శుక్రగ్రహ మహిమ – రెండవ భాగము
అదితి వ్రతం ఫలించింది. ఆదిదేవుడి వరం సాకారమైంది. అదితి దివ్యగర్భం ధరించింది. ఆమె శరీరాన్ని ఏదో దివ్యకాంతి ఆవరించింది. సహజ సౌందర్యవతి అయిన ఆమె అందం వెయ్యింతలయ్యింది.
ఆదితి గర్భాన అందంగా , ఆనందంగా కదలాడుతూ అవతరించడానికి సన్నద్ధుడవుతున్న క్షీరసాగరశాయిని చతుర్ముఖ బ్రహ్మ పరిపరివిధాలుగా ప్రస్తుతించాడు. నారదమహర్షి అదితి గర్భవతి అయిన శుభవార్తను , అందుకు మూలకారణాన్ని ఇంద్రాదులకు చేరవేశాడు.
“మహేంద్రా ! దేవతల కష్టాలు కడతేరే కాలం కనుచూపు మేరలో ఉంది. పూర్వ వైభవం అందుకోవడానికి , నీ వంతు కృషి నీవు చేయాలి.” బృహస్పతి సాలోచనగా అన్నాడు.
“శలవియ్యండి, గురుదేవా!”
“స్వర్గరాజ్యం రాక్షసరాజ్యం కావడానికి మూలకారణం…” బృహస్పతి ఏదో చెప్పబోయాడు.
“తెలుసు… బలిచక్రవర్తి !” ఇంద్రుడు అడ్డుతగిలాడు.
“బలిచక్రవర్తి కారణం కావచ్చు , కానీ , మూలకారణం వేరే వుంది , దేవేంద్రా !”
“ఏమిటది , గురుదేవా?”
“నీ మీద ప్రసరిస్తున్న శుక్రుడి వక్రదృష్టి !” బృహస్పతి ఇంద్రుడి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. “శుక్రుడు అశుభ దృష్టితో నిన్ను చూస్తున్నాడు. అతడి అశుభ దృష్టిని , శుభదృష్టిగా మార్చుకోవాలి నువ్వు !”
“ఊ….మార్గం ఉపదేశించండి !”
“భక్తిశ్రద్ధలతో నవగ్రహాలలో ఆరవగ్రహమైన శుక్రుడిని ధ్యానించు ! ఆరాధించు !”
“గురుదేవా !” ఇంద్రుడు నివ్వెరపాటుతో అన్నాడు. “శుక్రుడు సురవిరోధుల గురువు ! శుక్రుడు గురువు శత్రువే కద ! ఆయన నాకు ప్రసన్నుడవుతాడా ? అసంభవం !”
“సందేహాన్ని పరిత్యజించి , శుక్రుడిని ఆరాధించు , మహేంద్రా !” బృహస్పతి గంభీరంగా అన్నాడు. “శుక్రుడు కరుణిస్తాడు !”
“ఒక్క మాట చెప్పండి , గురుదేవా ! రాక్షసరాజు బలిచక్రవర్తి మిమ్మల్ని ఆరాధిస్తే అతనికి మీరు ప్రసన్నులవుతారా ?”
“తప్పక ప్రసన్నుడవుతాను ! తప్పదు ! అది మా విధి !” బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. “చరాచర ప్రపంచంలో అందరినీ శుభంగా , అశుభంగా , ఆగ్రహంతో , అనుగ్రహంతో వీక్షించే అధికారం త్రిమూర్తులు మా నవగ్రహాలకు ప్రసాదించారు. ఏ దైవమైనా నిన్ను కనికరించాలంటే , దానికి ముందుగా పునాది రూపంలో నవగ్రహాలలో అనుకూలంగా లేని గ్రహవీక్షణ శుభంగా మారాల్సిందే. నా మాటను విశ్వసించు ! ఐశ్వర్య వైభవ కారకుడైన శుక్రగ్రహ దేవతను ఆరాధించు !” బృహస్పతి నొక్కి వక్కాణించాడు.”ఆజ్ఞ !” ఇంద్రుడు వినయంగా అన్నాడు.
అది శ్రావణమాసం. ద్వాదశ తిథి. శ్రవణా నక్షత్రయుక్త అభిజిత్ లగ్నం. సూర్య భగవానుడు ఆకాశ మధ్యంలో ప్రకాశించే మధ్యాహ్న సమయం. చంద్రుడూ , ఇతర గ్రహాలూ , నక్షత్రాలూ ఉచ్ఛస్థితిలో ఉన్న శుభఘడియలలో అదితి కుమారుణ్ణి ప్రసవించింది.
ఆ బాలకుడు గోరోచన వర్ణ వస్త్రంతో , మకర కుండలాలతో , శ్రీవత్సంతో మెరిసిపోతున్నాడు. చతుర్భుజుడుగా జన్మించిన ఆ శిశువు నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉన్నాడు. కిరీటమూ , కంఠంలో కౌస్తుభమణీ , ఇతర హారాలూ దివ్యకాంతుల్ని వెదజల్లుతున్నాయి. నాలుగు చేతులతో , ఆభరణాలతో , ఆయుధాలతో ఆ శిశువు తన గర్భవాసాన ఎలా ఉన్నాడో అన్న ఆలోచనలో పడింది అదితి. ఆశ్చర్యానందాలతో , భక్తి ప్రపత్తులతో అదితీ కశ్యపులు శిశురూపంలో ఉన్న శ్రీమహావిష్ణువును కీర్తించారు. మరుక్షణం ఆయుధాలతో , అలంకారాలతో , ఆభరణాలతో ఉన్న దివ్య స్వరూపాన్ని వదలి సామాన్య బాలక రూపాన్ని ధరించాడు. ఆ వెంటనే ఉపనయనానికి తగిన వయసుతో పొట్టివాడుగా రూపొందాడు. అదితి అబ్బురపాటు నుండి తేరుకుంది. ఆమెలో మాతృ వాత్సల్యం స్తన్యంగా పెల్లుబికింది. పొట్టిగా ఉన్న చిట్టి తండ్రిని అక్కున చేర్చుకుంది.
నిర్వికల్పానంద చిరునవ్వుతో చూశాడు. “ఇదీ వామనావతార గాథ ! బలిచక్రవర్తి స్వాధీనపరుచుకున్న స్వర్గసామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించే లక్ష్యంతో శ్రీమహావిష్ణువు వామనుడుగా అవతరించాడు.
“ఆ వామనుడు బలిచక్రవర్తి యాగానికి వెళ్ళడం , మూడడుగుల చోటు దానమడగడం , దానం చేయబోయిన బలిని గురువు శుక్రాచార్యుడు వారించడం , జలధార పడకుండా శుక్రుడు సూక్ష్మ రూపం ధరించి కలశ రంధ్రానికి అడ్డుపడడం , కలశ రంధ్రాన్ని వామనుడు దర్భతో పొడవడం , ఫలితంగా శుక్రుడికి ఒక కన్ను పోవడం , దానంగా స్వీకరించిన సామ్రాజ్యాన్ని వామనరూప విష్ణువు ఇంద్రుడికి ప్రసాదించడం – అనే అంశాలు అందరికీ తెలిసినవే !” నిర్వికల్పానంద ఆగాడు. “గురువుగారూ… మరి శుక్రుడు…” చిదానందుడు ఏదో అడిగే ప్రయత్నం చేశాడు.
“అదే చెప్పబోతున్నాను , చిదానందా !” నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. “సరిగ్గా సమయానికి , ఇంద్రుడు చేసిన ధ్యాన పూర్వక శుక్రారాధన ఫలించింది ! ఇంద్రుడికి ప్రసన్నుడయ్యాడు. ఆయన మీద శుభవీక్షణలు ప్రసరించాడు…”
“గురువుగారూ…ఒక సందేహం…” విమలానందుడు వినయంగా అన్నాడు. “శుక్రుడు వక్రంగా చూడడం , ఇంద్రుడు శుక్రుడిని ఆరాధించడం , ఆయన కరుణించడం అనే అంశాలు కొత్తగా ఉన్నాయి. యధార్థంగా ఆ సంఘటనలు జరిగాయా ?”
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. “వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. కారణాన్ని ఆధారం చేసుకుని కార్యాన్ని , ఫలితాంశాన్ని గుర్తించడం ఒక పద్ధతి. తదనంతర కాలంలో జరిగిన కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించడం ఒక పద్ధతి. మొదటి పద్ధతిలాగే ఇది కూడా తర్కబద్ధమైనదే ! శాస్త్రీయమూ అయినదే ! ఎలాగంటే , ఒకసారి నువ్వు పగలంతా నిద్రలో మునిగిపోయావు. నువ్వు లేచేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయం సమయంలో అస్తమిస్తున్న సూర్యుడు ఉదయాన ఉదయించాడా అని నువ్వు ఆలోచించవు. సూర్యోదయాన్ని చూడకపోయినా , ఉదయించాడని నిశ్చయంగా అనుకుంటావు. అది సత్యం కూడా !”
“అదే విధంగా , నవగ్రహాలలో ఒకానొక గ్రహం అశుభ దృష్టిని ప్రసరించబోతోందనీ , ఫలితంగా కష్టనష్టాలు సంభవిస్తాయనీ జ్యోతిషగణన చెప్తుంది – ముందుగా పరిశీలిస్తే. అలా కాకుండా , కష్టనష్టాలు వాటిల్లిన అనంతరం జాతక గణన చేస్తే , ఏ గ్రహ వీక్షణం అశుభంగా ఉన్న కారణంగా ఆ కష్టనష్టాలు సంభవించాయో చెప్తుంది జ్యోతిషం. రెండవ విశ్లేషణను ఆధారంగా తీసుకుని , ఇంద్రుడికి కలిగిన నష్టాలకూ , కష్టాలకూ కారణం – ఐశ్వర్యాన్నీ , వైభవాన్నీ కరుణించే శుక్రగ్రహ వక్రవీక్షణ అని అనుకోవడంలో తప్పులేదు.
“మరొక అంశం ఏమిటంటే శుక్రుడు అసుర గురువు. దేవతలకు సహజ శత్రువు.. ఆయన దేవరాజైన ఇంద్రుడిని క్రూరంగా చూడడంలో ఆశ్చర్యం లేదు. సందేహించాల్సిన అవసరమూ లేదు. నవగ్రహాలు దైవ స్వరూపాలు. ఆగ్రహించడంలో , అనుగ్రహించడంలో ఆ గ్రహదేవతలకు దేవ , దానవ , మానవ జాతులన్నీ సమానమే ! అదే ఆ గ్రహదేవతల ఔన్నత్యం ! కాబట్టి , తన శిష్యుడైన బలిచక్రవర్తి విజయం కోసం శుక్రుడు సురసార్వభౌముడైన ఇంద్రుడి మీద వక్రవీక్షణను ప్రసరించడంలోనూ , తదనంతరం ఇంద్రుడి ప్రార్థనను మన్నించి , వక్రదృష్టిని ఉపసంహరించి సక్రమ దృష్టిని ప్రసరించడంలోనూ – ఆశ్చర్యం ఏమీ లేదు !”
“గురువు గారూ ! మరొక సందేహం…” శివానందుడు అన్నాడు. అడగమన్నట్టు నిర్వికల్పానంద తల పంకించాడు.
“శుక్రుడు ఇంద్రుడికి ప్రసన్నం కావడం వల్ల బలిచక్రవర్తికి అన్యాయం జరిగింది కదా ? అది శుక్రుడికి మచ్చ కదా ?”
“కాదు ! తార్కికంగా ఆలోచిస్తే శుక్రుడు బలికీ , ఇంద్రుడికీ ఇద్దరికీ మహర్దశ కలిగించే ప్రయత్నమే చేశాడు. గురువుగా , మంత్రాలోచన చెప్పే మేధావిగా బలిచక్రవర్తిని దానం చేయవద్దంటూ వారించాడు. కలశ రంధ్రానికి అడ్డుపడ్డాడు. ఆ ప్రయత్నంలో కన్ను పోగొట్టుకున్నాడు. ఆ విధంగా గురువుగా తన విధిని నిర్వర్తించాడు. గ్రహదేవతగా ఇంద్రుడిని కరుణించాడు !”
“మీ విశ్లేషణ చక్కటి సమన్వయంతో , తార్కికంగా తృప్తి కలిగించే విధంగా సాగింది , గురువుగారూ !” సదానందుడు మెప్పుగా అన్నాడు.
“స్పష్టంగా లేని విషయాలను తార్కికమైన సమన్వయంతో సాధించి , నిర్ధారణ చేయాలి. మీకు చక్కటి అవగాహన కలగడానికి మరొక ఉదాహరణ చెప్తాను. వధూవరులకు వివాహం జరిగింది. కాలక్రమంలో వాళ్ళకు కొడుకు పుట్టాడు. అరె ! కొడుకు పుట్టాడే… ఆ ఇద్దరి మధ్యా దాంపత్యం సాగిందా ? అని అనుమానించడం ధర్మం కాదు కదా ! మన కంటికి కనిపిస్తున్న కొడుకుని ఆధారంగా చేసుకుని , ఆ ఇద్దరి మధ్యా దాంపత్యం జరిగిందనీ , అది ఫలించిందనీ నిర్ధారణగా అనుకుంటాం కద ! ఇదీ అంతే ! ఇంద్రుడికి జరిగిన వైభవ నష్టం , ఐశ్వర్య నష్టం ఇవన్నీ శుక్రగ్రహ దుర్వీక్షణ ఫలితమే అని లెక్కగట్టడం అపరాధం కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి – శనిగ్రహ మహిమను శ్రవణం చేద్దాం !” నిర్వికల్పానంద వివరించాడు.
రేపటి నుండి శనిగ్రహ మహిమ ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹