సూర్యగ్రహ జననం తొమ్మిదవ భాగము
సంజ్ఞ శయ్యాగారంలోకి అడుగుపెట్టి, బంగారు తలుపులు మూసింది. మంచం మీద పవ్వళించిన పతి దేవుణ్ణి ఒక్కసారి చూసి , మణి దీపం వద్దకు నడిచి, ఆర్పివేసింది. శయ్యామందిరంలో దీపం లేకపోయినా , చీకటి ఉండదు. తన పతిదేవుడున్నచోట. వెలుతురే ! సంజ్ఞ చిరునవ్వుతో శయ్య వైపు చూసింది. పొడుగాటి కాంతి పుంజంలా సూర్యుడు !
సంజ్ఞ శయ్య వైపు అడుగులు వేసింది. ఆమె అందెలు సమ్మోహనకరంగా మోగుతూ , ఆమె నడకకు నేపథ్య సంగీతం అందిస్తున్నాయి. సంజ్ఞ మంచం మీద కూర్చుని , సూర్యుడి మీద చెయ్యి వేసింది. ఆమె గాజుల గలగల సూర్యుణ్ణి వెచ్చరించింది.
“స్వామీ… మీ శరీరం నాకు చాలా ఇష్టం ! ఎప్పుడూ వెచ్చగా , మత్తు కలిగిస్తూ , హాయిగా ఉంటుంది !” సంజ్ఞ పరవశంతో అంది. ఆమె మాటకు అర్థం చెబుతున్నట్లు ఆమె చెయ్యి సూర్యుడి శరీరాన్ని నిమిరింది.
“నీ శరీరం అంటే నాకు ప్రాణం ! ఎందుకో తెలుసా ?” సూర్యుడు సంజ్ఞ భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు.
“ఎందుకు ?”
“నువ్వు వరవర్ణినివి , సంజ్ఞ !”.
“వరవర్ణినా ? అంటే ?” సంజ్ఞ ప్రశ్నించింది.
“అంటే… “శీతాకాలంలో సుఖకరమైన ఉష్ణాన్నీ , ఉష్ణ సమయంలో సుఖకరమైన శీతలాన్నీ అందించే అవయవాలు కలిగిన ఉత్తమాంగన !” సూర్యుడు వివరించాడు.
“నిజంగానా , స్వామీ ! మీ సంజ్ఞ శరీరానికి ఆ లక్షణాలున్నాయా ? నేను నిజంగా ‘వరవర్ణిని’ అంటారా ?” సంజ్ఞ ఉల్లాసంగా అడిగింది.
“నువ్వు కేవలం వరవర్ణినవే కాదు , ‘వరారోహవు’ కూడా !” సూర్యుడు నవ్వాడు.
“వరారోహ…” సంజ్ఞ చేతులు , బొమలు ముడివేస్తూ అంది. “అంటే ఏమిటి స్వామీ ?”
“నన్ను కాదు , సంజ్ఞ ! ఆ ప్రశ్న నీ వాలుజడ కొస భాగాన్ని అడుగు !” సూర్యుడు నవ్వాడు.
సంజ్ఞ కూడా అర్ధం చేసుకుంది. సిగ్గుతో మెలితిరుగుతూ , తన ముఖాన్ని భర్త హృదయం మీద దాచుకుంది.
నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూశాడు.
“నవగ్రహాలలో మొదటి గ్రహదేవత గురించి విన్నారు కదా ! ఇప్పుడు రెండవ గ్రహదేవత అయిన ”చంద్రుడి” జన్మవృత్తాతం వినిపిస్తాను !” అంటూ ప్రారంభించాడు.
“చంద్రుణ్ణి ”ఆత్రేయుడు” అని అంటారు. ఎందుకంటే ఆయన ”అత్రి” పుత్రుడు కాబట్టి ! ”అత్రి మహర్షి” ఎవరో మీకు గుర్తుందా ?”
“బ్రహ్మ మానస పుత్రులలో అత్రి మహర్షి ఒకరని చెప్పారు కద , గురువుగారూ !” చిదానందుడు అన్నాడు.
“ఔను ! అత్రి ఎవరిని భార్యగా స్వీకరించాడో కూడా చెప్పాను ,” నిర్వికల్పానంద అన్నాడు.
“అత్రి మహర్షి భార్య అనసూయ. అనసూయ ఎవరి కూతురో తెలుసా ?” “చెప్పండి గురువుగారూ !” సదానందుడు అన్నాడు.
“బ్రహ్మ మానసపుత్రుడు ”కర్దముడు” గుర్తున్నాడుగా ! ఆయన భార్య దేవహూతి. అనసూయ దేవహూతీ , కర్దమ దంపతుల పుత్రిక. అనసూయను ధర్మపత్రిగా స్వీకరించిన అత్రి మహర్షి గృహస్థ జీవితం ప్రారంభించాడు. ఆ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. అనసూయ మాహా పతివ్రత. అసామాన్య విధానంలో , చివరికి తన పాతివ్రత్య మహిమతోనే అనసూయ సంతానాన్ని పొందగలిగింది. ఆ సంఘటన చాలా చిత్రమైంది. వినిపిస్తాను. వినండి !” అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద.
రేపటి నుండి చంద్రగ్రహ జననం ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹