Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఒకటవ అధ్యాయం

చంద్రగ్రహ జననం రెండవ భాగము

శీలవతి ( సతీ సుమతి కథ )

“అదేమిటి స్వామీ , అలా అంటారు. నా సర్వస్వమూ మీరే. అది మీకు తెలుసుగా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామీ !”

“సరే… ఈరోజు ఒక మేడ ముందు ఆగి , భిక్ష అడగకుండా వచ్చేశావ్ ! ఎందుకు ?” ఉగ్రశ్రవుడు శీలవతి మాటను వినిపించుకోనట్లు అన్నాడు.

“ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం నాకు ఇష్టం లేదు స్వామీ…”

“కారణం !” ఉగ్రుడు రెట్టించాడు. “అది కలిగిన వారి ఇల్లులా కనిపించింది !”.

“అవును…అయినా , ఆ ఇంట భిక్ష తీసుకోవడం దోషమని అనిపించింది ! నిజంగా అది దోషమే స్వామీ !” అంది శీలవతి.

“కారణం చెప్తావా లేదా ?” ఉగ్రశ్రవుడు గద్దించాడు.

“ఆ ఇల్లు ఒక వేశ్యది స్వామీ…” శీలవతి మెల్లగా అంది. “ఓహ్ ! మేడ మీద చందమామలా కనిపించింది , ఆ వేశ్య ముఖమన్నమాట !” ఉగ్రశ్రవుడి కంఠం ఉత్సాహంగా ధ్వనించింది.

“ఔను…”

“ఓహ్ ! చంద్రబింబంలాంటి ముఖం ! మెరుపు తీగలాంటి శరీరం ! అప్సరస కాబోలనిపించింది , చూస్తుంటే…” ఉగ్రశ్రవుడు చెప్పుకుపోతున్నాడు.

“పోనివ్వండి , స్వామీ ! ఆమె అందంతో మనకు అవసరమేమిటి ?” శీలవతి సౌమ్యంగా అంది. “హాయిగా నిద్రపోండి !”

“నాకు నిద్ర పట్టదు !” ఉగ్రశ్రవుడు ఎటో చూస్తూ అన్నాడు. “కంటికి కట్టిన ఆ వేశ్య సౌందర్యానుభవం వొంటికి పట్టేదాకా… నాకు నిద్ర పట్టదు !”


“స్వామీ… !” శీలవతి కంఠంలో ఆశ్చర్యం పలికింది.

“ఏం ? అంత ఆశ్చర్యపోతున్నావేమిటే ! వేశ్యా సంగమం అంత కానిపనైతే… వేశ్యలు ఎందుకుంటారే ! నన్ను ఆ వేశ్య ఇంటికి తీసుకెళ్ళు !” ఉగ్రశ్రవుడు ఆజ్ఞాపించాడు.

“స్వామి…”

“ఏం ? తీసుకెళ్ళలేవా ?” ఉగ్రశ్రవుడు హూంకరించాడు. “పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా ?”

“చివరిసారిగా చెప్తున్నాను ! నన్ను ఈ క్షణంలోనే ఆ వేశ్య వద్దకు తీసుకెళ్ళాల్సిందే ! మోసుకెళ్ళాల్సిందే !”

“స్వామీ… దయచేసి శాంతంగా వినండి…” శీలవతి దీనంగా అంది. “వేశ్యలు ధనం లేని వారిని గడప తొక్కనివ్వరు… మన వద్ద ధనం…”.

“లేదు – అది నాకు తెలుసు !” ఉగ్రశ్రవుడు గర్జించాడు. “మన వద్ద ధనమే కాదు. ధాన్యం కూడా లేదు ! అలాగని పస్తులుంటున్నామా ? ఏం చేస్తున్నావ్ ? నన్ను ఆ బుట్టలో కూలవేసి , ఎండలో ఎండిస్తూ , వానలో తడిపేస్తూ , కష్టపెడుతూ అడుక్కుతెస్తున్నావా లేదా ? అందర్నీ ధాన్య భిక్ష అడుగుతున్నావు ! ఆ వేశ్యను కూడా అడుగు ! ధనభిక్ష కాదు. ధాన్య భిక్ష కాదు. ‘ప్రణయభిక్ష’ అడుగు ! నీ పతి దేవుడికి ఇంత ప్రణయభిక్ష పెట్టమని ప్రార్ధించు !”

“స్వామీ…!” శీలవతి నివ్వెరపోతూ అంది.

“ఏమే ? స్వామి స్వామి అంటూ జపం చేస్తూ కూర్చుంటే మన కోరిక తీరదే పిచ్చిదానా ! నన్ను ఆ సౌందర్యరాశి ఇంటిముందుకు తీసుకెళ్ళు. దాని కాళ్ళు పట్టుకో. కన్నీళ్ళు పెట్టుకో. ”భిక్షం” సంపాదించు. లే ! బుట్ట తే !!”

“నా… ఆలోచన వినండి స్వామీ…” శీలవతి ప్రాధేయపడుతూ అంది. “మీ ఆరోగ్యం బాగాలేదు. లేవలేని స్థితిలో ఉన్నారు…”.

“నోర్ముయ్ ! నిన్ను చూస్తూ ఇలా ఉండచుట్టుకుని పడి ఉన్నాను ! అంతే ! ఆ వేశ్య ముందుకెళ్ళగానే లేచి గంతులేస్తాను లేవే !” అంటూ ఉగ్రశ్రవుడు తీక్షణంగా శీలవతి. మొహంలోకి చూశాడు. “నేను రోగిష్టినయితేనేం ? చెప్పానుగా ! కాళ్ళు పట్టుకో ! కన్నీళ్లు పెట్టుకో ! కావాలంటే రేపూ మాపూ బిచ్చమెత్తి దానికి చెల్లిస్తానని మాట ఇచ్చుకో ! పద !”

మంచం అంచుకి ఆవేశంగా జరుగుతున్న భర్తను నిస్సహాయంగా చూస్తూ , శీలవతి బుట్ట అందుకుంది. ఉగ్రశ్రవుణ్ణి బుట్టలోకి చేర్చి , ఆ బుట్టను తలమీదకి ఎత్తుకుంది. ఇంట్లోంచి అవతలకి నడిచింది…

శీలవతి భర్తను మోసుకుంటూ , చీకట్లో ఊరివైపు నడుస్తోంది. ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా వాలి కాళ్ళు ఆడిస్తూ , వేశ్య గురించి ఉత్సాహంగా ఏమిటేమిటో చెప్తున్నాడు.

చీకట్లో శీలవతి నడకసాగుతోంది.

బుట్టలోంచి వెలికి సాగిన ఉగ్రశ్రవుడి పాదం ఆ చీకటి దారిలో ఎవరికో తాకింది.

“అబ్బా !” అంది తీరని బాధతో ఒక పురుష కంఠం.

శీలవతి అప్రయత్నంగా ఆగింది. పరిశీలనగా చూసింది. కటిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఆకారం లీలగా కనిపిస్తోంది.

“నరకయాతన అనుభవిస్తున్న నన్ను తాకి , కదిలించి ఆ బాధను ఇనుమడింపచేసిన వారు ఎవరో సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది ఈ మాండవ్య మహర్షి శాపం !” ఏదో పురుష కంఠం ఏడో కఠోర బాధను ఓర్చుకుంటూ కర్కశంగా పలికింది.

“నా కాలు ఎవరికో తాకింది !” ఉగ్రశ్రవుడు వణికే గొంతుతో అన్నాడు. శీలవతి గుండె దడదడ కొట్టుకుంది ! ఎవరా శపించింది సూర్యోదయమైతే తన భర్త మరణిస్తాడా ?…

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment