Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పయ్యవ అధ్యాయం

సూర్యగ్రహ మహిమ మూడవ భాగము

“ఆ విధంగా సూర్యగ్రహ వీక్షణ శుభప్రదం అయ్యేసరికి , స్వయంగా చదువుల తల్లి దిగివచ్చి , యాజ్ఞవల్క్యునికి ఆయన కోరిన ”యజుస్సు”లనూ , వైదిక విజ్ఞానాన్నీ , సాంఖ్యయోగాన్నీ , యోగాన్నీ – ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల వేదాల సారాన్నీ ప్రసాదించింది !” నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు. “సూర్యగ్రహానుగ్రహంతో సరస్వతీ కటాక్షంతో లభించిన పారమార్థిక విజ్ఞానం యాజ్ఞవల్క్యుడిని మహోన్నత స్థానాన్ని అధిరోహింపజేసింది. విశ్వావసుడు అనే గంధర్వుడు అప్పటిదాకా తనకు సమాధానాలు లభించని పదిహేను జటిలమైన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడి నుండి సహేతుకమైన సమాధానాలు పొందగలిగాడు. నూతనంగా ”శతపథబ్రాహ్మణం” అనే తాత్విక గ్రంథాన్ని .. వెలువరించాడు, యాజ్ఞవల్క్యుడు.

“అంతే కాకుండా , భావి భారతజాతికి ఉపయోగపడే స్మృతిని రచించాడాయన. అదే ”యాజ్ఞవల్క్యస్మృతి ! యాజ్ఞవల్క్యుడి ఉదంతంతో – సూర్యగ్రహవీక్షణ వక్రంగా ఉంటే విద్యాగంధం ఆశించినంతగా అబ్బదని తెలుస్తోంది !” నిర్వికల్పానంద ముగించాడు.

“గురువు గారూ ! నిజానికి యాజ్ఞవల్క్యుడికి విద్యాదానం చేసింది సూర్యుడు కాదు. వాగ్దేవి సరస్వతి ! ఆ సత్కార్యంలోని ఘనత అంతా ఆమెదే కద ! సూర్యుడి వల్ల ఆయనకు విద్యాగంధం అబ్బిందని అనడం న్యాయమేనా ?” విమలానందుడు అనుమానం వెలిబుచ్చాడు.

నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “నువ్వు ఆరేడేళ్ళ బాలుడిగా ఉన్నప్పటి సంగతి అనుకో ! నీకు వరహా కావాలి. వరహాలు ఉండేది మీ నాన్న దగ్గర ! అయితే నువ్వు వరహా కావాలని మీ అమ్మగారిని అడిగావు. ఆమె మీ నాన్నకు చెప్పింది. ”అబ్బాయికి వరహా ఇవ్వండి , పాపం” అని. మీ నాన్నగారు ఇచ్చారు. ఇప్పుడు నువ్వే చెప్పు. నీకు వరహా ఇచ్చిన ఘనత ఎవరిది ? మీ నాన్నగారిదా ? అమ్మగారిదా ?”

“అమ్మదే ! ఆమె చెప్పకపోతే నాన్న ఇవ్వడుగా !” సదానంద విమలానందుడికి అవకాశం ఇవ్వకుండా అన్నాడు.

“సదానందుడు చక్కగా , తార్కికంగా చెప్పాడు ! సూర్యుడి అనుగ్రహం కలగకపోతే , ఆ గ్రహ సంబంధమైన ఆటంకం తొలగకపోతే సరస్వతి దిగి రాదుగా !” నిర్వికల్పానంద వివరణ ఇస్తూ అన్నాడు. “మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే దేవతలు ఎవరి విధిని వారు నిర్వహిస్తారు. తాను ఏ స్థాయి విద్యను ఇవ్వవచ్చో , ఇవ్వగలడో , తన అధికారం ఏ స్థాయి వరకూ ఉందో సూర్యభగవానుడికి తెలుసు. యాజ్ఞవల్క్యుడు కోరింది యజుస్సులు ! అది మౌలికమైన వేదవిద్య ! ఆ మహత్తర విద్యను బోధించగలిగిందీ , బోధించవలసిందీ అక్షరస్వరూపిణీ , వాగ్దేవతా , విద్యాధిదేవతా అయిన సరస్వతి అని ఆయనకు తెలుసు ! ఇంక తాను బోధించగలిగిన , బోధించదగిన సకల విద్యలనూ సూర్యభగవానుడు స్వయంగానే బోధించాడుకదా.”

“ఎవరికి గురువు గారూ ?” చిదానందుడు అడిగాడు.

“ఆంజనేయుడికి నాయనా ! బాలాంజనేయుడికి విద్యాదానం చేసే గురువే కరవయ్యారు. సూర్యగ్రహవీక్షణ ! చివరికి ఒకనాడు తాను కబళించడానికి ప్రయత్నించి , అవమానించిన ఆ సూర్యుడినే ఆరాధించి , ఆశ్రయించాల్సి వచ్చింది ఆంజనేయుడికి !”

“గురువు గారూ ! ఆ వృత్తాంతం వినిపించండి !” శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.

“అలాగే ! అయితే , ముందుగా ఆంజనేయుడు ఎవరికి , ఎలా జన్మించాడో వివరించి , ఆ తరువాత సూర్యుడి వద్ద ఆయన సాగించిన విద్యాభ్యాసం గురించి వినిపిస్తాను ! చెప్పండి , మీకు ”పుంజికస్థల” గుర్తుందా ?” నిర్వికల్పానంద అన్నాడు.

“అప్పుడే ఎలా మరిచిపోతాం , గురువుగారూ ! పైగా మీరు విశదీకరిస్తూ వినిపించే విషయాలు ఒక పట్టాన మరపురావు ! పుంజికస్థల అప్సరస. బృహస్పతి ఆశ్రమంలో పరిచారిక !” సదానందుడు ఉత్సాహంగా అన్నాడు.

“పుంజికస్థల వ్యక్తం చేసిన అక్రమ కామప్రకోపానికి ఆగ్రహించిన బృహస్పతి ఆమెను వానరస్త్రీగా జన్మించమంటూ శపించాడు. పుంజికస్థల బృహస్పతి శాపాన్ని అనుసరించి , ”కుంజరుడు” అనే వానర వీరుడి కూతురై జన్మించింది. కూతురికి ”అంజన” అని నామకరణం చేశాడు కుంజరుడు.”

“అంజన తండ్రి పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగి , యుక్తవయస్కురాలైంది. కుంజరుడికి ఒక మేనల్లుడున్నాడు. అతని పేరు కేసరి. కేసరి మహాబలశాలి , ధైర్యవంతుడు. అంజనను చూసి , యువకుడైన కేసరి ఇష్టపడ్డాడు. కేసరి అభిమతాన్ని తెలుసుకున్న కుంజరుడు కేసరితో అంజన వివాహం జరిపించాడు. అంజనా కేసరి దంపతులు తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. కాలం గడిచిపోతోంది…” నిర్వికల్పానంద కథనం సాగించాడు.

కేసరి రకరకాల పళ్ళూ , పుష్పాలూ తీసుకుని గుహలోకి వచ్చాడు. అంజన అతనికి ఎదురుగా రాలేదు , ఎందుకో ! భార్యను పేరుపెట్టి పిలుస్తూ గుహ అంతర్భాగంలోకి వెళ్ళాడు కేసరి. గుహ లోపల చీకటిగా ఉన్న చోట కూర్చున్న అంజనను చూసి ఆశ్చర్యపోయాడు కేసరి. దగ్గరగా వెళ్ళి ఆందోళనతో చూశాడు.

“అంజనా ! ఏమిటలా ఉన్నావు ? ఆరోగ్యం బాగా లేదా , దేవీ ?” అంజన బరువుగా నిట్టూర్చింది. “ఆరోగ్యానికేం… స్వామీ ! శరీరం బాగానే ఉంది , మనసే బాగాలేదు…”

“అంజనా !”

“నా నేస్తం ”హరిత” తల్లి అయ్యింది స్వామీ ! కొడుకు ! ఎర్రటి ముఖంతో ఎంత ముద్దుగా ఉన్నాడో !”

“ఓ ! అందుకు బాధపడుతున్నావా ?” కేసరి అమాయకంగా అడిగాడు.

“నేను బాధపడుతోంది హరితకి కొడుకు పుట్టినందుకు కాదు , నాకు పుట్టనందుకు !” అంజన విరక్తిగా అంది.

కేసరి నిట్టూర్పు గుహలో గింగిర్లు తిరిగింది. “ఊ… ఏం చేస్తాం ? మన దాంపత్యం సఫలం కాలేదు !” “సంతానం లేకపోతే దాంపత్యానికి పరిపూర్ణత సిద్ధించదు , స్వామీ !” అంజన దీనంగా అంది.

“లే , అంజనా ! చీకట్లో ఎందుకు ? లే ! గుహ ముందు కూర్చుని మాట్లాడుకుందాం…” అంటూ కేసరి చేయి పట్టుకొని అంజనను లేవదీశాడు. నడుం చుట్టూ చేతిని వేసి ఆమెను గుహ వెలుపలికి తీసుకువెళ్ళాడు.

ఆంజనను రాతి మీద కూర్చోబెట్టి , ఆప్యాయంగా ఆమె తల నిమిరి , దగ్గరగా కూర్చున్నాడు కేసరి.తన స్నేహితురాలైన వానర స్త్రీ , హరితకి కొడుకు ఎంత అందంగా ఉన్నాడో , హరితకీ , ఆమె భర్త ”భుజబలుడు” ఎంత ఆనందంగా ఉన్నారో అదే పనిగా వర్ణించి చెప్తోంది అంజన.

“రేపే మన వానర వైద్యుడిని కలుసుకుంటాను ! సంతాన యోగం కలిగించే ఔషధాలుంటే , ఇమ్మంటాను… ” కేసరి అంజనను ఓదార్చే ఉద్దేశంతో అన్నాడు. “చూశావా ! ఇన్నాళ్ళూ ఈ ఆలోచనే రాలేదు నాకు !”

“మనం కలుసుకోవాల్సింది వైద్యుణ్ణి కాదు…” అంజన నెమ్మదిగా అంది.

“అంజనా !”

“వైద్యుడి కన్నా శక్తి ఉన్న వ్యక్తిని కలుసుకోవాలి స్వామీ , మనం ! రేపు ఉదయమే ”మాతంగ మహర్షిని దర్శించుకుందాం !” అంది అంజన.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment