చంద్రగ్రహ మహిమ – మొదటి భాగము
“దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం !
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ !!”
శ్రావ్యంగా , భక్తిరసభరితంగా , భావస్ఫోరకంగా చంద్రస్తోత్రం పఠించిన నిర్వికల్పానంద , కళ్ళు తెరిచి , ప్రశాంతంగా శిష్యుల వైపు చూశాడు. వాళ్ళ ముఖాల్లో శ్రద్ధా , ఆసక్తీ , ఆత్రుతా ప్రతిబింబిస్తున్నాయి.
“ఇప్పుడు చంద్ర గ్రహ మహిమను శ్రవణం చేద్దాం. ఓషధులకు అధిపతి అయిన చంద్రుడు ”మనసు” మీద తన ప్రభావాన్ని అధికంగా చూపిస్తాడు. జల విన్యాసం మీద కూడా ఆయన ప్రభావం ప్రధానంగా ఉంటుంది. పూర్ణిమనాడు పూర్ణచంద్రుణ్ణి చూడగానే , ఆయన కిరణాల కాంతి తనను స్పృశించగానే సముద్రం తన తరంగ హస్తాలను సుదీర్ఘంగా చాచుతూ ఎగసిపడటం మనం చాలాసార్లు చూసి ఉన్నాం , చూస్తూనే ఉంటాం !”
“గురువు గారూ ! చంద్రగ్రహ వీక్షణ ప్రభావానికి గురి అయిన పురాణపురుషులు చాలా మందే ఉంటారుకదా ?” శివానందుడు అడిగాడు.
నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “ఇదివరకే పలు పర్యాయాలు మనం చెప్పుకున్నాం. ఈనాడు జరుగుతున్న కథ సాంఘికం ! నిన్నటి కథ చరిత్ర ! మొన్నటి కథ పురాణం ! అంటే సాంఘికం కొత్తది. చరిత్ర కొంచెం పాతది. పురాణం చాలా పాతది – అని అర్థం. ఒక అంశం అర్థం కావడానికో , ఒక ఆదర్శాన్ని అర్థం చేసుకోవడానికో గతించిపోయిన వ్యక్తుల కథల్ని , లేదా చరిత్రల్ని , లేదా పురాణాల్ని చెప్పుకోవడం ఆచారం. మనం ఏ వ్యక్తి చరిత్ర స్వీకరిస్తామో – ఆ వ్యక్తి రామాయణ భారత భాగవతాది పురాణేతిహాసాలలో పేర్కొనబడిన వ్యక్తే అయి ఉండనవసరం లేదు ! కావ్యాలలో , ప్రబంధాలలో దర్శనమిచ్చే వ్యక్తుల గాథలూ చెప్పుకోవచ్చు !…”
అర్థమైందన్నట్టు తలలు ఊపుతున్న శిష్యుల్ని నిర్వికల్పానంద చిరునవ్వుతో చూశాడు. “చంద్రగ్రహ మహిమను ఆలకించడానికి – పురాణ సాహిత్యంలో కాకుండా తదనంతరం సాహిత్యంలో కనిపించే వ్యక్తి కథను మనం ఉదాహరణంగా స్వీకరించి , చెప్పుకుందాం…”
“తదనంతర సాహిత్యం అంటే… ఆ గాథ ఏ గ్రంథంలో ఉంది ; గురువుగారూ ?” సదానందుడు అడిగాడు.
“మీరు బృహత్కథ అనే గ్రంథం పేరు విన్నారా ?” నిర్వికల్పానంద అడిగాడు. శిష్యులందరూ మొహాలు చూసుకుని , తలలు అడ్డంగా ఊపారు.
“బృహత్కథ అనేది ఓ సాహిత్య సాగరం. ”గుణాఢ్యుడు” అనే ప్రాచీన మహాకవి ఆ గ్రంథాన్ని పైశాచీ భాషలో రాశాడు.”
“పైశాచీ భాష ?!” చిదానందుడు ఆశ్చర్యంతో అన్నాడు. “ఆ భాష ఎవరికి అర్ధమవుతుంది , గురువుగారూ ?”
“ఆ భాష తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది ! అయితే ఆ భాష తెలిసిన వాళ్ళు అతి తక్కువ ! అందరికీ ఆ మహత్తరమైన బృహత్కథ అర్థం కావాలన్న మహదాశయంతో ఒక సంస్కృత కవి – దానిని సంస్కృతంలోకి అనువదించాడు. ఆ కవి పేరు క్షేమేంద్రుడు. అనువాదానికి ఆయన పెట్టిన పేరు ”బృహత్ కథామంజరి”. అయితే అది మూలం లాగా విస్తృతంగా లేదు. క్షేమేంద్రుడు దానిని సంక్షిప్తం చేశాడు. బృహత్కథ మూలంలో లాగా సంపూర్ణంగా , సమగ్రంగా ఉండాలన్న ఆశయంతో ”సోమదేవుడు” అనే కవి ”కథాసరిత్సాగరం” పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు…”
“కథాసరిత్సాగరం పేరు విన్నాం !” చిదానందుడు అడ్డుతగుల్తూ అన్నాడు.
“ఆ కథాసరిత్సాగరంలో చంద్రుడి వీక్షణ ఫలితాలను వ్యక్తం చేసే గాథ ఒకటి ఉంది. ఆ కథలో పాత్రకు సంభవించిన కష్టనష్టాలకు కారణం ”చంద్రగ్రహం వక్ర దృష్ఠి’’ అని చెప్పకపోయినప్పటికీ , నవగ్రహాలలో చంద్రగ్రహ వీక్షణ సక్రమంగా లేనందువల్లనే అలాంటి విపత్కర పరిస్థితులు దాపురించాయని మనం నిర్ధారించుకోవడం తప్పు కాదు ! ప్రతి ప్రాణి జీవనం మీదా నవగ్రహాల ప్రభావం ఉండి తీరుతుంది కద !”
“మీరు చెప్పింది తార్కికంగా , సమంజసంగా ఉంది , గురువుగారూ ! ఆ కథ వినిపించండి !” విమలానందుడు ఉత్సాహంగా అన్నాడు. “తర్కబద్ధంగా లేని అంశానికి విశ్వసనీయత ఉండదు. వినండి ! పాటలీపుత్రం రాజధానిగా రాజు యోగానందుడు పరిపాలించేవాడు. అతనికి ఒక్కడే కొడుకు. అతని పేరు హిరణ్యగుప్తుడు. యువకుడైన హిరణ్యగుప్తుడు మృగయా వినోద ప్రియుడు ! ఒకసారి అతను వేటకు వెళ్ళాలని సంకల్పించాడు…” అంటూ నిర్వికల్పానంద చెప్పసాగాడు.
యోగానంద మహారాజు మందిరంలో మంత్రి శకటాలుడితోనూ , ఆస్థాన జ్యోతిష్కుడితోనూ సమావేశమై ఉన్నాడు. యువరాజు హిరణ్య గుప్తుడు అక్కడికి వచ్చాడు. మహారాజు పుత్రుడి వైపు ప్రేమానురాగాలతో చూశాడు. తన ఏకైక పుత్రుడు అందగాడు , ఆజానుబాహుడు ! ఆ అందం , ఆ ఠీవీ తన నుండి అందిపుచ్చుకున్నాడు !”ఏమిటి హిరణ్యా ? ఏం కావాలి ?” యోగానంద మహారాజు కంఠంలో వాత్సల్యం ధ్వనించింది.
“మీ అనుమతి , నాన్నగారూ !” హిరణ్యగుప్తుడు చిరునవ్వుతో అన్నాడు.
“దేనికి ?”
“వేటకు వెళ్ళడానికి !”
“అందుకైతే , మా అనుమతితో బాటు ఆశీర్వాదం కూడా లభిస్తుంది !” మహారాజు నవ్వుతూ అన్నాడు. “వెళ్ళిరా ! తగిన పరివారాన్ని తీసుకువెళ్ళు !”
“ఒక్కక్షణం… ప్రభువులు మన్నించాలి…” ఆస్థాన జ్యోతిష్కుడు వినయంగా అడ్డు తగిలాడు.
“ఏమిటి ఆచార్యా ?” మహారాజు ప్రశ్నించాడు. “యువరాజుగారి జాతక రీత్యా గ్రహవీక్షణం శుభంగా లేదు…”
“లేకపోతే ?” వెళ్ళబోతున్న హిరణ్యగుప్తుడు ఆగి , వాలుగా చూస్తూ ప్రశ్నించాడు.
“… వేటకు వెళ్ళడం శ్రేయస్కరం కాదు…”
“ఎవరికి ?” యువరాజు హిరణ్యగుప్తుడు గంభీరంగా అడిగాడు. “మాకా ? అరణ్యంలోని క్రూర జంతువులకా ?” కుమారుడి మాట విని , రాజు గొల్లున నవ్వాడు. మంత్రి శృతి కలిపాడు. నవ్వు ఆపి , రాజు జ్యోతిష్కుడిని సూటిగా చూశాడు. “ఆచార్యా ! యువరాజులంగారు యుద్ధానికి వెళ్ళడం లేదు ! అంత పట్టింపు అవసరం లేదు !”
“ప్రభువులు చిత్తగించాలి… యువరాజులుంగారి జాతక రీత్యా గ్రహవీక్షణ…” హిరణ్యగుప్తుడు వెటకారంగా అన్నాడు. “గ్రహవీక్షణ తారతమ్యాలు – ఆత్మస్థైర్యంలేని వారికి , ఆచార్యా !”
“చిత్తం….కానీ…”
“మృగయావినోదం ముగించుకుని వచ్చి , మీ వాదనలో పసలేదని నిరూపిస్తాను !”అంటూ హిరణ్యగుప్తుడు తండ్రి వైపు తిరిగి , నమస్కరించాడు. “నాన్న గారూ…”
“విజయోస్తు !” యోగానంద మహారాజు చెయ్యెత్తి దీవించాడు. హిరణ్యగుప్తుడు నిష్క్రమించాడు. మహారాజు చూపులు జ్యోతిష్కుడి వైపు తిరిగాయి. “ఆచార్యా ! ఆత్మస్థైర్యం గురించి మా యువరాజు అభిప్రాయాన్ని గుర్తుంచుకుని , జాతకగణన చేస్తూ ఉండండి !”
“చిత్తం ! మన్నించాలి… మితిమీరిన మొండి ఆత్మస్థైర్యానికి కూడా గ్రహవీక్షణే కారణం , మహారాజా !” ఆస్థాన సిద్ధాంతి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. “ఇది వేటకు అనువైన సమయం కాదు…”
యువరాజు పరివార సమేతంగా కీకారణ్యం చేరుకున్నాడు. వన్యమృగాల అరుపులు వినపడగానే అతనిలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. గుర్రాన్ని అరణ్యంలోపలకి పరుగెత్తించాడు. హిరణ్యగుప్తుడి కళ్ళు సింహశార్దూలాల కోసం ఆత్రుతగా చూస్తున్నాయి. పరివారం ఎక్కిన గుర్రాలు యువరాజు గుర్రంతో సమానంగా పరుగెత్తలేకపోయాయి. వెనకబడిన పరిజనులకను పట్టించుకోకుండా , హిరణ్యగుప్తుడు తన అశ్వాన్ని స్వేచ్ఛగా ముందుకు దూసుకుపోనిచ్చాడు. ఫలితంగా ఆ ఘోరారణ్యంలో , అతను దారితప్పి , ఎటో వెళ్ళిపోయాడు. జంతువుల అరుపులు చెవిని బడటమే కానీ , ఒక్క జంతువు కూడా అతని కంటపడలేదు. హిరణ్య గుప్తుడి అశ్వరాజం అరణ్యంలో పరుగుతీస్తూనే ఉంది. ఆకాశంలో సూర్యుడు పైకి ఎగబ్రాకుతూనే ఉన్నాడు.అరణ్య మధ్యంలోకి వెళ్ళాక , అశ్వం అలసిపోయినట్టు హిరణ్యగుప్తుడు గుర్తించాడు. తను కూడా అలసిపోయాడు ! దాహంతో నాలుక పిడచకట్టుకుపోయింది. గుర్రాన్ని ఆపి , అతను చెవులు రిక్కించాడు. జంతువుల అరుపులుగానీ , పరివారజనులు వస్తున్న అలికిడి గానీ , వినిపించడం లేదు. తాను దారితప్పి , చాలా దూరం వచ్చివేసినట్లు అతనికి అర్థమవుతోంది.
అతని అదలింపు లేకుండానే అశ్వం నెమ్మదిగా ముందుకుసాగింది. అది ఎందుకు ముందుకు అడుగులు వేస్తోందో హిరణ్యగుప్తుడికి అర్థమయింది. కొంచెం దూరంలోంచి నీటిపక్షుల కలకలలు వినవస్తున్నాయి. నీటి జాడను పసికట్టింది దప్పికగొన్న అశ్వం. ఎదురుగా కనిపిస్తున్న పరస్సును చూస్తూ , హిరణ్యగుప్తుడు , కిందికి దిగి , అశ్వాన్ని వదిలి వేశాడు. అశ్వం చకచకా అడుగులు వేస్తూ సరోవరం వైపు వెళ్ళింది.నీళ్ళు తాగుతున్న అశ్వాన్ని క్షణకాలం చూసి , హిరణ్యగుప్తుడు నింగిలోంచీ నిప్పులు చెరుగుతున్న సూర్యుడి వైపు తలెత్తి చూశాడు. మిట్టమధ్యాహ్నం ! తనని అందుకోలేకపోయిన పరివారం ఎటో వెళ్ళిపోయింది. తను దారి తప్పాడు !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹