Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఏడవ భాగము

చంద్రగ్రహ జననం చివరి భాగము

“గురువుగారూ ! చంద్రుడి జననం గురించి చక్కగా చెప్పారు. పతివ్రత అయిన శీలవతి జీవితం బాగుపడింది. అనసూయకు సంతానం కలిగింది. ఆ రెండు మార్పులకు మూలం మాండవ్య మహర్షి శాపం ! శూలానికి గుచ్చబడిన ఆ మాండవ్య మహర్షి ఏమయ్యాడో మీరు చెప్పడం మరిచిపోయారు !” చిదానందుడు గురువు నిర్వికల్పానందతో అన్నాడు.

నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. “మరిచిపోలేదు నాయనా ! మనం శ్రవణం చేస్తున్న నవగ్రహ చరిత్రతో ఆ మహర్షికి అనుబంధం అంతమాత్రమే ! అంచేత చెప్పకుండా దాటవేశాను.”

“ఆయన గురించి తెలుసుకోవాలని ఉత్కంఠగా వుంది , గురువుగారూ !” విమలానందుడు అన్నాడు.

“సరే. క్లుప్తంగా చెప్తాను. ”శూలప్రోతం” శిక్ష అనుభవిస్తున్న మాండవ్యుడు నిరపరాధి అని తెలుసుకున్న రాజు , ఆయనను శూలం నుండి కిందకు దింపించాడు. అయితే కంఠం దాకా పోయిన ఆ శూలం లాగితే రాలేదు. పదునుగా ఉన్న అగ్రభాగం ఆయన శరీరంలోని కంఠభాగంలో విరిగి , అలాగే వుండిపోయింది. అప్పట్నుంచీ ఆయన ‘’ఆణిమాండవ్యుడు’’గా ప్రసిద్ధి చెందాడు. మరొక విశేషమేమంటే – ఆ మాండవ్య మహర్షి శాపం వల్లే యమధర్మరాజు ద్వాపరయుగంలో భూలోకంలో ”విదురుడు”గా జన్మించాడు !” అంటూ ముగించాడు నిర్వికల్పానంద.

“గురువుగారూ… ఇప్పుడు కుజగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తారా ?” సదానందుడు అడిగాడు.

“కుజుడు ఎవరికి జన్మించాడు. గురువు గారూ ?” శివానందుడు అడిగాడు

నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. “నవగ్రహాల గురించి ఆలకించాలని మీరంతా చాలా ఆత్రుతగా వున్నారు. ఇప్పుడు , ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతున్నట్టే – కుజుడి జననం గురించి చర్చ సత్యలోకంలోనూ జరిగింది. సరస్వతీ బ్రహ్మలు పద్మాసనాల మీద కూర్చుని వున్నారు. బ్రహ్మగారి మానసపుత్రుడూ , విశ్వవార్తాహరుడూ అయిన నారదుడు. చేరుకుని , తన జననీ జనకులకు నమస్కరించాడు…” అంటూ కథనం ప్రారంభించాడు.

“కావాలంటే మన నారదుణ్ని అడగండి !” అంది సరస్వతి చిరునవ్వు నవ్వుతూ. “ఏమిటి జననీ ?” నారదుడు కుతూహలాన్ని అణచుకోకుండా అడిగాడు.

“అది కాదు , నారదా ! మీ జనకుల అంశ అనసూయ కడుపు పంటగా చంద్రుడు జన్మించాడు కదా ! ఈ బ్రహ్మదేవుల కన్నా , ఆ బాలుడే అందంగా ఉన్నాడు అన్నాను. నేను కాదంటున్నారు ప్రాణేశ్వరులు!” సరస్వతి నవ్వుతూ అంది.

“పసిగుడ్డుతో మాకు పోలికా !” బ్రహ్మ నవ్వు దాచుకుంటూ అన్నాడు. “నువ్వు చెప్పు నారదా… ఈయనగారు అందంగా ఉన్నారా , ఆ బాలుడు అందంగా ఉన్నాడా ?” సరస్వతి బ్రహ్మను వాలుగా చూస్తూ నారదుణ్ణి అడిగింది.

“నారాయణ ! అమ్మ ముందు అసత్యం పలకరాదు ! చంద్రుడే అందగాడు !” అంటూ నారదుడు ఓరకంటితో బ్రహ్మ ముఖాలను పరిశీలించాడు.

బ్రహ్మ చిరునవ్వులు కురిపిస్తున్నాడు. “ఆ మాత్రం మాకు తెలియదా ఏమిటి ? చంద్రుడు అందచందాలలో అందరినీ తలదన్నే విధంగా ఉండాలని అతని జననానికి పూర్వమే మేము సంకల్పించాం కదా !”

“సత్యలోక ప్రభువుల నోట సత్యం పలికించడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో చూశావా , నారదా !” సరస్వతి నవ్వుతూ అంది. నారదుడూ , బ్రహ్మ శృతి కలిపారు. “నారదా ! బాలచంద్రుడు ఎలా ఉన్నాడు ?” సరస్వతి కుతూహలంగా అడిగింది. “ఇంకా అనసూయ స్తన్యం త్రాగుతూనే ఉన్నాడా ?”

“నారాయణ ! మాతా… మీరు కాలగణనను నిర్లక్ష్యం చేసినట్టున్నారు. మన చంద్రుడిప్పుడు పాలు తాగే పసివాడు కాడు. అరణ్యంలో తిరుగాడుతూ దర్భలూ , సమిధలూ ఏరి తెస్తున్నాడు. తండ్రి అత్రి మహర్షి అధ్యాపకత్వంలో వేద శాస్త్రాలు ఔపోసన పడుతున్నాడు !” నారదుడు వివరించాడు.

“అలాగా !” సరస్వతి ఆశ్చర్యంతో అంది. “మరి నవగ్రహాలలో మూడవ గ్రహం ఆవిర్భవించాలి కదా !”

“ఔను ! ఆ కార్యం పరమేశ్వరుడి ద్వారా జరిగితే బావుంటుంది…” బ్రహ్మ సాలోచనగా అన్నాడు.

“పరమేశ్వరుడా… !” ఆశ్చర్యపోయింది సరస్వతి.

“శ్రీమహావిష్ణువు నుండి మొదటి గ్రహదేవత సూర్యుడు అవతరించాడు. మా అంశతో రెండవ గ్రహదేవత చంద్రుడు ఉదయించాడు. త్రిమూర్తులలో ఇక మిగిలింది. శివుడే ! ఆయన మూలంగా మూడవ గ్రహం ఆవిర్భవిస్తే…”

“నారాయణ !” నారదుడు ఉత్సాహంగా అడ్డు తగిలాడు. “జనకా ! అయితే , వెళ్ళి కైలాసవాసుణ్ని హెచ్చరించమని ఆజ్ఞా !”

“మా జనకుల సంకల్పమూ , మా సంకల్పమూ అదే , పుత్రా !” బ్రహ్మ అన్నాడు. నారదుడు ఆలస్యం చేయకుండా నిష్క్రమించాడు.

రేపటి నుండి కుజ గ్రహ జననం ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment