Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – అరవై ఒకటవ అధ్యాయం

సూర్యగ్రహ చరిత్ర నాల్గవ భాగము

ఆ ప్రశాంత వాతావరణంలో సూర్యుడూ , సంజ్ఞ అశ్వ దంపతులుగా విహరిస్తూ. ఉండిపోయారు.

అశ్వరూపంలో ఉన్న సంజ్ఞ తనలో సూర్యుడు ప్రవేశపెట్టిన తేజస్సును నాసికా రంధ్రాల గుండా వెళ్ళగక్కింది. రెండు నాసికారంధ్రాల నుండి వెలువడిన సూర్య తేజం . ఇద్దరు కుమారులుగా మారింది. ఆశ్విక దాంపత్య ఫలంగా , అశ్వముఖాలతో , మానవ శరీరాలతో జన్మించిన ఇద్దరు పుత్రులతో బాటు , సహజ శరీరంతో మరొక పుత్రుడూ ఆవిర్భవించారు.

తమ ఆశ్విక దాంపత్యం ఫలవంతం కాగానే , సూర్యుడు తన సహజరూపాన్ని ధరించాడు. ఆయనను అనుసరిస్తూ సంజ్ఞ కూడా తన బడబారూపాన్ని వీడి , పూర్వ రూపాన్ని పొందింది.

అశ్వముఖాలతో జన్మించిన కుమారులకు – ”నాసత్యుడు” అనీ , ”దస్రుడు” అనీ పేర్లు నిర్ణయించాడు సూర్యుడు. ఆ ఇద్దరూ అశ్వనీ కుమారులుగా ప్రసిద్ధులవుతారని చెప్పాడు సంజ్ఞతో.

మూడవ కుమారుడికి ”రేవంతుడు” అని నామకరణం చేశాడు సూర్యుడు. అశ్వావతార సమయంలో తమకు పుట్టిన ఆ ముగ్గురు పుత్రుల భవితవ్యం గురించి భర్తను అడిగింది. సంజ్ఞ.

“ఇప్పుడు మనకు జన్మించిన ఈ ముగ్గురూ సామాన్యులు కారు ! సద్యోగర్భాన జన్మించి యువకులయ్యారు. చూడు ! నాసత్యద్రసులు ఇద్దరూ – అశ్వనీ కుమారులుగా , దేవ వైద్యులవుతారు. అశ్వనీ దేవతలుగా ఆరాధించబడతారు !” సూర్యుడు చిరునవ్వుతో చెప్పాడు. “ఇక రేవంతుడు అశ్వసంభూతుడైన కారణంగా అశ్వ విద్యలో ప్రసిద్ధుడవుతాడు !”

“సంజ్ఞా ! నీ బిడ్డలు – వైవస్వతుడూ , యముడూ , యమీ నీ కోసం పరితపించి పోతున్నారు. మందిరానికి వెళ్దాం , రా!” సూర్యుడు మన్ననగా అడిగాడు.

సంజ్ఞ సమాధానం చెప్పకుండా చూపుల్ని క్రిందకు దించుకుంది. ఆమెలో కలుగుతున్న ఆలోచనను వ్యక్తం చేస్తున్న ”అక్షర బిందువుల్లా” సంజ్ఞ అందమైన శరీరం మీద స్వేద బిందువులు పొటమరించాయి.

సంజ్ఞ శరీరాన్ని అలంకరించిన ”చెమట పూసల్ని” సూర్యుడు చిరునవ్వుతో చూశాడు. “అర్థమైంది ! నీ కోసం , మన దాంపత్యం కోసం నా దేహం విరజిమ్మే వెల్తురునూ , వేడిమినీ తగ్గించుకొంటాను !”

“స్వామీ…!” సంజ్ఞ ఆనందంగా అంది. “అది… అది…నా భాగ్యం…”

సంజ్ఞ భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది. “స్వామీ… మన బిడ్డలు… అశ్వనీ కుమారులూ , రేవంతుడూ… మనతో మందిరానికి వస్తారు కదా !”

సూర్యుడు తల అడ్డంగా ఊపాడు. “నీ అశ్వనీ కుమారులు దేవ వైద్యులు. రేవంతుడు దేవలోక అశ్విక నిపుణుడు ! ముగ్గురూ దేవలోకంలో ఇంద్రుని కొలువులో వెలుగొందాల్సినవారు !”

“జననీ జనకులారా ! మమ్మల్ని దేవలోకానికి ఎవరు తీసుకువెళ్తారు ?” రేవంతుడు ప్రశ్నించాడు. అశ్వనీ కుమారులు తమ అశ్వముఖాలను ఆడించారు. ”అవును” అన్నట్టుగా.

“అదిగో… ఆకాశమార్గాన… వస్తున్నారు చూడండి !… నారదమహర్షి !” అన్నాడు. సూర్యుడు నవ్వుతూ.

“నారాయణ !” అంటూ వాళ్ళ వద్ద సిద్ధమయ్యాడు నారదుడు. “ఈ ప్రశాంత ప్రదేశంలో సద్యోదాతులైన అశ్వనీ కుమారులను , రేవంత కుమారుడినీ ఇంద్ర సభకు జేర్చమని , బ్రహ్మదేవులు నన్ను పంపించారు !”

అశ్వనీ కుమారులూ , రేవంతుడూ తల్లిదండ్రులకు నమస్కరించారు. సంజ్ఞ పుత్రుల్ని అక్కున జేర్చుకుని , నుదుర్ల మీద చుంబించింది. సూర్యుడు ముగ్గుర్నీ కౌగిలించుకుని , దీవించాడు.

“అశ్వినులారా ! మీ వైద్యం దేవతలకే కాదు, మానవులకూ ఉపయోగపడాలి !” సూర్యుడు అన్నాడు.

“తండ్రిగారి ఆశయాన్ని తలదాల్చి , కర్తవ్యపాలన చేస్తాం !” అన్నాడు నాసత్యుడు.

“అమ్మా…సంజ్ఞా ! నీ రూపం ధరించి , నీ ”ఛాయ” అక్కడ ఆడిన నాటకం , అశ్వకామిని రూపంలో ఇక్కడ నువ్వు సాగించిన సాధనా ఫలవంతమయ్యాయి ! అక్కడ శనైశ్చరుడు జన్మించాడు ! ఇక్కడ దేవవైద్యులూ , రేవంతుడూ జన్మించారు !” నారదుడు మెప్పుగా అన్నాడు..

సూర్యుడు నారదుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు. “అయితే , నారదమహర్షీ ! ఇక్కడ ఈ సంఘటనలకు సంకల్పం…”.

“అక్కడ జరిగింది, సూర్యాదిత్యా !” చేత్తో పైకి చూపుతూ మాట పూర్తి చేశాడు నారదుడు.

నారదుడి వెంట వెళ్తున్న ముగ్గురు కుమారులనూ అశ్రునయనాలతో చూస్తూ ఉండిపోయింది సంజ్ఞ. సూర్యుడు ఆమెను సమీపించాడు. ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు. సంజ్ఞ తలతిప్పి , ఆయన ముఖంలోకి చూసింది.

“వైవస్వతుడూ , యముడూ , యమీ నీకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు, మందిరంలో !” సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.

సంజ్ఞ బుగ్గల మీదికి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ , భర్త వైపు చిరునవ్వుతో చూసింది.

“అమ్మా !” యమీ , యముడూ , వైవస్వతుడూ సంజ్ఞను చూడగానే ఏకకంఠంతో అరిచారు. తన వైపు దూసుకువచ్చిన ముగ్గుర్నీ ఒకేసారి తన చేతుల్లో బంధించలేక సతమతమవుతూ , వాళ్ళ శిరస్సుల మీద ముద్దులు కురిపించింది సంజ్ఞ..

సూర్యుడు ఆనందంగా తల్లీబిడ్డల్ని చూస్తూ ఉండిపోయాడు. ద్వారం వద్ద శబ్దమైంది. అందరూ చూశారు. శని , సావర్జీ , తపతీ వస్తున్నారు. ముగ్గురూ ఆగి , ఆశ్చర్యంగా సంజ్ఞ వైపు చూస్తూ ఉండిపోయారు.

“అమ్మా…” తపతి అనుమానిస్తూ అంది.

“రా తల్లీ ! రండి , నాయనా ! నేను మీ అమ్మనే !” సంజ్ఞ హాయిగొలిపేలా నవ్వుతూ అంది.

ముగ్గురూ సంజ్ఞ దగ్గరగా వచ్చారు. వైవస్వతుడు , యముడూ , యమీ పక్కకు జరిగారు. శనీ , సావర్టీ , తపతీ సంజ్ఞను సమీపించారు. ముగ్గుర్నీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సంజ్ఞ.

“అమ్మా…ఆ అమ్మ ?” శని సందేహిస్తూ లోపలి కక్ష్య వైపు చూపించాడు.

“ఛాయా !” సంజ్ఞ బిగ్గరగా పిలిచింది. ఛాయ ద్వారం దాటి , ఈవలకు వచ్చి , తటపటాయిస్తూ చూసింది. ఆమె ముఖం మీద అపరాధ భావన నాట్యం చేస్తోంది.

“ఇలా రా , ఛాయా !” సంజ్ఞ స్వరంలో ఆజ్ఞ ధ్వనించింది.

ఛాయ మెల్లగా నీడలా కదుల్తూ , ఆమె దగ్గరగా వచ్చింది.

“ఛాయా ! నీ కర్తవ్యం ముగిసింది. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మరిచిపోయి , నాలో నా ఛాయలో కలిసిపోవాలి !” సంజ్ఞ గంభీరంగా అంది.

ఛాయ మంత్ర ముగ్ధలా మౌనంగా చూసింది. “రా , ఛాయా ! నాలో కలిసిపో !” సంజ్ఞ అంది.

సూర్యుడూ , ఆరుమంది పిల్లలూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఛాయ నెమ్మదిగా సంజ్ఞ వైపు నడిచింది. సమీపించిన క్షణంలో సంజ్ఞలో కలిసిపోయినట్టనిపించింది. సువర్ణకుడ్యం మీద సంజ్ఞ నీడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

అందరూ సంజ్ఞ వైపు ఆశ్చర్యంగా చూశారు. సంజ్ఞ అందర్నీ కలియజూసింది. “ఈ సంజ్ఞా , ఆ ఛాయా ఇద్దరూ నేనే ! మీరు ఆరుగురూ నా బిడ్డలే ఇకనుంచీ !” అంది నవ్వుతూ.

అందరి ముఖాలూ నవ్వుతో వికసించాయి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment