సూర్యగ్రహ జననం ఏడవ భాగము
కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ , వేదాంగాలూ , తర్క , వ్యాకరణ , ధర్మ , మీమాంస , జ్యోతిష , వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యాబలంతో , సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది.
సకల చరాచర ప్రాణుల పట్లా చిన్నతనం నుంచే సూర్యుడు ప్రకటించే ”సమత” అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విద్యనూ , వినయాన్నీ పుణికి పుచ్చుకున్న సూర్యుడు బాల్యావస్థను దాటి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. చూపుల్ని సూదంటు రాయిలా లాగిపట్టే శరీరకాంతి , సౌష్టవంతో నిండిన నిలువెత్తు విగ్రహం , అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు , ప్రత్యూష సౌందర్య పరాకాష్ఠలా ఉన్నాడు సూర్యుడు.
అదితి ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది. సమిధలూ , పువ్వులూ సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు. పువ్వుల్ని అదితి ముందున్న దర్భతో అల్లిన చాప మీద రాశిగా పోశాడు. అందమైన తామర మొగ్గలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి.
తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపలి నుంచి ఆశ్రమం వైపుకు వస్తున్నాడు. అదితి కొడుకుని రెప్పవేయకుండా చూస్తోంది.
“స్వామీ ! నా కొడుకుని చూశారా ! యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ ?” అదితి కంఠంలో మాతృ సహజమైన గర్వం లీలగా ధ్వనించింది. “నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అదితీ !”
“నా బిడ్డడి ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతురాలికి మహాభాగ్యం అవుతుందో !” అదితి పారవశ్యంతో అంది.
“సౌందర్యంలో సరితూగే యువతిని అన్వేషించాలి మన సూర్యుడి కోసం ,” కశ్యపుడు సూర్యుణ్ణి చూస్తూ అన్నాడు.
సూర్యుడు ఆశ్రమ ద్వారం ముందుకు వచ్చాడు. సూర్యుడు దగ్గరకు రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి.
“సమిధలు ఇలా ఇవ్వండి నాన్నగారూ !” అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకుని సూర్యుడు ఆశ్రమంలోనికి వెళ్లాడు. కశ్యపుడు కూర్చున్నాడు. అదితి , కశ్యపులు తలలు తిప్పి , కొడుకు వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆశ్రమం ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణ నామగానం వినిపించింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. వీణను మీటుతూ , నామగానం చేస్తూ వస్తున్నాడు నారదమహర్షి.
అదితి , కశ్యపుడూ అరుగు మీంచి లేచి , మర్యాద పూర్వకంగా నారదుడికి ఎదురేగారు. చిరునవ్వుతో స్వాగతం చెప్తూ , “దయచేయండి !” కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు. “ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి !” అదితి నారదుడితో అంది.
“అలాగేమ్మా. దానికేం భాగ్యం !” నారదుడు నవ్వుతూ అన్నాడు. “ఆకాశమార్గాన వెళ్తుంటే… మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో కాంతిస్తంభంలా కనిపించాడు. వయసు పెరిగింది ; అందమూ పెరిగింది.”
“ఇందాకా మేమిద్దరమూ అదే అనుకున్నాం. సూర్యుడు చూడచక్కని యువకుడయ్యాడు!” కశ్యపుడు నవ్వుతూ అన్నాడు.. “ఔనౌను. వివాహం సంకల్పించారా ? నారదుడు అడిగాడు.
“మాదేముంది ? ఆ దైవం సంకల్పించాలి.” అదితి వినయంగా అంది.
“దైవ సంకల్పం జరిగిపోయింది. ఆ… కశ్యపా ! చూడచక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడచక్కని సుందరి కావాలి కదా. చూడచక్కని సుందరాంగిని ఇటీవల చూశాను…” నారదుడు అన్నాడు. అరుగు మీద ఆసీనుడవుతూ…
“ఎక్కడ మహర్షీ ?” అదితి ఆతృతగా అడిగింది. “ఎవరా చిన్నది ?”.
“దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ! ఆయన ఎవరనుకున్నారు ?” నారదుడు అడిగాడు.
“ప్రభాసవసు పుత్రుడు కదా?” కశ్యపుడు అన్నాడు.
“ఔను ! అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికీ , ఆయన పత్ని ”వరస్త్రీ”కి జన్మించినవాడు మన విశ్వకర్మ. ఆయన సేవలు అందుకొనని దేవతలు లేరు. ఆ దంపతుల జ్యేష్ఠ పుత్రిక సంజ్ఞ… సౌందర్యరాశి. మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే ,” నారదుడు వివరించాడు.
“అలాగా ! అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి , వాళ్ళ అభిప్రాయం….” అదితి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతోంది.
“తెలుసుకునే వచ్చాను!” ఆమె మాటకు తన మాటతో అడ్డువేశాడు నారదుడు. “మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆనోటా , ఈనోటా మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ళ ద్వారా విని ఉన్నాడు. ఆ దంపతులకు లేశమంత అభ్యంతరమూ లేదు…”
“అయితే ఆ కన్యామణి అభిప్రాయం ?” కళ్యపుడు అన్నాడు.
“సంజ్ఞాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ , విడిగానూ సూర్యుడి అందచందాలనూ , ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించాను. సంజ్ఞ తన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు గానీ , కళ్ళతో స్పష్టం చేసింది” నారదుడు నవ్వుతూ అన్నాడు.
“అలాగా ! అన్నీ ఆకళింపు చేసుకునే వచ్చారన్నమాట!” అదితి నవ్వుతూ అంది.
“నారదుల వారి తీరే అంత అదితీ , మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా !” కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు.
“ఇంతెందుకు కశ్యప ప్రజాపతీ ! నాతో చెప్పకపోయినప్పటికీ సంజ్ఞ అభిప్రాయం. వినే వచ్చాను. ఆ చిన్నది ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెప్తుంటే ఆ మాటను చాటుగా విన్నాను.” నారదుడు నవ్వుతూ అన్నాడు.
“అయితే , ఇంకేం ? ఆ కన్యామణి అందచందాల గురించీ , గుణగణాల గురించీ సూర్యుడికి మీరే వివరించి చెప్పండి. తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి , కళ్యాణం జరిపించుదాం !” కశ్యపుడు అన్నాడు.
“సంజ్ఞ గురించి మన సూర్యుడికి ఎరుక పరచడానికే ప్రత్యేకంగా వచ్చాననుకోండి ! ఆ కార్యం సానుకూలం చేసి , విశ్వకర్మతో మాట్లాడుతాను. ఆయనే మీ దర్శనానికి వస్తాడు.” అన్నాడు నారదుడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹