చంద్రగ్రహ జననం రెండవ భాగము
శీలవతి ( సతీ సుమతి ) కథ.
శీలవతి చీర కట్టడం ముగించి , పైట సర్దుకుంది. నుదురు మీద బొట్టు పెట్టుకుంది. భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఎవరో ముత్తైదువ దానం చేసిన పువ్వుల్ని జడలో దోపుకొంటోంది. “ఎక్కడ ఏడుస్తున్నావ్ ?” భర్త ఉగ్రశ్రవుడి కంఠంలో ఆగ్రహం ఆమెకు చెంపపెట్టులా తాకింది.
“వస్తున్నా స్వామీ !” అంటూ , మాట వెంటే భర్త ఉన్న చోటికి పరుగెత్తింది శీలవతి. గుడిస మూలలో కుక్కి మంచం మీద కూర్చున్న ఉగ్రశ్రవుడు శీలవతిని ఎగాదిగా చూశాడు.
“ఏమిటే… చీరకట్టి , పువ్వులు పెట్టి సింగారించుకున్నావ్ ? ఎవడు చూడాలనే ? ఉగ్రశ్రవుడు ఉరిమాడు.
“అదేమిటి స్వామీ , అలా అంటారు ? భిక్ష కోసం వీధి వీధి తిరిగాం కదా.. కట్టుకున్న వస్త్రాలు చెమటతో తడిసిపోయాయి. చెమట వాసన మీరు భరించలేరు. అందుకని స్నానం చేసి…”
“చాలు !” ఉగ్రశ్రవుడు కసిరాడు. “ఆకలి మండిపోతోంది ! మాటలతోనే కడుపు నింపేస్తావా ఏమిటి ? పిడికెడు తిండి పడేస్తావా లేదా ?”
“ఒక్కక్షణం. దీపం వెలిగించి… భోజనం పెట్టేస్తాను.” అంటూ శీలవతి వెనుతిరిగి వెళ్ళింది.
ఉగ్రశ్రవుడు బుసలు కొడుతూ కూర్చున్నాడు. శీలవతి క్షణంలో వచ్చింది. ఆమె చేతిలో పట్టుకున్న చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది. గాలి తాకకుండా ఒక అరచేతిని ఆమె దీపకళికకు రక్షణగా పట్టుకుంది.
ఉగ్రశ్రవుడు ఆమెనే చూస్తున్నాడు. ప్రమిదలో దీపకళిక గాలితాకిడికి స్పందిస్తూ , శీలవతి మొహానికి వెలుగుల్ని అద్దుతోంది. కోలమొహం మీద దోబూచులాడుతున్న దీపం వెలుతురు శీలవతి అందాన్ని హెచ్చవేత వేస్తోంది. ప్రమిదను పట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శీలవతి మేఘాల మీద అలవోకగా నడుస్తున్న అప్సరసలా ఉంది..
శీలవతి మూలలో ఉన్న పెద్దదీపాన్ని వెలిగించి , భర్త వైపు నడుస్తోంది. అలంకారం. లేకుండా అతి నిరాడంబరంగా ఉన్న ఆమె సన్నటి శరీరం తగుమాత్రం ఆకులున్న లేత వయసు తీగలా ఉంది. చేతిలోని ప్రమిదలో స్పందిస్తున్న దీపకళిక కాంతి కిరణాలతో శీలవతి ముఖాన్ని పుణుకుతోంది.
ఆమెనే చూస్తున్న ఉగ్రశ్రవుడు రౌద్రంగా నిట్టూర్చాడు. యవ్వనంలో ఉన్న తన భార్య సౌందర్యవతే ! సందేహం లేదు ! అయితే ఆమెలోని భక్తి , రక్తిని మింగేసింది. వినయమూ , విధేయతా వలపునీ , వయ్యారాన్నీ చంపేశాయి. భార్య భక్తిని కుమ్మరిస్తే చాలదు. వలపుని వొలకబోయాలి. తాళికట్టిన నాటి నుండీ ధర్మపత్నిని ద్వేషించుకుంటున్న ఉగ్రశ్రవుడు కసిగా అనుకున్నాడు.
ప్రమిదను భర్తకు దగ్గరగా ఉంచి , తిరిగి వెళ్ళి , క్షణంలో అన్నపాత్రతో వచ్చింది. శీలవతి. ఉగ్రుడు ఆశగా , ఆకలిగా కంచంలోని పదార్థాలను చూశాడు. చక్కగా కలుపుకుని , నోటినిండుగా పెద్ద పెద్ద ముద్దలు కూరుకుంటూ , వేళ్ళు చీకుతూ , లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తోంది అతనికి ! కానీ తనకి ఆ అదృష్టం లేదు ! పాపిష్ఠి కుష్ఠుతో వేళ్ళన్నీ కుళ్ళిపోయాయి.
శీలవతి వేళ్ళు భర్త నోటికి అన్నం ముద్దను అందించాయి.
“పెద్ద ముద్దలు పెట్టలేవా ఏమిటి ?” అని అరిచాడు. ఉగ్రశ్రవుడు. “నా నోట్లో ఇంత కుక్కి దాచుకుని ఆరగించాలనుకుంటున్నావా ?”
శీలవతి చిన్నగా నవ్వింది. “ప్రతి పూటా ఇలాగే అంటారు ! మీ ఆకలి పూర్తిగా తీరితే గానీ , నాకు ఆకలి వేయదు , స్వామీ !” “పెట్టు , పెట్టు ! కొంచెం పెద్ద ముద్ద నోటికి అందించి ఏడు !” ఉగ్రశ్రవుడు కసిరాడు.
భార్య తినిపించే అన్నం తింటూ , ఆమెను తిట్టే తిట్లను ఆనందంగా నంజుకుంటూ ఉగ్రశ్రవుడు తృప్తిగా భోజనం ముగించాడు.
“అయిపోయిందా, ఉందా ?” కసిరినట్లు అడిగాడతను.
“అయిపోయింది స్వామీ… ఇవ్వాళ భిక్ష తక్కువగానే దొరికింది…” శీలవతి నొచ్చుకుంది.
“దరిద్రపు మొహం ! అడుగుపెట్టావు నా జీవితంలో. అప్పట్నుంచీ అరకడుపే !” అంటూ ఆగి , బ్రేవ్ మంటూ తేన్చాడు ఉగ్రశ్రవుడు.
శీలవతి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుని వెళ్లింది.
“పడుకోండి ! కాళ్లు నొక్కుతాను !” తిరిగి వచ్చిన శీలవతి అంది.
ఉగ్రశ్రవుడుగుడ్లురిమాడు. “ఏమిటే తొందర ? ఈ రోగిష్ఠివాణ్ణి త్వరగా నిద్రపుచ్చి , వెన్నెల్లో విహరిద్దామనుకుంటున్నావా ?”
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹