గురుగ్రహ జననం మూడవ భాగము
“ఆ సుముహూర్తాన్ని – మాకు కూడా పితృసమానులైన అంగిరస మహర్షులు నిర్ణయిస్తారు !” ఇంద్రుడు సవినయంగా అన్నాడు.
అంగిరసుడు నిర్ణయించిన శుభముహూర్తాన దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు. అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకు బృహస్పతి విద్యాబోధన ప్రారంభమైంది. ఆశ్రమంలో వాసం చేస్తూ అవసరమైనప్పుడల్లా దేవసభకు వెళ్లి అక్కడ తన విధుల్ని నిర్వహిస్తున్నాడు బృహస్పతి.
ఒకనాడు ఇంద్రుడు బృహస్పతిని వెంటబెట్టుకుని , చతుర్ముఖ బ్రహ్మ సన్నిధికి వెళ్ళాడు. బృహస్పతిని దేవతల గురువుగా బ్రహ్మకు పరిచయం చేశాడు.
“మా గురుదేవుల వివాహం సంకల్పించారు. వారి జననీజనకులు. తగిన స్త్రీ రత్నాన్ని తమరే సూచించాలి” అంటూ ఇంద్రుడు బ్రహ్మను ప్రార్ధించాడు.
బ్రహ్మ బృహస్పతిని తదేకంగా చూశాడు. “బృహస్పతి చక్కని దేహసౌందర్యం , వర్ఛస్సూ కలిగిన వాడు. అతనికి తగిన అందగత్తె లభించాలి…” అంటూ బ్రహ్మ. అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడయ్యాడు..
ఇంద్రుడూ , బృహస్పతీ , ఆశ్చర్యంగా ఆయనవైపే చూస్తూన్నారు. బ్రహ్మ రెప్పలు పైకెత్తి బృహస్పతి వైపు చూశాడు.
“తార అనే జవ్వని తగిన పెనిమిటి కోసం తపస్సు చేస్తోంది. ఆమె జగదేక సుందరి ! కాలం మీ ఇద్దర్నీ కలుపుతుంది. ఆ తారను ధర్మపత్నిగా స్వీకరించు !” బ్రహ్మ వాక్కులో అనుశాసనం ధ్వనించింది.
బ్రహ్మ హఠాత్తుగా సాక్షాత్కరించి , తార వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్వేత వర్ణ వస్త్రాలు ధరించిన తార – తెల్ల రేకుల్లో దాగిన ఎర్ర తామరలా ఉంది. తార సర్వస్వమూ పద్మమయంగా కనిపిస్తోంది బ్రహ్మ చూపులకు. ముఖం పద్మం. రెప్పలు మూసిన విశాలవిలోచనాలు పద్మ పత్రాలు. చేతులు నాజూకైన పద్మనాళాలు. అరచేతులు పద్మపత్రాలు. తార తనువల్లిపైన తామరమొగ్గలు కనిపిస్తున్నాయి. ఓహ్ ! తారది నిసర్గ సౌందర్యం ! ఎనిమిది కళ్ళతోనూ చూడాలనిపిస్తోందామెను !
“తారా…” అప్రయత్నంగా పిలిచాడు బ్రహ్మ.
బోర్లించిన అరచేతుల్లా ఉన్న విశాలమైన రెప్పలు నెమ్మదిగా స్పందిస్తూ – పైకి లేచాయి. తార విశాల నేత్రాలు ఆశ్చర్యానందాలతో బ్రహ్మ దేవుణ్ని చూశాయి. “స్వామీ…” తార చేతులు జోడించింది.
“నువ్వు తగిన వరుని కోసం తపస్సు చేస్తున్నావని మాకు తెలుసు. స్ఫురద్రూపీ , కుశాగ్రబుద్ధీ అయిన యువకుడు నీ భర్త కాబోతున్నాడు…”
“స్వామీ…!” తార కంఠంలో వీణలు పలికాయనిపించింది. నిరంతరం వాణి వీణానాదం వినే బ్రహ్మకు.
“అతని పేరు బృహస్పతి ! దేవ గురువుగా విశిష్ట పదవిలో వున్నాడు. అచిర కాలంలో బృహస్పతి నీకు తారసిల్లుతాడు. ఆ సుందరుణ్ని భర్తగా స్వీకరించు !”
“ఆజ్ఞ !” తార నమస్కరిస్తూ అంది.
“బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం. ఆనందం ద్విముఖం ! కళ్యాణమస్తు !” తారను దీవించి , మరికాసేపు ఆమె అలౌకిక సౌందర్యాన్ని వీక్షించి , బ్రహ్మ అంతర్ధాన మయ్యాడు.
తపస్సు ఫలించిన ఆనందం తార వదనం మీద దరహాస చంద్రిక రూపంలో ప్రత్యక్ష మవుతోంది. తార కూర్చున్న చోటి నుంచి లేచింది. ఎదురుగా వున్న కొలను తామర కన్నులతో తననే చూస్తూ చిన్ని చిన్ని తరంగ హస్తాలతో రమ్మని పిలుస్తున్నట్టు కనిపిస్తోంది తారకు.
యజ్ఞం ముగిశాక ”అవభృథ స్నానం” చేయడానికన్నట్టు తార పిలుస్తున్న కొలను వైపు అడుగులు వేసింది. జుత్తు ముడి విప్పుకుంటూ నెమ్మదిగా కొలనులోనికి దిగింది. కొలనులోని తేటనీరు పై పైకి వ్యాపిస్తూ తారను తనలో ఇముడ్చుకోవడం ప్రారంభించింది.
తార ఒక్కసారిగా నీటిలో మునిగింది. క్షణంలో ఆమె మొహం నీటిపైన ప్రత్యక్షమైంది. కొలనులో వున్న తామరలను వెక్కిరిస్తున్న ”ముద్దు తామరలా” ఆమె ముఖం కనిపిస్తోంది.
రోజులు గడుస్తున్నాయి. కాబోయే ప్రాణేశ్వరుడి కోసం తార తనకు తెలియకుండానే అన్వేషణ సాగిస్తోంది. అందమైన ప్రకృతిలో , ఆకర్షణీయమైన స్థలాల్లో ఆమె అదే పనిగా విహరిస్తోంది.
తనతో తారను కలిపే కాలం ఎప్పుడొస్తుందో అని లోలోపల అనుకుంటూనే వున్నాడు బృహస్పతి.
ఆశ్రమంలో శిష్యులు క్రిందటిరోజు బోధించిన వేదపాఠాన్ని వల్లె వేస్తున్నారు. అనుష్ఠానాలు తీర్చుకునేందుకు బృహస్పతి సమీపంలోని నది వైపు బయలుదేరాడు.
నదీతీరానికి చేరుకున్న బృహస్పతి , తటాలున ఆగాడు. నదిలోంచి ఎవరో స్త్రీ గట్టు వైపు అడుగులు వేస్తోంది. సచేల స్నానం చేసిన ఆమె వలువలలోంచి నీరు – వయ్యారంగా వొలికిపోతోంది. తడిసిన శ్వేతాంబరం ఆ శరీరాన్ని దాచీ , దాచకుండా చూపుతున్న తెరలా వుంది.
నీటిలో నుంచి పైకి లేవనెత్తిన బంగారుబొమ్మలా వుందామె. ఎవరు ? ఎవరామె ? నదీ కన్యా ? సముద్రంలోంచి ఎదురీదుతూ వచ్చిన మత్స్యకాంతా ? లేక సాగరకన్య ? కమ్మెచ్చులోంచి తీసిన బంగారు తీగలాంటి ఆమె శరీరం బృహస్పతి సర్వస్వాన్నీ అయస్కాంత శిల్పంలా లాగుతోంది. అసంకల్పితంగా ఆమె వైపు అడుగు వేశాడతను.
బృహస్పతి తనలో కలుగుతున్న భావావేశానికి ఆశ్చర్యపోయాడు. ఇంతవరకూ ఏ స్త్రీని తాను అలా నిర్భయంగా , నిస్సంకోచంగా , రెప్పవేయకుండా చూడలేదు. బ్రహ్మదేవుడు ఎవరో ”తార” అన్నాడు ! తార కాకుండా ఈ లావణ్యవతి అని వుంటే ?….
లేకపోతే…. ఈ లావణ్యవతే తార అయితే ? లోపల్నుంచీ తన్నుకొస్తున్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతూ బృహస్పతి ఆగాడు. ఆమె కూడా ఆగింది.
సచేలస్నానం చేసిన ఆమె తనువు కాకుండా , బలిసిన చేపల్లా స్పందిస్తున్న ఆమె కళ్ళు బృహస్పతి దృష్టిని బలంగా లాగుతున్నాయి.
బృహస్పతి పెదవులు ఆరిపోతూ కదిలాయి.
అయితే – మాటను ఆమె పెదవులు పలికాయి.
” ఆర్యా… నా పేరు తార. మీరు బృహస్పతీ కుమారులను ఎరుగుదురా ?” తార ! బృహస్పతి గుండెగూటిలో పావురంలా కొట్టుకుంది. మౌనంగా , తెలుసన్నట్టు తల పంకించాడు.
“వారు ఎక్కడున్నారో చెప్పండి !” తార కంఠంలో కోయిల దాగి వుందేమో అనిపించింది బృహస్పతికి.
“ఇక్కడే… నీ సన్నిధిలో…”
“మీరా ?!” ఆశ్చర్యానందాలు తార కంఠంలో జంట స్వరాల్లా పలికాయి.
“తారా !” అన్నాడు బృహస్పతి ఆమె చేతిని పట్టుకుంటూ.
శ్రద్ధా అంగిరసులకు తార ఎంతగానో నచ్చింది. తారను తనంత తాను పరిగ్రహించకుండా , తమ అనుమతికోసం ఆమెతో బాటు వచ్చిన బృహస్పతిని చూసి అంగిరసుడూ , శ్రద్ధా సంతోషపడిపోయారు.
బృహస్పతీ తారల వివాహం నిశ్చయమైంది. ఇంద్రాది దేవతలూ , నారదుడూ , మానస పుత్రులూ వివాహానికి విచ్చేశారు. దేవేంద్రుడి ఆధ్వర్యంలో బృహస్పతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
శ్రద్ధా , అంగిరసుడూ – తారకూ , బృహస్పతికీ వేర్వేరుగా గృహస్థ ధర్మాలూ , దాంపత్య సూత్రాలూ బోధించారు. దాంపత్య యాత్ర నిరాఘాటంగా సాగించమనీ , వంశాన్ని సత్ సంతానంతో అభివృద్ధి చేయమని ఇద్దర్నీ దీవించి పంపించారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹