Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – యాబై నాల్గవ అధ్యాయం

శనిగ్రహ జననం ఐదవ భాగము

ఛాయ అడుగులో అడుగు వేసుకుంటూ , సూర్యుడి వద్దకు నడిచింది. సూర్యుడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. గర్భ భారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది. వేగాన్ని తగ్గించింది.

“గర్భం నీ దేహకాంతిని ద్విగుణీకృతం చేసింది సంజ్ఞా !” ఆమెను చూస్తూ అన్నాడు సూర్యుడు. శరీరాన్ని మెప్పుగా చూస్తూ అన్నాడు సూర్యుడు.

“మీ దగ్గరగా వచ్చానుగా , మీ కాంతి నా మీద పడి ప్రతిఫలిస్తోంది !” ఛాయ నవ్వుతూ అంది.

“నీ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ కాంతి నాదీ , నీదీ కాదు ! నీ గర్భంలోని మన పుత్రుడిది !” సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.

“నా కుమారుడు మీలాగా కమల వర్ణంలో ఉంటాడో , నాలాగా కనక వర్ణంలో ఉంటాడో చెప్పండి చూద్దాం !” అంది ఛాయ.

“కమల వర్ణం , కనక వర్ణం రెండూ కలిసిన నూతన కాంతిలో మెరిసిపోతూ ఉంటాడు !” సూర్యుడు నవ్వుతూ అన్నాడు.

“ఔను ! నాకూ అలాగే అనిపిస్తోంది !” అంది ఛాయ గర్వంగా.

అది ప్రమోదూత నామ సంవత్సరం, పుష్య మాసం, కృష్ణ పక్షం, స్వాతీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి.

ఆ సమయంలో ఛాయ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఛాయా సూర్యుల ఊహలను తల క్రిందులు చేస్తూ , నల్లటి దేహకాంతితో పుట్టాడు ఆ బాలుడు. కాటుక ముద్దలాంటి శరీరం ! గోరోచనం గుళికల్లాంటి కళ్ళు ! బలహీనంగా అవుపిస్తున్న సన్నటి ఆకారం…

అనాకారిగా , సన్నగా కనిపిస్తున్న కుమారుణ్ణి తదేకంగా చూసి , ఛాయ సూర్యుడి వైపు అర్థం కానట్టు చూసింది. సూర్యుడు ఆమె ఆలోచన అర్థమైనట్టు చిన్నగా నవ్వాడు.

“ఏమిటి దేవీ , నాలాగా ధగధగలాడే రంగులో లేడని ఆలోచిస్తున్నావా ? బాలుడు నా కుమారుడు ! అందుకే అలా నల్లగా ఉన్నాడు. నిలువు తెలుపు , నీడ నలుపు ! సహజమే కదా !!

మనవడి నామకరణ మహోత్సవానికి అదితి , కశ్యపులూ , విశ్వకర్మ దంపతులూ వచ్చారు. వాళ్లనూ , సూర్యుడినీ ఆశ్చర్యానందాలలో ముంచివేస్తూ త్రిమూర్తులూ , నారదుడు వచ్చారు.

“నీ కుమారుడు చాలా నెమ్మదిగా , అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడు. అతని సంచారం చాలా నిదానంగా ఉంటుంది. మందగమనం. అందుచేత బాలునికి అర్ధవంతమైన నామధేయం సూచిస్తున్నాను…” శ్రీమహా విష్ణువు సూర్యుడితో అన్నాడు.

“అవశ్యం ! అది మా చిన్నవాడి అదృష్టం!” అన్నాడు సూర్యుడు వినయంగా.

“నీ కుమారుని నామధేయం, “శనైశ్చరుడు’!” విష్ణువు అన్నాడు.

బాలుడికి శాస్త్ర సమ్మతంగా అదే పేరు పెట్టారు. త్రిమూర్తులు బాలకుణ్ణి దీవించారు. భవిష్యత్తులో బాలుడు నవగ్రహ దేవతలలో ప్రముఖుడవుతాడనీ , విద్యాబుద్ధులు నేర్పుతూ చక్కగా పెంచి పెద్దవాణ్ణి చేయమనీ శివుడూ , బ్రహ్మా సూర్యుడికి చెప్పారు. తన సంతతి పరంపరలో ఇద్దరు నవగ్రహాదేవతలు ఆవిర్భవించినందుకు కశ్యప ప్రజాపతి మహానంద భరితుడయ్యాడు.

శనైశ్చరుడు ఛాయ ప్రత్యేక పోషణలో పెరుగుతున్నాడు.

కాలక్రమాన ఛాయకు ద్వితీయ పుత్రుడు జన్మించాడు. తండ్రి సూర్యుడి దేహవర్ణంతో ‘సవర్ణుడు’గా జన్మించిన బాలునికి సూర్యుడు ‘సావర్ణి’ అని నామకరణం చేశాడు. ముడవ సంతానంగా ఛాయకు ఒక పుత్రిక పుట్టింది. కుమార్తెకు ‘తపతి’ అనే పేరు నిర్ణయించాడు సూర్యుడు.

సంజ్ఞ సంతానమూ , ఛాయ సంతానమూ – ఆరుగురూ ఛాయ అదుపాజ్ఞలలో పెరగసాగారు. తన బిడ్డలైన శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ క్రమంగా వృద్ధి చెందే కొద్దీ , ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల మమతానురాగాలు క్షీణించసాగాయి.

“ఇప్పుడు నవగ్రహాలలో అష్టమగ్రహమైన రాహువు జన్మగాథ చెప్తాను , సావధానంగా వినండి !” అన్నాడు శని జన్మ వృత్తాంతం ముగించిన నిర్వికల్పానంద.

“గురువుగారూ ! రాహువును ”సింహికాగర్భసంభూతుడు” అంటారు కదా ! అంటే రాహువు కశ్యప ప్రజాపతి భార్య అయిన సింహిక పుత్రుడనేనా అర్ధం ?” శివానందుడు అడిగాడు.

“ఔను ! రాహువు దక్షప్రజాపతి పుత్రికా , కశ్యప ప్రజాపతి ధర్మపత్ని అయిన సింహిక పుత్రుడే ! రాహువు జన్మ వృత్తాంతంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఏవీ లేవు. సూర్యుణ్ణి కబళించే మహాశక్తివంతమైన గ్రహంగా రూపొందిన మన రాహువు జననం సర్వసాధారణంగా జరిగింది. ఆ వృత్తాంతం తెలుసుకోవడానికి మనం కశ్యపాశ్రమానికి వెళ్ళాలి…” అంటూ కథనం కొనసాగించాడు నిర్వికల్పానంద.

రేపటి నుండి రాహుగ్రహ జననం ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment