Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఇరవై నాల్గవ అధ్యాయం

చంద్రగ్రహ జననం ఆరవ భాగము

శీలవతి ( సతీ సుమతి ) కథ

ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది. ఏదో అమోఘమైన కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు , చిరునవ్వులు చిందిస్తూ..

అత్రి , అనసూయలు మాటలు మరిచిపోయి , త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు. అనసూయ పళ్ళేన్ని శ్రీమహావిష్ణువు ముందు పెట్టింది. ఆమె ఆలోచనను గ్రహించిన విష్ణువు పళ్ళెంలో నిలుచున్నాడు. అనసూయ నీళ్ళు పోస్తూ ఉంటే , అత్రి ఆయన పాదాలు కడిగాడు. అలాగే బ్రహ్మకూ , పరమేశ్వరుడికీ ఆ దంపతులు పాద పూజలు చేశారు. త్రిమూర్తుల పాద జలాన్ని శిరస్సుల మీద చల్లుకుని , తీర్థంగా పుచ్చుకొన్నారు.

“ఇంద్రా… ఎందుకు ఆహ్వానించావు మమ్మల్ని ?” విష్ణుమూర్తి ప్రశ్నించాడు.

“మీరు ముగ్గురూ శీలవతి విషయం స్వయంగా తనను అడగాలన్న నిబంధన విధించింది సాధ్వి అనసూయ…” ఇంద్రుడు వివరించాడు వినయంగా.

విష్ణువూ , బ్రహ్మా , శివుడూ ఒకేసారి చిరునవ్వులు నవ్వారు.

“అంతే కదా !” అన్నాడు శ్రీమహావిష్ణువు.

“దానికేం భాగ్యం !” బ్రహ్మ తన వంతుగా అన్నాడు.

“మేం ఆజ్ఞాపించడానికి సిద్ధమే , అభ్యర్ధించడానికీ సిద్ధమే !” శివుడు నవ్వుతూ అన్నాడు.

“అనసూయా ! శీలవతిని ఒప్పించి , శాపం ఉపసంహరించేలా చూడు !”. శ్రీమహావిష్ణువు అన్నాడు.

“అవునమ్మా ! నా కోరికా అదే !” బ్రహ్మ అందుకొన్నాడు.

“శీలవతిని సమ్మతింపజేసి , పొద్దుపొడిచేలా చేయి సాధ్వీ !” పరమశివుడు వినయంగా అన్నాడు.

అనసూయ చేతులు జోడించి , ముగ్గురికీ నమస్కరించింది. “ఆజ్ఞ ! శీలవతికి నచ్చజెబుతాను. అందుకు నాకు ప్రతిఫలంగా మీరు ముగ్గురూ కోరిన వరాలు కరుణించాలి !” అంది అనసూయ.

“చూశారా ! పతివ్రత ఎవర్నైనా సరే , శాసిస్తుంది ! శీలవతి సూర్యుణ్ణి శాసించింది ! అనసూయ మనల్ని ముగ్గుర్నీ శాసిస్తోంది !” విష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ చూస్తూ చిరునవ్వుతో అన్నాడు.

“తథాస్తు ! అందాం !” పరమశివుడు నవ్వుతూ అన్నాడు.

“తథాస్తు !” బ్రహ్మ చెయ్యెత్తి అన్నాడు. “సాధ్వీ అనసూయా, అలాగే ! వెళ్ళిరా ! నువ్వు తిరిగి వచ్చే దాకా ఇక్కడే ఉంటాం !” అన్నాడు విష్ణువు. త్రిమూర్తుల్ని తన లోగిలిలో కట్టిపడవేసిన ధర్మపత్నిని సగర్వంగా చూస్తున్నాడు అత్రి.

అనసూయ పిలుపు విని , శీలవతి కుటీరంలోంచి ఇవతలకి వచ్చింది. వయసులో తనకన్నా పెద్దదైన అనసూయ పాదాలను చేతుల్తో తాకుతూ నమస్కరించింది.

“దీర్ఘసుమంగళీ భవ !” అనసూయ దీవించింది.

“శీలవతీ , నిన్నొకటి కోరడానికి వచ్చాను…” అనసూయ ఉపోద్ఘాత రూపంలో అంది.

“ఆజ్ఞాపించండి , మాతా !” శీలవతి కంఠంలో వినయం శబ్దం చేసింది.

“లోకహితం కోసం… నువ్వు సూర్యుడు ఉదయించేలా చేయాలి. అందుకు అడ్డుగా ఉన్న నీ శాపాన్ని ఉపసంహరించుకోవాలి !”

“సూర్యుడు ఉదయిస్తే , నా భర్త అస్తమిస్తాడు మాతా !” శీలవతి కంఠం దుఃఖావేశంతో వణికింది.

“ఇందాకా నిన్ను ‘దీర్ఘసుమంగళీ భవ !’ అంటూ దీవించాను శీలవతీ ! అనసూయ ఆశీస్సు వృధా కాదు తల్లీ !”

“అమ్మా !”

“అమ్మ కూతురి వైధవ్యాన్ని సహిస్తుందా ?” అనసూయ కంఠంలో ఏదో నిర్ణయం గంటలాగా మోగింది.

అనసూయ మాట శీలవతి చెవుల్లో గింగిర్లు తిరుగుతోంది. “అమ్మా… మీ మాట పాటిస్తాను !” శీలవతి చేతులు జోడించింది.

శీలవతి తూర్పు వైపు తిరిగింది. కళ్ళు మూసుకొని చేతులు జోడించింది. “నేను మహాపతివ్రతనే అయితే ఈ క్షణంలోనే సూర్యుడు ఉదయిస్తాడు గాక !” శీలవతి మాట పరిసరాల్లో మారు మోగింది. తూర్పు దిక్కును కప్పిన నల్లటి తెరను ఏదో అదృశ్య హస్తం ఒక్కసారిగా తొలగించింది. తూర్పున సూర్యుడు ఉదయించాడు !

ఉదయభానుణ్ని ఒకసారి చూసి , శీలవతి ఆత్రుతగా కుటీరంలోకి పరుగెట్టింది. కుక్కిమంచం వైపు చూసి , ఒక్కసారిగా ఆగిపోయింది శీలవతి. కుక్కిమంచం మీద నిర్జీవంగా పడున్నాడు ఉగ్రశ్రవుడు.

“స్వామీ !” శీలవతి ఆర్తనాదం కుటీరంలో ప్రతిధ్వనించింది.

అనసూయ వినిపించుకోనట్లు వెనుదిరిగి వేగంగా తమ ఆశ్రమం వైపు నడవసాగింది…

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment