సూర్యగ్రహ మహిమ తొమ్మిదవ భాగము
“ఆ విధంగా ఆంజనేయుడి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తయింది !” నిర్వికల్పానంద చిరునవ్వుతో ముగించాడు.
“గురువుగారూ ! అనంతర భవిష్యత్తులో ఆంజనేయుడు ఏ మహత్కార్యం ద్వారా గురువుగారి ఋణం తీర్చుకున్నాడు ?” శివానందుడు ప్రశ్నించాడు.”రామావతార సమయంలో… శ్రీరామచంద్రుడి బంటుగా అద్వితీయమైన సేవ ద్వారా…”
“శ్రీరామ సేవతో గురువు సూర్యభగవానుడి ఋణం ఎలా తీరింది , గురువుగారూ ?” సదానందుడు ప్రశ్నించాడు. నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు , సదానందా ?”
“సూర్యవంశానికి…”
“కద ! తన వంశంలో తన సంతాన పరంపరలో శ్రీరామచంద్రుడుగా అవతరించే శ్రీమహావిష్ణువును సేవించడానికీ , అద్వితీయమైన , నిజమైన ”రామబాణం”గా రాణించడానికి ఆంజనేయుడు జన్మించాడని సూర్యభగవానుడికి తెలుసు ! సూర్యవంశ శుద్ధాత్ముడైన రాముణ్ణి సేవించడం ద్వారా గురుదక్షిణ సమర్పించుకుంటావని ఆయన సూచించాడు !”
“చాలా బాగుంది ! సూర్యగ్రహ మహిమను తెలియజేసే ఐతిహ్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా , గురువుగారూ !” విమలానందుడు అడిగాడు.
“ఎందుకు లేవు నాయనా ? త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడూ , ద్వాపర యుగంలో పాండవాగ్రజుడు ధర్మరాజూ సూర్యగ్రహ సువీక్షణతో లబ్ధిపొందారు కద !” నిర్వికల్పానంద వివరించాడు.
“రామావతార సమయంలో – లంకాయుద్ధంలో శ్రీరామచంద్రమూర్తి తన బాణాలతో రావణుడిని వధించలేకపోయాడు. రావణాసురుడు రాముడి మీద శర వర్షం కురిపిస్తూ ఉండిపోయాడు. గ్రహాలు గతులు తప్పుతున్నాయి. ఆ గ్రహ గతులు శ్రీరామునికి అనుకూలంగా లేవు. శ్రీరాముడు ఆలోచనలో పడ్డాడు. ఆ సందిగ్ధ సమయంలో అగస్త్య మహర్షి యుద్ధ భూమికి ఆగమించాడు. విజయం చేరువకాకపోవడానికి కారణం గ్రహరాజు సూర్యుడి వీక్షణ ప్రసన్నంగా లేకపోవడమే అని వివరించాడు.
“శ్రీరామచంద్రా ! గ్రహగతులు నీ విజయానికి ఆటంకం కలిగిస్తున్నాయి. సూర్యగ్రహ శుభదృష్టి నీకు అత్యవసరంగా కావాలి. మహాశక్తివంతమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఏక దీక్షతో పఠించు ! ఆయుర్వృద్ధినీ , విజయాన్నీ కరుణించే మీ వంశకర్త అయిన ఆదిత్య సూర్యభగవానుడు నీ మీద తన శుభదృష్టి తప్పక ప్రసరిస్తాడు. తదనంతరం రావణవధ సులభతరమవుతుంది !” అన్నాడు అగస్త్య మహర్షి.
శ్రీరామచంద్రుడు అగస్త్యుల అనుశాసనాన్ని శిరసా స్వీకరించాడు. ”ఆదిత్య హృదయం” అందుకొన్నాడు. అద్వితీయమూ , అఖండమూ అయిన భక్తితో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేశాడు. ఏకోన్ముఖమైన ఆయన భక్తి భావన ఆదిత్యుని హృదయాన్ని స్పందింపజేసింది. తక్షణమే ఆయన రఘురాముడి మీద తన శుభదృష్టి కిరణాలు ప్రసరించాడు. శ్రీరాముడు నూతన శక్తితో ధనుర్బాణాలు అందుకున్నాడు. దశకంఠుడు నశించాడు !” అంటూ నిర్వికల్పానంద రామాయణాంతర్గత సూర్య మహిమను వివరించాడు.
“గురువుగారూ ! త్రేతాయుగంలో సూర్య మహిమకు చక్కటి గాథ వినిపించారు ! ద్వాపరయుగంలో…” చిదానందుడు ఆత్రుతను అదుపులో పెట్టుకోలేకపోయాడు.
“వస్తున్నా , చిదానందా ! ఆ ఐతిహ్యానికే వస్తున్నా !” నిర్వికల్పానంద అడ్డు తగులుతూ అన్నాడు. “ధర్మరాజు సూర్యగ్రహ ప్రసన్నతను పొందిన గాథ అది ! మాయాద్యూతంలో సర్వస్వాన్నీ కోల్పోయిన పాండవులు ధర్మపత్ని ద్రౌపదితో పాటు అరణ్య వాసం ప్రారంభించారు. పాండవులను వదిలి ఉండలేని కొందరు బ్రాహ్మణులు కూడా వాళ్ళతో పాటు అరణ్యం చేరుకున్నారు.”
“భీమార్జున నకుల సహదేవులు అరణ్యంలో తిరుగాడుతూ సేకరించే గడ్డలూ , వేళ్ళూ తింటూ అందరూ ఆకలి తీర్చుకుంటూ , కాలం గడుపుతున్నారు. ఆ దైన్యస్థితి ధర్మరాజుకు దుఃఖాన్ని కలిగించింది…” నిర్వికల్పానంద తన కథను కొనసాగించాడు.
ధర్మరాజు చెట్టునీడన విశ్రాంతిగా కూర్చుని ఉన్న తమ పురోహితుడు ధౌమ్యుడిని సమీపించాడు.”ఏమిటి నాయనా… విచారంగా ఉన్నావు ?” ధర్మరాజు ముఖ కవళికలను చూస్తూ ప్రశ్నించాడు ధౌమ్యాచార్యుడు.
ధర్మరాజు బరువుగా నిట్టూర్చి , ఆయన సమీపంలో కూర్చున్నాడు. “గురుదేవా ! నా మీద అభిమానాన్ని చంపుకోలేక దుర్భరమైన అరణ్యవాసానికి వచ్చి , సరి అయిన ఆహారం లేకుండా , అర్ధాకలితో వెతలు అనుభవిస్తున్న బ్రాహ్మణులను ఒకసారి చూడండి. ఈ కీకారణ్యంలో భూసురులైన మీ అందరికీ కందమూలాలతో విందులు ఇస్తున్నాను. వీళ్ళందరినీ చక్కటి ఆహారంతో సంభావించలేను ; వదిలి వెళ్ళలేను ! కర్తవ్య బోధ చేయండి !”
ధౌమ్యుడు క్షణ కాలం ధర్మరాజు ముఖంలోకి చూసి , సాలోచనగా కళ్ళు మూసుకొన్నాడు. ఆయన కుడిచేతి బొటనవేలు వేళ్ళ కణుపుల మీద కదులుతోంది. ఏదో గణన ముగించి , ధౌమ్యుడు రెప్పలెత్తి , ధర్మరాజును చూశాడు. “ధర్మరాజా ! శనైశ్చరుడి వక్రదృష్టి నిన్ను జూదంలో , సర్వస్వాన్నీ , నీ పంచ ప్రాణాలైన తమ్ములనూ , ధర్మపత్నినీ వొడ్డి ఆదే విధంగా ప్రోత్సహించింది. ఫలితంగా సకుటుంబంగా అడవుల పాలయ్యావు ! ఇక్కడ నీకు ఆహార లోపం ఎదురవుతోంది. కారణం సూర్యగ్రహం. ఆ గ్రహరాజు వీక్షణ నీకు అనుకూలంగా లేదు…”
“గురుదేవా !” ధర్మరాజు కంఠంలో ఆందోళన ధ్వనించింది. అంతలోనే ఆయన విరక్తిగా నవ్వారు. “గ్రహగతులు అనుకూలంగా ఉంటే మాకు ఈ గతి ఎందుకు పట్టుతుంది ?”
“ఔను !” ధౌమ్యుడు తలపంకిస్తూ అన్నాడు. “గ్రహవీక్షణం అశుభంగా ఉన్నప్పుడు శుభంగా మార్చుకోవడం మానవుల విధి ! సూర్యుడిని నువ్వు ప్రసన్నం చేసుకోవాలి. ఆయన గ్రహరాజుగా ఊరికే నియమించబడలేదు. ”లోక బాంధవుడు” అన్నది ఆయన సార్థక నామధేయం ! యాజ్ఞవల్క్య మహర్షికీ , ఆంజనేయుడికీ విద్యలు కరుణించిన సూర్యుడు కేవలం విద్యాదాత మాత్రమే కాదు ; అన్నదాత కూడా !
“దేవ మానవ దానవులకే కాదు ; పశుపక్ష్యాదులకూ , మృగాలకూ ఒక్కమాటలో చెప్పాలంటే సకల ప్రాణులకూ , చివరికి తరువులకూ , లతలకూ – సూర్యభగవానుడే అన్నదాత ! ఆయన తన వేడిమితో జలాన్ని గ్రహించి , వర్షానికి కారకుడవుతున్నాడు. కద ! సూర్యుడిని సుముఖుడుగా చేసుకున్న మానవుడికి ఆహారలోపం ఉండదు ! నువ్వు అత్యవసరంగా సూర్యారాధన చేయాలి ! ఆయనను ప్రసన్నం చేసుకోవాలి ! నీ ప్రస్తుత సమస్యకు పరిష్కారం అదే !”
“తమ ఆజ్ఞ ! సూర్యారాధన తప్పక చేస్తాను ! ఆ విధానం…” ధర్మరాజు సవినయంగా అన్నాడు.
“విధానం నేను ఉపదేశిస్తాను !” ధౌమ్యుడు అన్నాడు. “సూర్యారాధన అష్టోత్తర శత నామాల పఠనంతో సాగాలి. ఆ నూటెనిమిది సూర్య నామధేయాలూ నూట ఎనిమిది మంత్రాలతో సమానం ! అష్టోత్తర శత ఆదిత్య నామాలను పూర్వం దేవేంద్రుడు నారదమహర్షికి ఉపదేశించాడు. నారదుడు వసు చక్రవర్తికి ఉపదేశించాడు. వసురాజు నుండి ఆ నామామృతాన్ని నేను పొందగలిగాను !”
“తరతరాల సంపదన్నమాట !” ధర్మరాజు చిరునవ్వుతో తృప్తికరంగా అన్నాడు.”ఔను ! ఇప్పుడు నా నుండి నీకు లభించబోతున్నాయి ఆ సూర్యనామాలు ! మంత్రోపాసనకు ఆధారం రెండు అంశాలు ! ఒకటి ఆయా నామధేయాల అర్థ గ్రహణం ; రెండు ఉచ్చారణా విధానం ! అష్టోత్తరశత నామధేయాల అర్థాన్ని నీకు వివరిస్తాను. ఆ అక్షరాల ఉచ్చారణ పద్ధతిని ఉపదేశిస్తాను ! ఉపదేశానంతరం శుచిగా స్నానాదికాలు నిర్వర్తించి , గంగా నదీ జలంలో తూర్పు వైపు తిరిగి నిలుచుని సూర్యారాధన ప్రారంభించు ! రేపు ఉదయం దివ్యమైన ముహూర్తం ఉంది. అరుణోదయమైన అనంతరం సూర్యబింబ దర్శనంతో నీ దీక్ష ప్రారంభం కావాలి !”
“చిత్తం !” ధర్మరాజు చేతులు జోడించాడు.
అరుణోదయ సమయం !
ధౌమ్యుల వారి నుండి ఉపదేశం పొందిన ధర్మరాజు , ఆయన అనుమతి అర్థిస్తూ నమస్కరించాడు.”విజయోస్తు ! సూర్యగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు !” ధౌమ్యుడు ఆశీర్వదించాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు , ఎర్రగా.
ధర్మరాజు గంగా నదిలోకి దిగి , పూర్వాభిముఖంగా , నిలుచుని , ఉపాసన ప్రారంభించాడు. ధౌమ్యుడు వెనుదిరిగాడు. సుస్పష్టమైన అవగాహనతో , నిర్దుష్టమైన ఉచ్చారణతో ప్రారంభించిన సూర్యోపాసనను తదేక దీక్షతో కొనసాగిస్తున్నాడు ధర్మరాజు. పూర్వదిశాకాంత నుదురు మీద ఎర్రటి , గుండ్రటి తిలకంలా ప్రత్యక్షమైన సూర్యభగవానుడిని చూస్తూ రెప్పపాటు మరిచిపోయిన ఆయన నేత్రాలు వెలుగు వేలుపు విశిష్టరూపాన్ని హృదయ ఫలకం మీదకు చేరవేస్తున్నాయి. ప్రయత్నం లేకుండానే , అసంకల్పితంగానే ధర్మరాజు రెప్పలు కళ్ళమీదికి చర్మకవాటాల్లా వాలిపోయాయి.
హృదయ ఫలకం మీద నిక్షిప్తమైన సూర్య స్వరూపాన్ని అంతర్నేత్రంతో దర్శిస్తూ ఉచ్ఛారణ ద్వారా తన ఉపాసనా తరంగాల్ని సహస్ర కిరణుడి సన్నిధానానికి చేరవేయడంలో లీనమైపోయాడు ధర్మరాజు.గడిచినవి ఘడియలా ? గంటలా ? జాములా ? దీనాలా ? అన్నది ధర్మరాజుకు అవగతం కాలేదు. ఆయన తనువూ , మనసూ సర్వస్వమూ కాలగమనాన్ని విస్మరించి వేశాయి.
“ధర్మరాజా !”
శ్రావ్యంగా , లీలగా వినిపిస్తున్న పిలుపు ధర్మరాజు ధ్యాననిష్ఠకు కించిత్తు అంతరాయం కలిగించింది. ఆ పిలుపు ధ్యానం చాలించి , కళ్ళు తెరిచి చూడమని ఆహ్వానిస్తోంది. ధర్మరాజు కనురెప్పలు మెల్లగా విచ్చుకున్నాయి. ఎదురుగా సాక్షాత్కరించిన అద్భుత దృశ్యం ఆయన నేత్రాలను విశాలంగా చేశాయి. నీలాకాశం నేపథ్యంలో సప్తాశ్వాల ఏక చక్రరథం… ముందు అరుణుడు ! రథంలో ఆసీనుడైన సూర్యభగవానుడు !ధర్మరాజు చేతుల్ని శిరస్సుపైన జోడించి , నమస్కరించాడు. “అన్నదాతా !” అన్నాడు పారవశ్యంతో.
“ధర్మరాజా ! నీ ఉపాసన నన్ను అలరించింది. ఏకాగ్రంగా సాగిన నీ ధ్యాన నిష్టను ప్రశంసిస్తున్నాను. నా శుభదృష్టి నీమీద ప్రసరిస్తుంది. నీకు ”అక్షయపాత్ర”ను ప్రసాదిస్తున్నాను. నీ ధర్మపత్ని ద్రౌపది కందమూల ఫలాలతో వండే వంటలు , తరుగు లేకుండా భక్ష్య , భోజ్య , లేహ్య , చోష్యాలనబడే నాలుగు రకాల ఆహారాలుగా సిద్ధమవుతూ , మీ ఆకలిని తీరుస్తాయి !”
“ధన్యోస్మి , తండ్రీ !”
“అక్షయపాత్ర అందుకో !” అంటూ సూర్యభగవానుడు చేతిని ముందుకు చాచాడు.
ధర్మరాజు రెండు చేతుల్నీ చాచి , సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆయన చేతుల్లో తళతళ మెరస్తున్న తామ్రపాత్ర ప్రత్యక్షమైంది !ధర్మరాజు ఆనందబాష్పాలతో సూర్యుడిని చూశాడు. “అన్నదాతా ! నేనెంత భాగ్యవంతుణ్ణి !”
“ధర్మజా ! నా శుభదృష్టి నిన్ను భాగ్యవంతుడిగా చేసింది. అరణ్యవాసం పూర్తి అయ్యే సమయం దాకా ఆ ”అక్షయతామ్రస్థాలి” మీ ఆకలిని తీరుస్తూ ఉంటుంది ! శుభం భూయాత్ !” అన్నాడు సూర్యుడు దీవిస్తూ.
ఆకాశంలో సూర్యభగవానుడు అదృశ్యమైన కొంత సేపటి దాకా ఆశ్చర్యంలోంచి కోలుకోలేకపోయాడు ధర్మరాజు. విజయోత్సాహంతో విడిది ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు.
సూర్యానుగ్రహాన్ని అక్షయపాత్ర రూపంలో పొంది వచ్చిన ధర్మరాజుని ధౌమ్యులూ , ఇతర భూసురులూ ప్రశంసించారు. ద్రౌపది కందమూలాలతో వండే పదార్థాలు మృష్టాన్నాలవుతూ పాండవేయుల్నీ , వాళ్ళను ఆశ్రయించిన అభిమానుల్నీ ఆకలి బాధకు దూరంగా ఉంచసాగాయి. “అన్నదాత అయిన ఆదిత్యుడి అనుగ్రహాన్ని ఆ విధంగా సంపాదించిన ధర్మరాజు మనందరికీ సూర్యోపాసనలో మార్గదర్శకుడు !” కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద.
“అయితే గురువుగారూ , సూర్యుడు విద్యాదాత మాత్రమే కాదు ; అన్నదాత కూడా అన్నమాట !” శివానందుడు అన్నాడు.“అవును ! ఆ లోకబాంధవుడు లేకపోతే లోకాలలోని ప్రాణులకు అన్నమూ , నీళ్ళూ ఉండవు ! ఇంత వరకూ సూర్య గ్రహ మహిమకు కొన్ని మచ్చుతునకలు విన్నారు. ఇప్పుడు చంద్రగ్రహ మహిమ గురించి తెలుసుకుందాం !” నిర్వికల్పానంద అన్నాడు.
రేపటి నుండి చంద్రగ్రహ మహిమ ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹