పురాణ ప్రారంభం నాల్గవ భాగము
“కుమారా ! తపస్సు చేయి ! నీ కర్తవ్య నిర్వహణా విధానం నీకు ధ్యాన గోచరమవుతుంది ! నువ్వు సృష్టించే జీవుల భవితవ్యాలను వాళ్ళ ఫాల ఫలకాల మీద లిఖించే అధికారం నీదే ! నీ సృష్టి విన్యాసంలో మానవజాతికి మహోపకారం జరగాల్సి ఉంది. జ్యోతిర్మండలాలలో సూక్ష్మరూపాలలో నెలకొని వున్న నవగ్రహ దేవతలు సశరీరంగా ఆవిర్భవించాలి. ప్రాణుల జీవన విధానాన్ని నిర్దేశించే ఆ నవగ్రహాలను ఆరాధిస్తూ ప్రసన్నం చేసుకుని నరులు సుఖ శాంతులతో జీవించాలి.”
సృష్టికర్త కళ్ళు తామరరేకుల్లా విచ్చుకున్నాయి. ఆయన చూపులు చుట్టూ తిరిగాయి. ఆశ్చర్యం ! లోకాలు , సముద్రాలు , పర్వతాలు , అరణ్యాలు , ఉరకలు పెడుతున్న నదులు ! విరాట్ పురుషుని సంకల్పం సాకారమై సాక్షాత్కరిస్తోంది. పరమాత్మ ప్రథమాదేశం ఆయనకు గుర్తుకు వచ్చింది. మానస పుత్రులు… సంకల్ప సృష్టి !
బ్రహ్మ అరమోడ్పు కనులతో సంకల్పించాడు.
ఆయన సంకల్పస్థానం నుండి నలుగురు పుత్రులు ఆవిర్భవించారు. తనవైపు ఆశ్చర్యంగా చూస్తున్న తన కుమారులతో బ్రహ్మ ఇలా అన్నాడు. “నేను సృష్టికర్త అయిన బ్రహ్మను. నా మనో సంకల్పంతో మిమ్మల్ని సృష్టించాను. మీరు నా మానసపుత్రులు ! మీ నలుగురికీ నామ నిర్దేశం చేస్తాను !”.
అంటూ బ్రహ్మ ఒక్కొక్కర్నీ నిర్దేశిస్తూ – ‘సనకుడు’ , ‘సనందుడు’ , ‘సనత్ సుజాతుడు’ , ‘సనత్ కుమారుడు’ – అనే పేర్లు నిర్ణయించాడు. సనకాది మానస పుత్రులు ఆయనకు నమస్కరించారు.
“నాయనలారా ! నా జనకపాదులైన శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం జీవరాశి సృష్టి క్రమంలో ఓం ప్రథమంగా మిమ్మల్ని ఆవిర్భవింప జేశాను. సంతానోత్పత్తికి క్షేత్రాలైన స్త్రీమూర్తులను కూడా సృష్టి చేస్తాను. ఆ స్త్రీ మూర్తులలో తగినవారిని స్వీకరించి, సంతానోత్పత్తి చేయండి !”
సనకుడూ , సనందుడూ , సనత్కుమారుడూ , సనత్ సుజాతుడూ నలుగురూ ఒకేసారి తలలు అడ్డంగా వూపారు.
“మేము శుద్ధ సత్వ స్వరూపులం !” అన్నాడు సనకుడు.
“మేం స్వీకరించేదీ , దానం చేసేదీ కేవలం జ్ఞానమే !” సనందుడు అన్నాడు.
“సంతానోత్పత్తి మా అభిమతం కాదు !” అన్నాడు అందుకుంటూ సనత్కుమారుడు.
“ఔను ! మా అభిమతం , ఆశయం కేవలం జ్ఞానయజ్ఞం !” అన్నాడు సనత్ సుజాతుడు.
బ్రహ్మకళ్ళు పెద్దగాచేసి చూశాడు. “మీరు పసిపాపలు ! ఈ వయసులో జ్ఞానార్జనా ? నా సంకల్పాన్ని అనుసరిస్తూ ఎదగండి , పెరిగి యువకులై తగిన పత్నులను…” “సృష్టికర్తా ! మేం శాశ్వతంగా ఇదేప్రాయంతో , ఇవే శరీరాలతో బాల బ్రహ్మచారులుగా లోక సంచారం చేస్తూ జ్ఞానయాత్ర సాగిస్తాం. మన్నించండి !” సనకుడు నిష్కర్షగా అన్నాడు.
ఆశ్చర్యంగా చూస్తున్న బ్రహ్మకు నమస్కారం చేసి , నలుగురూ వెనుదిరిగి వెళ్తున్నారు.
తన ప్రయత్నానికీ , ఆదేశానికీ ఆదిలోనే అంతరాయం జరిగినందుకు బ్రహ్మ నివ్వెరపోయాడు. ఆలోచనలో పడ్డాడు. పరబ్రహ్మ అయిన శ్రీహరి సంకల్పం ఎలా వుంటే అలాగే జరుగుతుందన్న ఓదార్పు ఆయనలో కలిగింది. తన మాట పాటించి , ప్రజోత్పత్తి చేసే పరిణతి కలిగిన మానస పుత్రుల్ని తాను సృష్టించాలి.
ఆలోచన విరమించి , బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు. ఆయన హృదయంలో ప్రణవం ప్రతిధ్వనిస్తోంది. ఆయన మానసంలో ఏదో సంకల్పం రూపుదిద్దుకుంటోంది. భ్రూమధ్య భాగాన్ని చూపుడు వేలితో స్పృశించి , నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
ఆయన ఎదురుగా , ఒకరి తరువాత ఒకరుగా తొమ్మండుగురు మానసపుత్రులు. ఆవిర్భవించారు. అందరూ తెల్లటి వస్త్రాలు ధరించి వున్నారు. పాతికేళ్ళ వయసుతో ఆవిర్భవించిన తన మానస పుత్రుల్ని బ్రహ్మ ఆనందంగా చూశాడు. “ఆర్యా…! మీరెవరు ? మేమెవరు ?” మానస పుత్రులు అడిగారు.
శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠపుత్రుడూ , సృష్టిలో ఆదిజుడూ , సృష్టికర్త అయిన తన పేరు బ్రహ్మ అనీ , వాళ్ళు తన మానస పుత్రులనీ వివరించిన బ్రహ్మ – వాళ్ళకు అత్రి , మరీచి , భృగువు , పులస్త్యుడు , పులహుడు , క్రతువు , కర్దముడు , అంగిరసుడు , వసిష్ఠుడు అనే నామధేయాలు నిర్ణయించాడు.
“సంకల్ప సంభవులారా ! విశ్వసృష్టి విన్యాసాన్ని ప్రారంభించి , ఆ మహత్కార్య నిర్వాహకులుగా మిమ్మల్ని సృష్టించాను. బ్రహ్మ మానసపుత్రులుగా ప్రఖ్యాతులయ్యే మీ నుండి దేవ , గంధర్వ , కిన్నర , కింపురుష , గరుడ , రాక్షసాది వివిధ ప్రాణుల ఉత్పత్తి జరగాల్సి వుంది. మీ నివాసానికీ , జీవన వికాసానికీ అవసరమైన లోకాలూ , ఆ లోకాలలో సకల సదుపాయాలూ , అన్నీ సిద్ధంగా వున్నాయి. సకాలంలో మీకు పత్నులు లభిస్తారు.”
“పత్నులా ?!” అత్రి ఆశ్చర్యంగా అన్నాడు. “పత్నులంటే ఎవరు తండ్రీ !” మరీచి అడిగాడు.
“పత్నులంటే పురుషుడికి తోడుగా , జోడుగా వుండే స్త్రీ మూర్తులు” బ్రహ్మ వివరిస్తున్నాడు.
భృగువు ప్రశ్న ఆయనకు అడ్డు తగిలింది. “ఆ స్త్రీ మూర్తులు అవసరమా జనకా?”
“అవసరమే. సంతానం కలగాలంటే ప్రతి ప్రాణికీ తోడు అవసరం. పత్నీ పరిగ్రహణం , సంతాన సాఫల్యం , దాంపత్య జీవనం మొదలైనవన్నీ సృష్టి రహస్యాలు. క్రమానుగతంగా అవన్నీ మీకు సహజంగా అవగాహనవుతాయి” బ్రహ్మ ఓపికగా వివరించాడు.
మానసపుత్రులు మౌనంగా వింటున్నారు. బ్రహ్మ వాళ్ళందర్నీ ఒకసారి కలియజూశాడు. “మీ ద్వారా , మీ సంతతి ద్వారా యీ జగత్తులో ఒక మహత్తర కార్యం జరుగుతుంది. ఇది సత్య సంకల్పుడైన నా తండ్రి విష్ణు దేవుడి అనుశాసనం.”
“ఆ మహత్కార్యమేమిటో చెప్పండి” కర్దముడు కుతూహలంతో అడిగాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹