నవగ్రహాల పట్టాభిషేకం ఆరవ భాగము
“నవగ్రహాలైన మీ అందరిలోనూ కారకశక్తులున్నాయి. భరతవర్షంలోని భరతఖండంలో ఉన్న రాజ్యాల మీద మీకు ఆధిపత్యాలున్నాయి. సూక్ష్మరూపాలలో ఉన్నప్పుడు మీకు అవన్నీ తెలుసు ! కానీ సశరీరులుగా అవతరించిన ఫలితంగా , శరీరాలలో నెలకొన్న ఇంద్రియాల మూలంగా , ఆలోచనలనూ , ఆచరణలను ప్రభావితం చేసే త్రిగుణాల సమ్మేళనాల మూలంగా మీలో కొన్ని అవగుణాలూ , అవలక్షణాలూ ఏర్పడ్డాయి. అహంకారాలు పడగలెత్తాయి. ఈ లక్షణాలన్నీ జ్ఞానాన్నీ , దైవిక స్వభావాన్నీ మావిలా కప్పివేస్తాయి ! అందువల్ల మీ శక్తియుక్తులూ , మీ స్థానమానాలూ మీకు స్పష్టంగా తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది…”
“పరమేశ్వరులు క్షమించాలి ! మేమందరం సశరీరంగా అవతరించిన నవగ్రహ దేవతలం ! ఆ పదవులలో పట్టాభిషిక్తులైన దైవస్వరూపులం ! మాలో అవలక్షణాలా ?” రాహువు గర్వంగా అన్నాడు.
“మాలో అహంకారాలా ? అవగుణాలా ?” కేతువు నవ్వుతూ అన్నాడు. సూర్యుడూ , చంద్రుడూ , కుజుడూ , బుధుడూ , గురువూ , శుక్రుడూ , శనీ కూడా రాహుకేతువుల నవ్వుతో శృతి కలిపారు. రాహుకేతువుల విమర్శ వాళ్ళకు బాగా నచ్చింది !
పరమశివుడు చిన్నగా నవ్వాడు. “మీలో అవలక్షణాలులేవా ? అయితే , వినండి. సూర్యుడు తన ధర్మపత్ని సంజ్ఞ స్థానంలో , తన భార్యగా నటించిన ఛాయనూ , ఆమె నిజరూపాన్నీ , ఆమె మాయనూ కనిపెట్టలేకపోయాడు ! కర్మసాక్షి అయిన సూర్యుడి అజ్ఞానం కాదా , అది ?”
సూర్యుడు సిగ్గుతో తలవాల్చుకున్నాడు.
“ఇక చంద్రుడు. ఆదర్శదంపతులైన అత్రీ అనసూయలకు జన్మించాడు. గురుపత్నిని అపహరించుకు వెళ్ళి అపచారం చేశాడు ! వివాహం అయ్యాక పత్నీ బృందాన్ని సమదృష్టితో చూడకుండా ఒక్క రోహిణికి దాసుడైపోయి , అపరాధం చేశాడు. క్షయవ్యాధి బారిన పడేలా శాపాన్ని ఒడిలో వేసుకున్నాడు ! ఇది ప్రవర్తనలో చ్యుతి కాదా ?” శివుడు నవ్వుతూ చంద్రుడిని చూశాడు.
చంద్రుడు లజ్జతో చూపుల్ని దించుకున్నాడు.
“కుజుడు !” పరమశివుడు కుజుడినే చూస్తూ అన్నాడు. “కుజుడు నా స్వేద బిందువు నుండి అవతరించాడు. భూమాత ఒడిలో పెరిగాడు. తండ్రి అయిన నేను తృణీకరించానన్న అపోహతో , నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. నా అర్ధాంగి పార్వతిని ప్రసన్నం చేసుకుని వరాలు పొందాడు. పార్వతీ , నేనూ అర్థ – నారి – ఈశ్వరులమనే సత్యాన్ని విస్మరించాడు. పార్వతి కరుణిస్తే. ”నారి” కరుణిస్తే ఈశ్వరుడు కరుణించినట్టే అని తెలుసుకోలేకపోయాడు ! ఇది అజ్ఞానం కాదా ? పుత్రా ! అంగారకా ! ఏమంటావు ?”
కుజుడు సిగ్గుపడుతూ , వినయంగా చేతులు జోడించాడు. “పితృ దేవులన్నది యధార్థమే ! భావనలో , మిమ్మల్ని తృణీకరించిన అహంభావిని నేను ! మన్నించండి !”
“బుధుడి గురించి వివరిస్తాను !” శివుడు చెరగని చిరునవ్వుతో అన్నాడు. “బుధుడు చంద్రపుత్రుడు. అత్రీ అనసూయల పౌత్రుడు. జ్ఞాన సంపన్నుడు ! అయినప్పటికీ తాను మెహించిన ”ఇల” స్త్రీ రూపంలో ఉన్న ”సుద్యుమ్నుడు” అని గ్రహించలేకపోయాడు. తన జ్ఞానాన్ని కప్పివేయడానికి మోహానికీ , కామానికీ అవకాశం ఇచ్చాడు !”
బుధుడు చిరుసిగ్గుతో తలపంకించాడు. వినయంగా.
“ఇక గురువు ! బృహస్పతి మహాజ్ఞాని ! అయినప్పటికీ కామానికి దాసుడయ్యాడు. తన అన్న ”ఉతధ్యుడు” లేని సమయంలో – వదిన అయిన మమతను బలాత్కారంగా అనుభవించాడు. అప్పుడామె నిండుచూలాలు ! మమతకు ఇద్దరు కుమారులు కలిగారు. తన బలాత్కార సంగమం వల్ల కలిగిన రెండవ బాలకుణ్ణి బృహస్పతి స్వీకరించాడు. ఆ బాలుడే భరద్వాజుడు ! బృహస్పతి సాగించిన భ్రాతృ పత్నీ గమనం దోషం కాదా ?”
శివుడి మాటలు బృహస్పతి తలను క్రిందకు వాల్చాయి.
“గురువు శుక్రుడి గురించి వివరిస్తాను !” శివుడు శుక్రుడిని చూస్తూ అన్నాడు. “అసుర గురుస్థానంలో ఉన్నవాడూ , కవీ , జ్ఞానీ అయిన శుక్రుడు సురాపానానికి దాసుడయ్యాడు ! అది దోషం కాదా ?”
శుక్రుడు అవునన్నట్టు తల పంకించాడు.
“అంతే కాదు , శుక్రుడు తన మాయోపాయంతో ధనాధిపతి అయిన కుబేరుడి ఐశ్వర్యాన్ని అపహరించాడు. అదీ అక్రమ ప్రవర్తనే !” శివుడు నవ్వుతూ అన్నాడు.
పరమేశ్వరుడి చూపులు శనైశ్చరుడి మీద నిలిచాయి. “శనైశ్చరుడు అకృత్యాలకు పాల్పడ లేదు కానీ , జ్యేష్ఠ మాత సంజ్ఞ సంతానమైన వైవస్వతుడినీ , యముడినీ , యమినీ ద్వేషించాడు. యముడి అభివృద్ధిని చూసి ఈర్ష్యకు లోనయ్యాడు. ఈర్ష్యా ద్వేషాలూ , అసూయలూ దైవిక లక్షణాలు కావు కదా !”
శనైశ్చరుడు తల వాల్చుకున్నాడు. పరమేశ్వరుడి విశ్లేషణను మౌనంగా అంగీకరిస్తూ. శివుడు తన చూపుల్ని రాహువు వైపూ , కేతువు వైపు మళ్ళించి , తదేకంగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు.
“నా అభిప్రాయాన్ని అధిక్షేపించిన మీరిద్దరూ ఏం చేశారు ? వేషాలు మార్చి , కపట నాటకంతో అమృతాన్ని జుర్రుకోడానికి ప్రయత్నించారు ! అంతే కాకుండా లోకాలకు నిరంతర హితాన్ని అందిస్తూ ప్రకాశించే సూర్యుడినీ , చంద్రుడినీ కబళిస్తూ సకల ప్రాణులకూ కష్టం కలిగించారు. ప్రతీకారం సూర్యచంద్రుల మీద ; ఫలితం ప్రాణి కోటి మీద ! ఇవి తగని కార్యాలే కద !”
తమ వైపే చూస్తూ చిరునవ్వు నవ్వుతున్న శంకరుణ్ణి చూస్తూ , శిరస్సులు వంచుకున్నారు రాహుకేతువులు.
“పరమేశ్వరుల విశ్లేషణతో ఏకీభవిస్తూ నిరంకుశంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఆయనను హృదయపూర్వకంగా శ్లాఘిస్తున్నాను !” శ్రీమహావిష్ణువు మెచ్చుకున్నాడు.
“పరమశివుడు ”శిక్షాస్మృతి” నిర్మాత ! ఆయన విశ్లేషణా , విమర్శనా నిరంకుశంగానే ఉంటాయి , జనకా !” బ్రహ్మదేవుడు నవ్వుతూ అన్నాడు.
“నా విశ్లేషణా , విమర్శా మన నవగ్రహదేవతలు పూర్వాశ్రమాలలో చేసిన అపరాధాలను గుర్తు చేయడానికి ఉద్దేశించినవి కావు. శరీరధారణ ఫలితంగా సంక్రమించే త్రిగుణాల ప్రభావంతో సంభవించే ప్రవర్తనా స్టాలిత్యాలను తెలియజెప్పడమే నా ఉద్దేశం !” పరమేశ్వరుడు చిరునవ్వుతో అన్నాడు. ఆయన చూపులు నవగ్రహాలను ఒక్కసారి నిదానంగా పరామర్శించాయి.
“నేడు మా నిర్వాహకత్వంలో జరిగిన పట్టాభిషేక పావన కార్యక్రమాలు గతంలో మీరు చేసిన అపరాధాలను ప్రక్షాళనం చేసివేశాయి. మీరిప్పుడు అర్హులుగా అభిషిక్తులైన పరిపూర్ణ దైవస్వరూపాలు ! అద్వితీయమైన , అఖండమైన శక్తి సామర్ధ్యాలూ , ఆధిపత్యాలూ కలిగిన నవగ్రహదేవతలు ! శరీరధారులందరి జీవన గమనాలనూ శాసించే మహాశక్తులు !” పరమేశ్వరుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు.
“పరమేశ్వరులు చక్కగా వక్కాణించారు. పావన భరతఖండంలో స్వాయంభువ మను సంతతి అయిన మనువుల సామ్రాజ్యాలు నెలకొన్నాయి. ఆ రాజ్యాల మీద కూడా మీ నవగ్రహదేవతలకు ఆధిపత్యాలు ఉంటాయి. ఆ రాజ్యాలనూ , ఆధిపత్యాలనూ పరమశివుడు వివరిస్తాడు !” అన్నాడు విష్ణువు , నవగ్రహాలతో.
శివుడు చిరునవ్వుతో అంగీకారం తెలియజేసి , ప్రారంభించాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹