సూర్యగ్రహ మహిమ రెండవ భాగము
సూర్యుడి కిరణాలకు ఏదీ అడ్డుతగలని చోట , ఉదయం నుండీ సాయం సమయం దాకా ఎండ పడేచోట – యాజ్ఞవల్యుడు తపస్సు ప్రారంభించాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు , అస్తమిస్తున్నాడు. అయితే ఆ రెండు దైనిక క్రియల్నీ గమనించే స్థితిలో లేడు , యాజ్ఞవల్క్యుడు. అతనిలోని పట్టుదల భక్తి శ్రద్ధలకూ , ఏకాగ్రతకు పదనుపెట్టుతోంది. అచిరకాలంలోనే అతడు శారీరక స్పృహను కోల్పోయాడు. ఆకలిదప్పులూ , శీతోష్టాలూ , వెలుగు చీకట్లూ అనే ద్వంద్వాలకు అతి దూరంగా , ధ్యాన క్షేత్రంలో సాగిపోయాడు యాజ్ఞవల్క్యుడు.
కాలం గడిచిపోతోంది. అతను కలలు గన్న కమనీయ ఘడియ కదలి వచ్చింది. తపస్సులో గాఢంగా మునిగిపోయిన యాజ్ఞవల్క్యుడి అర్ధనిమీలిత నేత్రాల మీద. ఏదో కొత్త వెలుగు పడింది. అతని కనురెప్పలు స్పందిస్తూ మెల్లగా తెరుచుకున్నాయి. ఎదురుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెల్తురు ! యాజ్ఞవల్క్యుడి రెప్పలు టపటపలాడి , కళ్ళ మీద వాలిపోయాయి !
“యాజ్ఞవల్క్య ! మేఘ గర్జనలాంటి కంఠధ్వని తనను పిలుస్తోంది ! యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరిచాడు. ఈసారి అతడి కళ్ళు నిబ్బరంగా చూడగలుగు తున్నాయి.ఎదురుగా కేంద్రీకరించిన కాంతిపుంజంలోంచి ఏడు గుర్రాలు రథాన్ని లాగుతూ వెలికి వచ్చాయి ! రథానికి ఒకే చక్రం ఉంది. గుర్రాల వెనక సారథి అరుణుడు !
రథంలో వేయి కిరణాల వేలుపు ! కెందామరలాంటి మనోహరమైన శరీరవర్ణం ! శరీరవర్ణంతో చెలిమి చేస్తూ , దానిని అందంగా ఆచ్ఛాదించిన ఎర్రటి వస్త్రం ! చేతిలో తెల్లని తామర ! చుట్టూ ఆవరించిన సువర్ణకాంతులను చెదరగొడుతూ , చేతిలోని శ్వేత పద్మ వర్ణాన్ని వెక్కిరిస్తున్న చిరునవ్వు ! “ఓం సూర్యాయనమః ! ఓం సూర్యాయనమః…” జోడించిన చేతుల్ని , శిరస్సును పైకి యెత్తి , నమస్కరిస్తూ ఆదిత్య మంత్రాన్ని పఠించాడు యాజ్ఞవల్క్యుడు.
“యాజ్ఞవల్మా ! నీ ధ్యాన కిరణం నా సహస్ర కిరణాలనూ ఆకర్షించి , నన్నిక్కడికి తెచ్చింది ! ఏం కావాలి నీకు ?” సూర్యభగవానుడి కంఠం ఆకాశంలో సుళ్ళు తిరుగుతూ మారుమ్రోగింది.
“భగవాన్ ! నీ దయ లోపించిన కారణంగా , నీ వక్రవీక్షణ కారణంగా నేను గురుదేవుల తిరస్కారానికి గురయ్యాను. కోరిన విద్యలను పొందలేకపోయాను. మహత్తరమైన యజుస్సులను ప్రసాదించు. నన్ను కరుణతో చూడు !” యాజ్ఞవల్యుడు రెండు చేతులూ చాచి , దోసిలిపట్టి అభ్యర్థించాడు.
సూర్యుడు చిన్నగా నవ్వాడు. “నువ్వు చివర కోరిన కోరికను మొదట అనుగ్రహిస్తాను. నిన్ను కరుణతో చూస్తాను. నీ మీద ఉన్న నా వక్రదృష్టిని ఉపసంహరించి , శుభదృష్టితో వీక్షిస్తాను !”
“స్వామీ ! అంత అదృష్టమా నాది !” యాజ్ఞవల్క్యుడు వణికే కంఠంతో అన్నాడు.
“నా శుభదృష్టి నీ మీద వాలగానే వాగ్దేవి అయిన సరస్వతి నిన్ను ఆవహిస్తుంది ! ఆ గీర్వాణికి స్వాగతం పలుకుతూ , నీ శరీరానికి మహద్వారమూ , ”తలవాకిలీ” అయిన నోటిని తెరిచి ఉంచు !” సూర్యుడి పలుకును ప్రకృతి ఆనందంగా ప్రతిధ్వనించింది. యాజ్ఞవల్క్యుడు ఆదిత్య భగవానుని ఆజ్ఞను శిరసావహిస్తూ , ఆయననే చూస్తూ నోరు తెరిచాడు , సరస్వతిని స్మరిస్తూ.
క్షణంలో మహాశ్వేత అయిన సరస్వతి సాక్షాత్కరించింది. చిరునవ్వులు చిందిస్తూ సూక్ష్మ రూపంలోకి మారి , యాజ్ఞవల్క్యుడి వదనద్వారం గుండా అతని శరీరంలోకి ప్రవేశించింది. యాజ్ఞవల్క్యుడి శరీరం ఒక్కసారి జలదరించింది. ఏదో తెలియని అలౌకికమైన , ఆందోళనకరమైన ”మహాతాపం” అతని శరీరాన్ని దావానలంలా దహించివేస్తోంది. భరించలేని మంట అతని శరీరాన్ని ఆవరించి , పొగలు చిమ్ముతున్నట్టనిపించింది.
ఆ మహాతాపాన్ని భరించలేక పోతున్న యాజ్ఞవల్క్యుడు అసంకల్పితంగా పరుగెట్టాడు. సరోవర జలంలోకి దూకబోయాడు. సూర్యుడి గంభీర కంఠస్వరం అతన్ని ఆపింది “యజ్ఞా ! ఆగు ! వాగ్రూపిణి మహత్తర శక్తి నీలో ప్రవేశించింది. అదే ఆ తాపానికి కారణం. ఆ తల్లిని ధ్యానించు. ఆ మహాతాపం స్వల్పకాలికమే సుమా !”
యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వైపు తిరిగి , వినయంగా నమస్కరించాడు. “ఆజ్ఞ !” సూర్య వచనం నిజమైంది , క్షణంలో ! యాజ్ఞవల్క్యుడి తనువును దహించిన భుగభుగలు మాయమైపోయాయి. ఏదో తెలియని దివ్యకాంతి మంచుతో తడిసి పిల్లగాలిలా అతని శరీరాన్ని రెండవ చర్మంలా ఆవరించింది.
“నిష్ఠతో , తపస్సుతో , భక్తితో , విశ్వాసంతో నన్ను మెప్పించావు. నా వక్రదృష్టిని , ప్రసన్న దృష్టిగా మార్చుకున్నావు. వేదవిజ్ఞానం నీకు లభిస్తుంది. నువ్వు కోరిన యజుస్సుల ఉనికిపట్టు అదే ! అంతే కాకుండా నీకు సాంఖ్య యోగాలు సిద్ధిస్తాయి. ఇదిగో , నా చేతిలోని కమలం వికసించినట్టు – నీ మేథస్సు వికసిస్తుంది. శతపథ బ్రాహ్మణం నీకు సిద్ధిస్తుంది. సరస్వతీ మాత నీ వెంట ఉంది ; నీ ఇంట ఉంటుంది. వెళ్ళు ! ఇష్టప్రాప్తి కలుగుతుంది !”
దీవిస్తున్న సూర్యభగవానుడికి , కృతజ్ఞతా భారంతో చలించిపోతూ , నమస్కరించాడు యాజ్ఞవల్క్యుడు. “ధన్యోస్మి దేవా , ధన్యోస్మి !”
చిరునవ్వుతో దీవిస్తున్న సూర్యుడూ , ఆయన రథమూ నెమ్మదిగా గగన నేపథ్యంలో కలిసిపోయాయి. గుండ్రటి సూర్యబింబం – ఆస్థానంలో – యాజ్ఞవల్క్యుడికి కనిపిస్తోంది.
వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రాతఃకాలీన అనుష్టాలు తీర్చుకున్న యాజ్ఞవల్క్యుడు , సూర్యభగవానుడి అనుశాసనాన్ని గుర్తుచేసుకుంటూ , సరస్వతీ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. కాస్సేపట్లో శ్రావ్యమైన వీణానాదం వినవచ్చిందతనికి. శబ్ద బ్రహ్మను తలపించే మనోజ్ఞ నాదమది ! తన చుట్టూ ప్రతిధ్వనిస్తున్న దివ్యరాగాన్ని ఆలకిస్తూ యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరిచాడు. అతని ఎదురుగా చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తున్న సరస్వతీ మాత !
శ్వేత వస్త్రాలతో ఉన్న ఆ మహాశ్వేతను అక్షరాలు అచ్చులూ , హల్లులూ అందమైన తమ ఆకారాలతో ఆభరణాలుగా అలంకరించి ఉన్నాయి , ఓంకారం అగ్రభాగాన ఉంది !అక్షరాభరణ సౌందర్యంతో వెలిగిపోతున్న ”అక్షరస్వరూపిణి”ని యాజ్ఞవల్క్యుడు పులకించిపోతూ దర్శించాడు. చేతులు జోడించి ఆ విద్యాధినేత్రికి నమస్కరించాడు.
“అమ్మా ! వేదవిజ్ఞాన భిక్ష అనుగ్రహించు !”
“పుత్రా ! సూర్యగ్రహ వీక్షణ అనుకూలంగా లేని కారణంగా నీకు ఆశించిన విద్య అందే యోగం లేకపోయింది. ఇప్పుడు ఆ గ్రహరాజును ప్రసన్నుడిగా చేసుకున్నావు. కోరిన విద్యను నీకు అనుగ్రహించాలన్న స్ఫూర్తి నాకు కలిగింది !”
“ధన్యుణ్ణి , తల్లీ !” యాజ్ఞవల్క్యుడు నమస్కరించాడు.
అక్షరరూపిణికి అర్ఘ్యం సమర్పించాడు. పుష్పాలతో పూజించాడు. అర్చన ముగించిన భక్తుడు తీర్థప్రసాదాల కోసం వేచి చూస్తున్నట్టు , కూర్చున్నాడు.
“యాజ్ఞవల్క్యా ! కళ్ళు మూసుకో ! ఏకాగ్రచిత్తంతో , ధ్యాన నిష్ఠలో నిమగ్నుడివి కా ! ధ్యాన సమయంలో , నా అనుగ్రహంతో కోరిన విద్యలన్నీ నీకు స్ఫురిస్తాయి. ధ్యానగోచర మవుతాయి. ఇష్టవిద్యాప్రాప్తిరస్తు !” సరస్వతి దీవిస్తూ అంది. ఆమె చల్లని చూపులు జ్ఞాన కిరణాల్లా యాజ్ఞవల్క్యుడి కళ్ళల్లోకి దూసుకెళ్ళాయి. ధ్యాన భారంతో అతని కళ్ళు సగం మూసుకున్నాయి.
జ్ఞాన పరిమళం తన సర్వస్వాన్నీ ఆవరిస్తున్న అనుభూతి కలుగుతోంది యాజ్ఞవల్క్యుడికి !
పదిహేను శాఖల యజుర్వేదం స్ఫురిస్తూ , యాజ్ఞవల్క్యుడి మేధోమంజూషికలో నిక్షిప్తమయింది. సాంఖ్యమూ , యోగమూ అతనిలోని జ్ఞానపుష్పాన్ని సంపూర్ణంగా వికసింపజేశాయి. శతపథ బ్రాహ్మణం పూర్తిగా అతని అంతరంగంలో ఆవిష్కరించబడింది.
మహత్తరమైన , అమూల్యమైన జ్ఞాన సంపదను ఆర్జించిన మహదానందంతో , పరమతృప్తితో కళ్ళు తెరిచాడు యాజ్ఞవల్క్యుడు. అక్షరాభరణాలతో అలౌకికమైన దర్శనాన్ని అనుగ్రహించిన సరస్వతీ మాత , తల్లి ఇచ్చిన క్షీరాన్ని తాగిన పసిబాలుడిలా కనిపిస్తున్న యాజ్ఞవల్క్యుడి వైపు చిరునవ్వుతో చూస్తూనే ఉంది. ఆమె దక్షిణ హస్తం అతన్ని దీవిస్తోంది. చేతులు జోడించి నమస్కరిస్తూ , ఆనందబాష్పాలు రాలుస్తున్న యాజ్ఞవల్క్యుడి ముందు నుంచి అదృశ్యమైంది సరస్వతి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹