కేతుగ్రహ జననం రెండవ భాగము
కశ్యప పత్ని దనూదేవి ఆతృతగా ఆశ్రమంలోకి వచ్చింది. ఆమె చేతుల్లో ఒక చిన్నారి శిశువున్నాడు.
“స్వామీ ! స్వామీ !” అంటూ భర్తను పిలిచిందామె.
“ఏమిటి దనూ !” అంటూ వచ్చాడు కశ్యపుడు.
“చూశారా ! చూశారా ! బాలుడు ! ఆశ్రమం వెనక తోటలోని ముళ్ళ పొద నీడలో హాయిగా ఆడుకుంటూ , పరవశంగా ఉన్నాడు !”.
“ఎవరి బిడ్డడో …” కశ్యపుడు బాలుడిని చూస్తూ అన్నాడు.
“నాకు దొరికాడు కాబట్టి నా బిడ్డడే ! చూడండి… ఆ ముఖమూ , ఆ కళ్ళూ… అన్నీ నా బిడ్డలకు లాగానే ఉన్నాయి !” దనూదేవి ఉత్సాహంగా అంది. “వీడు నా బిడ్డడే ! ఏమిటలా చూస్తున్నారు ! నా బిడ్డడే ! నేను పెంచుకుంటాను !”
“సరే ! ఎవరు కాదన్నారు ! అంతా దేవేచ్ఛ కదా !” కశ్యపుడు చిరునవ్వుతో అన్నాడు.
” పిల్లవాడికి… పేరు ?” దనూ దేవి ఆవేశంగా అడిగింది.
“చక్కటి పేరు పెట్టండి !”
“పేరు…ఏ పేరు పెట్టమంటావు ?” కశ్యపుడు ఆలోచిస్తూ అన్నాడు.
“కేతువు అని సృష్టికర్త బ్రహ్మదేవులు పెట్టేశారుగా !” లోపలికి వస్తూ అన్నాడు. నారదుడు.
“నారద మునీంద్రా !” కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు.
“నారాయణ ! ఆ విషయం చేరవేయడానికి వచ్చాను. బాలుడికి నామకరణం చేశాక , మీకు అందేలా చూశారు మా జనకులు. మీ బిడ్డగా స్వీకరించి , పోషించి , ప్రయోజకుణ్ణి చేయమన్నారు !”
“అలాగా ! మహా భాగ్యం !” కశ్యపుడు చేతులు జోడించాడు.
“అందుకేనేమో వీణ్ణి చూడగానే నా బిడ్డడే అనిపించి , స్తన్యం కురిసింది!” అంటూ లోపలకి వెళ్ళింది దనూదేవి ఉత్సాహంగా.
రోజులు కాలాన్ని ఖండిస్తూ తమ గణన కార్యాన్ని కొనసాగిస్తున్నాయి. దనూదేవి పెంపుడు కొడుకు కేతువూ , సింహిక కుమారుడు రాహువు ఒకరిని వదిలి మరొకరు. ఉండలేనట్లు మసులుతున్నారు.
రాహుకేతువుల సాహచర్యం నేల మీద పాకే వయస్సులోనే మొగ్గ తొడిగింది ! ఇద్దరూ జంటగా పాకడం ప్రారంభించారు. ఇద్దరూ ఒకరిపక్కనొకరు దోగాడసాగారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని తప్పటడుగులు వేశారు.
కశ్యప మహర్షి రాహువు కేతువులకు విద్యాభ్యాసం ఆరంభించారు. విద్యార్జనలో కూడా అంతే ! ఒకరికి చెప్తే చాలు – మరొకరు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన దనూదేవికి సందేహం కలిగించింది. ఒకనాడు భర్తతో ఇలా అంది.
“స్వామీ ! కన్నబిడ్డతో సమానంగా కేతువుకి పాలిచ్చి పెంచాను కద ! బాలుడు నా బిడ్డలతో కలిసి మెలిసి ఉండడానికి మారుగా , ఆ సింహిక బిడ్డడితో కలిసిపోయాడెందుకు ?”
“వాడి చిన్ని మనసులో ఏముందో , ఎవరికి తెలుసు ! కేతువు ఒక్కడే కాదు సుమా , రాహువుని చూడు ! వాడు కూడా కేతువు నీడలా ఉంటున్నాడు ! ఇద్దరి మధ్యా మనకు అర్ధం కాని అజ్ఞాత సంబంధం ఏదైనా ఉందేమో !” అన్నాడు కశ్యపుడు.
దనూదేవి సాలోచనగా తల పంకించింది.
“రాహుకేతువులిద్దరూ అన్యోన్యంగా పెరగాలనీ , రాణించాలనీ బ్రహ్మదేవుల సంకల్పం అయి ఉండవచ్చు. ఎందరో మానస పుత్రులూ , వారి సంతతులూ ఉండగా ఈ కశ్యపుడికే ఆ అవకాశం ఎందుకు వరించింది ? కేతువు మన పోషణలో పెరగాలన్న లక్ష్యం కన్నా , రాహుతో కలిసి మమేకంగా పెరగాలన్న సంకల్పమే అందుకు కారణమనిపిస్తోంది సుమా !” కశ్యప మహర్షి విశ్లేషించాడు.
“ఏది ఏమైనా అదంతా నా అదృష్టమే !” దనూదేవి సగర్వంగా అంది.
రాహుకేతువులు యువకులయ్యారు. రాహువు సింహిదేవి అనే స్త్రీని , కేతువు చిత్రలేఖనూ పత్నులుగా స్వీకరించారు.
కాలక్రమాన సింహిదేవీ రాహు దంపతులకు ”మేఘహాసుడు” అనే కుమారుడు. జన్మించాడు.
రాహుకేతువుల సహోదరానుబంధం వాళ్ళతో పాటే వృద్ధి చెంది , వికసిస్తూనే ఉంది.
నిర్వికల్పానంద నవగ్రహాల జన్మవృత్తాంతాల కథనం ముగించి ఇలా అన్నాడు. శిష్యులతో.
“ఇప్పటి దాకా మనం నవగ్రహాల పుట్టుకల గురించి తెలుసుకున్నాం. అయితే , మన నిత్య వ్యవహారంలో , జాతక గణనంలో పేర్కొంటున్న ‘సూర్య , చంద్ర , కుజ , బుధ , గురు , శుక్ర , శని , రాహు , కేతు’ అనే క్రమంలో కాకుండా వాళ్ళ ఆవిర్భావ క్రమంలో శ్రవణం చేశాం
“నవగ్రహాల ఆవిర్భావాలలో లాగే , వాళ్ళ చరిత్రలలో కూడా ఆసక్తిని రేకెత్తించే అద్భుత సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనల సమాహారంగా , ఆ గ్రహదేవతల చరిత్రలను సూర్యుడి నుండి కేతువు దాకా , మనం స్మరించే వరస క్రమంలో శ్రవణం చేద్దాం.”
“ముందుగా సూర్య గ్రహ చరిత్ర ఒక్క సారి గుర్తుచేసుకుంటే , శివానందా ! సూర్యుడి తల్లిదండ్రులు ఎవరో గుర్తున్నారా ?” అంటూ అడిగాడు చిరునవ్వుతో నిర్వికల్పానంద.
“అదితీ , కశ్యపులు గురువుగారూ !” శివానందుడు సమాధానం చెప్పాడు.
“చిదానందా , నువ్వు చెప్పు , సూర్యపత్ని ఎవరు ?” నిర్నికల్పానంద అడిగాడు.
“విశ్మకర్మ పుత్రిక – సంజ్ఞ గురువుగారూ…” చిదానందుడు అన్నాడు. ”సంజ్ఞ తన నీడను ”ఛాయ” అనే పేరుతో తన స్థానంలో సూర్యుడి భార్యగా నియమించింది !”
“బాగుంది !” నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. “ఇప్పుడు సంజ్ఞ బిడ్డలు ఎవరో , ఛాయ బిడ్డలు ఎవరో మన శివానందుడూ , విమలనందుడూ చెప్తారు !”
“వైవస్వతుడు , యముడు , యమి – సంజ్ఞ సంతానం , గురువుగారూ !” శివానందుడు గుర్తు చేసుకుంటూ అన్నాడు.
“ఛాయ సంతతి శనైశ్చరుడు , సావర్ణి , తపతి !” విమలానందుడు చెప్పాడు.
“గుర్తుంచుకున్నారు. సంతోషం !” నిర్వికల్పానంద అన్నాడు. సంజ్ఞకూ , ఛాయకూ జన్మించిన సూర్యుని సంతానం ఆరుగురూ ఛాయ పోషణలో పెరుగుతున్నారనీ , సంజ్ఞ బిడ్డల పట్ల ఛాయ ప్రేమ తగ్గుముఖం పట్టిందనీ చెప్పుకున్నాం కదా ! ఇక వినండి ! ఒక రోజు ఏమైందంటే…
ఇప్పటి వరకు నవగ్రహల జననం గురించి చదువుకున్నాము. ఇక నవగ్రహల చరిత్ర మార్గశీర్ష మాసంలో చెప్పుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹