చంద్రగ్రహ మహిమ రెండవ భాగము
అశ్వం డెక్కల చప్పుడు హిరణ్యగుప్తుడి ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది. అతను తలవాల్చి చూశాడు. నీళ్ళు తాగిన తన అశ్వం తన వైపు రాకుండా అటు వైపు పరుగెడుతోంది. అతను అప్రయత్నంగా ఈల వేశాడు. యజమాని ఈల పిలుపును పట్టించుకోకుండా పరుగు లంకించుకుంది. క్షణంలో పొదల మధ్య దూరి మాయమైంది !అటు వైపు చూస్తున్న హిరణ్యగుప్తుడి కళ్ళు ఒక్కసారిగా చెదిరాయి. ఒళ్ళు జలదరించింది. అశ్వం ఎందుకు పారిపోయిందో అతనికి అర్థమైంది. ముళ్ళ పొదల సందులో హుందాగా నిలుచుని భయం గొలిపే కళ్ళతో తననే చూస్తోంది , సింహం ! తనను హెచ్చరిస్తున్నట్టు సింహం ఒక్కసారి చిన్నగా గర్జించింది. విల్లునీ , బాణాలనూ అశ్వం మీదే వదిలివేసిన సంగతి గుర్తొచ్చిందతనికి. సింహం అతని వైపు అడుగులు వేస్తోంది. నాలుకను పిడచకట్టిస్తున్న దాహాన్ని మరిచిపోయి హిరణ్యగుప్తుడు వెనుదిరిగి పరుగు లంకించుకున్నాడు. సింహం వెంటనే నడకను పరుగుగా మార్చి , వెంటపడింది.
ఒగరుస్తూ , ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగెడుతున్న హిరణ్యగుప్తుడు తలతిప్పి చూశాడు. సింహం – ఇద్దరికీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ – పరుగెడుతోంది ! పొదల్లో దూరి , ఇవతలకి వచ్చిన హిరణ్యగుప్తుడికి , తన కోసమే నిలుచున్నట్టున్న పెద్దచెట్టు కనిపించింది. అసంకల్పితంగా అతను చెట్టు ఎక్కేశాడు. గుబురుగా ఉన్న రెమ్మల మధ్య పెద్దకొమ్మ మీద కూచుని , గుండె దిటవు చేసుకుంటూ , కిందికి చూశాడతను. చెట్టు కింద ఆగిన సింహం తలెత్తి చూస్తోంది. దాని అగ్ని నేత్రాల్లో ఆకలి మండుతోంది !
ఏదో చప్పుడు అతని చూపుల్ని ఆకర్షించింది. పెద్ద ఎలుగుబంటి నల్లటి నీడలా చెట్టు పైకి ఎక్కి తనున్న కొమ్మ మీదకే ప్రాకుతోంది ! హిరణ్యగుప్తుడి శరీరం వశం తప్పి వణకసాగింది. దగ్గరగా వచ్చి , ఆగిన ఎలుగు అతని కళ్ళల్లోకి చూస్తోంది. హిరణ్యగుప్తుడు ఒకసారి కింద ఉన్న సింహాన్ని , చెట్టుకొమ్మ మీద తిష్ఠ వేసిన ఎలుగునూ కంగారుగా చూశాడు. “భయపడకు , మానవా ! నేను కూడా నీలాగే ఆ సింహం నుండి తప్పించుకుని , చెట్టెక్కాను ! నువ్వూ , నేనూ – ఇద్దరం ఒకే స్థితిలో ఉన్నాం…”
“నీకు… నీకు… మా మానవ భాష వచ్చా ?!” యువరాజు హిరణ్యగుప్తుడు ఆశ్చర్యంగా అడిగాడు. “మనిషిలా మాట్లాడుతున్నావు !”
“మనుషులు జంతువుల్లా ప్రవర్తించేటప్పుడు జంతువులు మనుషుల్లా ఎందుకు మాట్లాడవు ?” ఎలుగు సమాధానం చెప్పింది. “సింహం వల్ల దాపురించిన ప్రాణాపాయం మనిద్దర్నీ ప్రాణమిత్రుల్ని చేసింది. నేను నిన్నేమీ చేయను !” యువరాజు హిరణ్యగుప్తుడు ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎలుగు అతని దగ్గరగా జరిగింది , ధైర్యం చెప్తున్నట్టు. తన నోటికి అందినట్టే అంది , జారిపోయిన ఇద్దర్నీ ఆశగా చూస్తూ చెట్టుకిందే విశ్రాంతిగా వాలింది సింహం. భల్లూకరాజు ప్రశ్నలకి సమాధానంగా హిరణ్యగుప్తుడు తన కథ అంతా వివరించాడు.
సూర్యాస్తమయం అయ్యింది. చీకటి కమ్ముకుంది , బాగా అలసిపోయిన హిరణ్యగుప్తుడికి నిద్ర ముంచుకువస్తోంది. భల్లూకం అతని పరిస్థితి గ్రహించి జాలి పడింది. “హిరణ్యా ! ఇదిగో నా ఒడిలో తలపెట్టుకుని , పడుకో ! హాయిగా నిద్రపో ! అర్ధరాత్రి దాటాక , నీ ఒడిలో తలపెట్టుకుని నేను నిద్రపోతాను !” అంది భల్లూకం.
హిరణ్యగుప్తుడు భల్లూకం ఒడిలో తలపెట్టుకుని , పడుకున్నాడు. భల్లూకం చెయ్యి అతన్ని గట్టిగా , భద్రంగా పట్టుకుంది , హిరణ్యగుప్తుడు లిప్తపాటులో గాఢనిద్రలోకి జారుకున్నాడు. అతని గురక శబ్దం విన్న సింహం పైకి లేచి , జూలు విదుల్చుకుంది. “భల్లూకరాజా ! నువ్వు అమాయకుడివి ! వాడు మానవుడు , మనల్ని వేటాడి చంపడానికి వెనుదీయని తత్వం వాడిది. మనిషి మన జంతు కులానికి ఆగర్భ శత్రువు సుమా ! వాణ్ణి కిందికి తోసేయ్ ! ఆకలి తీర్చుకుని , నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను !” అంది సింహం భల్లూకంతో.
“ఇతగాడి ప్రాణాలు కాపాడుతానని నేను అభయమిచ్చాను. మాట తప్పడం మహాపాపం సుమా !” అంది నిష్కర్షగా భల్లూకం. సింహం చేసేది లేక , మెల్లగా పొదల్లోకి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి దాటింది. భల్లూకం హిరణ్యగుప్తుడిని నిద్రలేపింది.
“మిత్రమా ! ఇక మేలుకునే వంతు నీది ! మెలకువగా , జాగ్రత్తగా ఉండు ! చెట్టు దిగకు సుమా ! ఆ జిత్తులమారి సింహం ఇక్కడే ఎక్కడో నక్కి ఉంటుంది !” అంటూ హెచ్చరించి , అతని ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. క్షణాలు గడుస్తున్నాయి. ఎలుగుబంటిని నిద్ర ఆవహించింది…చెట్టు కింద అడుగుల చప్పుడైంది. హిరణ్యగుప్తుడు తల వాల్చి చూశాడు. పొదల్లోంచి ఇవతలకి వచ్చిన సింహం తలపైకెత్తి చూసింది.
“రాకుమారా ! నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. అయితే ముందు నా ఆకలి తీరాలి. ఒక పనిచెయ్ ! ఆ ఎలుగ్గొడ్డును కిందికి తోసెయ్ ! దాన్ని తిని , ఆకలి తీర్చుకొని నా దారిన నేను పోతాను. తెల్లవారేక , నీ దారిన నువ్వు పో !” అంది సింహం హిరణ్యగుప్తుడితో. హిరణ్యగుప్తుడు ఆశ్చర్యంతో చూశాడు. ఎలుగులాగే సింహమూ మానవ భాషలో మాట్లాడుతోంది !
“నా ఆకలి తీరలేదనుకో ! మీలో ఎవరో ఒకరు కిందికి దిగేదాకా ఎన్ని రోజులైనా సరే – ఇక్కడే కాచుకుని కూర్చుంటాను !” సింహం హెచ్చరించింది. “నిజంగా నన్ను వదిలేస్తావా ?” హిరణ్యగుప్తుడు సందేహిస్తూ అడిగాడు.
“నేను మృగరాజును ! రాజులు మాట తప్పరు సుమా !” అంది సింహం గంభీరంగా. “ఎలుగు గాఢ నిద్రలో ఉంది ! తోసెయ్ ! ఊ !” హిరణ్యగుప్తుడు ఆలోచనలో పడ్డాడు. అరణ్యంలో ఉండే ఈ భల్లూకం – ఇవాళ కాకపోతే రేపు – సింహానికి ఆహారం కాక తప్పదు. ఇప్పుడే సింహానికి నైవేద్యం పెడితే – తన ప్రాణాలు దక్కుతాయి. మానవుడికి ఆత్మరక్షణ ప్రథమ కర్తవ్యం ! ఆలోచిస్తున్న హిరణ్యగుప్తుడి చేతులు అసంకల్పితంగా కదిలాయి. అమాయకంగా నిద్రిస్తున్న ఎలుగును బలంగా తోశాయి.
జారిపడబోయిన ఎలుగుబంటి చేతులు అప్రయత్నంగా కొమ్మను పట్టుకొన్నాయి. మేలుకుని , భద్రంగా కొమ్మ మీద కూచుని , ఎలుగుబంటి హిరణ్యగుప్తుడిని అసహ్యంగా చూసింది. “నీచుడా ! నీ సహజలక్షణాన్ని నిరూపించుకున్నావు. నీ ప్రాణం కోసం నా ప్రాణాన్ని బలిపెట్టే ప్రయత్నం చేశావు. అయినా , నిన్ను సింహానికి అప్పగించను. చేసిన ద్రోహానికి శిక్షగా నిన్ను శపిస్తున్నాను. మతి భ్రమణతో పిచ్చివాడివైపో !” అంటూ శపించింది భల్లూకం.
చాలా సేపు ఎదురు చూసి , ఆశాభంగంతో వెళ్ళిపోయింది సింహం. భల్లూక శాపంతో మతిభ్రమించిన హిరణ్యగుప్తుడు గుడ్డలను చించుకున్నాడు. చెట్టు మీద నుంచి దిగి , దారీ తెన్నూ లేకుండా ఆ కారడవిలో సంచరిస్తూ ఉండిపోయాడు. యువరాజు కోసం – అతని వెంట వచ్చి , అడవిలో విడిపోయిన పరివారం – అరణ్యంలో కొన్ని రోజుల పాటు అన్వేషించి , అతను రాజధాని చేరుకుని ఉంటాడన్న ఆశాభావంతో ఇంటి దారి పట్టారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹