Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పై ఐదవ అధ్యాయం

సూర్యగ్రహ మహిమ ఎనిమిదవ భాగము

కేసరి ఆంజనేయుడి వైపు జాలిగా చూశాడు. అతని చూపులు అంజన వైపు తిరిగాయి. “దేవ గురువు కదా , ఆయన ! అందుకే మన వానరజాతిని చిన్న చూపు చూశారు !”

“ఆ విధంగా అనుకోవలసిన అవసరం లేదు నాన్నగారూ !” అంజనేయుడు మెల్లగా అన్నాడు. “ఆయన కుమారుడు తారుడు కూడా వానరుడే ! అతనికి కూడా ఆయన విద్యాభ్యాసం చేయించలేదు ! ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు !”

“బృహస్పతి గారి సూచనను పాటించు , హనుమా ! సూర్యదేవుణ్ణి ఆశ్రయించు !” అంజన అంది.

ఆంజనేయుడి కళ్ళల్లో సందేహం దోబూచులాడింది. బరువుగా నిట్టూర్చి ఇలా అన్నాడు. “చిన్నప్పుడు ఫలభ్రాంతితో ఆయననే కబళించే ప్రయత్నం చేశాను. ఆయనను ఆ విధంగా అవమానించాను. నా మీద ఆయనకు ఆగ్రహం కలిగి ఉంటుందమ్మా !”

అంజన చిరునవ్వు నవ్వింది. “సూర్యభగవానుడు గ్రహరాజు , లోకబాంధవుడు అని ఆయనకు బిరుదు కూడా ఉంది. ఆయనకు ఆగ్రహం కలిగి ఉన్నా అది క్షణికమే , నాయనా !”

“ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చుకుంటే ?” కేసరి కల్పించుకుంటూ అన్నాడు.

“నీ తండ్రిగారి ఆలోచన గొప్పది హనుమా ! మొదట సూర్యదేవుణ్ణి క్షమాపణ కోరుకో ! అనుగ్రహం కోసం అర్థించు ! ఏదో కారణం లేకుండా దేవగురువు సూర్యుణ్ణి ఆశ్రయించమని చెప్పరు !” అంజన ధైర్యం చెప్తూ అంది.

“సూర్యభగవానుడు క్షమిస్తాడా అమ్మా !”

“తప్పక క్షమిస్తాడు నాయనా ! నీ బాల్య చేష్టకు ఆయన ముచ్చటపడి ఉంటారు సుమా !”

ఆంజనేయుడు కూర్చున్న చోటి నుండి లేచాడు. తల్లిదండ్రులిద్దరినీ ఉద్రేకంతో చూశాడు. “ఇప్పుడే బయలుదేరుతాను ! నన్ను దీవించండి !”

తన ముందు వినయంగా నిలుచున్న వానర యువకుడిని సూర్యభగవానుడు చిరునవ్వుతో చూశాడు.

“అంజనాకేసరి దంపతుల పుత్రుడు ఆంజనేయుడు ప్రణమిల్లుతున్నాడు !” ఆంజనేయుడు చేతులు జోడించాడు.

“హనుమా ?!”

“భగవాన్ ! బాల్యచాపల్యంతో మిమ్మల్ని ఫలంగా భావించి , కబళించే సాహసం చేసిన నా దురాగతాన్ని మన్నించండి !”

తన ముందు వినయ విగ్రహంలా మోకరిల్లిన ఆంజనేయుణ్ణి సూర్యుడు చిరునవ్వుతో చూశాడు. “ఆనాడే క్షమించాను ! నీది బాల్య చేష్ట కద !”

“స్వామీ !” ‘ఆంజనేయుడి కంఠంలో ఆశ్చర్యం , ఆనందం జంట స్వరాలుగా పలికాయి. “అయితే నాకు విద్యాదానం చేయండి ! సకల శాస్త్రాలూ బోధించి , నన్ను అనుగ్రహించండి !”

“హనుమా ! లే , నాయనా !”

ఆంజనేయుడు పైకి లేచి , చేతులు కట్టుకుని , కొద్దిగా వొంగి నిలుచున్నాడు.

“మహోగ్రమైన , అతి తీవ్రమైన ఈ సూర్యతాపాన్ని భరించి , సన్నిధిలో నిలువగలిగిన శక్తి నీది ! నువ్వు కారణజన్ముడవని నాకు అనిపిస్తోంది. శాఖామృగం వంశంలో జన్మించి కూడా సకల శాస్త్రాలూ అధ్యయనం చేయాలని సంకల్పించడం సాధారణ విషయం కాదు. నిన్ను విద్యార్థిగా , శిష్యుడిగా స్వీకరిస్తున్నాను !”

“ధన్యుడను , స్వామీ !”

“హనుమా ! నాలుగు వేదాలూ , ఆరు అంగాలూ , మీమాంస , న్యాయ , శబ్ద శాస్త్రాలూ , పురాణ ధర్మశాస్త్రాలు , ఆయుర్వేదం , ధనుర్వేదం , అర్థశాస్త్రం – అనేవి అష్టాదశ విద్యలు. ఇవి నేర్చితే సకల శాస్త్రాలూ నేర్చినట్లే ! వీటితో బాటు నీకు ప్రత్యేకంగా వ్యాకరణం బోధిస్తాను ! వ్యాకరణం భాషకి జీవనాడి ! నిన్ను నవ వ్యాకరణ పండితుడిగా రూపొందిస్తాను !”

“మహాభాగ్యం…”

“ఉచ్చారణ ప్రక్రియలో నిన్ను అద్వితీయుణ్ణి చేస్తాను ! పదాలనూ , వాక్యాలనూ పలికే విధానం నీకు కరతలామలకం చేస్తాను !” ఆంజనేయుడు పొంగిపోతూ చూశాడు.

“కానీ , ఒక ఆటంకం ఉంది…” సూర్యుడు అనుమానిస్తూ అన్నాడు. ఆంజనేయుడు బొమలు ముడివేసి , ప్రశ్నార్థకంగా చూశాడు.

“నిరంతరం సంచారం చేస్తూ , నేను లోకాలకు వెలుగునూ , వేడిమినీ అందిస్తూ ఉండాలి. ఒక చోట కూర్చుని , విద్య బోధించే అవకాశం లేదు…”

“మీరు అనుమతిస్తే మిమ్మల్ని అనుసరిస్తూ ఆకాశమార్గాన ప్రయాణం చేస్తూ విద్యను అభ్యసిస్తాను !” ఆంజనేయుడు వెంటనే అన్నాడు. సూర్యుడు ఆశ్చర్యంతో చూశాడు. ఆయన ముఖం చిరునవ్వుతో వికసించింది. “అలా చేయగలిగితే , నువ్వు నిజంగానే గురువుకు తగిన శిష్యుడ వవుతావు , హనుమా !”

“మీ అనుగ్రహం !” హనుమ నమస్కరిస్తూ అన్నాడు.

“నీ వినయ విధేయతలతో , భక్తితో నా అనుగ్రహాన్ని సంపాదించుకున్నావు. నీకు సకల విద్యలూ సంప్రాప్తిస్తాయి. ఈ క్షణం నుండీ నువ్వు నా విద్యార్థివి. నాతో బయలుదేరు. నీ సంచార విద్యార్జన మొదలు పెడతాను. పరబ్రహ్మకు ప్రతిరూపమూ , నాదబ్రహ్మమూ అయిన ప్రణవోచ్చారణతో విద్యాబోధన ప్రారంభిస్తాను ! ఓమ్ !” సూర్యభగవానుడు గంభీరంగా అన్నాడు.

“ఓమ్ !”ఆంజనేయుడి కంఠస్వరం గుహలో సింహనాదంలా ధ్వనించింది.

ఉదయాస్తమాన కాల వ్యవధిలో నిరంతరాయంగా సూర్యుడు శిష్యుడికి విద్యలన్నీ బోధించసాగేడు. అలసట అనేది లేకుండా , విశ్రాంతి కోసం ఆరాటపడకుండా తనతో సమానమైన వేగంతో తన సమీపంలోనే ఆకాశ గమనం చేస్తూ , ఒక్కమారు శ్రవణం చేయడంతోనే బోధించిన పాఠాన్ని అవగాహన చేసుకుంటూ , మూర్తీభవించిన వినయంలా ప్రవర్తిస్తోన్న వానర శిష్యుణ్ణి చూసి సూర్యుడు అబ్బురపడిపోయాడు.

ఆకాశగమనం చేస్తూ అచిరకాలంలో ఆంజనేయుడు తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. వేదాలూ , వేదాంగాలూ , శాస్త్ర పురాణాలూ – అన్నీ ఆంజనేయుడి మహామస్తిష్కంలో నిక్షిప్తమయ్యాయి. సూర్యభగవానుడి ప్రత్యేక శిక్షణలో ఆంజనేయుడు తొమ్మిది వ్యాకరణాలలో పాండిత్యాన్ని ఆర్జించుకున్నాడు.

తాను ఊహించిన దానికన్నా తక్కువ సమయంలో సమస్త విద్యలూ మేధోగతం చేసుకున్న ప్రియశిష్యుడికి వీడ్కోలు పలుకుతూ సూర్యుడు ఇలా అన్నాడు

“నీ విద్యాభ్యాసం పరిసమాప్తమైంది. క్రమానుగతంగా బోధన సాగిస్తూ , నీకు తెలియకుండానే , గత బోధనల సారాంశాన్ని నీ నుండి రాబట్టుతూ నిన్ను పరీక్షిస్తూ వచ్చాను. సకల శాస్త్రాలలోనూ నువ్వు ఉత్తీర్ణత సాధించావు. సామవేదాభ్యాసం నీలోని సంగీత జ్ఞానాన్ని నిద్ర లేపింది. గాన విద్యలోనూ , రాగ నిర్దేశంలోనూ , రాగ నిర్మాణంలోనూ నువ్వు ప్రవీణుడవుతావు. నువ్వు సాధించి , సొంతం చేసుకున్న ఉచ్చారణావిధానం జగద్విఖ్యాతమవుతుంది. ఇక వెళ్ళిరా ! నీకు శుభం కలుగుతుంది !”

ఆనంద బాష్పాలు కమ్ముతున్న కళ్ళతో వినయంగా చూస్తూ ఆంజనేయుడు చేతులు జోడించాడు. “గురుదేవా ! గురుదక్షిణ సమర్పించి , మీ ఋణం తీర్చుకుంటాను. అనుమతించండి ! గురు దక్షిణ ఏదో నిర్దేశించండి !”

సూర్యుడు చిరునవ్వు నవ్వాడు. “భవిష్యత్తులో నువ్వు చేసే మహత్కార్యమే నాకు గురుదక్షిణవుతుంది ! ఆ గురుదక్షిణ ఏమిటో నీకు అప్పుడే అవగతమవుతుంది ! వెళ్ళిరా , నాయనా !”

ఆంజనేయుడు భక్తి ప్రవత్తులతో తన విద్యాగురువుగారికి కృతజ్ఞతా సూచకంగా నమస్కరించాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment