చంద్రగ్రహ మహిమ నాల్గవ భాగము
“నీ ప్రశ్నను మహామంత్రిగారే ఆనాడు శిరచ్ఛేదం చేయించే ముందు వరరుచిగారిని అడిగాడు !” నిర్వికల్పానంద అన్నాడు. “మంత్రి ప్రశ్నకు సమాధానంగా , ”గ్రహబలం” అన్నాడు వరరుచి. తన మీద ఉన్న గ్రహవక్రదృష్టి తన చేత ఆ పని చేయించిందనీ , ”ఆలోచనకూ , ఆచరణకూ కారణం గ్రహవీక్షణే” అని కూడా ఆయన అన్నాడు. అదలా ఉంచి , తరువాతి కథ వినండి !” అంటూ తన కథనాన్ని పునఃప్రారంభించాడు.
“వరరుచికి మరణశిక్ష విధించినందుకు బాధపడుతున్నాం , మహామంత్రీ…” యోగానంద మహారాజు పశ్చాత్తాపంతో అన్నాడు.
“ప్రభువులు పశ్చాత్తాప పడుతున్నారు !” మహామంత్రి అన్నాడు.
“ఔను ! వరరుచి జీవించి ఉంటే , మా చిరంజీవి ఆనవాలు తెలిసేది కద ! హు !అంతా దైవేచ్ఛ !” యోగానంద మహారాజు విరక్తితో అన్నాడు.
“ప్రభువుల ఇచ్ఛ సానుకూలంగా ఉంటే… వరరుచి ఆచార్యులను సమ్ముఖానికి తీసుకురాగలను !”
“మహామంత్రీ ! శిరచ్ఛేదం చేసిన వరరుచినా ? ప్రాణాలతోనా ?” యోగానంద మహారాజు కంఠంలో ఆశ్చర్యం ఖంగుమంది.
“ఆనాడు ప్రభువులు అవధులు లేని ఆవేశంతో , ఆలోచనకు స్వస్తి చెప్పి , ఆచార్య వరరుచికి మరణశిక్ష విధించారు. ఆయన ఔన్నత్యాన్ని ఎరిగిన నేను – ఒక సాహసం చేశాను. వరరుచిగారిని రహస్యంగా దాచి ఉంచాను. మరణ శిక్షను భూగర్భ నిర్బంధ శిక్షగా మార్పు చేశాను…”
“అంటే… అంటే ఆచార్యుడు సజీవంగా ఉన్నాడా ?”
“చిత్తం ! ప్రభువులు క్షమాభిక్ష అనుగ్రహిస్తే , వారిని సన్నిధికి పిలిపిస్తాను !”
“ఆనందంగా క్షమిస్తున్నాం ! వరరుచిగారినే స్వయంగా క్షమాపణ కోరుతాం ! వెళ్ళండి , మహామంత్రీ ! వెంటనే ఆచార్యులను సగౌరవంగా తీసుకురండి !” యోగానందుడు ఆనందోత్సాహాలతో అన్నాడు.
“ఆచార్యా ! మా అజ్ఞానాన్నీ , ఆవేశాన్నీ మన్నించి , దీవించండి !”
“ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు !” వరరుచి దీవిస్తూ అన్నాడు. “మహారాజా ! మహారాణి నాకు సోదరీమణితో సమానం. జన్మతః వచ్చిన శారీరక చిహ్నాలను జ్యోతిషగణన ద్వారా దర్శించవచ్చు. మహారాణి గారి పుట్టుమచ్చ విషయంలో అదే జరిగింది. గ్రహవీక్షణ సక్రమంగా లేనికారణంగా , అవసరం లేని అంశంలో నేను నా విద్వత్తును ప్రదర్శించాను. ఏకాంతవాస శిక్ష అనుభవించాను. మీరు నిమిత్తమాత్రులు !”
“మీ మాటలు మీ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. మా మహద్భాగ్యం కొద్దీ , మళ్ళీ మా మధ్యకు ఆగమించారు. ఆ ఘనత అంతా సమయోచిత జ్ఞానం కలిగిన మహామంత్రి గారిదే !” మహారాజు మెప్పుగా అన్నాడు.
“మహామంత్రిగారికి కృతజ్ఞతలతో మరొక అంశం మనవి చేస్తాను…” వరరుచి నవ్వుతూ అన్నాడు. “నాకు తమరు మరణ శిక్ష విధించినప్పుడు తత్కాల గ్రహ సంపత్తి రీత్యా నాకు మారకం అంటే మరణయోగం లేదు ! నన్ను రక్షించాలన్న ఆలోచన మన మంత్రిగారికి అందుకే కలిగింది !”
“అంతా గ్రహాల అనుగ్రహమే అంటారు !” యోగానంద మహారాజు నవ్వుతో అన్నాడు.
“ఔను ! గ్రహాల అనుగ్రహం ; కాకపోతే గ్రహాల ఆగ్రహం !” వరరుచి నవ్వాడు. “వేటకు వెళ్ళి అరణ్యంలో అదృశ్యమైపోయి , చాలాకాలానికి మతి భ్రమించినవాడై , మాట కోల్పోయినవాడై తిరిగివచ్చాడు , మా వంశాంకురం ! హిరణ్యగుప్తుడి జాతకాన్ని పరిశీలించి , తరుణోపాయం ఉపదేశించండి , ఆచార్యా !” యోగానంద మహారాజు వినయంగా అన్నాడు. “ఆచార్యా ! జాతక కుండలి తెప్పించమన్నారా !” మహారాణి వరరుచిని అడిగింది.
“అవసరం లేదు , తల్లీ ! రాజదంపతుల జాతకాలూ , యువరాజు జాతకం – అన్నీ ఈ వరరుచి మేధస్సులో నిక్షిప్తమై ఉన్నాయి !” వరరుచి చిరునవ్వుతో అన్నాడు. “ఒక్క క్షణం…”.వేళ్ళు లెక్కిస్తూ , అర్ధనిమీలిత నేత్రాలతో జాతక గణన చేస్తున్న వరరుచిని చూస్తూ , రాజదంపతులూ , మహామంత్రీ మౌనంగా ఉండిపోయారు. మెల్లగా రెప్పలెత్తి , మహారాజు వైపు చూశాడు.
“చంద్రుడు శత్రుక్షేత్రంలో విడిది చేసి , మహావక్రంగా చూస్తున్నాడు ! మనస్సు మీద ఆ దుష్ప్రభావం అధికంగా ఉంది. మతిభ్రమణకు మూలం అదే !” అన్నాడు వరరుచి. యోగానంద మహారాజు ఆందోళనగా చూశాడు. “అరణ్యాలలో ఉండే ఒక ప్రాణి శాపం అందుకు దోహదం చేసింది !”
“అరణ్య ప్రాణి… అంటే ఏమిటి ఆచార్యా ?” మహారాజు ప్రశ్నించాడు.”యువరాజు జాతకగణన ప్రకారం శరీరం నిండుగా నల్లటి రోమాలతో భయంకరంగా ఉండే అడవి జంతువు…”
“మీ వర్ణన నాకు భల్లూకాన్ని గుర్తుకు తెస్తోంది ఆచార్యా !” మహామంత్రి అన్నాడు.”నా జ్యోతిష నేత్రానికీ భల్లూకమే కనిపిస్తోంది…” వరరుచి సాలోచనగా అన్నాడు.
“విచిత్రంగా ఉంది ! నమ్మశక్యం కాకుండా ఉంది ! నోరు లేని జంతువు శపించడమా ?” యోగానంద మహారాజు అన్నాడు.
“విశ్వ సృష్టిలో విశ్వసించలేని విచిత్రాలూ , ఆశ్చర్యం కలిగించే అద్భుతాలూ ఎన్నో ఉన్నాయి , మహారాజా ! ఈ వరరుచి జ్యోతిషగణన తప్పుకాదు. మతిభ్రమణ నుండి విముక్తి లభించి మాట వచ్చిన అనంతరం యువరాజు జరిగిందేమిటో స్వయంగా మనకు చెప్తాడు !”
“మతిభ్రమణ తొలిగిపోయే మార్గం ?” యోగానంద మహారాజు నిట్టూర్చాడు.”ఉంది ! చంద్రగ్రహ వక్రవీక్షణను అశుభదృష్టిని , శుభదృష్టిగా మార్చుకోవడమే !” వరరుచి చిరునవ్వుతో అన్నాడు.
“ఆచార్యా ! ముందు నా సందేహాన్ని నివృత్తి చేయండి !” యోగానంద మహారాజు అన్నాడు.
“అవశ్యం ! అడగండి !”
“గ్రహాల సంచారాన్నీ , ఉనికినీ ఆధారంగా చేసుకుని , ఆనాడు మహారాణిగారి పుట్టుమచ్చను కనిపెట్టారు ! ఇప్పుడు హిరణ్యుడి మతిభ్రమణకు కారణాన్నీ కనిపెట్టడంతో బాటు , అందుక్కారణం వన్యమృగ శాపం అని కూడా అంటున్నారు ! అది ఎలా వీలైంది ?” మహారాజు అడిగాడు.
“గ్రహాల సంచారం , గ్రహాల ఉనికి – ఈ రెండింటితో బాటు నిర్దుష్టమైన గణనా , అంతరృష్టి , తర్కం అనేవి అవసరం. మానవ మేధస్సులో అన్నింటికీ అవకాశం ఉంది ! ఏకకాలంలో – ఈ మూడు అంశాలనూ ఏకోన్ముఖం చేస్తే లభించేదే త్రికాలజ్ఞత !”
“బాగుంది ! చంద్రగ్రహ అశుభ దృష్టిని సానుకూలమైన శుభ దృష్టిగా మార్చుకునే ఉపాయం ఉపదేశించండి !”
“అలాగే ! రాజ పురోహితుల వారికి శాస్త్ర విహితమైన శాంతి హోమం , ఆరాధనా విధానాలను వివరిస్తాను. ఆయన రాజ దంపతుల చేత శాంతి క్రతువు నిర్వహింపజేస్తారు. చిరంజీవి యువరాజు మీద చంద్రుడు శుభదృక్కులను ప్రసరిస్తాడు. అది జరిగిన క్షణంలోనే మతి భ్రమణ జాడ్యం తొలగిపోతుంది !”
నిర్వికల్పానంద కుతూహలంగా వింటున్న శిష్యులను చిరునవ్వుతో చూశాడు. “వరరుచి సూచించిన విధంగా యోగానంద మహారాజు చంద్రగ్రహ శాంతి హోమమూ , ఆరాధనా నిర్వహించాడు. మాతా పితరుల వాత్సల్యంతో ఏకోన్ముఖమైన ఆ శాంతి హోమం ఫలించింది. అచిరకాలంలోనే రాకుమారుడు హిరణ్యగుప్తుడు మతిభ్రమణ వ్యాధి నుంచీ , మూగతనం నుంచీ విముక్తుడయ్యాడు. అరణ్యంలో జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. రాకుమారుడికి అరణ్యంలో జరిగినదాన్నంతటినీ కార్తాంతిక జ్ఞాన నేత్రంలో దర్శించి , తెలియజేసిన ఆచార్య వరరుచిని యోగానంద మహారాజు , మహామంత్రీ ఎంతగానో శ్లాఘించారు !”
“గురువు గారూ ! చంద్రగ్రహ ప్రభావానికి లోనైన పురాణపురుషులు ఇంకా ఎవ్వరేనా ఉన్నారా ?” సదానందుడు ప్రశ్నించాడు.
“లెక్కలేనంత మంది ఉంటారు. వ్యక్తుల జీవితాలలో సంభవించే ఘటనల ఆధారంగా , కష్టసుఖాల ఆధారంగా ఏయే గ్రహాల ప్రభావాలు కారణాలో జాతక గణన తెలిసిన మేధావులు చెప్పగలరు. చంద్రగ్రహ ప్రభావం గురించిన అవగాహన కోసం ఒక గాథను ఉదాహరణగా చెప్పుకున్నాం ! అదిచాలు , సదానందా ! ఇప్పుడు కుజ గ్రహ మహిమ గురించి చెప్పుకుందాం !” నిర్వికల్పానంద సదానందుడి సందేహానికి సమాధానంగా అన్నాడు.
రేపటి నుండి కుజగ్రహ మహిమ ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹