Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నలబై ఆరవ అధ్యాయం

బుధగ్రహ జననం తొమ్మిదవ భాగము

తారా , చంద్రుడూ అరణ్యంలోకి వెళ్ళి ఉంటారనీ , తిరిగి వస్తారనీ నమ్మిన బృహస్పతి ఆశ అడియాసే అయ్యింది. నెలల పాటు శిష్యుల చేత ఆయన చేయించిన తార , చంద్రుల అన్వేషణ ఫలించలేదు.

తారా , చంద్రుడూ అంతర్ధానం కావడానికి కారణం వారిద్దరికీ ఒకరి పట్ల మరొకరికి ఉన్న వ్యామోహమేనని నిస్సంశయంగా అనిపించినప్పటికీ , ఆయన తారను విస్మరించలేకుండా ఉన్నాడు. ఏది జరిగినప్పటికీ తార తన భార్య !

తార సౌందర్య రాశి, తార బ్రహ్మదేవుడు సూచించిన భార్య – తిరిగి తనను చేరుకుంటుందన్న నమ్మకాన్నీ , చేరాలన్న ఆశనూ పెంచిపోషించుకుంటూ యాంత్రికంగా కాలం వెళ్ళదీస్తున్నాడాయన.

ఆశ్రమంలో పాఠ ప్రవచనం , ఇంద్ర సభలో మంత్రాంగం అనే విధులకు లోపం రానివ్వకుండా చూసుకుంటున్నారాయన. తార వియోగాన్నీ , ఆ వియోగం అందించిన అవమానాన్ని మౌనంగా భరిస్తున్న బృహస్పతి – ”తారాచంద్రుల అంతర్ధాన విషయం” ఇంద్రుడికి తెలియకుండా చూసుకున్నాడు.

కాలం తన నిరంతర ప్రయాణాన్ని నిరాటంకంగా సాగిస్తూ తనూ సాగిపోతోంది. జరిగిపోతున్న వాటన్నింటినీ తన విశాల గర్భంలో దాచుకుంటూ కాలం తన నిరంకుశ , నిర్దాక్షిణ్య ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.

తన వైపు దూసుకువస్తున్న తారను చంద్రుడు వొడుపుగా పట్టుకుని ఆపాడు. ఆమె ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ ఊయలను బలంగా తోశాడు.

వేగంగా , తనకు దూరంగా వెళ్ళిన తార , క్షణకాలం ఆగి , ఇనుమడించిన వేగంతో తన వైపు వస్తోంది… గాలిలో ! తార తన వైపు వస్తూనే ఉంటుంది. ఆమెను తనకు దూరంగా తీసుకు వెళ్ళాలని ఎవరు ప్రయత్నించినా , ఆ ఊయలలాగే ఆ ప్రయత్నంలో ఓడిపోవాల్సిందే ! చంద్రుడు సగర్వంగా నవ్వుకుంటూ , తన వైపు దూసుకొస్తున్న తార కోసం చేతులు చాచాడు.

తార తటాలున ఊయల పీఠం మీద నుంచి , కిందికి , అతని చేతుల్లోకి జారింది.

“ఏం ? డోలోత్సవం చాలా , తారా ?” చంద్రుడు నవ్వాడు.

“చాలు….” తార బరువుగా నిట్టూర్చింది.

“ఏం ? ఆ మాత్రానికే అలసిపోయావా ?” చంద్రుడు ఆమెను కొద్దిగా దగ్గరగా లాగి అన్నాడు.

“మనం ఈ మందిరానికి వచ్చినప్పుడున్నంత ఉబలాటం ఇప్పుడు ఈ డోలిక మీద లేదు…” తార మెల్లగా అంది.

“అలాగా ! అదేమిటి ? మోజు తీరిపోయిందా , దేవికి ?”

“కాదు…నీకు అర్థం కాలేదా ?” తార చంద్రుడి ముఖంలోకి చూస్తూ అంది.

“ఏమిటి ?” చంద్రుడు అడిగాడు. నవ్వింది. “ఒకసారి… నన్ను చూడు !”.

చంద్రుడు చూశాడు. ప్రేమతో , కోరికతో వెలిగిపోతున్న అతని కళ్ళు తార పాదాలు నుంచి తల దాకా దీపారాధన చేస్తున్నాయి.

అతని చూపులు తారకు నవ్వు తెప్పించాయి. “పిచ్చి చంద్రా ! నీకు చూడ్డం తెలీదు. విను , నేను ఊయలలో ఎందుకు మనుపట్లా ఊగలేనంటే , ఊయలలో ఊగే నీ ప్రతిరూపం నాలో – నాగర్భడోలికలో ఊగుతోంది !”.

చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు. “నిజమా ?”.

“నన్ను చూసే కళ్ళతో నువ్వు ఇక దేన్నీ చూడలేకపోతున్నావు. అయిదు మాసాలుగా మోస్తున్నాను… మన ఆనందఫలాన్ని నాలో !” తార అలసటగా చంద్రుడి వైపు వాలుతూ అంది.

” బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం ! ఆనందం ద్విముఖం !’ అని బ్రహ్మ నన్ను దీవించారు… చంద్రా ! నీతో నేను పొందుతున్నది ద్విముఖమైన ఆనందం !” అంది తార.

బృహస్పతి పూజ ముగించి , లేచి , చేతులు జోడించి ప్రార్ధన చేస్తున్నాడు.

“నారాయణ ! నారాయణ !” నారదుడి నారాయణ నామ స్మరణ బృహస్పతిని తీగలా చుట్టి వెనక్కి తిప్పింది.

“నారద మునీంద్రులకు నమస్సులు !” బృహస్పతి చేతులు జోడిస్తూ అన్నాడు.

“నారాయణ ! సతీ సమాగమ ప్రాప్తిరస్తు !” నారదుడు సందర్భశుద్ధిగా అన్నాడు.

“నారదా… !” బృహస్పతి కంఠం నివ్వెర పాటుతో బొంగురుగా ధ్వనించింది..

“ఈ నారదుడికి ఎలా తెలుసునని ఆశ్చర్యపోతున్నారా ? ఇలాంటివి తెలుసుకోవడానికే బ్రహ్మగారు నన్ను కన్నారు , మనసుతో !” నారదుడు నవ్వుతూ అన్నాడు.

“మీ శిష్యులు ఇంకా ఆ తారాచంద్రుల కోసం – పాపం – వాళ్ళు లేని ప్రదేశాల్లో గాలిస్తూనే ఉన్నారు !” నారదుడు నవ్వాడు.

“నారదా ! తారా… అదే… తార ఎక్కడుందో తెలుసా ?” చంద్రుడి ప్రస్తావన లేకుండా జాగ్రత్తగా అడిగాడు బృహస్పతి.

“నారాయణ ! తెలుసుకోకుండా మీ దర్శనానికి వస్తానా ?”

బృహస్పతి నిట్టూర్చాడు. “… ఎలా ఉంది , తార ?”

“ఇక్కడున్నప్పటి కన్నా అందంగా , ఇక్కడున్నప్పటి కన్నా ఆనందంగా ఉంది !” నారదుడు నవ్వుతూ అన్నాడు.

బృహస్పతి మౌనంగా , విచారంగా చూశాడు.

“మీ శిష్యుడు చంద్రుడు మీ అందాల తారను తన మందిరంలో ఉంచుకున్నాడు !” నారదుడు చిరునవ్వుతో అన్నాడు. “తారా చంద్రుల విలాస నిలయంగా ఉన్న ఆ చంద్ర మందిర విలాసం చెబుతాను. శిష్యుల్ని దూతలుగా అక్కడికి పంపండి !”

“రా , చంద్రా!” ఒంటరిగా కూర్చున్న బృహస్పతి ఉలిక్కిపడి , ఆగ్రహంతో చెట్టు మీదికి చూశాడు. చిలక గుబురులో సర్దుకుంటూ , తననే చూస్తోంది. ఆ పాపిష్ఠి చిలక అనుకరిస్తోంది తార పిలుపు అని ఆయనకు తెలుసు. కోపాగ్నిలో ఆ చిలకను మాడ్చి మసి చేసివేయాలనిపిస్తున్న ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ , చెట్టు కొమ్మల్నే చూస్తూ ఉండిపోయా డాయన. పువ్వులన్నీ పిందెలుగా మారిపోయాయి. కాలం కరిగిపోతోంది. దానితో పాటు తార తిరిగి వస్తుందన్న ఆశ తరిగిపోతోంది తనలో.

నారద మహర్షి సూచన మేరకు శిష్యుల్ని పంపించాడు తను. తారాచంద్రులిద్దరూ. ఆ కుర్రవాళ్ళను దారుణంగా అవమానించి , బెదిరించి పంపి వేశారు.

చేసేది లేక , స్వయంగా తనే వెళ్ళాడు. మందిరం ముందు పడిగాపులు కాశాడు. చాలా సేపటికి , మందిరంలోంచి వెలికి వచ్చిన చంద్రుడూ , తార – తనను పురుగులా. చూశారు. “గురుతల్ప గమనం పాపం !” అన్నాడు తాను చంద్రుడితో.

“అందుకే కదా దర్భలతో అల్లిన ఆ తల్పాన్ని వదిలి – ఇక్కడున్న హంసతూలికా తల్పాన్ని చేరాం !” అన్నాడు చంద్రుడు.

బృహస్పతి బరువుగా నిట్టూర్చాడు. తనను హీనాతిహీనంగా చిన్నబుచ్చుతూ , తనను తిరస్కరిస్తూ తార పలికిన పలుకులు గుర్తుచేసుకోవడం ఇష్టం లేక నిస్సహాయంగా తల విదిల్చాడు బృహస్పతి.

“గురుదేవులకు ప్రణామం !” బృహస్పతి ఆలోచనల లోంచి బయటపడి చూశాడు. ఎదురుగా ఇంద్రుడు !

“మహేంద్రా !”

“మీరు రాలేదు ! నేనే వచ్చాను ! కొంత కాలంగా మీరు సభకు ఎందుకు క్రమంగా రాలేకపోతున్నారో తెలుసుకునే వచ్చాను…” ఇంద్రుడు బృహస్పతితో బాటు ఆశ్రమం వైపు నడుస్తూ అన్నాడు.

“దేవరాజా !”

“ఈ దేవరాజు తమ కోసం ఏ సాహసమైనా చేయగలడన్న సత్యాన్ని మీరు విస్మరించారు. ఆ చంద్రుడి దురాగతాన్ని దాచి ఉంచుకున్నారు. ఆ తారను మరిచిపొండి. బ్రహ్మదేవులను మళ్ళీ ఆశ్రయించి , మరొక ఉత్తమ కళత్రం మీకు లభించేలా చేస్తాను !” ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.

“మహేంద్రా…!”

“ఔను గురుదేవా ! ఆ తార పరపురుషుని పరిష్వంగంతో పతిత అయిపోయింది. ఆమె మీకు తగదు !”

బృహస్పతి ఇంద్రుని వైపు నిదానించి చూశాడు. “దేవరాజా ! ఈ సందర్భంలో నీకొక ధర్మ సూక్ష్మం చెబుతాను. స్త్రీకి పర పురుష సంగమ దోషం ఋతుస్రావంతో పోతుంది. బహిష్టు అలాంటి స్త్రీని పవిత్రం చేస్తుంది !”

ఇంద్రుడు కొత్త పాఠం వింటున్నట్టు చూస్తూ వుండిపోయాడు.

“మీరు సెలవిచ్చిన ధర్మ సూక్ష్మం మాకు శిరోధార్యం గురుదేవా ! మీ ధర్మపత్ని తారాదేవిని మీ పాదాల ముందు గురుదక్షిణగా సమర్పించుకునే బాధ్యత నాది !”

“మహేంద్రా !” బృహస్పతి ఆనందంగా అన్నాడు..

“అందుకు అవసరమైతే ఆ చంద్రుడి మీద యుద్ధం ప్రకటిస్తాను ! ఆశీర్వదించండి !” ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.

“విజయోస్తు , దేవేంద్రా ! విజయోస్తు !” బృహస్పతి ఉత్సాహంగా దీవించాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment