Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై రెండవ అధ్యాయం

రాహువు పరాజయాన్ని అర్థం చేసుకున్న సభలో కలకలం ప్రారంభమైంది.

రాహువు మొక్క వైపు చూస్తూ కొద్దిగా ముందుకు జరిగాడు. సభలో ఉన్న వారందరూ ముందుకు వంగి ఆసక్తిగా చూస్తున్నారు. రాహువు విష్ణువు వైపు ఒకసారి గర్వంగా చూసి , స్వర్ణ కలశంలో రెపరెపలాడుతున్న మొక్కను తదేకంగా చూశాడు. అతని కళ్ళలోంచి ఎర్రటి కాంతి కిరణాలు మొక్కవైపు సాగాయి. రాహు నేత్రాలు వెదజల్లుతున్న నీల లోహిత వర్ణ కిరణాల కాంతిలో మొక్క సహజ హరిత వర్ణం ఎర్రగా మారింది. క్షణంలో లేత ఆకులు వాడిపోయాయి. మొక్క బలహీనంగా వాలిపోతోంది !

కేతువు ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి రాహువు భుజం మీద సాభిప్రాయంగా తన చేతిని వేశాడు. క్రమంగా నిర్జీవ స్థితికి చేరుతున్న మొక్క మీద నుంచి తన చూపుల్ని కేతువు వైపు మళ్ళించాడు రాహువు. ఒకరి కళ్ళల్లోని ఓటమి మరొకరి కళ్ళల్లోని ఓటమిని పరామర్శిస్తోంది !

రాహువు పరాజయాన్ని అర్థం చేసుకున్న సభలో కలకలం ప్రారంభమైంది.

“కేతూ ! నువ్వు ప్రయత్నించు !” విష్ణువు గంభీర స్వరం కేతువును హెచ్చరించింది. పరాజయ భారంతో వాలిపోయిన శిరస్సును పైకి ఎత్తుకోకుండా రాహువు తన ఆసనం వైపు అడుగులు వేశాడు. అతడిని నీడలా అంటిపెట్టుకుని ఉండే కేతువు , తోడుగా వెళ్తున్న వాడిలా రాహువు వెంటే నడిచాడు. సభలో ఉన్నవాళ్ళ గొంతుకల్లోంచి వెలువడుతున్న అవ్యక్తశబ్దాలు రాహువు పరాజయాన్నీ , కేతువు పరాభవాన్నీ చెప్పకనే చెప్తున్నాయి.

“సూర్యా ! ఆ అంకురానికి ప్రాణశక్తినీ , ఆహార శక్తినీ అందిస్తూ పెంపొందించు ! నీ దృష్టిని ప్రసరించు !” విష్ణువు కంఠం సూర్యుణ్ణి హెచ్చరించింది.

సూర్యుడు లేచి , వినయంగా త్రిమూర్తులకు చేతులు జోడించి , మొక్క వైపు తన చూపులను ప్రసరించాడు. క్షణాలు గడుస్తున్నాయి. వాడిపోయి , తల వాల్చిన మొక్క ఏదో నూతన చైతన్యంతో కదలసాగింది. కాస్సేపట్లో అది నిటారుగా నిలుచుంది. వాడిపోయిన చిన్నారి ఆకులను హరిత వర్ణం ఆవరిస్తోంది. సూర్య కిరణాల ద్వారా అందే ప్రాణశక్తినీ , ఆహారశక్తినీ గ్రహించిన అంకురం పచ్చగా , ఆరోగ్యంగా , ‘నిగనిగలాడసాగింది !

సూర్యుడు దృష్టి కిరణాలను ఉపసంహరించుకున్నాడు.

“గ్రహరాజు సూర్యభగవానుడికి జయీభవ ! విజయీభవ !” అనే జయజయధ్వానాలు మారుమ్రోగసాగేయి.

తమ నిర్ణయాన్ని వేలాది కంఠాలతో ప్రతిధ్వనిస్తున్న దేవతలనూ , మహర్షులనూ త్రిమూర్తులు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు.

మిన్ను ముట్టిన హర్షధ్వానాలు సద్దుమణిగాక , కశ్యప ప్రజాపతి రాహుకేతువులను సమీపించి , వాళ్ళ ముఖాలలోకి తదేకంగా చూశాడు. రాహుకేతువులు అసంకల్పితంగా తలలు వాల్చుకున్నారు.

కశ్యప ప్రజాపతి ముఖం మీద చిరునవ్వు మెరిసింది. “రాహూ , కేతూ ! తలలెత్తి నిలవండి ! త్రిమూర్తులకు నమస్కరించి , క్షమాపణలు అర్పించండి ! మీ సోదరుడూ , సోదర గ్రహదేవతా అయిన సూర్యుడిని గ్రహరాజుగా అంగీకరించి , గౌరవించండి ! తద్వారా గ్రహదేవతలుగా మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి !”

రాహువు , కేతువూ త్రిమూర్తులకు నమస్కరించారు. సూర్యుడి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి , తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. సూర్యుడు చిరునవ్వుతో వాళ్ళను సంభావించాడు. రాహువూ , కేతువూ మౌనంగా వెళ్ళి తమ స్థానాల్లో కూర్చున్నారు.

“నేను నిర్వహించిన ”అంకుర స్పర్థ” సూర్యుడిని పొగడటానికి గానీ , అతని సోదరులైన రాహుకేతువులను తెగడటానికిగానీ ఉద్దేశించి కాదు !” విష్ణువు సమాధాన పూర్వకంగా అన్నాడు. “నవగ్రహదేవతలందరికీ సమాన ప్రతిపత్తి ఉంది ! ఎవరి శక్తి వారికి ఉంది ! ప్రాణుల జీవన భ్రమణంలో తొమ్మండుగురి ప్రభావమూ ఉంటుంది !”

“మా ఆశయమూ, అనుశాసనమూ అదే !” పరమశివుడు నవ్వుతూ అన్నాడు.

“మా నిర్ణయాన్ని రాహుకేతువులు ఆవేశంతో అపార్థం చేసుకున్నారు !” శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. “సూర్యుడి వెలుతురు , వేడిమీ సకలజీవులకూ ప్రాణాధారం. సూర్యుడు అన్నదాత ! వృక్షాలకూ , లతలకూ , పైరులకూ ప్రాణాధారమైన పత్రహరితం సూర్యుడి కాంతి నుండే లభిస్తుంది. ఆహారానికీ , ఆరోగ్యానికీ – సూర్యరశ్మి మూలకారణం ! అందుకే గ్రహరాజుగా సూర్యుడిని నియమించాం ! మానవులు తాము పండించిన ధాన్యాన్ని మొట్టమొదట సూర్యుడికి అర్పించే ఆచారాన్ని స్వీకరిస్తారు !”

“తరతమ భేదాలు లేకుండా సకల చరాచర సృష్టిజాలం మీద సమానంగా తన ప్రకాశాన్నీ , ప్రభావాన్నీ చూపే సమదృష్టి కలిగిన సూర్యుడు నవగ్రహ చక్రవర్తిగా ఉండడానికి అన్ని విధాలా తగిన దివ్య తేజం !” శివుడు సంతోషంగా అన్నాడు.

“అందుకే , త్రిమూర్తులమైన మేము ఏకాభిప్రాయంతో గ్రహరాజును ఎన్నిక చేశాం !” బ్రహ్మ వివరిస్తూ అన్నాడు.

చంద్రుడూ , కుజుడూ , బుధుడూ , గురువూ , శుక్రుడూ , శనైశ్చరుడూ , రాహువూ , కేతువూ కరతాళధ్వనులు చేశారు.

“జనకా ! అభిషేక ముహూర్తం ఆసన్నమవుతోంది !” బ్రహ్మ విష్ణువుతో అన్నాడు. ఆయన తలపంకించాడు.

“ఇంద్రా !”

విష్ణువు పిలుపు విన్న ఇంద్రుడు సవినయంగా ఆయన సమ్ముఖానికి వచ్చి , చేతులు కట్టుకుని నిలుచున్నాడు.

“ఇంద్రా ! క్షీరసాగరంలోని క్షీరమే జలంగా నవగ్రహాల అభిషేకం జరగాలి ! అభిషేకంతో నవగ్రహాల పట్టాభిషేక మహోత్సవం ప్రారంభమవుతుంది ! ఆ శుభకార్యానికి మన చతుర్ముఖుడు నేతృత్వం వహిస్తాడు !” విష్ణువు ఆదేశ పూర్వకంగా అన్నాడు.

“ఆజ్ఞ ! క్షీరంతో నిండిన సువర్ణకలశాలతో మా అప్సరసలు సిద్ధంగా ఉన్నారు !” ఇంద్రుడు చేతులు జోడించి అన్నాడు.

ఇంద్రుడి చేసైగతో గంధర్వులూ , విద్యాధరలూ మంగళ వాద్యాల శుభసంగీతాన్ని ప్రారంభించారు. క్షీరసాగర తరంగాలు ఆ సంగీతానికి అనుగుణంగా , లయ బద్ధంగా స్పందించసాగాయి !

బ్రహ్మ నేతృత్వంలో నవగ్రహాల పట్టాభిషేక కార్యక్రమం క్షీరాభిషేకంతో ప్రారంభమైంది. బ్రహ్మ సూచన ప్రకారం సప్తర్షులు వేదమంత్రాలు పఠిస్తున్నారు.

నవగ్రహదేవతల పత్నులు తమ పతిదేవుళ్ళ అభిషేక వైభవాన్ని తిలకిస్తూ పరవశించి పోతున్నారు. అప్సరసలు అందిస్తున్న కలశాలతో మహర్షులు అభిషేకం పూర్తి చేశారు. ఇంద్రుడి సూచనను పాటిస్తూ అప్సరసలు నవగ్రహాల లలాట ఫలకాల మీద క్షీరసాగర తీరంలో లభించిన గైరికాది ధాతువులతో తిలకాలు దిద్దుతున్నారు.

మరికొందరు అప్సరసలు బంగారు తీగలలాంటి తమ చేతులతో కల్పకపుష్ప మాలికలను వయ్యారంగా మోస్తూ , నాట్యం చేస్తున్న వొడుపుతో నడుస్తూ వచ్చారు. వాళ్ళ చేతులలోని దివ్య పుష్పమాలికలు బ్రహ్మ ఆజ్ఞతో నవగ్రహాల గళ సీమలను అలంకరించాయి.

త్రిమూర్తులు దేవేరులతో పాటు నవగ్రహాల శిరస్సుల మీద అక్షతలు చల్లారు , ఆశీర్వాదపూర్వకంగా. మరుక్షణం దేవతలు సామూహికంగా కురిపిస్తున్న పుష్పవృష్టి ”పుష్పాక్షతలు”గా నవగ్రహాల మీద వర్షించసాగింది. చేతులు జోడించిన నవగ్రహ దేవతలు పుష్పాక్షతవర్షాన్ని స్వీకరించారు.

“శ్రీహరీ ! సూర్యుడిని గ్రహరాజుగా నేను అభిషేకిస్తాను !” అన్నాడు పరమశివుడు.

“అది మా సూర్యుడి అదృష్టం !” విష్ణువు చిరునవ్వుతో అన్నాడు.

గ్రహరాజుగా సూర్యుడి అభిషేకానికి క్షణాలలో సర్వం సిద్ధం చేయబడింది. సమున్నతమైన స్వర్ణ సింహాసనం మీద సూర్యుడు కూర్చున్నాడు. ఆయనపై శ్వేత ఛత్రం మెరిసిపోతోంది. సూర్యుడి సింహాసనం ఉన్న వేదిక క్రింది భాగంలో ఆయనకు ఇరువైపులా నలుగురుచొప్పున మిగిలిన అష్టగ్రహదేవతలు ఆసీనులై ఉన్నారు.

త్రిమూర్తులూ , వాళ్ళ సతీమణులూ సూర్యుడున్న వేదిక మీదికి చేరుకున్నారు. ఇంద్రుడు శచీదేవితో పాటు వేదికపైకి ఎక్కసాగేడు. ఆయన చేతిలో అమృతకలశం ఉంది.

వైదిక మంత్రాల నేపథ్యంలో పరమశివుడు అమృతంతో సూర్యుడి శిరస్సును అభిషేకించాడు. శచీదేవి అందించిన శ్వేత పద్మ మాలికను సూర్యుడి మెడలో వేశాడు. మహాలక్ష్మీ విష్ణువులూ , సరస్వతీ చతుర్ముఖులూ , పార్వతీ పరమేశ్వరులూ , శచీ దేవేంద్రులూ సూర్యుడి మీద అక్షతలు చల్లి ఆశీర్వదించారు.

గ్రహరాజుగా నియమించబడిన సూర్యుడి పేరిట దేవతా సమూహం చేస్తున్న జయజయ ధ్వానాలతో అంతరాళం మారుమ్రోగిపోయింది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment