల్లెళ్ళందరూ తీగను అంటిపెట్టుకుని కదిలే మొగ్గల్లా అశ్విని వెంట వెళ్ళారు. అశ్విని శయనాగార ద్వారం ముందు నిలబడింది. తలుపులు మూసి ఉన్నాయి.

అశ్విని కంఠం మందిరంలో ప్రతిధ్వనించింది. “రోహిణీ !” అశ్విని అలాగే బిగ్గరగా పిలుస్తూ ఉండిపోయింది. చెల్లెళ్ళు ముఖాలు చూసుకున్నారు.

శయనాగారం తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన రోహిణి కోపంగా చూసింది. “ఏమిటి ? ఏమిటా అరుపులు ? పతిదేవులు నిద్రలో ఉన్నారు… తెలుసా ?”

“తెలుసు ! మేలుకొలపడానికే వచ్చాను. నువ్వు చేస్తున్న నేరం ఏమిటో , మా అందరికీ కలిగిస్తున్న నష్టం ఏమిటో నీకు తెలుసు. ఈ మందిరంలో మాకు జరుగుతున్న అవమానమేమిటో నీకు తెలుసు. కళ్ళు తెరుచుకో , రోహిణీ ! ఆత్రేయ చంద్రుడు నీ ఒక్కతికే భర్త కాదు. ఆయన అనుబంధంతో మా అందరికీ భాగస్వామ్యం ఉంది. తోబుట్టువులకు అన్యాయం చేస్తున్నావ్. తప్పు తెలుసుకొని తప్పుకో !” అశ్విని ఆవేశంతో అంది.

రోహిణి పెదవులు మెల్లిగా కదిలి వెటకారానికి రూపం ఇచ్చాయి. “నేను ఆయనను కొంగున ముడివేయలేదు. మిమ్మల్ని కన్నెత్తి చూడవద్దని కట్టడి చేయలేదు. ఆయనే నా చుట్టూ తిరుగుతున్నారు. చేతనైతే మీ చుట్టూ తిప్పుకోండి !”

“నీ అక్కచెల్లెళ్ళని , ధర్మపత్నుల్ని ఆదరించమని ఆయనకు గుర్తు చేయడం నీ విధి !

రోహిణి అశ్విని వైపు గర్వంగా చూసింది. “నీకో నిజం తెలుసా అశ్వినీ ! ఆనాడు ఆయనను మీకు దూరంగా , నాకు దగ్గరగా ఉండిపొమ్మని నేను అడగలేదు. నేడు నాకు దూరంగా , మీకు దగ్గరగా వెళ్ళమని అనలేను. ఇది నా భాగ్యం. అది మీ దౌర్భాగ్యం !”

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment